దేశాల విదేశాంగ విధానాలకు ఆయా దేశాల ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉండాలి. అందులో సందేహం లేదు. కానీ ప్రజల ప్రయోజనాలు ఏమిటన్నదీ సంకుచిత, స్వల్పకాలిక స్వార్ధ పూరిత ఎత్తుగడలు నిర్ణయించరాదని ఈ కార్టూన్ లో ‘ది హిందూ‘ కార్టూనిస్టు కేశవ్ చెబుతున్నారు. బహుశా శ్రీలంక మానవ హక్కుల తీర్మానం, కాశ్మీరులో భారత్-పాక్ సైనికుల ఘర్షణలు, (ఇటలీ మెరైన్ల వ్యవహారం కూడానా?) కార్టూనిస్టు దృష్టిలో ఉన్నాయనుకుంటాను.
ఎల్.టి.టి.ఇ తో పోరాటం గెలిచిన చివరి రోజుల్లో శ్రీలంక సైన్యం తమిళ ప్రజలపై అత్యంత ఘోరమైన దురాగతాలకు పాల్పడిందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ ఆ సంగతి చెప్పాల్సింది ఎవరు? మానవ హక్కుల హరణలో, యుద్ధ నేరాలలో, వాణిజ్య ఆంక్షల పేరుతో అనేక దేశాల్లోని అమాయక ప్రజలను తిండికి, మందులకు లేకుండా మాడ్చడంలో పేరెన్నిక గన్న అమెరికా అయితే ఖచ్చితంగా కాదు. దురాగతాలు జరిగినప్పుడు తమిళ నాడు పార్టీలు నోరెత్తింది లేదు. జరిగిన తర్వాత రోజుల్లో తమిళ ప్రజలు శ్రీలంకలోని శరణార్థి శిబిరాల్లో అష్టకష్టాలు పడుతున్నా ఏ పార్టీ పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ అమెరికా తీర్మానానికి అటూ, ఇటూ రోజుల్లో ఈ పార్టీలు ఆందోళన చేయడం వెనుక ఎవరు ఉన్నారు?
ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు స్పందించి తదనుగుణమైన చర్యలను వాస్తవంగా తీసుకోవడం, ఆ భావోద్వేగాలను రాజకీయ స్వార్ధాలకు ఉపయోగించుకోవడం రెండూ వేరు వేరు. ఇప్పుడు తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ రెండో క్రీడలో మునిగి తేలుతున్నాయి. ఈ క్రీడ ఎంతవరకు వెళ్లిందంటే నవంబరులో శ్రీలంకలో జరగనున్న చోగమ్ (Commonwealth Heads of Governments Meeting) సమావేశాలకు ఇండియా వెళ్లడానికి వీలు లేదని ముఖ్యమంత్రి జయలలిత డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు ఆమె ప్రధానికి లేఖ రాశారు. అసలు చోగమ్ సమావేశాలే శ్రీలంకలో జరగడానికి వీల్లేదని, ఒక వేళ జరిగితే ఇండియా హాజరు కావద్దని డిఎంకె డిమాండు. ‘ఎద్దు ఈనిందంటే దూడని కట్టెయ్యమనడం‘ అంటే ఇదే కాబోలు!
భారత్, పాకిస్ధాన్ దేశాల మధ్య పరస్పర వాణిజ్య, సాంస్కృతిక సహకార సంబంధాలు మొదలయ్యిందే బిజెపి పాలనలో. అలాంటి పార్టీ ఇప్పుడు పాక్ తో వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకోవాలని, అసలు పాక్ తో ఏ సంబంధమూ వద్దనీ కూడా డిమాండ్ చేయడం ఏ కోవలోనిది?
ప్రజల నిజమైన భావోద్వేగాలు వారి రోజువారీ ఆర్ధిక జీవనంతో ముడిపడి ఉంటాయి. రోజు రోజుకి తగ్గిపోతున్న వారి ఆదాయాలు వారి బతుకులను దుర్భరం చేస్తున్నాయి. దరిద్రం నుండి, అప్పుల నుండి తప్పించుకునే మార్గం లేక అనేకమంది రైతులు, మధ్యతరగతి జీవులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇంకా అనేకమంది నేరస్థులుగా మారుతున్నారు. ఈ పరిస్ధితులను పట్టించుకోని పాలకులు బోడి గుండుకి మోకాలుకి ముడులు వేస్తూ ప్రజల సాంస్కృతిక, ప్రాంతీయ భావోద్వేగాలతో ఆటలాడుకోవడం నేటి భారతం.
