2016 నాటికి చైనా ఆర్ధిక వ్యవస్థ ‘పర్చేసింగ్ పవర్ ప్యారిటీ’ (పి.పి.పి) పరంగా అమెరికాను మించిపోతుందని ఒఇసిడి (Organization for Economic Cooperation and Development) జోస్యం చెప్పింది. వరుసగా నాలుగో దశాబ్దంలో వేగవంతమైన ఆర్ధిక వృద్ధి (జి.డి.పి వృద్ధి రేటు) నమోదు చేయడానికి చైనా ఉరుకులు పరుగులు పెడుతోందని ఒఇసిడి విడుదల చేసిన తాజా నివేదిక తెలియజేసింది.
గత సంవత్సరం జపాన్ ఆర్ధిక వ్యవస్థ పరిమాణాన్ని మించి పోయి అమెరికా తర్వాత అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించిన చైనా మరో మూడేళ్లలోనే అమెరికాను అధిగమిస్తుందని అంచనా వేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే అయినా ఒఇసిడి పరిశీలనను తేలికగా కొట్టిపారేయలేము.
పారిస్ నుండి పని చేసే ఒఇసిడి కూటమి 34 అభివృద్ధి చెందిన దేశాల ఆర్ధిక కూటమి. ఇందులో మెక్సికో, టర్కీ లాంటి ‘ఎమర్జింగ్ దేశాలు’ కూడా రెండో, మూడో ఉన్నాయి. ప్రపంచం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని ఈ కూటమి తన గురించి తాను చెప్పుకుంటుంది. కానీ ఆచరణలో అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంది. ప్రపంచ దేశాల ఆర్ధిక వనరులను పణంగా పెట్టి తమ బహుళజాతి కంపెనీలకు దోచిపెడుతూ సంపదలను తమ వద్దనే కేంద్రీకరింపజేసుకోవడం ఈ కూటమి వాస్తవ విధానం.
ఒఇసిడి నివేదిక ప్రకారం ఈ సంవత్సరం చైనా జి.డి.పి 8.5 శాతం వృద్ధి నమోదు చేసి తదుపరి సంవత్సరం (2014) 8.9 శాతం వృద్ధి నమోదు చేస్తుంది. ఇది చైనా సొంత అంచనా కంటే ఎక్కువ కావడం విశేషం. 2015తో ముగిసే 5 సంవత్సరాల కాలంలో సగటున సంవత్సరానికి 7 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తామని చైనా నేతలు అంచనా వేశారు. ఒఇసిడి అంచనా ప్రకారం ఈ దశాబ్దంలో చైనా సగటు వృద్ధి 8 శాతంగా ఉంటుంది. గత సంవత్సరం 7.8 శాతం వృద్ధి నమోదు చేసింది. గత దశాబ్ద కాలంలో చైనా నమోదు చేసిన అతి తక్కువ జి.డి.పి వృద్ధి ఇదే కావడం గమనార్హం.
అయితే తాను అంచనా వేసిన వృద్ధి రేటు సాధించాలంటే చైనా మరిన్ని ద్రవ్య సంస్కరణలను అమలు చేయాలని ఒఇసిడి మెలిక పెట్టింది. నియంత్రణ పరమైన సంస్కరణలను చేపట్టి ఆర్ధిక వ్యవస్థను మరింత సరళీకరించాలని షరతు విధించింది. “దీర్ఘకాలిక దృష్ట్యా, చైనా ఇప్పుడు యూరో ఏరియా (యూరో ఉమ్మడి కరెన్సీగా కలిగిన యూరో జోన్) ను అధిగమించింది. 2016కల్లా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించే దిశలో సాగుతోంది” అని ఒఇసిడి సెక్రటరీ జనరల్ ఏంజెల్ గురియా తెలిపింది. (ది హిందు)
ప్రస్తుతం అమెరికా జి.డి.పి 15.7 ట్రిలియన్ డాలర్లు కాగా చైనా జి.డి.పి 8.3 ట్రిలియన్ డాలర్లు. దాదాపు అమెరికా కంటే సగం పరిణామంలో ఉన్న చైనా మరో మూడేళ్లలో అమెరికాను అధిగమించడం అద్భుతమే కాగలదు. “చైనా పుంజుకోవడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. స్థిరమైన వృద్ధి సాధించడానికి కీలకమైన అంశాలకు సంబంధించి చైనాకు శక్తివంతమైన రికార్డు ఉంది” అని ఒఇసిడి నివేదిక పేర్కొంది. అయితే అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలను అందుకునే కొద్దీ చైనా వృద్ధి మందగించే అవకాశం ఉందని కూడా నివేదిక పేర్కొందని ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్.టి) పత్రిక తెలిపింది.
చైనా వృద్ధికి ఎదురయ్యే ఆటంకాలను కూడా నివేదిక తెలియజేసింది. ఎఫ్.టి ప్రకారం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మందగమనంతో ఉండడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిస్త్రాణంగా పడి ఉన్న ద్రవ్య వ్యవస్థ, అసమానతలు, పెరుగుతున్న వృద్ధుల సంఖ్య చైనా వృద్ధికి ఆటంకాలుగా నివేదిక పేర్కొంది. అయితే చైనా ఇప్పటికే ఎగుమతులపై ఆధారపడడం క్రమంగా తగ్గించుకుంటున్నదని, దేశీయంగా తగు విధంగా సమతూకం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిందని, పెట్టుబడుల కంటే ఎక్కువగా వినియోగం ద్వారానే 2011లో వృద్ధిని పెంచుకున్నదని తెలిపింది.
మరింత వృద్ధి సాధించాలంటే నగరీకరణను తీవ్రం చేయాలని నివేదిక కోరింది. భారీ అయిన ఉత్పాదక నగరాలను నిర్మించడానికి చైనా పూనుకోవాలని కోరింది. నగరీకరణ వేగంగానే ఉన్నప్పటికీ అదే స్ధాయిలో వృద్ధి నమోదు చేస్తున్న దేశాలతో పోలిస్తే తక్కువ వేగంతో నగరీకరణ జరుగుతోందని తెలిపింది. రవాణా సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, రాజధాని బీజింగ్ లోనే రవాణా సమయం ఒఇసిడి దేశాల సగటు కంటే రెట్టింపు సమయం పడుతోందని తెలిపింది. నూతన ప్రధాని లీ కెకియాంగ్ నగరీకరణ తమ ప్రాధాన్యతగా చెప్పినప్పటికీ భూసేకరణ పైన కేంద్ర ప్రభుత్వం నియంత్రణ సరళీకరించవలసి ఉందని తెలిపింది.
ఒఇసిడి నివేదిక చైనా ఆర్ధిక వృద్ధి పశ్చిమ దేశాల వినియోగం కోసమే అన్నట్లుగా ఉంది తప్ప చైనా ప్రజల కోసం అన్నట్లు లేదు. లేదంటే చైనాలో తీవ్రం అవుతున్న కార్మిక వర్గ అసంతృప్తి గురించి, ఏటికేడూ పెరుగుతూ పోతున్న సమ్మెల, ఆందోళనల సంఖ్య గురించి నివేదిక ఏమీ మాట్లాడకపోవడం విచిత్రం. పైగా నివేదిక చేసిన సూచనలను చైనా ప్రజల ప్రయోజనాలకు మరింత ఎసరు తెచ్చేవే.

