ఇండియా మరోసారి ఇటలీపై రాయబార విజయాన్ని నమోదు చేసుకుంది. కేరళ జాలర్ల హత్య కేసులో నిందితులైన ఇద్దరు ఇటలీ మెరైన్ సైనికులు ఇండియాకు వస్తున్నట్లు ఇటలీ ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిన అనంతరం మెరైన్లను తిరిగి పంపడానికి ఇటలీ ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు విధించిన గడువు చివరి తేదీ మార్చి 22 నే ఇటలీ ప్రకటన వెలువడడం గమనార్హం.
ఈ మేరకు గురువారం బాగా పొద్దుపోయాక ఇటలీ ప్రభుత్వ ప్రకటన వెలువడినట్లు ది హిందూ పత్రిక తెలిపింది. ఈ ప్రకటనతో ఇటలీ ప్రభుత్వం గతంలో చేసిన ప్రకటనను వెనక్కి తీసుకున్నట్లయింది. జాలర్ల హత్య కేసులో నిందితులైన తమ మెరైన్లు ఇండియాకి తిరిగి రావడం లేదని ఇటలీ ప్రభుత్వం ప్రకటించిన తరువాత అంతర్జాతీయ రాయబార సంబంధాలలో ఉద్రిక్తత ఏర్పడిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల పాటు ఇటలీ, ఇండియాల ప్రభుత్వాలతో పాటు ప్రజల మధ్య కూడా భావోద్వేగపరమైన ఉద్రిక్తతలు ఏర్పడి క్రమంగా తీవ్రం అయ్యే ప్రమాదం తలెత్తింది. వివిధ వైపుల నుండి వచ్చిన ఒత్తిడితో ఇటలీ ప్రభుత్వం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.
మెరైన్లు తిరిగి రావడానికి భారత ప్రభుత్వం రెండు ప్రధాన హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటలీ వార్తా సంస్థ ANSA ప్రకారం ఇద్దరు ఇటలీ మెరైన్లకు భారత సుప్రీం కోర్టు మరణ శిక్ష విధించబోదని భారత ప్రభుత్వం హామీ ఇచ్చాక ఇటలీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి అంగీకరించింది. ఇటలీ ఉప విదేశాంగ మంత్రి ‘స్టెఫాన్ డి మిస్తురా‘ ఈ మేరకు ANSA వార్తా సంస్థకు సమాచారం ఇచ్చాడు.
ఇద్దరు మెరైన్ల మౌలిక హక్కులకు భంగం రానివ్వబోమన్న హామీని కూడా ఇటలీ ప్రభుత్వం భారత ప్రభుత్వం నుండి కోరింది. భారత ప్రభుత్వం ఆమేరకు హామీ ఇచ్చినట్లు ఇటలీ మంత్రి తెలిపాడని ANSA తెలియజేసింది.
భారత సుప్రీం కోర్టు కఠినంగా వ్యవహరించడంతో ఇటలీ ప్రభుత్వం పునరాలోచించినట్లు కనిపిస్తోంది. లేక ఇటలీ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే మొదట మెరైన్లను పంపడానికి నిరాకరించి భారత ప్రభుత్వం నుండి తగిన షరతులను ఆమోదింపజేసుకుని చివరి
నిమిషంలో తమ వారిని పంపడానికి అంగీకరించి ఉండవచ్చు. రాయబార చర్చల ద్వారా ప్రభుత్వాల స్ధాయిలో సమస్యను పరిష్కరించుకుందామని ఇటలీ మొదటి నుండి కోరుతోంది. దుర్ఘటన జరిగింది అంతర్జాతీయ జలాల్లో కనుక, మెరైన్లు ఉన్న ఓడకు ఇటలీ జెండా ఉన్నందున ఇటలీ న్యాయస్థానాలు కేసును విచారించాలని ఇటలీ వాదించింది. ఈ మేరకు ఇటలీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను భారత్ వినిపించుకోలేదు. దానితో తమ మెరైన్లను రక్షించుకోడానికి ఇటలీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న వాదనను కొట్టిపారేయడానికి వీలు లేదు.
కంటిగ్యుస్ జోన్
ఏ దేశానికైనా ఆ దేశ సముద్రం తీరం నుండి 12 నాటికల్ మైళ్ల దూరం వరకు ఉన్న సముద్రం ఆ దేశానికి చెందుతుంది. దానికి ఆనుకుని ఉన్న మరో 12 నాటికల్ మైళ్ల దూరం మేరకు సముద్రం ‘కంటిగ్యుస్ జోన్‘గా (పటం చూడగలరు) వ్యవహరిస్తారు. ఈ జలాలపైన కూడా ఆయా దేశాలకు హక్కు ఉన్నప్పటికీ వాటిపైన సార్వభౌమాధికారం ఉండదు. ఈ జలాలను అంతర్జాతీయ సముద్ర జలాలుగా పరిగణిస్తారు. ఇక్కడ ప్రయాణించే ఓడలపైనా ఏ దేశ జాతీయ జెండా ఉంటే ఆ దేశానికి ఆ ఓడ పైన సార్వభౌమాధికారం ఉంటుంది. ప్రస్తుత ఉదాహరణలో ‘ఎన్రికా లెక్సి‘ పైన ఇటలీ జెండా ఉండగా కేరళ జాలర్ల ఓడపైన భారతీయ జెండా లేదు. దానితో దుర్ఘటన పైన ఇటలీ కోర్టులే విచారించాలని ఇటలీ ప్రభుత్వం వాదించడానికి ఆస్కారం ఏర్పడింది.
కానయితే, ఇటలీ ప్రభుత్వం తన హామీ నుండి వెనక్కి వెళుతున్నట్లు ప్రకటించడం వలన సుప్రీం కోర్టు ఆగ్రహాన్ని చవిచూసింది. ఆ విధంగా ఇటలీ మెరైన్లు మరింత కఠిన శిక్షను ఎదుర్కునే పరిస్ధితిని కల్పించి ఉండవచ్చు. ఏదేమైనా తక్షణ పరిశీలనలో ఇటలీ మెరైన్లు తిరిగి రావడం భారత ప్రభుత్వానికి ఒక రాయబార విజయంగా పరిగణించవచ్చు.

