ఫేస్ బుక్ లో 10 శాతం మంది తిట్లు తింటున్నారట!


ఇమేజ్: టేలిగ్రాఫ్

ఇమేజ్: టేలిగ్రాఫ్

ఫేస్ బుక్ ఖాతాదారుల్లో కనీసం నూటికి పది మంది తిట్లు, అవమానాలు ఎదుర్కొంటున్నారని ఒక అధ్యయనం తెలిపింది. అధ్యయనం ప్రకారం ఫేస్ బుక్ వినియోగదారుల్లో పది శాతం మంది తమ వాల్ పైన అభ్యంతరకరమైన, అవమానకరమైన సందేశాలు పోస్ట్ చేయబడిన అనుభవాలు ఎదుర్కొన్నారు. తమకు నచ్చని యూజర్‌లను తిట్టడం, అవమానించడం, వ్యక్తిగతంగా ఎగతాళి చేయడం బూతురాయుళ్ళ పనిగా ఉంటోంది. బెదిరిస్తూ ప్రైవేటు సందేశాలు ఇవ్వడం కూడా వీరి పనుల్లో ఒకటని టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది.

ఇంకా ఘోరం ఏమిటంటే, ఎక్కువమంది -61 శాతం- తమకు కనీసం ఒకసారి లేదా రెండు సార్లు అవమానించబడిన అనుభవం ఎదురైందని చెప్పారు. 8 శాత మంది కనీసం నెలకు ఒకసారి సంఘ వ్యతిరేక స్వభావం ఉన్న సందేశాలు ఎదుర్కొన్నారు. 3 శాతం మందికి నెలకు ఒకటి కంటే ఎక్కువ సార్లు అలాంటి సందేశాలు వచ్చాయి. మరో 3 శాతం మందికి గత సంవత్సరంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సార్లు బూతు సందేశాలు ఎదుర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్ పరిశోధన కోసం సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిష్కారాలు అందజేసే సంస్థ గ్లోబల్ మార్కెట్ ఇన్సైట్‘, ఈ అధ్యయనం నిర్వహించిందని టెలిగ్రాఫ్ తెలిపింది.

అవమానకర, బూతు సందేశాలు ఎదుర్కొన్నవారికీ, వాటిని పోస్ట్ చేసినవారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్న విషయానికి వస్తే 62 శాతం కేసుల్లో వాస్తవ జీవితంలో తెలిసినవారి నుండే అలాంటి సందేశాలు వచ్చాయి. కానీ 27 శాతం మందికి మాత్రం అలాంటి సందేశాలు పంపేవారు కనీసం వారి ఫ్రెండ్స్ లిస్ట్ లో కూడా లేనివారే.

ఇలాంటి సందేశాలకు యూజర్లు ఎలా స్పందించారు? మూడింట రెండొంతుల మంది బూతురాయుళ్లను బ్లాక్ చేశారు. నాలుగోవంతు మంది ఫేస్ బుక్ లో ఉన్న రిపోర్ట్ అనే సౌకర్యాన్ని వినియోగించడం ద్వారా స్పందించారు. 14 శాతం మంది ఫేస్ బుక్ లోని ప్రైవసీ సెటింగ్స్ ద్వారా అవాంఛనీయ సందేశాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 6 శాతం మంది పరిమిత ప్రొఫైల్ ను ఫేస్ బుక్ లో ఉంచడం ద్వారా తమ ప్రైవసీని కాపాడుకున్నారు. 5 శాతం మంది అసలు ఫేస్ బుక్ వాడడమే మానేశారు. 3 శాతం మంది ఫేస్ బుక్ ఖాతాను శాశ్వతంగా మూసేస్తే, 14 శాతం మంది అలాంటి సందేశాలు పెట్టడం మానుకోవాలని నేరుగా చెప్పేశారు.

ట్విట్టర్ మెరుగు

ట్విట్టర్ లో పరిస్ధితి ఫేస్ బుక్ కి పూర్తి భిన్నంగా ఉంది. కేవలం 5 శాతం మాత్రమే బెదిరింపులు, అవమానం, తిట్లు ఎదుర్కొన్నారు. దీనికి కారణం కూడా అధ్యయన సంస్థ తెలిపింది. దాని ప్రకారం ట్విట్టర్ వినియోగదారుల్లో సగం మంది కేవలం ఒకరిని అనుసరించడానికే (ఫాలో) ఖాతాలు నిర్వహిస్తున్నారు. మూడు శాతం మంది మాత్రమే తమ ట్వీట్ లను తొలగించాల్సిందిగా తమను కోరారని తెలిపారని తెలుస్తోంది.

అధ్యయనం నిర్వహించిన సంస్థ యూరోప్ విభాగానికి మార్కెటింగ్ డైరెక్టర్ అయిన రాల్ఫ్ రిస్క్ ఇలా అంటున్నాడు. “అంతర్జాల ప్రపంచంలోని సామాజిక మాధ్యమాల్లో అజ్ఞాతలుగా ఉంటూ ఇతర వినియోగదారులకు అవమానకరమైన సందేశాలు పంపడం, బూతులు పోస్ట్ చేయడం చాలా తేలిక అని భావిస్తున్నారు. ఫేస్ బుక్ లో తమకు అందుబాటులో ఉంచబడిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనేకమంది ఈ సమస్యను తమంతట తామే ఎదుర్కొంటున్నారు. అవమానకర సందేశాలను గాని తిట్లను గానీ ఎదుర్కోకుండా ఉండాలంటే పరిష్కారం చాలా సులభం. అదేమిటంటే అలాంటివి పోస్ట్ చేయకుండా తమను తాము నియంత్రించుకోవడం” అని రాల్ఫ్ సెలవిచ్చాడు.

పరిష్కారం ఇంత తేలికయితే అసలు సమస్య, సమస్యగా ఎండుకుంటుంది? రాల్ఫ్ దృష్టిలో తిట్టేవారూ, తిట్టించుకునేవారు ఒకరే. లేదా ఆయన తిట్టేవారినీ, తిట్టించుకునేవారినీ ఒకే గాటన కట్టేశారు. ఎంతయినా ఇంటర్నెట్ టెక్నాలజీని ఆదాయ మార్గంగా ఎంచుకున్న సంస్థకు అధినేత కదా ఆయన! ప్రకృతి వనరులను సొంత లాభానికి వెచ్చించి లాభపడే రాల్ఫ్ లాంటి వారినుండి ఇంతకంటే మెరుగైన పరిష్కారం ఆశించలేము. అంతర్జాల ప్రపంచం అనేది వాస్తవ ప్రపంచానికి కొనసాగింపే తప్ప అదేదో ప్రత్యేకంగా ఆకాశం నుండి ఊడిపడిన ప్రపంచం కాదు.

రాల్ఫ్ లాంటి వారికి అంతర్జాలం, లాభాలు కురిపించడానికి ఆకాశం నుండి ఊడిపడిందే కావచ్చు గాని జనానికి మాత్రం కాదు. కాదు గనకే ఇటీవల హైదరాబాద్ మహిళలు తమ పరిష్కారం ఏదో తాము చూసుకున్నారు. రాల్ఫ్ కావాలనుకుంటే వారిని ‘ఫాలో అయ్యి పరిష్కారం ఎంత బాగా పనిచేసిందో స్వయంగా తెలుసుకోవచ్చు.

2 thoughts on “ఫేస్ బుక్ లో 10 శాతం మంది తిట్లు తింటున్నారట!

  1. అవును. హైదరాబాద్ మహిళల చర్య….మన తెలుగు నెటిజన్లపై గట్టి ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది.
    గతంలో లాగా ఎక్కడపడితే అక్కడ, ఏది తోస్తే అది.. రాసే వాళ్లు కొద్దిగా సంయమనం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది.

  2. Its because of mental immaturity of people. One person had wrongly identified me as scion from Savara tribe and added me as friend. In a post I wrote that I belong to kandha tribe and it is not possible to identify the tribe of a person by the surname. The Savara tribesman had immediately deleted by comment and said that my comment hurts sentiments of a specific tribe. People with surname Mandangi are seen in different tribes of Orissa. If he thinks that all the people with same surname are brothers then whom will be responsible for his fault? He need not scold me but he did scold.

వ్యాఖ్యానించండి