తమిళనాట ఇపుడు యు.పి.ఎ భాగస్వామి ఎవరు? -కార్టూన్


ది హిందు నుండి

ది హిందు నుండి

డిఎంకె తెగతెంపులు చేసుకోవడంతో యుపిఎలో తమిళనాడు స్ధానం సీటు ఖాళీ అయింది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్న నేపధ్యంలో తమిళనాడులో ఖాళీ అయిన సీటును భర్తీ చేసుకోవడానికి కాంగ్రెస్ ఎదురు చూస్తోంది. తెలియని ప్రేమికుడి కోసం తమిళనాడు (T) గేటు వద్ద ఆ పార్టీ మోహ గీతాలు ఆలపిస్తోందని ది హిందూ కార్టూనిస్టు కేశవ్ కార్టూన్ సూచిస్తోంది. ఎన్నికల వేడి రాజుకునేకొద్దీ ఆ గీతాలకు స్పందించే వారు దొరక్కపోరు. వాడుకుని వదిలేయడం భారత పాలకులకు కొత్త కాదు కదా!

ఇంతకీ డిఎంకె. పార్టీ యుపిఎ నుండి ఎందుకు వైదొలగింది? ఎ.రాజా, కనిమొళి లను జైలు పాల్జేసినా దిగమింగుకున్న డి.ఎం.కె నానాటికీ కాంగ్రెస్ తో కలిసి ఇమడలేక సతమతం అయ్యిందనీ, దానితో తెగతెంపులు చేసుకోవడానికి తగిన అవకాశం కోసం కరుణ పార్టీ ఎదురు చూసిందని, శ్రీలంక మానవ హక్కుల తీర్మానం చక్కటి సందర్భంగా కలిసి రావడంతో పావులు వేగంగా కదిపి యు.పి.ఎను విసిరేశారని ది హిందూ పత్రిక సంపాదకీయం విశ్లేషించింది. శ్రీలంక తమిళుల సమస్య కేవలం ఒక సాకు మాత్రమేనని సదరు పత్రిక పరోక్షంగా సూచించింది.

శ్రీలంకలో తమిళులపై పెద్ద ఎత్తున మారణకాండ జరిగినప్పుడు లేని స్పందన చుక్క తెగి పడ్డట్టు అమెరికా మానవ హక్కుల తీర్మానానికి రావడం ఏమిటి? అమానుష రీతిలో హత్యాకాండ జరిగినప్పుడు గానీ, సంబంధిత వీడియోలు బైటపడ్డప్పుడు గానీ, అనేకసార్లు తమిళ జాలర్లను పట్టుకుని జైళ్ళలో కుక్కినప్పుడు గానీ రాని స్పందన తమిళనాడు ప్రజల్లో, విద్యార్ధుల్లో ఇప్పుడు ఎందుకు వస్తున్నట్లు? ఈ ఆందోళనల వెనుక ఎవరి ప్రోద్బలం ఉన్నట్లు? ఎన్నికలు ఒప్పందాలు ముగిస్తే గాని ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరక్కపోవచ్చు.

వ్యాఖ్యానించండి