–
వివిధ రంగాల్లో చైనా, శ్రీలంక దేశాల మధ్య పెరుగుతున్న సహకారం భారత పాలకులకు (ప్రజలకు కాదు) ఆందోళన కలిగిస్తోంది. భారత్ ని విస్మరిస్తూ శ్రీలంక, చైనాతో సహకార సంబంధాలు పెంపొందించుకోవడం ముఖ్యంగా భారత భద్రతా వ్యవస్థలను ఠారెత్తిస్తోంది. అది కూడా కీలకమైన వ్యూహాత్మక రంగాలలో ఈ సహకారం కొంత పుంతలు తొక్కడం మరింత కంగారు పుట్టిస్తోంది. శ్రీలంకలో భారత ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం వచ్చేవారం వివిధ మంత్రిత్వ శాఖల సమావేశం (inter-ministerial meeting) జరపాలని భారత ప్రభుత్వ జాతీయ భద్రతా సంస్థ సెక్రటేరియట్ ప్రతిపాదించడాన్ని బట్టి పరిస్ధితి తీవ్రతను స్పష్టం చేస్తోంది.
అంతరిక్ష రంగంలో చైనా, శ్రీలంకలు సహకరించుకోనున్నాయని వార్తలు వెలువడడంతో భారత పాలకులు తాజాగా ఆందోళన చెందుతున్నారని ది హిందూ విలేఖరి సందీప్ జోషి తెలిపాడు. శ్రీలంక దేశం తన మొదటి కమ్యూనికేషన్ శాటిలైట్ ను 2015లో చైనా సహాయంతో ప్రయోగించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ అంశం పైన 2012 మధ్య కాలంలోనే భారత జాతీయ భద్రత సంస్థ (National Security Agency) చర్చించిందని తెలుస్తోంది. శ్రీలంక అంతరిక్ష కార్యక్రమాల వలన భారత భద్రతపై ఏమేరకు ప్రభావం పడుతుందో మదింపు వేయాలని ఎన్.ఎస్.ఎ, భారత అంతరిక్ష విభాగాన్ని (Department of Space) కోరినట్లు కూడా తెలుస్తోంది.
శ్రీలంక అంతరిక్ష కార్యక్రమం వలన నేరుగా భారత్ పై ప్రభావం కలిగించేది ఏమీ ఉండకపోవచ్చు. ఆ కార్యక్రమం చైనా సహకారంతో జరగడమే భారత్ ఆందోళనకు కారణంగా తెలుస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో (Indian Space Research Organization) అసలు భారత దేశమే పూనుకుని శ్రీలంక కోసం ఉపగ్రహాలు నిర్మించి ప్రయోగించాలని భారత ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. తద్వారా సదరు ఉపగ్రహాల ద్వారా ఇరు దేశాలు లబ్ది పొందవచ్చని ఇస్రో సూచించింది. అయితే ఈ సలహా ప్రభుత్వ పెద్దలు ఎంతవరకు స్వీకరించింది తెలియలేదు.
ది హిందూ పత్రిక ప్రకారం శ్రీలంక కంపెనీ ‘సుప్రీం శాట్ ప్రైవేట్ లిమిటెట్’ (Supreme SAT (Pvt) Ltd.), టెలికమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగించడానికి శ్రీలంక ప్రభుత్వ సంస్థ ‘బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్’ తో గత సంవత్సరం మే నెలలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ, చైనాకు చెందిన ప్రభుత్వ సంస్థ ‘చైనా గ్రేట్ వాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్’ భాగస్వామ్యంతో 320 మిలియన్ డాలర్ల (రు. 1728 కోట్లు) ఖర్చుతో ఈ శాటిలైట్ నిర్మిస్తోంది. అంతే కాదు. శ్రీలంకలో చైనా సహాయంతో గ్రౌండ్ స్టేషన్ గా కూడా పని చేసే ఒక స్పేస్ అకాడమీ నిర్మించడానికి ఈ సహకార ఒప్పందం తలపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా చైనా శ్రీలంక పైన ఏదో మేరకు ప్రభావం సంపాదించుకోవడం అనివార్యం. భారత పాలకులకు సహజంగానే ఇది నచ్చదు. దక్షిణ ఆసియాలో తామే పెద్దన్నలమని భారత పాలకుల గట్టి నమ్మకం. ఇక చైనా ప్రభావం పెరగడానికి అమెరికా ఎలాగూ వ్యతిరేకమే.
ఈ నేపధ్యంలో మార్చి 25 తేదీన ఉప జాతీయ భద్రతా అధిపతి నేతృత్వంలో మంత్రిత్వ శాఖల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో శ్రీలంక అంతరిక్ష కార్యక్రమం గురించి వివరంగా చర్చించనున్నారు. అంతరిక్ష కార్యక్రమాలలో ద్వైపాక్షిక సహకారం చేసుకోవాలని భారత ప్రభుత్వం శ్రీలంక అధికారులతో చర్చలకు చొరవ చూపవచ్చని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ది హిందూ తెలిపింది. ఉపగ్రహాల నిర్మాణం, ప్రయోగం, నిర్వహణ… ఈ మూడు అంశాలలోనూ సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని భారత్ ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శ్రీలంక అందుకు అంగీకరించకపోతే శాటిలైట్ పరిధిని శ్రీలంక భూభాగం మరియు, టెరిటోరియల్ వాటర్స్ వరకు పరిమితం చేసేలా జాగ్రత్త తీసుకోవాలని భారత్ కోరనుంది.
కక్ష కేటాయింపు, ఫ్రీక్వెన్సీ సమన్వయం, విదేశీ ఛానళ్ల డౌన్ లింకింగ్ తదితర అంశాలను నిర్ధారించే సందర్భంగా అంతర్జాతీయ స్ధాయిలో భారత్ తన అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి సంసిద్ధం అవుతున్నట్లు పత్రిక నివేదించింది. తమ జాతీయ భద్రతకు, వాణిజ్య ప్రయోజనాలకు తగిన రక్షణలు కల్పించాలని భారత్ డిమాండ్ చేయనుంది.
ఇప్పటిది కాదు
చైనా, శ్రీలంకల సహకారం వాస్తవానికి ఇప్పటిది కాదు. గత సంవత్సరం నవంబరు లోనే చైనా సహాయంతో తన మొదటి కమ్యూనికేషన్స్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అయితే అది చైనా భూభాగంలోని గ్జిచాంగ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించబడింది. చైనా కక్షలో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడంతో భారత్ అప్పుడు పెద్దగా స్పందించలేదు. వాణిజ్య ఉపగ్రహం అయినందున తమకు ఖాతరు లేదని భారత అధికారులు తెలిపినట్లు వార్తా సంస్థలు తెలిపాయి.
ఇది ప్రైవేటు కంపెనీ చొరవతో జరిగిందని శ్రీలంక ప్రభుత్వం చెప్పినప్పటికీ, శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్ష తనయుడు విజిత్ పీరిస్ ఇందులో కీలక పాత్ర పోషించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రైవేటు అయినా, ప్రభుత్వం అయినా ఉపగ్రహ ప్రయోగం చైనా-శ్రీలంక దేశాల మధ్య పెరుగుతున్న స్నేహానికి ప్రబల సంకేతం అనడంలో సందేహం లేదు. శ్రీలంక క్రమంగా భారత్ కి దూరం అవుతూ, చైనాకు దగ్గర అవుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కూడా.
రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం ఎల్.టి.టి.ఇ ఓటమి తర్వాత కాలం నుండి శ్రీలంకకు అతి పెద్ద ఋణ దాత చైనాయే. తమిళ టైగర్లను ఓడించడంలో చైనా అందజేసిన మిలటరీ పరికరాలు సహాయం ఎంతో ఉంది. అప్పటి నుండి చైనాతో రక్షణ ఒప్పందాలు చేసుకోవడానికి శ్రీలంక ప్రయత్నాలు తీవ్రం చేసింది. గత సెప్టెంబరులో చైనా రక్షణ మంత్రి శ్రీలంక పర్యటించి మిలట్రీ శిక్షణ కోసం గ్రాంటు మంజూరు చేస్తామని హామీ ఇచ్చాడు. ప్రాంతీయ సమతుల్యం పెంచడమే తమ లక్ష్యమని ఆ సందర్భంగా చైనా మంత్రి ప్రకటించడం ఇండియా పాలకులకు పుండు మీద కారం రాసినట్లే అయింది.
ఇదే కాకుండా శ్రీలంక దక్షిణ ప్రాంతంలో ఒక ఓడ రేవు, ఒక విమానాశ్రయం నిర్మించడంలో చైనా సహాయం ఉన్నది. ఈ రెండు నిర్మాణాలు అధ్యక్షుడు రాజపక్ష నియోజకవర్గంలో జరగడం విశేషం. ధర్మల్ విద్యుత్ కేంద్రం, ఎక్స్ ప్రెస్ హైవేలు, రైల్వేలు, కాలువల తవ్వకం తదితర ప్రాజెక్టులలో కూడా చైనా కంపెనీలు భాగం పంచుకుంటున్నాయి.
బహుళ రంగాలలో కొనసాగుతున్న ఈ సహకారం ఇండియాతో పాటు అమెరికాకు కూడా ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఈ రోజు (మార్చి 21) ఐరాస మానవ హక్కుల సమితిలో శ్రీలంకకు వ్యతిరేకంగా అమెరికా ప్రతిపాదించిన తీర్మానం ఆమోదం పొందడాన్ని ఈ కోణంలో చూస్తే సరిగ్గా అర్ధం అవుతుంది. తీర్మానం ఆమోదానికి ఒకరోజు ముందు తమ తీర్మానాన్ని అమెరికా తీవ్రంగా నీరుగార్చడం వెనుక ఏయే ఒప్పందాలు జరిగాయో మున్ముందు మాత్రమే తెలియగలదు.
