శ్రీలంక మానవహక్కుల తీర్మానాన్ని నీరుగార్చిన అమెరికా


Source: Channel 4

Source: Channel 4

శ్రీలంక పాలకులపై కన్నెర్రజేసినట్లు కనిపించిన అమెరికా చివరికి తన అసలు రంగు చూపించింది. ఎల్.టి.టి.ఇ తో జరిగిన యుద్ధంలో చివరి రోజుల్లో అమాయక తమిళ ప్రజలపై శ్రీలంక సైనికులు సాగించిన అమానుష హత్యాకాండను ఖండిస్తూ, అంతర్జాతీయ విచారణకు అంగీకరించాలని ఒత్తిడి చేస్తూ ఐరాస మానవహక్కుల సంస్థలో ఆమోదించడానికి తయారు చేసిన తీర్మానాన్ని తీవ్రంగా నీరుగార్చింది. అలంకార పదజాలంతో నిప్పులు కక్కుతూ రాసిన భాషను తొలగించి అలంకార ప్రాయమైన పరిభాషను చేర్చింది.

శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం తమిళనాడు ప్రజలు రోజుల తరబడి ఆందోళనలు చేయడానికి ప్రేరేపించిన అమెరికా తీర్మానం చివరికి తుస్సుమనిపించడం అమెరికా మార్కు బెదిరింపు వ్యూహమే కాగా మానవహక్కులను హరించడమే తెలిసిన అమెరికా ఆ హక్కులను కాపాడడానికి ఎప్పటికీ పూనుకోదని భారత ప్రజలు ఇంకా నేర్వని పాఠం కావచ్చు.

సవరించిన తీర్మానం ప్రకారం శ్రీలంకలో అంతర్జాతీయ పరిశీలకులను అనుమతించ వలసిన అవసరం శ్రీలంక ప్రభుత్వానికి లేదు. విదేశీ పరిశీలకులను, ప్రత్యేక నిపుణులను శ్రీలంకలోకి అనుమతించాలని కోరే వాక్యాలను తీర్మానం నుండి అమెరికా తొలగించింది. శ్రీలంక ప్రభుత్వ సైనికులు పాల్పడిన మానవ హక్కుల ఉల్లంఘనలపై విదేశీ విచారణను కోరుతూ చేసిన ప్రతిపాదనను కూడా తీర్మానం నుండి తొలగించారు. అత్యంత ఘోరం ఏమిటంటే తన ఉల్లంఘనలపై తానే విచారణ చేసుకోవాలని శ్రీలంక ప్రభుత్వాన్ని తీర్మానం కోరడం.

ఇది అమెరికా, దాని తోక రాజ్యం ఇజ్రాయెల్ లు ఎప్పుడూ అనుసరించే దమననీతికి చక్కని అనువర్తన. పాలస్తీనీయుల గాజాను అతిపెద్ద బహిరంగ జైలుగా మార్చి ఇజ్రాయెల్ అమలు చేస్తున్న జాత్యహంకార విధానాల పైనా, అణచివేత యుద్ధాలలో సాగించిన యుద్ధ నేరాల పైనా అంతర్జాతీయ విచారణ చేయాలని ఐరాస మానవహక్కుల సంస్థ తీర్మానం చేసిన ప్రతిసారీ,
అక్కర్లేదు. ఇజ్రాయెల్ ప్రభుత్వమే తనపై తాను విచారణ చేసుకుంటే సరిపోతుంది అని అమెరికా చేసే సవరణలకు అచ్చమైన ప్రతిరూపం తాజా శ్రీలంక తీర్మానం.

సవరణలు

విదేశీ పరిశీలకులకు, ప్రత్యేక నిపుణులకు శ్రీలంకలో నిర్నిరోధ ప్రవేశం (unfettered access) కల్పించాలని ఒరిజినల్ తీర్మానం కోరింది. సవరించిన తీర్మానం ఆ పేరాను మొత్తంగా తొలగించింది. సవరించిన తీర్మానంలో ఇది అతి పెద్ద మార్పు. తీర్మానం స్వభావాన్ని మార్చివేసిన మార్పు.

From Channel 4

From Channel 4

అసలు తీర్మానంలోని ఒక సెక్షన్, శ్రీలంక సైనికుల మానవ హక్కుల ఉల్లంఘనలపై, యుద్ధ నేరాలపై విశ్వసనీయమైన అంతర్జాతీయ పరిశోధనకు” శ్రీలంక అంగీకరించాలని కోరింది. సవరించిన తీర్మానం విదేశీ విచారణకు విజ్ఞప్తి మాత్రమే చేస్తోంది. పైగా ఆ విజ్ఞప్తినే ప్రధాన అంశంగా హై లైట్ చేస్తోందని ది హిందు విలేఖరి నారాయణ్ లక్ష్మణ్ నివేదించాడు. శ్రీలంక ప్రభుత్వం తన ఉల్లంఘనలపై తానే విచారణ చేసుకోవాలని కూడా సవరణాలను చేర్చింది అమెరికా. ఇది తీర్మానం స్వభావాన్ని మార్చిన రెండవ మేజర్ మార్పు.

“అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని (international human rights law), అంతర్జాతీయ మానవత్వ చట్టాన్ని (international humanitarian law) ఉల్లంఘించిన ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం స్వతంత్ర, విశ్వసనీయమైన పరిశోధన చేయాలని (తీర్మానం) పిలుపునిస్తోంది” అని తీర్మానం పేర్కొందని ది హిందు తెలిపింది. అయితే ఇప్పుడు అంతర్జాతీయ (international) పదం కూడా లేదని పత్రిక తెలిపింది.

ఆ తర్వాత తీర్మానం పొడవునా విమర్శనాత్మక పరిభాష స్ధానంలో సానుకూలమైన, బలహీనమైన పరిభాషను చేర్చారు. శ్రీలంక ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నట్లు ఉన్న పదజాలాన్ని తొలగించి బలహీన పదజాలాన్ని చొప్పించారు. ఉదాహరణకి:

“Noting with concern the failure of the Government of Sri Lanka to fulfil its public commitments, including on the devolution of political authority…”

అన్న వాక్యంలోని “Noting with concern the failure of…” స్ధానంలో “Calling upon…” అని చేర్చారు.

మరో చోట, “(UNHRC was) Reaffirming that it is the responsibility of the Government of Sri Lanka to ensure the full enjoyment of all human rights and fundamental freedoms of its entire population,”

అన్న వాక్యంలో ‘Government of Sri Lanka’ స్ధానంలో ‘each State’ అని చేర్చారు. అంటే తీర్మానం శ్రీలంక ప్రభుత్వ మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించినది అన్న ప్రస్తావన కూడా లేకుండా చేయడం అన్నమాట.

శ్రీలంక ప్రభుత్వం శరణార్థి శిబిరాలలో తలదాచుకుంటున్న తమిళ ప్రజలను సొంత ఇళ్లకు తరలించడానికి ఇంతవరకు సరైన కృషి చేయలేదు. లక్షల మంది రోగాలతో, వైద్య సౌకర్యం లేకుండా, సరైన తిండి, ఇతర సదుపాయాలు లేకుండా బతుకీడుస్తున్నారు. అయినప్పటికీ శ్రీలంక ప్రభుత్వం తమిళుల పరిస్ధితుల మెరుగుదలలో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని గుర్తిస్తున్నట్లుగా పదజాలాన్ని తీర్మానంలో చేర్చారు.

రాజకీయ అధికారాన్ని కింది స్థాయి వరకూ పంచుకోవాలన్న సూచనను తీర్మానం నుండి తొలగించారు. తద్వారా తమిళులకు అధికారంలో భాగం పంచాలన్న ప్రాధమిక డిమాండును పక్కనబెట్టారు. బ్రిటన్ కి చెందిన అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా తీర్మానాన్ని నీరుగార్చారని అభిప్రాయపడడం గమనార్హం.

అమెరికా ప్రతిపాదించిన తీర్మానం, అందులోని సవరణాలను ది హిందూ పత్రిక అందుబాటులో ఉంచింది. దానిని ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు.

3 thoughts on “శ్రీలంక మానవహక్కుల తీర్మానాన్ని నీరుగార్చిన అమెరికా

  1. మానవ హక్కుల సంస్థ ఇవ్వన్ని ఎవరికి ఊడిగం చేస్తాయో తెలిసిన విషయమే. వీటి పుట్టుపూర్వోత్తరాల గురించి లోడు కొంటు పోతే ప్రపంచ యుద్దాల దగ్గరి చేరుతాం. ఆరోజుల్లో ఏర్పాటు చేయబడిన ఈ సంస్థలు ఇప్పుడు అగ్రరాజ్యాలను ఏమాత్రం అదుపు చేయగలవో గల్ఫ్ యుద్దాల సమయం లో చూశాం. కాని మూడవ ప్రపంచ దేశాలైన శ్రీలంక లాంటి వాటిపైన మాత్రం ప్రతాపం చూపించటానికి సంకోచించవు. బహుశ ఎమైనా వారి దేశ స్వప్రయోజనాలు ముడిపడి ఉండవచ్చు.

    ఇటువంటి నివేదికలను ఆధారం చేసుకొని మనదేశంలో తమిళ రాజకీయ నాయకులు, ప్రజలు హద్దులు మించి గగ్గోలు చేయటం హర్షించ దగ్గవిషయం కాదు. ఈ మధ్య శ్రీలంక కు చెందిన టురిస్ట్ ల పైన దాడి చేయటం భాతదేశ ప్రజలందరు ఖండించవలసిన విషయం. వాళ్ల ప్రభుత్వం పైన కోపం ఉంటే, అమాయకులైన టురిస్ట్లను దేశం గాని దేశం లో కోడితే వాళ్లకి పరిస్థితి ఎలా ఉంట్టుందో ఊహించుకోవచ్చు.

    మనదేశానికి ఎంతో మంది విదేశి టురిస్ట్లు వస్తారు. అదే పక్క దేశాలైన పాకిస్తాన్, బంగ్లదేశ్ కి ఎవ్వరు పోరు. oka కారణం అక్కడ భద్రత పైన విదేశీయులకి నమ్మకం లేకపోవటమే! ఇటువంటి సంఘటనల వలన దేశానికి అంతర్జాతీయంగా చెడ్డపేరు వస్తుంది. అదేగాక ఎంతో మంది యన్ ఆర్ ఐ లు దశాబ్దాలు విదేశాలలో పని చేసి, మన దేశానికి అంతర్జాతీయం గా మంచి పేరు సంపాదించి పెట్టారు, అందువలన ఇప్పటి తరం వాళ్లు అతి సులువు గా విదేశాలకి వెళ్ళి నిర్భయంగా పని చేయగలుగుతున్నరు.

    విదేశీయులను కొట్టటం, విదేశి వనితలను రేప్ చేయటం ఇటువంటి సంఘటనలను దేశ ప్రజలు, రాజకీయ నాయకులు, మీడీయా ఆషామాహిగా తీసుకొని భాద్యత లేకుండా వ్యవహరిస్తే భారత ప్రజలకే ఎంతో నష్టం. ఇప్పటికైనా ప్రజలు గుర్తించాలి.

వ్యాఖ్యానించండి