–
అమెరికా, చైనాల వైరుధ్యాలు క్రమంగా వివిధ రంగాలలో ప్రస్ఫుటంగా ముందుకు వస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై పరస్పరం అడపాదడపా గౌరవం ప్రకటించుకుంటూనే ఒకరిపై మరొకరు గూఢచర్యానికి పాల్పడడం అగ్ర దేశాలకు కొత్త కాకపోయినా, చైనా అణు గూఢచర్యం వెల్లడి కావడం ఇదే ప్రధమం కావచ్చు. అమెరికాకు చెందిన ఒక డిఫెన్స్ కాంట్రాక్టర్ అమెరికా అణు రహస్యాలను ఒక చైనా అమ్మాయికి అందజేసి దొరికిపోయాడని ఫెడరల్ పోలీసు సంస్థ ఎఫ్.బి.ఐ ప్రకటించింది.
డిఫెన్స్ కాంట్రాక్టర్ హవాయ్ ద్వీపంలో అమెరికా ప్రభుత్వం కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘బెంజమిన్ పీర్స్ బిషప్‘ వీసా మీద అమెరికాలో ఉన్న చైనా జాతీయురాలికి రహస్యంగా వర్గీకరించిన అణు సమాచారాన్ని తెలిపాడని ఎఫ్.బి.ఐ ఆరోపించింది. అణ్వాయుధాలకు సంబంధించిన సమాచారంతో పాటు అమెరికా వ్యూహాత్మక అణు వ్యవస్థలను ఎక్కడెక్కడ నెలకొల్పిందీ వివరాలు అందించాడని, విదేశీ ప్రభుత్వాలకు చెందిన స్వల్ప మరియు, మధ్య దూరాలను ఛేదించే బాలిస్టిక్ మిసైళ్లను కనిపెట్టడంలో అమెరికాకి గల శక్తియుక్తుల వివరాలు కూడా అందజేశాడని ఎఫ్.బి.ఐ తెలిపింది. పసిఫిక్ రిమ్ ప్రాంతంలో అమెరికా నెలకొల్పిన ముందస్తు హెచ్చరికల రాడార్ వ్యవస్థల సమాచారం కూడా బిషప్ అందజేసిన సమాచారంలో ఉన్నట్లు తెలుస్తోంది.
బిషప్ కి గల ఉన్నతస్థాయి సెక్యూరిటీ క్లియరెన్స్ దృష్ట్యా అతనికి ఉన్న అన్ని సంబంధాల వివరాలు ప్రభుత్వానికి తెలియాలి. చివరికి ఎవరెవరితో లైంగిక సంబంధాలు ఉన్నాయో కూడా పై అధికారులకు తెలియజేయాలి. ఈ సూత్రాన్ని బిషప్ ఉల్లంఘించాడని, ముఖ్యంగా విదేశీ వ్యక్తులతో ఉన్న సంబంధాలను దాచిపెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని ‘ది హిందు‘ తెలిపింది. అమెరికా ప్రభుత్వ అధికారుల నుండి ‘పర్సన్ 1‘ అనే కోడ్ నేమ్ గల వ్యక్తితో తనకు గల సంబంధాన్ని బిషప్ దాచిపెట్టాడని ఎఫ్.బి.ఐ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ తెలియజేసింది.
అఫిడవిట్ ప్రకారం హవాయ్ లో అంతర్జాతీయ మిలటరీ సమస్యల అంశంపై జరిగిన కాన్ఫరెన్స్ సందర్భంగా బిషప్, చైనా మహిళ మొదటిసారి కలుసుకున్నారు. తదనంతరం ఇరువురి మధ్య రొమాంటిక్ సంబంధాలు మొదలయ్యాయి. అయితే మహిళ డిమాండ్ చెయ్యడం వల్లనే అణు రహస్యాలను బిషప్ తన ఇంటికి తీసుకెళ్లాడా అన్నది ఇంకా సరిగా నిర్ధారణ కానట్లు తెలుస్తోంది. అంటే ఇంటికి తీసుకెళ్లడానికి అనుమతి లేని రహస్యాలను బిషప్ ఇంటికి తీసుకెళ్ళడం, అతనికి చైనా మహిళతో సంబంధం ఉందని తెలియడం… ఈ రెండు అంశాలని ఎఫ్.బి.ఐ అధికారులే కలిపి అనుమానించినట్లు అర్ధం అవుతోంది. నిజానికి మహిళ విదేశీ ఏ ప్రభుత్వంతోనైనా అణు గూఢచర్య సంబంధాలు ఉన్నదీ లేనిదీ ఇంకా స్పష్టం కాలేదు.
గతంలో చైనా పారిశ్రామిక వేత్త ఒకరు (ఈమె కూడా మహిళే) అణు బాంబుల తయారీకి సంబంధించిన విడిభాగాలను పాకిస్ధాన్ కి ఎగుమతి చేసి దొరికిపోయిందని వార్తలు వచ్చాయి. సదరు విడిభాగాలను పాకిస్ధాన్ కి ఎగుమతి చేయడానికి ఆమె అనుమతి కోరగా అమెరికా ప్రభుత్వం నిరాకరించింది. అయితే ఆమె ఒక వ్యూహం ప్రకారం వాటిని మొదట చైనాకు ఎగుమతి చేసి అనంతరం పాకిస్ధాన్ కి ఎగుమతి అయ్యేలా ఏర్పాట్లు చేసిందని ఆరోపించి అరెస్టు చేశారు. ఆమె అమెరికా పౌరసత్వం తీసుకున్న చైనా జాతీయురాలు. ఇంకోసారి అమెరికా పౌరసత్వం ఉన్న భారతీయ వ్యాపారి ఒకరు చైనా బాలిస్టిక్ మిసైళ్ళ నిర్మాణానికి అమెరికా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేసి దొరికిపోవడంతో కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు.
వీటితో పాటు ఇంకా అనేక ఉదాహరణల నేపధ్యంలో బిషప్, చైనా మహిళల సంబంధాన్ని అమెరికా అధికారులు అనుమానించినట్లు కనిపిస్తోంది. ఇంటికి తీసుకెళ్లడానికి అనుమతి లేని రహస్య డాక్యుమెంట్లను బిషప్ తన ఇంటికి తీసుకెళ్లడమే అనుమానానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత నవంబరులో ఆయన ఇంటిలో జరిపిన సోదాలో 12 రహస్య డాక్యుమెంట్లు లభ్యం అయ్యాయి. డాక్యుమెంట్లకు చైనా మహిళకు ఉన్న సంబంధం ఇంకా స్పష్టం కానప్పటికీ గూఢచర్యంగానే ఎఫ్.బి.ఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గూఢచర్యం విషయంలో ఏ దేశమూ స్వచ్ఛం కాదు. పైకి ఎన్ని చెప్పినా వివిధ దేశాల రాయబారులే స్వయంగా వివిధ రూపాలలో గూఢచర్యం సాగించడం ‘వికీ లీక్స్‘ పుణ్యమాని ఇప్పుడు జగమెరిగిన సత్యం. దొరకనంత కాలమే దొర, దొరికాక దొంగ. అయితే ఇతర దేశాల దొంగలకు వచ్చే ప్రచారం అమెరికా, యూరప్ ల దొంగలకు రాకపోవడమే అసలు విషయం.

really informative. meru explain chese style, oka hollywood movie chusinatlu untundi :)