నీరుగారిన అత్యాచార వ్యతిరేక చట్టం?


Delhi protests

Delhi protests

సోమవారం నాడు జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం అత్యాచార వ్యతిరేక చట్టం మరింత నీరుగారినట్లు తెలుస్తోంది. కొన్ని అంశాల్లో మెరుగుగానే ఉన్నప్పటికీ ఇతర అంశాలలో రాజకీయ పార్టీల ఒత్తిడితో చట్టాన్ని బలహీనం చేయడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వానికి మెజారిటీ లేని రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీ బిల్లును అడ్డుకుంటామని ప్రకటించిన నేపధ్యంలో బిల్లు చట్టంగా రూపొందడం పైన సందిగ్ధత ఏర్పడింది.

అంగీకార వయసు విషయమై ప్రభుత్వం మళ్ళీ మనసు మార్చుకుంది. లైంగిక కలయికకు మహిళ అంగీకార వయసు 16 నుండి 18 కి పెంచడానికి అంగీకరించింది. వివిధ రాజకీయ పార్టీలు గట్టిగా వ్యతిరేకించడంతో ఈ మార్పు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఫిబ్రవరిలో తెచ్చిన అత్యాచార వ్యతిరేక ఆర్టినెన్స్ లో అంగీకార వయసు 16 సంవత్సరాలుగా ప్రభుత్వం పేర్కొంది. దీనిపై పలు విమర్శలు వచ్చాయి. వివాహ వయస్సు మహిళకు 18 సంవత్సరాలు అయినప్పుడు లైంగిక కలయికకు అంగీకార వయసును అంతకంటే తక్కువ ఎలా నిర్ణయిస్తారని వారు ప్రశ్నించారు. వివాహ పూర్వ లైంగిక కలయిక ఒక వాస్తవమని కనుక 16 సంవత్సరాలనే అంగీకార వయసుగా కొనసాగించాలని సిపిఐ లాంటి పార్టీలు వాదిస్తున్నాయి.

భారతీయ శిక్షా స్మృతి (IPC) ప్రకారం లైంగిక కలయికకు అంగీకార వయసు 16 సంవత్సరాలే. ఢిల్లీ బస్సులో జరిగిన సామూహిక అత్యాచారంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించిన నేపధ్యంలో ఫిబ్రవరి 3 తేదీన ప్రభుత్వం యాంటీ రేప్ ఆర్డినెన్స్ తెచ్చింది. ఆర్డినెన్స్ లో అంగీకార వయసును 18 సంవత్సరాలకు పెంచిన ప్రభుత్వం మళ్ళీ ఏమైందో,
నేర చట్ట సవరణ బిల్లు – 2013 [Criminal Law (Amendment)
Bill] చట్టాన్ని ప్రతిపాదిస్తూ దానిని 16 కి తగ్గించింది. బిజెపి, సమాజ్ వాదీ పార్టీలు దీనిని సవరించాలని పట్టుబట్టడంతో ప్రభుత్వం మళ్ళీ 18 సంవత్సరాలకు పెంచడానికి అంగీకరించింది.

వివాహానికి ముందే లైంగిక కలయికలో పాల్గొనడం ఒక వాస్తవం అని కనుక 16 సంవత్సరాల వయసును అంగీకార వయసుగా కొనసాగించడం ఉత్తమమని సిపిఐ పార్టీ వాదించినట్లు ది హిందూ తెలిపింది. ఇక్కడ ఒక చిక్కు ఉన్న సంగతి ఆ పార్టీ దృష్టికి రాలేదేమో తెలియకుంది. Child Protection Act – 2012, అంగీకార వయసును 18 సంవత్సరాలుగా నిర్దేశించింది. అలాంటప్పుడు మహిళ అంగీకార వయసును 16 సంవత్సరాలుగా నిర్ణయించడం అర్ధరహితం.

అదీకాక, ముక్కుపచ్చలారని పసిపిల్లలపైనా కూడా అత్యాచారాలు జరుగుతున్నది కూడా ఒక చేదు వాస్తవం. పేరు మోసిన రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ అధికారులు కూడా చైల్డ్ సెక్స్ రాకెట్ లో నిందితులుగా తేలుతున్నారు. పైగా వ్యభిచారంలో దింపడానికి పసిపిల్లలతో సహా మైనర్ బాలికలను అక్రమంగా రవాణా చేయడం మాఫియాలకు దిన చర్య అన్నా అతిశయోక్తి కాదు. ఈ నేపధ్యంలో వ్యభిచారులు, బాలికలను అక్రమంగా నిర్బంధించినవారు బాధితురాళ్లను బెదిరించి వారి అంగీకారంతోనే లైంగిక కలయికలో పాల్గొన్నామంటూ సాక్ష్యాలు చెప్పించి శిక్షల నుండి తప్పించుకునే ప్రమాదం ఉంది. బలవంతంగా వ్యభిచారంలోకి దింపి వ్యభిచారాన్ని పరస్పర అంగీకారంతో జరిగిన లైంగిక కలయికగా చెప్పి తప్పించుకునే అవకాశం కూడా ఉన్నది.

anti rape billసూర్యనెల్లి కేసు అందుకు ప్రబల దృష్టాంతం. రాజకీయ ప్రముఖులు, పెద్ద మనుషులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. హై కోర్టు జడ్జి స్వయంగా బాలిక చెడిపోయిందని, ఆమె వ్యభిచారం చేసిందే తప్ప, అత్యాచారం జరగలేదని, వ్యభిచారం నైతికంగా తప్పే గానీ నేరం కాదని చెప్పి ముప్పై మందికి పైగా నిందితులకు సెషన్స్ కోర్టు విధించిన జైలు శిక్షను ఒక్క తీర్పుతో రద్దు చేశాడు. న్యాయ మీమాంస (jurisprudence) లో వస్తున్న మార్పుల దృష్ట్యా అంగీకార వయసును 18 సంవత్సరాలకు పెంచడం సముచితం. రాజకీయ పార్టీల అభిప్రాయాల మేరకు 18 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం కొన్ని రక్షణలు కల్పించనున్నట్లు తెలుస్తోంది. అవేమిటో పత్రికలు చెప్పలేదు. 18 సంవత్సరాలే అంతిమం అయితే ఆ వయసు లోపు బాలికల అంగీకారంతో లైంగిక కలయికకు పాల్పడినా అది అత్యాచారంగా పరిగణించబడుతుంది.

వెంటపడి వేధించడం (stalking), దొంగచాటుగా చూడడం (voyeurism) తదితర నేరాలను ప్రభుత్వం ప్రతిపాదించిన కఠిన శిక్షల పట్ల రాజకీయ పార్టీలు (SP,
BSP) తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. దానితో వీటిని కూడా నీరుగార్చడానికి ప్రభుత్వం అంగీకరించిందట. పట్టు విడవకుండా అదే పనిగా వెంటపడితే దాన్ని నాన్-బెయిలబుల్ నేరంగా చేయడం కూడా వారికి నచ్చలేదట. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపైనే నేరం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మోపడం వారికి ఇంకా నచ్చలేదట. ప్రత్యర్థులు పగ తీర్చుకోవడానికి వీటిని దుర్వినియోగం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీల అభిప్రాయంగా తెలుస్తోంది.

దుర్వినియోగం కాకుండా బిల్లులో తగ్గిన రక్షణలు ఉన్నప్పటికీ వాటిని మంత్రుల కమిటీ (Group of Ministers) తొలగించింది. ఐ.పి.సి లో తగిన రక్షణలు ఇప్పటికే ఉన్నందున కొత్తగా అవసరం లేదని కమిటీ అభిప్రాయపడింది. రాజకీయ పార్టీల అభ్యంతరాలతో ఈ రక్షణలు తిరిగి బిల్లులో చోటు సంపాదించనున్నాయి. “లోక్ సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని కొందరు రాజకీయ నాయకులు అన్నారు. నిర్దిష్ట రక్షణలు ఉండాలని వారు కోరారు” అని సమావేశంలో పాల్గొన్న ఒక మంత్రిని ఉటంకిస్తూ ది హిందు తెలిపింది.

మహిళా సంఘాలు, స్వచ్ఛంద సమస్యలు చేస్తున్న ఒక డిమాండు అంగీకరిస్తూ బిల్లులో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అత్యాచార నేరాన్ని జెండర్-న్యూట్రల్ గా చేస్తూ నేర చట్ట సవరణ బిల్లులో మొదట ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను తొలగించి అత్యాచారాన్ని జెండర్-స్పెసిఫిక్ గా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అత్యాచారం అంటే మహిళలపై జరిగేదే అని జెండర్-న్యూట్రల్ చేయడం ద్వారా మహిళలను కూడా అత్యాచారంలో నిందితులుగా చేర్చే కుట్ర జరుగుతోందని వారు ఆరోపించారు. ఇతర అత్యాచారాలకు అవసరమైతే ప్రత్యేక చట్టాలు చేయాలి తప్ప ఇలాంటి సవరణ ద్వారా మహిళా అనుకూల చట్టాలను నీరుగార్చవద్దని వారు కోరారు. ఈ నేపధ్యంలో ప్రతిపాదిత సవరణను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఉపసంహరణతో అత్యాచార బాధితులంటే ఇక మహిళలే అవుతారు.

బిల్లులోని అంశాలు పూర్తిగా తెలిస్తే తప్ప అది నీరుగారిందా లేదా అని స్పష్టంగా ఒక అవగాహనకు రావడం తొందరపాటుతనం కావచ్చు. కానీ కొన్ని పత్రికలు (ఉదా: ఎన్.డి.టి.వి, ది హిందు) నీరుగారిన వర్షన్ ని మంగళవారం సభలో ప్రవేశపెడుతున్నారని చెబుతున్నాయి.

2 thoughts on “నీరుగారిన అత్యాచార వ్యతిరేక చట్టం?

వ్యాఖ్యానించండి