కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ ఫలితాలు చూపిస్తోంది. బలి పశువుల తలలు తెగిపడుతున్నాయి. సమస్య మూలాలను కదిలించడానికి బదులు జీతగాళ్లను బలి తీసుకునే కార్యక్రమం మొదలయింది. అందులో భాగంగా మనీ లాండరింగ్ కి అంగీకరిస్తున్నట్లు రహస్య కెమెరాల సాక్షిగా దొరికిపోయిన అధికారులను ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు సస్పెండ్ చేసింది. బ్యాంకు అంతర్గత విచారణ పూర్తయ్యేవరకు వారు సస్పెన్షన్ లో ఉంటారని సదరు బ్యాంకు తెలియజేసింది. రెండు వారాల లోపు విచారణ పూర్తవుతుందని బ్యాంకు అధికారులను ఉటంకిస్తూ పిటిఐ తెలియజేసింది.
ఆరోపణలను పరిశీలించడానికి స్వతంత్ర ఫోరెన్సిక్ నిపుణులను నియమించినట్లు హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు తెలిపింది. కాగా యాక్సిస్ బ్యాంకు నుండి ఏ చర్యలు తీసుకుంటున్నదీ సమాచారం లేదు.
మనీ లాండరింగ్ కుంభకోణంలో దొరికిపోయిన మూడు బ్యాంకులు భారత దేశంలో అతి పెద్ద ప్రైవేటు బ్యాంకులు కావడం గమనార్హం. మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఎవరైనా దోషులుగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ లో ఒక్క రూపాయి కూడా జమ చేయడం జరగలేదు కాబట్టి తీవ్రమైన చర్యలు ఉండే అవకాశం కనిపించడం లేదు. ఆర్.బి.ఐ, ఆర్ధిక మంత్రిత్వ శాఖ రెండూ కోబ్రా పోస్ట్ ఆరోపణలపైన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
“ఆర్.బి.ఐ, మంత్రిత్వ శాఖలు రెండూ రంగంలోకి దిగాయి. కాబట్టి, మేము సమాచారం సేకరిస్తున్నాము. ఛానళ్లను సంప్రదించాము. నిజం ఏమిటో ఒకసారి స్పష్టంగా తెలుసుకున్న తర్వాత తదుపరి ఏ చర్యలు తీసుకోవాల్సిందీ నిర్ణయించుకుంటాము. కానీ ప్రాధమికంగా ఇది చాలా తీవ్రమైన విషయం” అని ఆర్ధిక సేవల కార్యదర్శి (Financial Services Secretary) రాజీవ్ తక్రు ను ఉటంకిస్తూ ‘ది హిందు‘ తెలిపింది.
ఎక్కడ, ఎలా సంపాదించింది లెక్కలు చూపని నల్ల డబ్బును భద్రంగా పెట్టుబడి పధకాలలో, ఇన్సూరెన్స్ స్కీములలో డిపాజిట్ చేయడం ద్వారా తెల్ల డబ్బుగా మార్చుతామని మూడు ప్రైవేటు బ్యాంకుల అధికారులు అంగీకరిస్తుండగా కోబ్రా పోస్ట్ పోర్టల్, రహస్య కెమెరాతో రికార్డు చేసి తమ వెబ్ సైట్ లో ప్రచురించిన సంగతి తెలిసిందే. ఏదో ఒకటి రెండు బ్రాంచి కార్యాలయాలు కాకుండా పోర్టల్ విలేఖరి సంప్రదించిన డజన్ల కొద్దీ బ్యాంకు బ్రాంచులన్నీ మనీ లాండరింగ్ కి అనుమతించడం సంచలనం కలిగిస్తోంది. సామాన్యులకు ఖాతా తెరవడానికి సవాలక్షా నిబంధనలు విధించే ప్రైవేటు బ్యాంకులు అక్రమ డబ్బు కోసం ఎలా గేట్లు బార్లా తెరిచి ఉంచినది కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ స్పష్టం చేసింది.
మూడు అతి పెద్ద ప్రైవేటు బ్యాంకులు దేశ వ్యాపితంగా విస్తరించిన బ్రాంచుల్లో మనీ లాండరింగ్ కు అనుకూలంగా ఉండడం తమను కూడా ఆశ్చర్యపరిచిందని రాజీవ్ తక్రు చెబుతున్నాడు. “బ్యాంకులు నేరస్థులని ఇప్పుడే చెప్పడం తొందరపాటుతనం అవుతుంది. మొదట మేము నిర్ధారించుకోవాలి. ఇది జరగడం దురదృష్టకరం. మేమంతా షాక్ తిన్నాము. ఆశ్చర్యానికి గురయ్యాము. నిజాలు నిర్ధారించబడితే దోషులు ఎవరైనా సరే, మూల్యం చెల్లించక తప్పదు… ఆరోపణల్లో నిజం ఉంటే అంతర్గతంగా విచారణ జరగాలి. దానితో పాటు బయటి ఏజన్సీలు కూడా విచారణ చేయాల్సిందే. అది ఎలాగూ జరుగుతుంది” అని రాజీవ్ తక్రు తెలిపాడు.
దేశ వ్యాపితంగా విస్తరించిన అనేక బ్రాంచి కార్యాలయాల్లో ఇది జరుగుతున్నట్లు వెల్లడి అయినందున మొత్తం ఎపిసోడ్ పైన ప్రభుత్వ ఏజన్సీలు విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు బ్రాంచులు కాకుండా అనేక బ్రాంచులకు ఇందులో పాత్ర ఉన్నట్లు తేలడం ఆందోళనకరమని రాజీవ్ తెలిపాడు. “ఇది అత్యద్భుతమైన యాదృచ్చికత అయినా అయి ఉండాలి లేదా తీవ్రంగా తీసుకోవాల్సిన లోతైన అంశాలైనా ఇందులో ఇమిడి ఉండాలి” అని రాజీవ్ తక్రు అన్నాడు.
అయితే నల్ల డబ్బు వ్యవహారం ఎవరో రెండు మూడు డజన్ల బ్యాంకు అధికారులు ఈ రోజు కొత్తగా ప్రవేశపెట్టినది కాదు. కోటి కోట్ల డబ్బు విదేశీ ఖాతాల్లో మూలుగుతుండగా అది వదిలేసి స్టింగ్ ఆపరేషన్ లో అమాయకంగా దొరికిపోయిన అధికారులను మాత్రమే బాధ్యులను చేయడం అర్ధరహితం. లోక్ పాల్ బిల్లు ఆమోదానికి దశాబ్దాలుగా మోకాలడ్డుతున్న పార్లమెంటేరియన్లు, శ్రామికుల శ్రమను దోచుకుని విదేశాలకు తరలిస్తున్న కంపెనీలు, సూపర్ ధనికులు వీరి కోసమే స్టింగ్ ఆపరేషన్ లో దొరికిన అధికార్లు పని చేస్తున్నారు. మూలకారణాన్ని పెకిలించకుండా పైపూతలతో సరిపెట్టడం అనాదిగా జరుగుతున్నదే. మూడు ప్రైవేటు బ్యాంకులు వ్యాపారాలను ఆమూలాగ్రం శోధించకుండా కొందరు బలిపశువులను ఎంచుకుని శిక్షించడం పైపూత అవుతుందే తప్ప వ్యాధి నిర్మూలన మాత్రం కాజాలదు.
పెరుగుతున్న స్టింగ్ ఆపరేషన్లు
భారత దేశంలో ఈ మధ్య కాలంలో స్టింగ్ ఆపరేషన్ల జోరు పెరిగింది. తెహెల్కా పోర్టల్ పత్రికగా మారక ముందు ప్రారంభించిన స్టింగ్ జర్నలిజం ఇప్పటివరకు సానుకూల ఫలితాలనే ఇచ్చింది. తెహెల్కా చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ వల్లనే బిజెపి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కు కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే అసలు లంచం ఇచ్చినట్లు చెప్పబడిన రక్షణ పరికరాల కంపెనీయే ఫేక్ కంపెనీ అయినప్పుడు, వాస్తవంగా కుట్ర అనేది జరగనప్పుడు శిక్ష ఎలా వేస్తారని అప్పట్లో కోర్టు తీర్పు పైన విమర్శలు వచ్చాయి. గుజరాత్ ఎమ్మెల్యే మాయా కొడ్నానికి ముస్లింలను ఊచకోత కోసిన కేసులో యావజ్జీవ శిక్ష పడడానికి తెహెల్కా జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో వెల్లడయిన సాక్ష్యాలు తోడ్పడ్డాయి. ఇటీవల జీ న్యూస్ ఎడిటర్లు జిందాల్ కంపెనీ అధినేత నుండి లంచం డిమాండ్ చేస్తూ రివర్స్ స్టింగ్ లో దొరికిపోవడం పెను సంచలనం రేపింది.
విలేఖరులు సాధారణ సమాచార సేకరణ నిమిత్తం బ్యాంకులకు వెళ్ళి నల్ల డబ్బును చట్ట బద్ధమైన తెల్ల డబ్బుగా మార్చడానికి ఏ పధకాలు ఉన్నాయి అని అడిగితే సమాచారం ఇవ్వకపోగా తాము ఎంత నీతిమంతులమో పాఠాలు చెబుతారు. స్టింగ్ ఆపరేషన్ లాంటి ప్రక్రియలు లేనట్లయితే ప్రజలకు అందవలసిన నిర్దిష్ట సమాచారం ఎప్పటికీ నాలుగు గోడల మధ్యనే ఉండిపోతుందనడంలో సందేహం లేదు. స్టింగ్ ఆపరేషన్లు స్వార్ధ ప్రయోజనాలకు కాకుండా ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపట్టినంతవరకు ఆమోదనీయమే అని జర్నలిస్టు ప్రముఖులు కూడా అంగీకరిస్తున్నారని ది హిందు పత్రిక విశ్లేషించడం విశేషం.
