క్రికెట్ ఆటలోనే కాక క్రికెట్ కామెంటరీలో కూడా తనదైన బాణీ సృష్టించుకున్న నవజ్యోత్ సింగ్ సిద్దు శనివారం కలకాలం గుర్తుంచుకోదగ్గ మాటలు చెప్పాడు. టెస్ట్ మ్యాచుల్లో సైతం సిక్సర్లతో విరుచుకుపడి ‘సిక్సర్ సిద్దు’గా పేరుగాంచిన నవజ్యోత్ సింగ్ సిద్దు ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య మొహాలిలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో కామెంటరీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యాక ఇండియా కొత్త ఓపెనింగ్ జంటతో ఆట ప్రారంభించింది. శిఖర్ ధావన్ ఈ మ్యాచ్ లో మొదటిసారిగా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. మొదటి మ్యాచ్ లోనే అత్యంత వేగంగా సెంచురీ చేసిన ఆటగాడుగా ధావన్ చరిత్ర సృష్టించాడు. అయితే ఈ టపా ధావన్ సెంచురీ గురించి కాదు. ధావన్ ఆటను వర్ణిస్తూ సిద్ధూ చేసిన వ్యాఖ్యల గురించి.
కొత్తతరం ఆటగాళ్ల చేతుల్లో భారత క్రికెట్ భవితవ్యం గొప్పగా ఉండబోతోందన్న సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సిద్ధూ ధావన్ ని ప్రశంసలతో ముంచెత్తాడు. “ఈ ఇన్నింగ్స్ లో కొట్టొచ్చినట్లు కనపడింది ఏమిటంటే అతని భయంలేనితనం. విఫలం అవుతానేమో అన్న భయమే అతనికి లేదు. అతను గాలికే హెచ్చరికలు పంపాడు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను చరిత్ర సృష్టించాడు. మొదటిసారి రంగప్రవేశం చేసేటప్పుడు, ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నపుడు నీ కాళ్లు వణుకుతాయి. పొట్టలో సీతాకోకచిలుకలు ఎగురుతుంటాయి. కానీ అతను వన్డే మ్యాచ్ తరహాలో ఆడేశాడు.”
“23 ఫోర్లతో టెస్ట్ సెంచురీ చేసే మనిషిని మీరు ఎక్కడ చూస్తారు? టెస్టుల్లో మొదటిసారి ఆడుతూ ఒకే సెషన్ లో సెంచురీ స్కోర్ చేసే వ్యక్తిని మీరు ఎక్కడ చూస్తారు? ఒక సెంచురీ చేయాలంటే నాలుగైదు సెషన్లు పడుతుంది. నన్ను నమ్మండి, అతను ఫెరారి వెళ్ళే లేన్ లో వెళ్తున్నాడని నేను చెప్పగలను”
ఈ ధోరణిలో ప్రశంసలు కురిపిస్తూ పోయిన 49 యేళ్ళ సిద్ధూ అన్న ఈ క్రింది మాటలు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి.
“The distance from earth to heaven is not a matter of altitude, it’s a matter of attitude.”
“భువికి, దివికి మధ్య ఉన్న దూరం ‘ఆల్టిట్యూడ్’ కి సంబంధించిన సమస్య కాదు, ‘యాటిట్యూడ్’ కి సంబంధించిన సమస్య.”
ఎంత గొప్ప మాట! ఒక సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడం మొదలుపెడితే ఆ సమస్య సగం పరిష్కారం అయినట్లే. సమస్య పరిష్కారం అవుతుందా లేదా అన్నది ఆ సమస్యను ఎదుర్కునే వైఖరి లోనే సగం నిర్ణయం అవుతుంది. పరిస్ధితులు ప్రతికూలించి సమస్య పరిష్కారంలో వైఫల్యం ఎదురైతే ఎదురుకావచ్చు గాక! కానీ, ఆశావాహ దృక్పథంతో, ధైర్యంతో, సహజ గుణగణాలతో సమస్య పరిష్కారానికి పూనుకున్నపుడు వైఫల్యం ఎదురైనా, అద్వితీయమైన అనుభవాలను అది మిగల్చడం ఖాయం. సిద్ధూ చెప్పిన మాటలు ఈ విధంగా స్వీకరించవచ్చు.
‘క్రికెట్ ఆటలో భారత్ స్ధానం’ లేదా ‘ధావన్ వేగవంతమైన మొదటి సెంచురీ’ అనే సందర్భంగా సిద్ధూ చెప్పిన ఈ మాటలు ప్రతి సమస్యకూ వర్తిస్తాయన్నది నిజం. చిన్నప్పుడు ఆటల్లో ఎదుటి వాడి కంటే పెద్ద సంఖ్య చెప్పాలనుకున్నపుడు “మబ్బుకు భూమికి తాళం వేసినంత” అని చెప్పుకోవడం గుర్తు. అదే మాటని సిద్ధూ ఒక జీవన వాస్తవానికి అన్వయించుకోగల విధంగా చెప్పడం విశేషం.
(గమనిక: ముందే చెప్పినట్లు ఈ టపా క్రికెట్ కోసం కాదు. నేను క్రికెట్ చూడను. ఆటలో మనవాళ్లు గెలిచారని చెబితే సంతోషించడం తప్ప ఇంకేవిధంగానూ నాకు ఆ ఆటతో అనుబంధం లేదు. –విశేఖర్)

I appriciate your postings. It will be nice if you mention the date and time of postings. This will give us how old is the posting. Thank you, KKRAO
KKRAO గారు,
ప్రతి టపా ఏ తేదీన పోస్ట్ చేస్తున్నదీ తెలిపే అమరిక బ్లాగ్ డిజైన్ లోనే ఉంటుంది. ఈ బ్లాగ్ కి పై భాగంలో కుడిపక్క ఉన్న తేదీని మీరు చూడవచ్చు. పోస్టు కేటగిరి, ట్యాగ్ లు కూడా అక్కడే కనపడతాయి. సమయం కనపడే అమరిక ఈ డిజైన్ కి ఉన్నట్లు లేదు. ఉంటే యాక్టివేట్ చేస్తాను.
వ్యాఖ్యాతలు ఏ తేదీన తమ వ్యాఖ్య పోస్ట్ చేసిందీ వారి పేరు కిందనే ఉంటుంది.
కుడి చివర కాలం (column) లో ప్రత్యేకంగా ఉన్నందున తేదీ బహుశా మీకు కనపడి ఉండదు.
నిజమే శిఖర్ ధావన్ తనకు లభించిన అవకాశాన్ని గొప్పగా వినియోగించుకున్నాడు.
అంతే కాదు తమకు అవకాశం ఇస్తే ఎంతటి అద్భుతాలు చేయగలరో….యువతరం తరపున చాటిచెప్పాడు.
బీసీసీఐ పెద్దలు కొత్త కుర్రాళ్లు మరింత మందికి అవకాశాలు ఇవ్వాలి.
ఇక సిద్ధూ గురించి చెప్పేదేముంది. కామెంటరీలో ఒక నూతన ఒరవడిని సృష్టించాడు.
ముఖ్యంగా క్రికెట్ కామెంటరీలో హాస్యాన్ని జోడించిన వ్యక్తి సిద్ధూ.