ఇంకో అత్యాచారం, ఈసారి స్విస్ మహిళ పైన


no-rape

జర్మనీ మహిళ పైన ఒడిషా మాజీ డి.జి.పి పుత్ర రత్నం ఏడేళ్ల క్రితం అత్యాచారం చేసిన కేసులో నిందితుడి గుర్తింపు గురించి నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, పోలీసులు ఒకవైపు మల్లగుల్లాలు పడుతుండగానే మధ్య ప్రదేశ్ లో ఒక స్విస్ మహిళ పైన అత్యంత దారుణంగా ఎనిమిది మంది భారతీయులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

ఢిల్లీ బస్సులో మెడికల్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం దరిమిలా భారత కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో ఇప్పటికే మారుమోగుతున్నాయి. స్విస్ బాధితురాలి పైన జరిగిన దుర్మార్గంతో అవి మరింతగా మారుమోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం రాత్రి సైకిల్ పైన వెళుతున్న స్విస్ జంట పైన దాడి చేసి భర్త ఎదురుగానే భార్యపై అత్యాచారం చేసిన దుర్మార్గం తలచుకోడానికే కంపరంగా ఉంది.

39 సంవత్సరాల స్విస్ మహిళ తన భర్తతో కలిసి ఇండియా టూర్ కి వచ్చింది. సాహస యాత్రీకులయిన భార్యా భర్తలు శుక్రవారం రాత్రి మధ్య ప్రదేశ్ లోని దాటియా పట్టణానికి 8 కిలో మీటర్ల దూరంలోని ఝరియా గ్రామం వద్ద సైకిల్ పై వెళ్తున్నారు. రాత్రి కావడంతో వారు అడవిలో విశ్రమించడానికి నిర్ణయించుకున్నారని తెలుస్తున్నది. దుర్ఘటన జరిగే సమయానికి వారు రాముడి గుడులకు నిలయమైన ఓర్చ నుండి ఆగ్రా వెళ్ళే దారిలో ఉన్నారు.

దారుణంలో ఎంతమంది పాల్గొన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఏడెనిమిది మంది అయి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అనుమానంతో 20 మందిని నిర్బంధంలోకి తీసుకుని విచారిస్తున్నామని చంబల్ రేంజి డి.ఐ.జి డి.కె.ఆర్య చెప్పాడని పిటిఐ తెలిపింది.

ఎన్.డి.టి.వి ప్రకారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఏడుగురు వ్యక్తులు కర్రలతో స్విస్ జంటపై దాడి చేశారని మహిళ భర్త తెలిపాడు. వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకున్నారు. వారిలో నలుగురు వ్యక్తులు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. దుండగులు మహిళ భర్తను తీవ్రంగా కొట్టారు.

బాధితురాలిని హుటాహుటిన అక్కడికి 100 కి.మీ దూరంలోని గ్వాలియర్ కి తీసుకెళ్లారని ది హిందు తెలిపింది. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ఆమెపై అత్యాచారం జరిగినట్లు ధృవపరిచాయని తెలుస్తోంది. “వాళ్ళు ఓర్చ నుండి సైకిల్ పైన వస్తున్నారు. రాత్రికి అడవిలో ఉండడానికి నిశ్చయించుకున్నారు. అనేకమంది టూరిస్టులు ఈ ఏరియాకి నిత్యం వస్తూ పోతుంటారు. కొంతమంది వారిని కొట్టి వారి ల్యాప్ టాప్ లను తీసుకెళ్లిపోయారు” అని సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఎం.ఎల్.ధోడి తెలిపాడు. ఏరియాని జల్లెడ పడుతున్నామని దాటియా జిల్లా ఎస్.పి సి.ఎస్.సోలంకి తెలిపాడు.

జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ మమతా శర్మ దుర్ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఘటనను తీవ్రంగా పరిగణించాలని కోరింది. ‘అత్యాచార దుర్ఘటన మధ్య ప్రదేశ్ ను ఏలుతున్న బిజెపి ప్రభుత్వంపై మచ్చ’ అని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కూడా అయిన అజయ్ సింగ్ ప్రకటించాడు. ‘ఢిల్లీ అత్యాచార దుర్ఘటన కాంగ్రెస్ ప్రభుత్వం పైన మచ్చ’ అని సోనియా అంగీకరిస్తుందా? అని బిజెపి నాయకులు ఇపుడు ప్రశ్నిస్తారు కాబోలు!

Swiss ambassdor Linus Von Castelmur -Times of India

Swiss ambassdor Linus Von Castelmur -Times of India

స్విస్ రాయబారి లినస్ వొన్ కాస్టెల్మర్ ఘటనపై స్పందించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ‘వేగంగా విచారణ చేయాలని, తద్వారా బాధితురాలికి న్యాయం చేయాలని’ ఆయన కోరినట్లు స్విస్ ఎంబసీ విడుదల చేసిన ప్రకటన తెలిపింది బాధితురాలి ఆరోగ్యం, వైద్య చికిత్స తక్షణం తమ ముందున్న ప్రధమ కర్తవ్యం అని ప్రకటన పేర్కొంది.

ఒడిషా మాజీ డి.జి.పి కొడుకు బెట్టి మొహంతి ఏడు సంవత్సరాల క్రితం రాజస్థాన్ లోని ఒక హోటల్ లో జర్మనీ మహిళ పైన అత్యాచారం చేసినపుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా అత్యంత వేగంగా విచారణ చేసి రెండు వారాలలోనే దోష నిర్ధారణ చేసి నిందితుడికి ఏడు సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా రాజస్థాన్ ప్రభుత్వ పద్ధతిని ఆదర్శంగా తీసుకుంటే ఆ మేరకు పోయిన పరువులో కొంతైనా తిరిగి పొందవచ్చేమో.

నిజానికి అత్యాచారాలు అన్నాక స్విస్ మహిళ అయినా, భారత్ మహిళ అయినా ఒకటే. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి వేగంగా శిక్షించాము అన్న పేరు తెచ్చుకునే బదులు అత్యాచారాలు అసలే జరగని పరిస్ధితులు కల్పించడమే ప్రభుత్వాల ముందు ఉన్న అసలు కర్తవ్యం. అది జరిగే అవకాశాలు ఎలాగూ కను చూపు మేరలో కూడా కనిపించడం లేదు.

వ్యాఖ్యానించండి