తవ్వే కొద్దీ తవ్వుకున్నంత! అక్రమాలు పుట్టలే పుట్టలు!! ఒకే ఒక్కడు; ఐనా ఒంటి చేతితో పుట్టించిన అక్రమ సర్టిఫెట్లకు కొదవ లేదు!! ఒక పేరుతో బి.టెక్ చదివి మరో పేరుతో చదివినట్లు సర్టిఫికేట్ పుట్టించిన బెట్టి మొహంతి అదే సర్టిఫికేట్ తో ఏకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులోనే ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టు కొట్టేశాడు. జర్మనీ యువతిపై అత్యాచారం జరిపిన కేసులో దోషిగా తేలిన యువకుడు పెరోలుపై బయటికొచ్చి పరారీలో ఉండగానే ఇవన్నీ ఎలా అమరుతాయి? ఉన్నత స్థాయిలోని అధికారుల సహాయ, సహకారాలు లేకుండా ఇది సాధ్యం కాదని పోలీసులు భావిస్తుండగా, ఒడిషా మాజీ డి.సి.పి పుత్ర రత్నం అయిన బెట్టి మొహంతికి తన తండ్రి మద్దతు లేకుండా ఇవన్నీ అసంభవం అని పత్రికలు ఊహిస్తున్నాయి. కాగా, తన కొడుకు ఎప్పుడో చనిపోయి ఉంటాడని బెట్టి మొహంతి తండ్రి చెప్పడం విశేషం.
భువనేశ్వర్ లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీ (KIITU) లో 2001-2005 వరకు బెట్టి మొహంతి బి.టెక్ (కంప్యూటర్స్) చదివినట్లు కొద్ది రోజుల క్రితం ది హిందు పత్రిక వెల్లడి చేసింది. అయితే ఏం చేశాడో గాని రాఘవ రాజన్ పేరుతో అతను బి.టెక్ సర్టిఫికేట్ సంపాదించాడు. తాను పుట్టపర్తి నుండి వచ్చానని కేరళలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావంకోర్ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ గా చేస్తున్న రాఘవ రాజన్ వాస్తవానికి రాజస్థాన్ కోర్టు అత్యాచార దోషిగా తేల్చిన బెట్టి మొహంతి అని ఒక అజ్ఞాత ఉత్తరం అందుకున్న బ్యాంకు అధికారులు కేరళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి నాలుగు రాష్ట్రాల పోలీసులు అతను రాఘవ రాజన్ కాదని బెట్టి మొహంతి అని రుజువు చేయడానికి అష్టకష్టాలు పడుతున్నారు.
రాఘవ రాజన్ పేరుతో తాము ఎవరికి బి.టెక్ సర్టిఫికేట్ ఇవ్వలేదని KIITU అధికార్లు తేల్చడంతో రాఘవ రాజన్ పేరుతో ఇచ్చిన సర్టిఫికేట్ ఫోర్జరీ అని పోలీసులకు అర్ధం అయింది. ఇప్పుడు వారు తేల్చవలసిన విషయం: పెరోలు ఉల్లంఘించి పరారీలో ఉన్న యువకుడు, పరారీలో ఉండగానే ఇన్ని పనులు (పుట్టపర్తి నివాసి రాఘవ రాజన్ గా నివాస ధృవీకరణ పత్రం పొందడం, ఫోర్జరీ బి.టెక్ సర్టిఫికెట్లు సంపాదించడం, ఫోర్జరీ సర్టిఫికెట్ల ఆధారంగా బ్యాంకు అధికారిగా ఎన్నిక కావడం, ఎవరికి అనుమానం రాకుండా కేరళలోని కన్నూరులో పోస్టింగ్ సంపాదించడం) ఎలా చేయగలిగాడని! పుట్టిన రోజు, స్కూల్, ఇంటర్ సర్టిఫికెట్ల దగ్గర్నుంచి, గుర్తింపు పత్రం, నాలుగు సంవత్సరాల స్టడీ సర్టిఫికెట్స్… ఇవన్నీ సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఉన్నత స్ధానాల్లోని వ్యక్తుల అండదండలతో పాటు ధనబలం దండిగా ఉంటే తప్ప సాధ్యం కాదని పోలీసులు అంగీకరిస్తున్న విషయం.
వ్యవస్థలోని అనేక చోట్ల ఉన్న తనిఖీలన్నింటినీ దాటుకుని క్షేమంగా తాను అనుకున్న చోటికి దర్జాగా చేరడం పోలీసు అధికారులను, పరిశీలకులను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతోంది. ఢిల్లీ బస్సులో అత్యాచారం జరిగిన దరిమిలా దేశ వ్యాపితంగా స్త్రీలపై అత్యాచారాలు జరిపినట్లు రుజువయిన దోషుల ఫొటోలను పోలీసులు టి.విలలోనూ, ఇంటర్నెట్ లోనూ ప్రదర్శనకు ఉంచడంతో రాఘవ రాజన్ ఎవరో, అతని అసలు పేరు ఏమిటో అజ్ఞాత వ్యక్తులు కనిపెట్టి బ్యాంకుకు ఫిర్యాదు చేయడం వల్లనే కధ వెలుగులోకి వచ్చింది. అధికారం, డబ్బు అండగా ఉంటే ఈ దేశంలో ఏమైనా సాధ్యమేనని బెట్టి మొహంతి, బహుశా ఆయన తండ్రి కూడా, నిరూపించాడు.
రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, కేరళ రాష్ట్రాల నుండి తగిన సాక్ష్యాలను సేకరించడంలో పోలీసులు బిజీగా ఉన్నారు. రాఘవ రాజన్ అలియాస్ బెట్టి మొహంతి ని వెంటేసుకుని వారు ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి చక్కర్లు కొడుతున్నారు. ఆ క్రమంలోనే రాఘవ రాజన్ పేరుతో ఉన్న బి.టెక్ సర్టిఫికెట్లు ఫోర్జరీ అని వారు శుక్రవారం ప్రకటించారు. అక్రమ వ్యాపారాలు, ఫోర్జరీలు, ఆర్ధిక నేరాలు తదితర నేరాలతో పాటు నేరస్థులు కూడా తెలిసి ఉండే ఉన్నత స్థాయి పోలీసు అధికారులకు ఫోర్జరీ సర్టిఫికెట్లు సంపాదించడం పెద్ద కష్టం కాదు. కాకపోతే అది రుజువు చేయడమే పోలీసుల ముందున్న సవాలు. తాను మాజీ డి.జి.పి కొడుకును కాదని రాఘవ రాజన్/బెట్టి మొహంతి ఇప్పటికీ చెబుతుండడంతో పోలీసుల పరిశోధన మరింతగా సాగుతూ సాగుతూ పోతోంది.
రాఘవ రాజన్ ను బ్యాంకు అధికారులు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉంచారు. బ్యాంకు సర్వీసు నిబంధనల ప్రకారం 48 గంటల కంటే ఎక్కువ కాలం కస్టడీలో/జైలులో ఉన్నట్లయితే ఉద్యోగి సస్పెండ్ అవుతాడు. ఉద్యోగ నియామకం పూర్తి చేసే దశలో అభ్యర్ధుల పేర్లను బ్యాంకులు సంబంధిత కలెక్టర్లకు పంపుతారు. కలెక్టర్లు ఆ పేర్లను జిల్లా ఎస్.పి లకు పంపితే అక్కడి పోలీసులు అభ్యర్ధుల వివరాలను తనిఖీ చేయడం సాధారణంగా జరిగే వ్యవహారం. బెట్టి మొహంతి ఈ తనిఖీలను విజయవంతంగా అధిగమించాడని స్పష్టం అవుతోంది. సాధారణంగా ట్రైనీ అధికారులు తాము పని చేసే చోటును ఎంపిక చేసుకోవడానికి బ్యాంకు నిబంధనలు అంగీకరించవు. ఆ నిబంధనలను సైతం దాటుకుని బెట్టి కన్నూరులో పోస్టింగ్ ఎలా సంపాదించాడో పోలీసులు చెప్పవలసిందే.
రాజస్థాన్ రాష్ట్రం ఆళ్వార్ లో ఒక జర్మనీ యువతి పైన అత్యాచారం చేసిన కేసులో మార్చి 21, 2006 తేదీన బెట్టి మొహంతి దోషిగా రుజువయ్యాడు. రాజస్థాన్ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు నెలకొల్పి అత్యాచారం కేసును కేవలం 15 రోజుల్లోనే విచారణ పూర్తి చేసింది. ఫిర్యాదు చేయడానికి, కోర్టు విచారణ చేయడానికి, శిక్ష పాడడానికి కేవలం 15 రోజులే పట్టింది. 7 సంవత్సరాల జైలు శిక్ష వేసిన ఈ కేసు విచారణ అప్పట్లో అరుదైన, గొప్ప విషయంగా పేరు కూడా సంపాదించింది. జబ్బు పడిన తల్లిని చూసే పేరుతో నవంబరు 20, 2006 తేదీన పెరోలు పై బయటికి వచ్చిన బెట్టి మళ్ళీ జైలు మొఖం చూడలేదు.
రిక్రూట్ మెంట్ అనంతరం జరగవలసిన పోలీసుల తనిఖీలో చాలా ఆలస్యం జరుగుతోందని, ఫలితంగా తనిఖీ వివరాలు తమకు చేరేలోపే ప్రొబేషనరీ అధికారుల పోస్టుల అభ్యర్ధులను వివిధ చోట్ల నియమించవలసి వస్తోందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అత్యంత అరుదైన కేసే అయినప్పటికీ వ్యవస్థ లోని చట్టాలు, తనిఖీలు, నియమ నిబంధనలు అధికారం, డబ్బు లకు విధేయంగా ఉంటాయని రాఘవ రాజన్ ఉరఫ్ బెట్టి మొహంతి ఉదాహరణ నిర్ద్వంద్వంగా నిరూపిస్తోంది.

మనం సంతోషించాల్సిన విషయం ఏమిటంటే….తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా ఏదో ఒకరోజు బయటపడక తప్పదని ఈ సంఘటనతో రుజువయింది.
అడ్డదారుల్లో పైకి రావాలనుకునే వారెవరికైనా ఈ ఘటన ఓ గుణపాఠం.