ఎప్పుడో తప్ప మాటలు పెగలని ప్రధాని మన్మోహన్ సింగ్ కి కొత్తగా ఉన్నట్లుంది కోరలు మొలిచాయని పత్రికలు గుసగుసలు పోతున్నాయి. ఇటలీ మెరైన్లు ఇండియాకు తిరిగి రాబోరని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో ప్రధాన మంత్రి ఉభయ సభల్లో కాస్త గట్టిగా మాట్లాడడం ఈ గుసగుసలకు కారణం. ఇద్దరు కేరళ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి ఇటలీ నౌకపై ఉన్న మెరైన్లు కాల్చి చంపడంతో వారిని అరెస్టు చేసి సుప్రీం కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే.
భారత దేశంలోని ఇటలీ రాయబారి హామీతో ఓటు వేయడానికి వెళ్ళిన ఇద్దరు ఇటలీ సైనికులు తిరిగి రావడం లేదని ప్రకటించాక ప్రతిపక్షాలు ఉభయ సభల్లోనూ గొంతు చించుకున్నారు. దానితో ప్రధాని అనివార్యంగా నోరు తెరిచారు. “మర్యాదగా వెనక్కి పంపండి, లేదా పరిణామాలు తప్పవు” అని ప్రధాని ఒకింత ఘాటుగా ప్రకటించడంతో కొందరు సంతోషించినా అనేకమంది ఆశ్చర్యపోయిన మాట వాస్తవం.
మన్మోహన్ మౌనం భారత పత్రికలకు ఎప్పటికీ కొరుకుడు పడని విషయం. ‘మంచితనం‘ అంటే ‘బలహీనంగా ఉండడం‘ అని మన్మోహన్ రుజువు చేశారని తెహెల్కా ఎడిటర్ సోమ చౌదరి జనవరి నెలలో సంపాదకీయం రాస్తూ ఆరోపించడం ఈ సందర్భంగా గమనార్హం. తన మౌనంతో ‘ఒక స్పష్టమైన గొంతు లేని నాయకుడు‘ని మోస్తున్నట్లు భారత ప్రజలు భావించేలా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. చివరికి దేశం పాలక పక్షం కాకుండా ప్రతిపక్షం నడుస్తున్నట్లుగా మారిందని ఆమె ఆరోపణ.
మన్మోహన్ స్పందనా రాహిత్యాన్ని లెక్కగట్టిన పత్రికలూ ఉన్నాయి. ఒక పత్రిక ప్రకారం ప్రధాని మన్మోహన్ ‘కామన్ వెల్త్ కుంభకోణం‘ పట్ల స్పందించడానికి ఒక సంవత్సరం సమయం తీసుకున్నారు; 2జి కుంభకోణం పట్ల స్పందనకు మరో సంవత్సరం సమయం ఆయనకు పట్టింది; లోక్ పాల్ చట్టం కోసం జరిగిన ఆందోళనకు ఆరు నెలలు; చిల్లర వర్తకంలో ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలకు స్పందించడానికి 82 రోజులు; కొక్రాఝార్ (అస్సాం) అల్లర్లకు 8 రోజులు; ఢిల్లీ సామూహిక అత్యాచారానికి 9 రోజులు; లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద భారత సైనికుడి తల పట్టుకుపోయిన ఘటనకు 9 రోజులు ప్రధాని సమయం తీసుకున్నారని పత్రిక తెలిపింది.
ఈ నేపధ్యంలో ఇటలీ ప్రభుత్వ నమ్మక ద్రోహం పట్ల ప్రధాని స్పందించడమే కాక హెచ్చరిక (లాంటిది) చెయ్యడం చాలామందిని సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. శ్రీలంక సైనికులు నలభైకి పైగా భారతీయ జాలర్లను అరెస్టు చేసి హింసిస్తోందని పార్లమెంటులో తమిళనాడు సభ్యులు గొడవ చేయడంతో ‘వెంటనే విడుదల చేయాలని‘ ప్రధాని అల్టిమేటం జారీ చేయడం కూడా ఈ ఆశ్చర్యాల జాబితాలో ఉంది.
అయితే పత్రికల అభిభాషణ పూర్తిగా వాస్తవమేనా? విదేశీ ప్రభుత్వాల పట్ల, నేరాలు, నేరస్ధుల పట్లా, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల పట్లా మెతకగా వ్యవహరిస్తున్న ప్రధాని ఆయన పాలిస్తున్న దేశ ప్రజల పట్ల మాత్రం అత్యంత కఠినంగా, దయ అనేదే తెలియకుండా వ్యవహరిస్తున్నారన్నది సత్యం. లేదంటే రాజీనామా చేస్తానని బెదిరించి మరీ అమెరికాతో అణు ఒప్పందం చేసుకునే బిల్లుని ఆయన ఎలా ఆమోదింపజేసుకుంటారు? మా బ్రతుకులకు గ్యారంటీ ఏదని ప్రశ్నిస్తున్న కూడంకుళం పరిసర గ్రామాల ప్రజలకు సమాధానం చెప్పకపోగా పోలీసులను, పారా మిలటరీ బలగాలనూ ప్రయోగించి పిల్లలపై కూడా దేశ ద్రోహం కేసులు ఎలా మోపుతారు? అమెరికా అధ్యక్షుడు బెదిరించిన కొద్ది నెలలకే వాల్ మార్ట్ లాంటి బహుళజాతి కంపెనీలకి మేలు చేస్తూ, చిల్లర వర్తకంలో స్వయం ఉపాధి పొందుతున్న నాలుగున్నర కోట్ల కుటుంబాలను వీధి పాలు చేసేలా ఎఫ్.డి.ఐ బిల్లును ఎలా ఆమోదించారు? ఒడిషాలో సౌత్ కొరియా ఉక్కు కంపెనీ పోస్కో కోసం సామాన్య గిరిజన, దళిత ప్రజల పైన ఉక్కుపాదం మోపడమే కాక వారి నాయకులను మాఫియా గ్యాంగులు బాంబులు వేసి చంపుతున్నా తిరిగి ప్రజలపైనే ఎదురు కేసులు ఎలా మోపుతారు?
ప్రధాని మన్మోహన్ సింగ్ వాస్తవానికి భయంకరమైన కోరలతోనే ఆర్ధిక మంత్రి గానూ, ఆ తర్వాత ప్రధాన మంత్రి గాను అధికారం నెరుపుతున్నారు. ఆయన కోరలకు ప్రజలన్నా వారి ప్రయోజనాలన్నా దయ, జాలి, సానుభూతి లాంటి అనుభూతులు లేవు. లక్షల కోట్ల కుంభకోణాల పట్ల ఉన్నాయో, లేవో అన్నట్లు ఉండే ఆ కోరలు ఈ దేశంలోని సాధారణ ప్రజలంటే మాత్రం జూలు విదిల్చి పంజా విసురుతాయి. ప్రజల ఆయువుపట్లయిన సాధారణ ఉపాధి సౌకర్యాల పైన కర్కశంగా దిగబడతాయి. లక్షలాది విద్యావంతులకు దశాబ్దాల పాటు కనీసంగానైనా ఉద్యోగ సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వ రంగాన్ని కలికానికి కూడా కానరాకుండా చేస్తున్నది ఆ కోరలే. తద్వారా ఎస్.సి, ఎస్.టి, బి.సి ల ఉద్యోగాల రిజర్వేషన్లను అలంకారప్రాయంగా మార్చింది ఆ కోరలే. ఎల్.ఐ.సి, బ్యాంకులు లాంటి ప్రభుత్వరంగ సంస్ధలలో రిక్రూట్మెంట్లను లేకుండా చేసింది ఆ కోరలే. విద్య సౌకర్యాలు దాదాపు పూర్తిగా ప్రైవేటు కంపెనీలకు, వ్యక్తులకు ఆదాయ వనరులుగా మారిపోవడానికి కారణమూ ఆ కోరలే.
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు కోరలు లేవనడం ఒట్టిమాట!

Hahaha
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు కోరలు లేవనడం ఒట్టిమాట
Nice