దేశం వదిలి వెళ్లొద్దు, ఇటలీ రాయబారికి సుప్రీం ఆదేశం


సౌత్ బ్లాక్ వద్దకు వస్తున్న ఇటలీ రాయబారి డేనియల్ మన్సిని

సౌత్ బ్లాక్ వద్దకు వస్తున్న ఇటలీ రాయబారి డేనియల్ మన్సిని

ఇద్దరు కేరళ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి కాల్చి చంపిన ఇటాలియన్ మెరైన్లను ఇండియాకి తిరిగి పంపేది లేదని ఇటలీ ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో సుప్రీం కోర్టు అసాధారణ చర్య చేపట్టింది. ఇటలీ రాయబారి డేనియల్ మన్సిని తమ అనుమతి లేకుండా దేశం వదిలి వెళ్లరాదని ఆదేశించింది. ఫిబ్రవరి 24-25 తేదీలలో జరిగిన ఇటలీ సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేసి తిరిగి వెనక్కి వస్తామని మెరైన్లు సుప్రీం కోర్టును కోరగా వారికి ఇటలీ రాయబారి హామీగా నిలిచాడు. మెరైన్లు వెనక్కి తిరిగి వస్తారని ఇటలీ రాయబారి ఇచ్చిన హామీని పురస్కరించుకుని సుప్రీం కోర్టు షరతులేవీ లేకుండా అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం ఆదేశాలతో ఇండియా, ఇటలీ దేశాల సంబంధాలు మరొక అడుగు కిందికి జారినట్లే భావించవచ్చు.

తగిన జాగ్రత్తలు తీసుకోకుండా తమ దేశం వెళ్ళి ఓటు వేసి రావడానికి ఇటలీ మెరైన్లకు అనుమతి ఇచ్చిందని సుప్రీం కోర్టు విమర్శలు ఎదుర్కొంటోంది. ఇటలీ రాయబారి హామీ ఉల్లంఘన విషయాన్ని అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి గురువారం సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు. అటార్నీ జనరల్ చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం వెనువెంటనే ఇటలీ రాయబారికి నోటీసు ఇచ్చింది. తన అనుమతి లేకుండా దేశం వదిలి వెళ్లవద్దని నోటీసులో ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ఆల్తమస్ కబీర్ నేతృత్వంలోని త్రి సభ్య బెంచి ఓటు వేస్తామంటూ వెళ్లిన మెరైన్లకు కూడా నోటీసులు జారీ చేసింది. జస్టిస్ ఎ.ఆర్.దవే, జస్టిస్ విక్రమజిత్ సేన్ లు డివిజన్ బెంచిలో ఇతర సభ్యులు.

“దేశంలో అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ఉల్లంఘించడమే ఇది. ప్రభుత్వం ఈ పరిణామం పట్ల ఎంతో ఆందోళనతో ఉన్నది” అని అటార్నీ జనరల్ సుప్రీం డివిజన్ బెంచికి తెలిపాడు. మార్చి 18 లోగా మెరైన్లు తన నోటీసుకు సమాధానం ఇవ్వాలని కోర్టు కోరింది. మెరైన్లకు నోటీసులు అందించలేని పరిస్ధితి ఏర్పడితే సదరు నోటీసులను ఇటలీ రాయబారికే అందజేయాలని కోర్టు సూచించింది. అత్యవసరంగా కేసును విచారణకు స్వీకరించాలని అటార్నీ జనరల్ కోరడంతో తదుపరి విచారణ సోమవారానికి (మార్చి 19) వాయిదా వేసింది.

పరిణామాలు తప్పవు

ఇటలీ ప్రభుత్వ హామీ ఉల్లంఘన పైన ఉభయ సభల్లో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్ కూడా ఎన్నడూ లేని విధంగా తనకూ మాటలు వచ్చని రుజువు చేస్తూ కొంత కఠినత్వాన్ని ప్రదర్శించారు. సభ్యుల ఆందోళనలో తాను కూడా భాగం పంచుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటలీ రాయబారి ఒట్టి వ్యక్తి కాదని, ఇటలీ రాజ్యం అధికారికంగా ఆమోదించి ఇండియాలో నియమించబడిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తి ఇచ్చిన హామీలకు విలువ ఉంటుందని తాము భావించామని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయవద్దని ప్రధాని మన్మోహన్ కోరారు. హామీ ఉల్లంఘన కొనసాగితే “తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదు” అని ప్రధాని మన్మోహన్ ఉభయ సభల్లో ఒక ప్రకటన జారీ చేశారు.

కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టుల పైన బిజెపి నాయకులు విమర్శలు కురిపించారు. ఇటలీ మెరైన్లు క్రిస్టమస్ సెలవుల కోసం ఇంటికి వెళ్ళి రావడానికి కేరళ హై కోర్టు అనుమతి ఇవ్వడమే “కొత్తగానూ, ఆసక్తికరంగానూ” (strange and curious) ఉందనుకుంటే ఓటు వేసి రావడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వడం మరింత కొత్తగా, ఆసక్తికరంగా” ఉన్నదని విమర్శించారు.

కేరళ హై కోర్టు క్రిస్టమస్ కి అనుమతి ఇచ్చేటప్పుడు వాళ్ళు తిరిగి వచ్చేలా తగిన జాగ్రత్తలు తీసుకుందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తగు మొత్తంలో బాండ్ చెల్లించిన తర్వాత రాయబార స్ధాయిలో ఒప్పందం జరిగాకే మెరైన్లు ఇటలీ వెళ్లడానికి కేరళ హైకోర్టు అనుమతించిందని, సుప్రీం కోర్టు ఆ జాగ్రత్తలు తీసుకోలేదని వారు చెబుతున్నారు. కేవలం రాయబారి హామీని నమ్మి అనుమతి ఇవ్వడం తప్పిదం అన్నది వారి అవగాహన.

ఒకసారి వెళ్ళి వచ్చినవారు మళ్ళీ రాకపోతారా అన్న నమ్మకాన్ని పెట్టుకున్నట్లు సుప్రీం కోర్టు తాను మెరైన్లకు ఇచ్చిన అనుమతి ఆదేశాలలో పేర్కొంది. అయితే నేర చట్టాలకు అతీతంగా సుప్రీం కోర్టు ఇలా చేసిందా లేక చట్టాలకు లోబడి చేసిందా అన్నది తెలియరాలేదు. అతీతంగా చేసినట్లయితే సుప్రీం కోర్టు సైతం ఆ విధంగా వ్యవహరించరాదని ఇటలీ ప్రభుత్వము మరియు మెరైన్ల తొండాట ద్వారా నేర్చుకోవాల్సిన గుణపాఠం.

అంతర్జాతీయ చట్టాలు ఎవరికి అనుకూలం?

అంతర్జాతీయ రాయబార చట్టాలు తమ వాదనకే అనుకూలంగా ఉన్నాయని మార్చి 14 తేదీన ఇటలీ ప్రభుత్వం ప్రకటించినట్లు ది హిందు పత్రిక తెలిపింది. ఈ వాదన సరికాదని భారత న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ఇటాలియన్ చట్టాల ప్రకారం మెరైన్లు ఇండియా నుండి ఓటింగ్ హక్కు వినియోగించుకోవడం కుదరదని కనుక వారు ఇటలీ వెళ్ళే అనుమతి ఇవ్వాలని ఇటలీ రాయబారి డేనియల్ మన్సిని ఒక అఫిడవిట్ ద్వారా సుప్రీం కోర్టును కోరాడు. మెరైన్లు తిరిగి రావడానికి ఆ మేరకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని ఆయన పేర్కొన్నాడు. దీనర్ధం రాయబారి సుప్రీం కోర్టు జ్యూరిస్ డిక్షన్ ను అంగీకరించినట్లే.

తీరా మెరైన్లు వెళ్లిపోయాక భారత సుప్రీం కోర్టుకు జ్యూరిస్ డిక్షన్ లేదనీ, అంతర్జాతీయ న్యాయ చట్టాల ప్రకారం తామే విచారిస్తామని ఇటలీ ప్రకటించడం మోసపూరితం అని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. తమ రాయబారి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఇటలీ పైన ఉన్నది. అలా జరగలేదు. కానీ ఇప్పుడు భారత కోర్టులు చేయగలిగింది ఏమీ లేదు. నిందితులు ఇక్కడ ఉంటే అరెస్టు వారంటూ ఇచ్చేది. లేరు కనుక రాయబార చర్చలే మిగిలిన మార్గం. అది ప్రభుత్వం చెయ్యాల్సిన పని. బహుశా ఇదంతా ఆలోచించే ఇటలీ మోసానికి దిగిందని భావించవచ్చేమో.

వ్యాఖ్యానించండి