‘వార్టన్ ఇండియా ఎకనమిక్ ఫోరం‘, మోడి ప్రసంగం రద్దు చేయడం వలన ఎవరికి మేలు జరిగినట్లు?
మార్చి 22-23 తారీఖుల్లో ఫిలడెల్ఫియా లో జరగనున్న ఫోరం సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించాలని నరేంద్ర మోడిని ‘వార్టన్ ఇండియా ఎకనమిక్ ఫోరం‘ ఆహ్వానించింది. కానీ ‘యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా‘ లోని కొందరు విద్యార్ధులు, బోధన సిబ్బంది మోడికి ఆహ్వానం పంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 2002లో ముస్లిం ప్రజలపై జరిగిన అమానుష హత్యాకాండ దరిమిలా అమెరికా ప్రభుత్వమే మోడీకి వీసా ఇవ్వడానికి నిరాకరిస్తే, దానిని ఉల్లంఘిస్తూ వీడియో కాన్ఫరెన్స్ కు ఎలా ఆహ్వానిస్తారని వారు ప్రశ్నించారు. దానితో మోడి ఆహ్వానాన్ని ఫోరం రద్దు చేసుకుంది.
దానితో ‘వార్టన్ ఇండియా ఎకనమిక్ ఫోరం‘ కు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ‘అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్‘ తన స్పాన్సర్ షిప్ రద్దు చేసుకుంది శివసేన తరపున హాజరు కావలసిన మరో నాయకుడు కూడా తాను ఫోరంకి వెళ్లబోనని ప్రకటించాడు. ఈ విధంగా రద్దు, ప్రతీకార రద్దుల ప్రహసనంలో అసలు మోడీకి మేలు జరిగిందా, కీడు జరిగిందా అన్న మీమాంస తలెత్తి జోరుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి.
మోడి ప్రసంగం రద్దు చేయడాన్ని మోడి వ్యతిరేకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. రద్దు వలన మోడి ‘భావ ప్రకటన స్వేచ్ఛ‘ కు ఆటంకం కలిగినట్లేనని వారి అభిప్రాయం. కాంగ్రెస్ నాయకుడు శశి ధరూర్, ఇంగ్లండులో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తలు వీరిలో ఉండడం విశేషం. ది హిందు లాంటి పత్రికలలో ఈ రద్దుకి వ్యతిరేకంగా విశ్లేషణలు ప్రచురించబడ్డాయి. మూడు సార్లు వరుసగా గుజరాత్ ప్రజలు పట్టం కట్టిన వ్యక్తికి తన అభిప్రాయాలూ ప్రకటించుకునే స్వేచ్ఛ ఇవ్వకపోవడం వలన అది మోడీకి మరింత ప్రచారం కల్పించిందే తప్ప వారు నిరోధించగలిగింది ఏమీ లేదని ఇతర సెక్షన్లు కూడా బలంగా అభిప్రాయపడుతున్నారు. రద్దు వలన మోడి కంటే మోడి వ్యతిరేకులే ప్రతికూల ధోరణితో తమను తాము వ్యక్తపరచుకున్నట్లయిందని విశ్లేషణలు సాగుతున్నాయి.
బహుశా గుజరాత్ హత్యాకాండకు మోడి అనుచర రాజకీయ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల నాయకులు ఎలా తెగబడిందీ తెహెల్కా పత్రిక ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెల్లడి చేసిన అనంతర పరిణామాలు ఈ విశ్లేషణకు‘ ఒక సాక్ష్యం కావచ్చు. తెహెల్కా స్టింగ్ ఆపరేషన్ వాస్తవానికి మోడీకి సహాయపడిందని, గుజరాత్ సెంటిమెంటును రెచ్చగొట్టడానికి మోడీకి అవకాశం కల్పించిందని, అసలు స్టింగ్ ఆపరేషన్ వల్లనే మోడి రెండోసారి అత్యధిక మెజారిటీతో తిరిగి ప్రభుత్వం చేజిక్కించుకున్నాడని కొందరు అప్పట్లో విశ్లేషించారు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా “స్టింగ్ ఆపరేషన్ ‘కాంగ్రెస్ పనే‘ అన్న ప్రచారంలో వాస్తవం లేదని, ఎవరో కాంగ్రెస్ అంటే గిట్టనివారే ఒక కుట్ర ప్రకారం స్టింగ్ ఆపరేషన్ చేయించారని“ చెప్పుకోవాల్సి వచ్చింది.
అదే నిజమయితే మోడి మూడోసారి గెలవడానికి ఏ స్టింగ్ ఆపరేషన్ సహాయపడినట్లు? అన్న ప్రశ్న తలఎత్తుతోంది. స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెల్లడి అయిన వాస్తవాలను మోడికి వ్యతిరేకంగా వినియోగించుకోవడంలో కాంగ్రెస్ విఫలం అయింది అనడం సబబు అని వాదించేవారు ఉన్నారు.
స్టింగ్ ఆపరేషన్ వ్యవహారం ఎలా ఉన్నా వార్టన్ ఫోరం రద్దు వ్యవహారం వలన ‘భవిష్యత్తు ప్రధాని మోడియే‘ అన్న ప్రచారానికి గండి పడినట్లని కొందరు చెబుతుండగా, సహాయం చేసినట్లని మరికొంతమంది అభిప్రాయంగా ఉంది. ది హిందూ ప్రచురించిన ఈ కార్టూన్ ఈ అభిప్రాయాల్లో ఒక భాగంగా చూడవచ్చు. షేర్ మార్కెట్ లో ‘బై‘
‘సెల్‘ అనే పదాల వినియోగం అందరికీ తెలిసిందే. బై అనేది నిర్దిష్ట షేర్ కు ఆమోద (బుల్) సూచకం కాగా ‘సెల్‘ అనేది సదరు షేర్ పతన దిశలో (బేర్) ఉన్నదనడానికి సూచకం. మోడి ప్రసంగాన్ని కేన్‘సెల్‘ చెయ్యడం ఆయనకు ‘సెల్‘ రేటింగ్ ఇచ్చినట్లని కార్టూన్ సూచిస్తోంది.
పింగ్‌బ్యాక్: మోడీకి అమెరికా వీసా కావాలట! | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ