బొగ్గు కుంభకోణం, మరో చీకటి అధ్యాయం


Coal scam

భారత పాలకవర్గాల అవినీతి చరిత్రలో మరో రసవత్తర అధ్యాయానికి తెర లేస్తోంది. 2జి కుంభకోణం దరిమిలా 122 లైసెన్సులను రద్దు చేసి కాంగ్రెస్ పాలకుల అవినీతి మాలిన్యాన్ని ధృవపరిచిన సుప్రీం కోర్టే తాజా అధ్యాయానికి నాందీ వాచకం పలుకుతోంది. ప్రాధమిక సాక్ష్యాల ప్రకారం బొగ్గు గనుల కేటాయింపులు ఒక పద్ధతి లేకుండా జరిగినట్లు స్పష్టం అవుతోందని, అవసరమైతే కేటాయింపులన్నింటిని రద్దు చేయాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది.

అసలు బొగ్గు గనుల కేటాయింపుల రాష్ట్రాల ఆధీనంలో ఉండగా కేంద్రం ఎలా కేటాయింపులు జరిపిందని జనవరిలో ప్రశ్నించిన సుప్రీం మంగళవారం కూడా అదే స్ధాయిలో వ్యాఖ్యలు చేసింది. కాగ్ నివేదిక ద్వారా బొగ్గు కుంభకోణం బట్టబయలు అయినప్పుడు తాము అమితంగా భక్తిప్రపత్తులు ప్రకటించుకునే రాజ్యాంగానికి అనుగుణంగా ఏర్పడిన కాగ్ పైనే వారాల తరబడి దూషణల పర్వం సాగించిన కేంద్ర సచివులు సుప్రీం కోర్టుకు ఏ సమాధానం ఇస్తారో వేచిచూడాలి. 2జి కుంభకోణాన్ని తలదన్నుతూ బొగ్గు కుంభకోణం వలన 1.86 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ఖజానాకి నష్టం వాటిల్లిందని కాగ్ అంచనా వేసిన విషయం తెలిసిందే.

బొగ్గు గనుల కేటాయింపులలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానం చట్టబద్ధంగా కనిపించడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. చట్టం నిర్దేశించిన విధి, విధానాలు పాటించి ఉండకపోతే కేటాయింపులను రద్దు చేస్తామని హెచ్చరించింది. అడ్వొకేట్ మనోహర్ లాల్ శర్మ, స్వచ్ఛంద సంస్థ కామన్ కాజ్ లు బొగ్గు బ్లాకుల కేటాయింపులు రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంను విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

కేంద్ర ప్రభుత్వానికి, మంత్రివర్గానికి దాదాపు అభిశంసనతో సమానమైన రీతిలో సిబిఐకి సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. బొగ్గు కుంభకోణం పైన జరుగుతున్న విచారణకు సంబంధించిన సమాచారాన్ని పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ (కేంద్ర ప్రభుత్వం) తో ఎట్టి పరిస్ధితులలో చేరవేయరాదని కోర్టు సిబిఐని ఆదేశించింది. “తమలో తాము (బొగ్గు బ్లాకుల దరఖాస్తుదారులు) కేటాయింపులు జరిపిన సందర్భాలలో కూడా వారు (ప్రభుత్వం) మార్గదర్శక సూత్రాలను గానీ, చట్టబద్ధ ప్రక్రియలను గానీ పాటించకపోయినట్లయితే,, బి, సి (కంపెనీలకు) కేటాయింపులు జరిపి, డి,, ఎఫ్ కంపెనీలను మినహాయిస్తే గనుక అప్పుడు మొత్తం కేటాయింపులను రద్దు చేయాల్సి ఉంటుంది” అని జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని సుప్రీం బెంచి పేర్కొంది.

కేటాయింపులలో ఎటువంటి పద్ధతిని ప్రభుత్వం పాటించకపోతే అప్పుడిక బొగ్గు బ్లాకుల కేటాయింపులన్నీ రద్దు చేయక తప్పదని బెంచి పేర్కొంది. “ప్రభుత్వం చెబుతున్న ప్రక్రియ (procedure) ను గమనించినట్లయితే అది సరైన రీతిలో లేదని, చట్టబద్ధంగా లేదని ప్రాధమిక పరిశీలనలోనే తెలుస్తోంది” అని జస్టిస్ లోధా వ్యాఖ్యానించారు. బొగ్గు గనుల కేటాయింపుల చట్టబద్ధతను తాను మొదట పరిశీలిస్తానని, అనంతరం కేటాయింపుల్లో నేరం జరిగిందీ, లేనిదీ సిబిఐ చూసుకుంటుందని కోర్టు తెలిపింది.

1993 నుండి జరిపిన కేప్టివ్ బొగ్గు గనుల కేటాయింపులను రద్దు చేయాలని ప్రముఖ సీనియర్ పౌరులు అనేకులు సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి టి.ఎస్.ఆర్.సుబ్రమణీయన్, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎన్.గోపాలస్వామి, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి రామస్వామి అయ్యర్, రిటైర్డ్ అడ్మిరల్ తహిల్యాని, కేంద్ర ప్రభుత్వ మరో మాజీ కార్యదర్శి సుశీల్ త్రిపాఠి, రిటైర్డ్ అడ్మిరల్ ఎల్.రామదాస్ మొదలయిన ప్రముఖులు వ్యాజ్యం దాఖలు చేసినవారిలో ఉండడం విశేషం.

మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్ మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ (ఎం.ఎం.డి.ఆర్), 1957 ప్రకారం బొగ్గు గనులు రాష్ట్రాల పరిధిలోనివే తప్ప కేంద్రం పరిధిలోనివి కాదు. బొగ్గు గనుల పైన కేంద్రానికి ఎట్టి అధికారము లేదు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలా కేటాయింపులు జరిపిందని గత జనవరిలోనే సుప్రీం ప్రశ్నించింది. బొగ్గు గనుల జాతీయకరణ చట్టం ద్వారా కేంద్రం బొగ్గు గనులపై అధికారాలు ఏమన్నా దఖలుపరుచుకున్నదా అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు అధ్యయనం చేసి సమాధానం చెబుతామన్న ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఈసారి కూడా సమాధానం ఇచ్చినట్లు లేదు. రానున్న రోజుల్లో ఇస్తారేమో చూడాలి.

వ్యాఖ్యానించండి