అసలే ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతున్న ఇండియా, ఇటలీ సంబంధాలు ఇటలీ ప్రభుత్వ నిర్ణయంతో మరింత క్షీణించే పరిస్ధితి ఏర్పడింది. పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసొస్తామని చెప్పి వెళ్ళిన భారతీయ జాలరుల హంతకులను తిరిగి ఇండియాకి పంపేది లేదని ఇటలీ ప్రకటించింది. రాయబార చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని తాము చేసిన ప్రతిపాదనకు భారత్ స్పందించకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఇటలీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు భారత విదేశాంగ కార్యాలయానికి సోమవారం రాత్రి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. కానీ, ఇటలీ నిర్ణయం తనకు పత్రికల ద్వారానే తెలిసిందని భారత ప్రధాని మంగళవారం తనను కలిసిన కేరళ లెఫ్ట్ ఎం.పిలకు చెప్పడం గమనార్హం.
క్రిస్టమస్ కి ఇంటికి వెళ్లినప్పుడు మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చిన ఇటాలియన్లు ఈసారి నమ్మక ద్రోహానికి పాల్పడడం పరిశీలకులను ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. సముద్ర దొంగలుగా భావించి ఇద్దరు కేరళ జాలర్లను ఇటలీ సైనికులు హత్య చేశాక ఈ వివాదం అటు ఇటలీలోను, ఇటు కేరళ లోనూ భావోద్వేగాలకు సంబంధించిన సమస్యగా అవతరించింది. భారత జలాల్లో దుర్ఘటన జరిగింది కనుక నేరాన్ని తమ కోర్టులు విచారించాలని వాదిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇటలీ మెరైన్లను అరెస్టు చేసి విచారణ ప్రారంభించింది. కానీ దుర్ఘటన అంతర్జాతీయ జలాల్లో జరిగిందని ఇటలీ ప్రభుత్వం వాదిస్తోంది. కనుక ఐరాస సముద్ర చట్టాల ప్రకారం నేర విచారణ ఇటలీ కోర్టులు చేయాలని ఇటలీ వాదన. భారత ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో, ఇటలీ మెరైన్లు అప్పటికే కేరళ పోలీసుల నిర్బంధంలోకి రావడంతో విచారణ ఇండియాలోనే కొనసాగుతోంది.
భారత తీరానికి 12 నాటికల్ మైళ్ల దూరంలో దుర్ఘటన జరిగిందని నిర్ధారించిన సుప్రీం కోర్టు కేసును తమకు తరలించాలని కేరళ హై కోర్టును గత జనవరిలో కోరింది. భారత సముద్ర జలాలకు ఆవల ఘటన జరిగినందున కేసు కేరళ రాష్ట్ర పరిధిలోకి రాదని సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చింది. ఐరాస సముద్ర చట్టాల ప్రకారం కేసును విచారించే అధికారం భారత సుప్రీం కోర్టుకు ఉన్నదని కూడా సుప్రీం కోర్టు నిర్ధారించింది. ఆ మేరకు విచారణ ప్రారంభించిన సుప్రీం కోర్టు రోజువారీ విచారణ కోసం ఢిల్లీలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు నియమించాలని కేంద్రాన్ని కోరింది. భారత ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ఏర్పాట్లు చేయకుండా ఒకసారి సుప్రీం చివాట్లు కూడా తిన్నది. ఈ లోపు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటు వేయడానికి అనుమతి ఇవ్వడంతో ఇటలీ మెరైన్లు ఇటలీ వెళ్లారు. వారు ఓటు వేస్తున్న దృశ్యాలను భారత పత్రికలు ప్రచురించాయి కూడా.
ఇటలీ మెరైన్ల అరెస్టు, విచారణ, విడుదల వ్యవహారం ఇటలీ పార్లమెంటు ఎన్నికలలో ఒక ప్రముఖ అంశంగా నడిచింది. అప్పటి ప్రధాని మెరియో మోంటి సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించలేకపోయాడని, ఇండియాతో చర్చలలో బలహీనంగా వ్యవహరించాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. సెంట్రిస్టు కూటమిగా భావించిన మోంటి నాయకత్వంలోని కూటమి పార్టీ అత్యంత పేలవ ప్రదర్శనతో మూడో స్ధానంతో సరిపెట్టుకుంది. (మైనర్ బాలికతో వ్యభిచరించాడన్న ఆరోపణతో పాటు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని బెర్లుస్కొనికి చెందిన సెంటర్-రైట్ కూటమి మెరుగైన స్ధానాలతో రెండో స్ధానంలోనూ, సెంటర్-లెఫ్ట్ కూటమి మొదటి స్ధానంలోనూ నిలిచాయి. అయితే ఏ కూటమికి మెజారిటీ దక్కలేదు.) కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటలీ మెరైన్లు సుప్రీం కోర్టుకి ఇచ్చిన హామీని ఉల్లంఘించారు. బహుశా మెరైన్ల నేర విచారణ వివాదంలో సమర్ధవంతంగా వ్యవహరించడం అంటే అర్ధం కొత్త ప్రభుత్వం దృష్టిలో ‘నమ్మక ద్రోహం చేయగలగడం‘ అనుకోవాలేమో!
ఇటలీ మెరైన్లను భారత దేశంలోనే విచారించాలని భారత ప్రజలు, ప్రభుత్వ పెద్దలు భావించినప్పటికీ అందుకు విరుద్ధంగా హెచ్చరించినవారు లేకపోలేదు. మెరైన్లను తమకు అప్పచెప్పాలని ఇటలీ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి నచ్చజెప్పడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలం అయింది. ఇటలీ విదేశాంగ మంత్రితో పాటు ప్రధాన మంత్రి సైతం భారత్ సందర్శించి రాయబారం నెరిపినా ఫలితం దక్కలేదు. ఉన్నత స్ధాయిలో సాగిన ఈ చర్చలకు తగిన విధంగా స్పందించాలని కొందరు నిపుణులు కోరారు. లేనట్లయితే రాయబార ఉద్రిక్తతలకు సమస్య దారి తీస్తుందని వారు హెచ్చరించారు.
ఓటు వేయడం కోసం ఇటలీ వెళ్లడానికి అనుమతించే ముందు సుప్రీం కోర్టు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. క్రిస్టమస్ పండగ సమయంలో అనుమతి ఇచ్చినప్పుడు ఇరు దేశాల మధ్య రాయబార స్ధాయిలో స్పష్టమైన ఒప్పందం జరిగాకే కేరళ హై కోర్టు అనుమతి ఇచ్చిందని సుప్రీం కోర్టు ఆ జాగ్రత్త తీసుకోలేదని కొందరు న్యాయ నిపుణులను ఉటంకిస్తూ ది హిందూ తెలిపింది. ఇప్పుడిక రాజకీయ స్టాయిలోనే సమస్య పరిష్కారం కావాలి తప్ప భారత కోర్టులు చేయగలిగింది ఏమీ లేకపోవచ్చు. ఇటలీ అవలంబించిన పద్ధతి వలన భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగినపుడు బాధిత దేశాలు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఏర్పడింది.
