ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నాయకులతో పాటు పత్రికల కేంద్రీకరణ అటు మళ్లడం సహజమే. రాజకీయ నాయకులే తమ ఏర్పాట్లతో పత్రికలను ఆకర్షిస్తారా లేక పత్రికలే రాజకీయ నాయకులను రెచ్చగొట్టి వార్తలు సృష్టిస్తాయా అన్నది చెప్పడం ఒకింత కష్టమే అయినా, ఒకరికొకరు సహకరించుకోవడం మాత్రం ఒక వాస్తవం. ప్రధాన మంత్రి పదవికి పోటీదారుగా ఎవరిని ప్రకటించాలి అన్న విషయమై బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలలో సాగుతున్న అంతర్గత మరియు బహిరంగ ఉత్సుకత లేదా ఉద్రిక్తతల వ్యక్తీకరణలు వివిధ రూపాల్లో వ్యక్తం అవుతుండగా వాటిని ఒడిసి పట్టుకోవడానికి పత్రికలు తమ ప్రయత్నం తాము చేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ తమ ప్రధాని అభ్యర్ధి ఎవరో పరోక్షంగా సూచించి తద్వారా బి.జె.పి కూటమికి సవాలు విసరగా బి.జె.పి మాత్రం ఆ సవాలు స్వీకరించే పరిస్ధితిలో లేకపోవడం విశేషం. పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తున్నప్పటికీ అద్వానీ, మోడీ శిబిరాల మధ్య చెలరేగుతున్న పోటీ బి.జె.పి కూటమిని ఆత్మరక్షణలోకి నెడుతున్న పరిస్ధితి ద్యోతకమవుతోంది. బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్ నాయకులు అనేకమంది మోడి ప్రధాన మంత్రి అభ్యర్ధిత్వానికి మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ ఎన్.డి.ఎ మిత్రులు మాత్రం ‘మోడి’ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్, అమెరికాలు మోడీకి మద్దతు విషయంలో దోబూచులాడడం ఆయనకు పుండు మీద కారంలా మారింది. బి.జె.పి అంతర్గత కుమ్ములాటల్లో సతమతం అవుతుంటే కాంగ్రెస్ తమ యువరాజుకి ప్రజాదరణ పెంచుకోవడానికి తంటాలు పడుతోంది.
‘కై పో చే’ అనేది గుజరాతీ వ్యక్తీకరణ. ఒక సామెత లాంటిది. గాలి పటాల పోటీలు జరుగుతున్నపుడు పోటీదారులు తమ గాలిపటం ద్వారా ప్రత్యర్ధి గాలిపటం దారాన్ని తెంపితే ‘నేను నీ గాలిపటాన్ని తెంచేశాను!’ అని అరవడమే ‘కై పో చె!’ ఈ పేరుతో గత ఫిబ్రవరిలో ఒక సినిమా కూడా విడుదలై ప్రపంచ వ్యాపితంగా ఆదరణ పొందుతున్నట్లు వినికిడి. బి.జె.పి గాలి పటాన్ని కాంగ్రెస్ తెంపెయ్యక ముందే చిక్కుముడులు పడిపోవడం. దానినే తమ విజయానికి మార్గంగా గా కాంగ్రెస్ భావిస్తున్న పరిస్ధితిని ఈ కార్టూన్ ప్రతిభావంతంగా చూపుతోంది.
