షిండే గారు మళ్ళీ తొట్రుపడ్డారు…


Shinde’s gaffeఅమెరికా ఉపాధ్యక్షుడు జోసెఫ్ బిడెన్ లాగా భారత హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు తొట్రుపడం అలవాటుగా మారినట్లుంది. ప్రభుత్వం లోని పెద్దలు రహస్యంగా దాచిపెట్టుకోవాల్సిన అంశాలను బహిరంగంగా ప్రకటించి ఆనక నాలిక్కరుచుకోవడం జో బిడెన్ కు ఉన్న అలవాటు. ఆ అలవాటు వలన బిడెన్ పైన అమెరికాలో అనేక జోకులు వ్యాప్తిలో ఉన్నాయి. మన షిండే గారు కూడా చెప్పకూడని సంగతులు బైటికి చెప్పడం, అనకూడని మాటలు అనేయడం, ఆనక సారీ చెప్పడం మామూలుగా మారింది.

మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ముగ్గురు మైనర్ అక్క చెల్లెళ్లను అత్యాచారం చేసి చంపేసిన జరిగిన సంగతి చెబుతూ ఆయన రాజ్యసభలో ఆ ముగ్గురి పేర్లు చెప్పేశారు. అత్యాచారం ఎదుర్కున్న వారి పేర్లు బహిరంగపరచడం చట్ట రీత్యా నేరం అన్న సంగతి ఆయన మర్చిపోయారు. అధికారులు రాసిన స్టేట్ మెంటునే మంత్రులు సభలో చదువుతుంటారు. ఇది కూడా అధికారులు రాసినదో లేదో తెలియదు కానీ అపరాధం మాత్రం ఆయనదే అయింది.

మంత్రి గారి తప్పుని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ ఎత్తి చూపే వరకూ ఇతర సభ్యులు, సభ ఛైర్మన్ తో సహా గమనించినట్లు లేదు. “ఇది ఖచ్చితంగా పొరబాటే అయి ఉంటుంది… హోమ్ మంత్రి ప్రకటనలో ముగ్గురు పసి బాలికల పేర్లు ఉన్నాయి. ఏదైతో జరగకూడదో అదే జరిగింది” అని జైట్లీ అభ్యంతరం చెప్పారు. “బాధితురాళ్ళ పేర్లను చెప్పకూడదు. వారి పేర్లు బైటికి వచ్చాయి, వారెవరో గుర్తించారు. హోమ్ మంత్రి తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. సభలో తాజా ప్రకటన ప్రవేశపెట్టాలి” అని జైట్లీ సభకు విషయం ఎరుక పరిచారు.

భండారా జిల్లాలో జరిగిన దారుణం పరమ ఘోరం. (ఈ అంశంపై ఈ బ్లాగ్ లో ఆర్టికల్ ప్రచురించబడింది) జీ న్యూస్ లాంటి వెబ్ సైట్లు ఈ ఘోరం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదనీ, ఢిల్లీ ఘోరాన్ని మించిన ఘోరం అయినప్పటికీ పత్రికలు అవసరమైనంతగా దృష్టి పెట్టడం లేదనీ వాపోయాయి. అమానుష ఘోరాలను ఒకదానితో మరొకటి పోల్చడం, పోటీకి తేవడం సరైన ధోరణి కానప్పటికీ జీ న్యూస్ ఎత్తి చూపిన అంశం పట్టించుకోవలసినదే. 11, 8, 6 సంవత్సరాల వయసు కల ముగ్గురు అక్క చెల్లెళ్లు దళిత కుటుంబంలో పుట్టినవారు కావడం, నిందితులు భూస్వామ్య కుటుంబీకులని ప్రచారం కావడం… ఈ నేపధ్యంలో భండారా ఘోరానికి స్పందన లేకపోవడం అన్యాయం.

రాజ్య సభ ఉప సభాపతి పి.జె.కురియన్ జైట్లీ అభ్యంతరానికి వెనువెంటనే స్పందించారు. జైట్లీ అత్యంత ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారని వ్యాఖ్యానించారు. బాధితురాళ్ళ పేర్లు వెంటనే రికార్డుల నుండి తొలగిస్తున్నట్లు చెప్పారు. వారి పేర్లు ప్రచురించవద్దని మీడియాకు ఆదేశాలు జారీ చేశారు. తన ఆదేశాన్ని మన్నించకుండా పేర్లు ప్రచురిస్తే సభా హక్కుల ఉల్లంఘన కింద విచారణ ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.

మంత్రి షిండే అరుణ్ జైట్లీకి కృతజ్ఞతలు తెలిపారు. అనుకోకుండా జరిగిన తప్పిదాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు చెబుతూ పేర్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు రాజ్య సభ సెక్రటేరియట్ ఒక నోటీసు జారీ చేసింది.

షిండే ఈ మధ్య కాలంలో వరుసగా తొట్రుపడుతున్నారు. ఆయన హోమ్ మంత్రి అయ్యాక అది ఎక్కువయినట్లు కనిపిస్తోంది. సభలోనూ, సభ బయటా ఆయన విన్యాసాలకు కొదవలేదు. లేక ఆయన హోమ్ మంత్రి కనుక పత్రికలు ఎక్కువ పట్టించుకుంటున్నాయో తెలియదు.

గత ఆగస్టు నెలలో అస్సాం హింస పైన సభలో చర్చ జరుగుతుండగా సమాజ్ వాదీ పార్టీ ఎం.పి జయా బచ్చన్ పైన వింత వ్యాఖ్య చేసి విమర్శలు ఎదుర్కొన్నారాయన. “ఇదేమీ సినిమా వ్యవహారం కాదు” అని హేళనగా వ్యాఖ్యానించడంతో ప్రతిపక్ష సభ్యులు ఉగ్రులయ్యారు. ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించడంతో తన మాటలు వెనక్కి తీసుకుని జయా బచ్చన్ కు క్షమాపణ చెప్పారు.

పాకిస్థానీ టెర్రరిస్టుగా భారత ప్రభుత్వం భావిస్తున్న హఫీజ్ సయీద్ ను శ్రీ అని సంబోధించి షిండే విమర్శలు ఎదుర్కొన్నారు. హఫీజ్ ను భారత్ మోస్ట్ వాంటేడ్ టెర్రరిస్టు గా ప్రకటించింది. ముంబై దాడులకు పాల్పడిన లష్కర్-ఎ-తొయిబా తో ఆయనకి సంబంధాలు ఉన్నాయని ఇండియా ఆరోపించింది. ఆయన నాయకుడుగా ఉన్న జమాత్-ఉద్-దవా సంస్థ ప్రపంచంలో పెద్ద ఉగ్రవాద సంస్థల్లో ఒకటని పేరు. ఆ సంస్థను ఐరాస ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. హఫీజ్ ను ఇండియాతో పాటు అమెరికా, ఇ.యు, బ్రిటన్ తదితర దేశాలు కూటములు టెర్రరిస్టుగా ప్రకటించాయి. అలాంటి వ్యక్తిని శ్రీ అని సంబోధించి షిండే కలకలం రేపారు.

ఇక బిజెపి, ఆర్ఎస్ఎస్ సంస్థలు ఇండియాలో కాషాయ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నాయని. శిక్షణా శిబిరాలలో టెర్రరిస్టు శిక్షణ ఇస్తున్నారని జైపూర్ లో జరిగిన కాంగ్రెస్ చింతన శిబిరంలో ప్రకటించి మరో సంచలనానికి తెర తీశాడు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే పార్లమెంటు సమావేశాలలో ఆయనను బహిష్కరిస్తామని బిజెపి హెచ్చరించడంతో ఆయనకు క్షమాపణ చెప్పక తప్పింది కాదు. ఆయన క్షమాపణ చెబితే మాత్రం ఆ వ్యాఖ్యలు ‘factually incorrect” అని భావించనవసరం లేదు అని కాంగ్రెస్ పెద్దలు వ్యాఖ్యానించి షిండే పై భారం తగ్గించడం వేరే సంగతి. హిందూ సంస్థలు ఏయే సందర్భాల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడిందీ సిబిఐ, ఐబి లాంటి భద్రతా సంస్థలతో సమాచారం వెల్లడి చేయించడం ద్వారా షిండేకు పరోక్ష పద్ధతిలో మద్దతుగా వచ్చారు కూడా.

ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారం జరిగిన ఘోరానికి నిరసనగా ఢిల్లీ వీధుల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించినప్పుడు కూడా షిండే నోరు జారారు. ఆందోళనకారులను మావోయిస్టులతో పోల్చి విమర్శలు చవిచూశారు. “ఇండియా గేట్ వద్దకు ఎవరు వచ్చి అరిచినా హోమ్ మంత్రి అక్కడికి రావాలా? రేపు మావోయిస్టులు వచ్చినా వారితో మాట్లాడాలా?” అని అమాయకంగా ప్రశ్నించి షిండే నిరసనలు ఎదుర్కొన్నారు.

షిండే వ్యాఖ్యలు సోనియా కుటుంబాన్ని ఓ సారి ఇరుకున పెట్టాయి. “రానున్న రోజుల్లో బొగ్గు కుంభకోణాన్ని కూడా ప్రజలు మర్చిపోతారు. బోఫోర్స్ కుంభకోణం, పెట్రోల్ పంపుల పంపిణీ కుంభకోణాన్ని మర్చిపోలేదా? ప్రజల జ్ఞాపకశక్తి చాలా తక్కువ” అని ఆయన కుంభకోణాల విచారణలో ప్రభుత్వాల గుట్టు విప్పారు. బోఫోర్స్ విచారణ ప్రహసనం యొక్క గుట్టు కూడా ఆయన విప్పినట్లయింది.

షిండే లాంటి నాయకులుంటే పత్రికలకు వార్తలకు కొదవ ఎందుకుంటుంది?

వ్యాఖ్యానించండి