బడ్జెట్ 2013-14: సబ్సిడీల్లో భారీ కోత


Subsidy cutting

2013-14 ఆర్ధిక సంవత్సరానికి గాను గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రభుత్వం సబ్సిడీలలో భారీ కోతలు ప్రతిపాదించింది. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి చిదంబరం ఈ కోతల గురించి ఒక్క ముక్క కూడా చెప్పకుండా దాచిపెట్టాడు.

నిజానికి సబ్సిడీలను తగ్గించవలసిన అవసరం గురించి ప్రధాని, ఆర్ధిక మంత్రి, ప్రధాని ఆర్ధిక సలహా బృందం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు తదితరులంతా వీలు దొరికినప్పుడల్లా బోధనలు, సలహాలు, హెచ్చరికలు చేస్తూ వచ్చారు. వాటిని అమలు చేసే సమయంలో మాత్రం గుట్టు చప్పుడు కాకుండా వ్యవహరించడం ప్రజలను వంచించడం తప్ప మరొకటి కాదు.

ఖజానా లోటు (fiscal deficit) తగ్గింపు ఈ కోతలకు లక్ష్యమని ప్రభుత్వం చేస్తున్న సూచనలు నమ్మదగ్గవేనా అన్నది అనుమానమే. ఎందుకంటే ఖజానా లోటు తగ్గించడానికి, ఆదాయం పెంచుకోవడానికి వచ్చిన అవకాశాలన్నింటినీ మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు కాలదన్నుతూ వచ్చారు. 2జి స్పెక్ట్రమ్ వేలం వేయకుండా అతి తక్కువ రేట్లకు కట్టబెట్టడం ద్వారా 1,70,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం వదిలేసిందన్న కాగ్ అంచనా ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు.

ఖాళీ అయిన స్పెక్ట్రమ్ మొత్తాన్ని వేలం వేయకుండా కొద్ది మొత్తంలో వేలానికి పెట్టడం, భారీ ప్రారంభ ధరను ప్రతిపాదించడం లాంటి ఎత్తుగడలకు పాల్పడడం ద్వారా కాగ్ అంచనాలు తప్పని చెప్పడానికి మంత్రులు, అధికారులు శాయశక్తులా కృషి చేశారు. కానీ పత్రికలు వారి కుటిల ఎత్తుగడలను ఎండగట్టడంతో వారి ఎత్తులు పెద్దగా పారలేదు. ఖజానా లోటు గురించి అంత ఆందోళన ప్రకటించేవారు ఈ మోసపూరిత పద్ధతులను అనుసరించడం, కాగ్ ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించడం ఎందుకు?

ఆహారం, పెట్రోలియం, ఎరువుల సబ్సిడీల మొత్తంలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి, ప్రతిపాదిత బడ్జెట్ సంవత్సరానికి తేడా కనపడుతోంది. 2012-13 సంవత్సరానికి సబ్సిడీల మొత్తంను 1,79,554 కోట్ల అంచనా నుండి 2,47,854 కోట్లుగా రివైజ్ చేసిన ప్రభుత్వం 2013-14 ఆర్ధిక సంవత్సరానికి వచ్చేసరికి 2,20,971.5 కోట్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

నగదు బదిలీ పధకం ద్వారా సబ్సిడీలు వస్తు రూపేణా ఇవ్వడానికి బదులు నగదు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చిన నేపధ్యంలో ఈ సబ్సిడీల కోత లక్ష్యం అర్ధం చేసుకోవలసి ఉంది. నగదు బదిలీ పధకంను అడ్డు పెట్టుకుని వాస్తవ లబ్దిదారులను కూడా పెద్ద ఎత్తున తగ్గించేందుకు పధక రచన జరుగుతున్నట్లు అనేకమంది అనుమానిస్తున్నారు. అవినీతి పరులకు వ్యవస్ధలో ఎప్పుడూ తగిన అవకాశాలు సృష్టించబడుతూనే ఉంటాయి. నష్టపోయేది అధికార, అంగ, అర్ధ బలాలు లేని సామాన్యుడే.


వ్యాఖ్యానించండి