
చిదంబరం సతీమణి నళిని, కుమారుడు కార్తి, కోడలు శ్రీనిధి మనవరాలు బడ్జెట్ సమర్పణ వీక్షించడానికి పార్లమెంటుకు వస్తున్న దృశ్యం -ఫొటో: ది హిందు
ఆర్ధిక మంత్రి చిదంబరం 2013-14 బడ్జెట్ లో సాధారణ పన్ను చెల్లింపుదారులకు కాసింత ముష్టి విదిలించి మధ్య తరగతి ప్రజల పట్ల తనకు ఉన్న ఔదార్యం చాటుకున్నాడు. సంవత్సరానికి రు. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రు. 2,000/- పన్ను చెల్లింపులో మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించాడు. అంటే మొదటి పన్ను శ్లాబ్ ను రు. 2 లక్షల నుండి 2.2 లక్షలకు పెంచినట్లు అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఇది పరిమితి పెంపు కాదు. ప్రభుత్వమే ఆయా వ్యక్తుల పన్ను ఖాతాలో 2,000 రూపాయలు జమ చేసినట్లు చూపుతుంది. ఆ మేరకు చెల్లించవలసిన పన్నులో తగ్గుతుంది. ఆ మొత్తం వాస్తవానికి చెల్లించకుండానే చెల్లించినట్లు లెక్కిస్తుంది.
“2 నుండి 5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి మొదటి బ్రాకెట్ లో పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నాను… మొత్తం ఆదాయం 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి రు. 2,000/- పన్ను జమ ఇవ్వడానికి ప్రతిపాదిస్తున్నాను. దీని ద్వారా 1.8 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు లబ్ది చేకూరుతుంది. ప్రభుత్వం రు. 3,600/- కోట్ల ఆదాయం కోల్పోతుంది” అని ఆర్ధిక మంత్రి చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఉనికిలో ఉన్న శ్లాబుల ప్రకారం మొదటి 2 నుండి 5 లక్షల ఆదాయానికి 10 శాతం, 5 నుండి 10 లక్షల ఆదాయానికి 20 శాతం ఆపై ఆదాయానికి 30 శాతం ఆదాయ పన్ను చెల్లించాలి. మంత్రి చెప్పిన మొదటి బ్రాకెట్ అంటే 2 నుండి 5 లక్షల ఆదాయం ఉన్నవారని అర్ధం. ఉదాహరణకి 5 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి రు. 50,000 పన్ను చెల్లించవలసి ఉంటుంది. 2013-14లో ఆ వ్యక్తి 48,000 పన్ను చెల్లిస్తే సరిపోతుంది. సెక్షన్ 80C కింద రు. 1 లక్ష సేవింగ్స్ చూపిస్తే రు. వారి పన్ను 38,000 కు, గృహ రుణాలు, పి.ఎఫ్, వృత్తి పన్ను మొదలయిన ఖాతాలకు యధాతధంగా ఆ మేరకు పన్ను మినహాయింపు కొనసాగుతుంది.
కోటి రూపాయల ఆదాయం దాటిన ధనికులకు 10 శాతం సర్ ఛార్జీ విధిస్తున్నట్లు మంత్రి తెలిపాడు. దేశంలో కోటి రూపాయల ఆదాయం దాటినవారు కేవలం 42,800 మంది మాత్రమేనని మంత్రిగారే బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. సర్ ఛార్జి అంటే పన్ను మీద పన్ను తప్ప ఆదాయం పైన పన్ను కాదు. ఆ లెక్కన కొద్దిపాటి మంది ధనికులు చెల్లించే ఆదాయ పన్ను పైన 10 శాతం సర్ ఛార్జి విధిస్తే వచ్చే ఆదాయం సోదిలోకి కూడా రాదు. 1.8 కోట్ల మంది మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులకు 2,000 టాక్స్ క్రెడిట్ ఇస్తున్నందున 3,600 కోట్లు కోల్పోతున్నట్లు చెప్పిన చిదంబరం ఈ 10 శాతం సర్ ఛార్జీ ద్వారా ఎంత ఆదాయం వస్తుందో చెప్పలేదు. చెప్పలేనంత తక్కువగా ధనికులపైన సర్ ఛార్జీ వేసినట్లు జనం అర్ధం చేసుకోవాలా?
చిదంబరం ఏమంటున్నారో చూడండి. “పన్ను మినహాయింపు పరిమితిని కనీస మాత్రంగా పెంచినా దాని వలన కొన్ని వందల వేల మంది పన్ను చెల్లింపు నుండి మినహాయింపు పొందుతారు. తద్వారా పన్ను పునాది (tax base) తీవ్రంగా దెబ్బతింటుంది.” అదీ విషయం! ప్రభుత్వ ఆదాయం గొర్రె తోక ఆదాయ జీవులపైన ఎంతగా ఆధారపడి ఉన్నదో ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. వేతన జీవులు ఎలాగూ తమ ఆదాయాన్ని దాచుకోలేరు. కాబట్టి వారి ఆదాయం అంతా పన్ను కిందికి రావాల్సిందే. నల్ల డబ్బు సొంతదారుల ఆదాయ వనరులు మాత్రం కదలకపోవడమే కాక నానాటికి పెరుగుతూ పోతున్నా దాన్ని పట్టుకోవడానికి ప్రభుత్వాలు ఏ ప్రయత్నమూ చెయ్యవు. అదేమంటే కోటలు దాటే హామీలు గుప్పించడానికి ఎప్పుడూ రెడీ. స్విస్ బ్యాంకు ఖాతాదారుల పేర్లు చేతికి వచ్చినా అవి బైటికి చెప్పడానికి ‘జాతీయ భద్రత’ సాకుగా చూపే ఈ ప్రభుత్వాలు ఎవరి పక్షమో తెలియడానికి ఈ ఒక్క సంగతి చాలు.
జి.డి.పి వృద్ధి రేటు లక్ష్యంలో ప్రజా సంక్షేమం బొత్తిగా ఉండదని ఆర్థికవేత్తలే అంగీకరిస్తున్న విషయం. ఇటీవల భారత్ పర్యటించిన ఆర్ధిక నోబెల్ గ్రహీత, అమెరికన్ ఆర్థికవేత్త జోసెఫ్ స్టిగ్లిట్జ్ ఆ విషయమే చెప్పాడు. జి.డి.పి వృద్ధి పైన గుడ్డిగా కేంద్రీకరిస్తే ఉపయోగం లేకపోగా తీవ్రమైన నష్టం జరుగుతుందనీ, సామాజిక సంక్షేమాన్ని జతపరిస్తేనే వృద్ధికి నిజమైన అర్ధం ఉంటుందనీ ఆయన చెప్పాడు. వాల్ మార్ట్ లాంటి కంపెనీల ఒత్తిడికి తల ఒగ్గి విచ్చలవిడిగా ఎఫ్.డి.ఐలను ఆహ్వానించడం, ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరించడం తగదని హెచ్చరించాడాయన. కానీ మన ఆర్ధిక మంత్రి చిదంబరం మాత్రం ఎవరు అవునన్నా, కాదన్నా జి.డి.పి వృద్ధి శాతం పెంచుకోవడమే తమ ప్రధమ కర్తవ్యం అని ప్రకటించాడు. జి.డి.పి వృద్ధి పెరగకుండా ‘అందరితో కలుపుకున్న వృద్ధి’ (inclusive growth) సాధ్యం కాదని కూడా సెలవిచ్చాడు. Inclusive growth ద్వారానే GDP growth వాస్తవ అర్ధంలో సాధ్యం అవుతుందన్న నిజాన్ని గుర్తించడానికి నిరాకరిస్తున్నాడు. అలాంటి వ్యక్తి రైతులు, కార్మికులు, మధ్యతరగతి జీవుల వెతలను పట్టించుకుంటాడని ఆశించడం వ్యర్ధమే కావచ్చు.