ఈ తుఫాను గాలులు ఎక్కడివి? -కార్టూన్


ది హిందు నుండి

ది హిందు నుండి

“ఈ విప్లవాగ్నులు ఎచటివి అని అడిగితే నగ్జల్బరి వసంత మేఘ గర్జనవైపు వేలు చూపండి” ప్రముఖ విప్లవ కవి చెరబండరాజు రాసిన ఒక కవితలోని పాదాలివి. ఒక కాలంలో కాలేజీలు, యూనివర్శిటీలను ఒక్క ఊపు ఊపి బహుళ ప్రసిద్ధి చెందిన పాదాలివి. భారత ప్రజలు మార్పుని కోరుకుంటున్నారు అన్న నిజానికి సంకేతంగా 1960ల చివర్లో పశ్చిమ బెంగాల్ లో నగ్జల్బరి గ్రామంలో పుట్టిన రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రస్తావిస్తూ చెరబండరాజు ఈ మాటలు రాశాడు. నగ్జల్బరిలో వసంత కాలంలో పుట్టిన విప్లవ గాలులు తెలుగు నేల వరకు వీచి శ్రీకాకుళం రైతాంగ పోరాటం, గోదావరి లోయ పోరాటం తదితర విప్లవ కమ్యూనిస్టు పోరాటాలకు జన్మనిచ్చాయి అని చెప్పడానికి చెరబండరాజు ఈ మాటలు చెప్పాడు.

ఇపుడు పార్లమెంటు పైన కూడా తీవ్రమైన గాలులు వీస్తున్నాయి. ఈ గాలులు కూడా మార్పునే కోరుతున్నాయి. భారత ఆర్ధిక వ్యవస్ధలో పెను మార్పులు కోరుతున్న ఈ గాలులు వీచడం మొదలై ఇప్పటికీ రెండు దశాబ్దాలు దాటింది. ఆర్ధిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రారంభించిన నూతన ఆర్ధిక విధానాలు దేశంలో లెక్కకు మిక్కిలిగా పుష్పించి 2జి కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, ఎ.పి, మహారాష్ట్ర రాష్ట్రాల జల యజ్ఞాల కుంభకోణాలు, ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాలు, దాదాపు ప్రతి రాష్ట్రంలో వెలుగు చూస్తున్న సెజ్/రియల్ ఎస్టేట్ కుంభకోణాలు … ఇంకా అనేకానేక కుంభకోణాలుగా విరగ కాస్తున్నాయి. ఈ ఒరవడిలో ‘అగస్టా వెస్ట్ లాండ్ వి.ఐ.పి హెలికాప్టర్ల కుంభకోణం’ తాజాగా నవనవలాడుతోంది.

నగ్జల్బరి గాలులు తమ జీవితాలలో మార్పు కోరుతున్న సాధారణ రైతాంగ ప్రజానీకపు ప్రజాస్వామిక ఆకాంక్షల నుండి బలం పుంజుకుంటే, కుంభకోణాల గాలులు మాత్రం విదేశీ కంపెనీల పేరాశల కాంక్షల నుండి పుట్టి వీస్తున్న పడమటి గాలులు. నగ్జల్బరి, శ్రీకాకుళం గాలులు ప్రజల జీవనాల మెరుగుదల కోసం పుడితే పడమటి గాలులు పడమటి దేశాలలోని సంక్షుభిత కంపెనీల లాభార్జనా దాహాల నుండి, దేశీయ దళారుల కమిషన్ కొట్ల నుండి పుట్టిన నోట్ల కట్టల రెపరెపల గాలులు. ఈ గాలులు భారతీయ దొరల ఆధునిక గడీలయిన స్విస్ బ్యాంకుల ఖాతాలను ముంచెత్తేవి కాగా, వేనవేల భారతీయుల కష్టార్జితాలను ఊడ్చివేసేవి.

వరుస కుంభకోణాలకు జన్మనిస్తున్న పడమటి గాలులను నిలువరించాలంటే విప్లవాలను కోరుకునే భారత శ్రామిక జనం మళ్ళీ విప్లవ బడబాగ్నులకు జన్మనివ్వాలి. పశ్చిమ దేశాలు పైనుండి రుద్దుతున్న మార్పులకు కింది నుండి ఎగసిపడే ప్రజా పోరాటాలే సరైన సమాధానం.


3 thoughts on “ఈ తుఫాను గాలులు ఎక్కడివి? -కార్టూన్

  1. నిజంగానే నిఖిల లోకం
    నిండు హర్షం వహిస్తుందా..?
    మానవాళికి నిజంగానే
    మంచికాలం రహిస్తుందా.?

    నిజంగానే నిజంగానే
    నిఖిలలోకం హసిస్తుందా.?
    సాధుసత్వపు సోదరత్వపు
    స్వాదుతత్వం జయిస్తుందా..?

    నిజంగానే నిజంగానే..?

  2. మొన్న ఈ మద్య మహేష్ బాబు సినిమా BUSINESSMAN లో ఒక డైలాగ్ గుర్తొస్తుంది ” భారతదేశంలో చాల సంపద ఉంది కవలసినోడు కావలిసినంత దోచుకోవటమే” ఈ డైలాగ్ బాగా నచినట్టుంది మన పాలకులకు. పాపం ప్రతిపక్షం కూడా చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే ప్రస్తుత స్కాం ల గురించి అడిగితే “మీరు పాలించినప్పుడు తినలేదా” అని అడుగుతున్నారు కదా.

వ్యాఖ్యానించండి