ముఖ్యమంత్రి తదితరుల వి.వి.ఐ.పి ల సందర్శన వలన పోలీసుల పరిశోధన ముందుకు సాగని పరిస్ధితి ఏర్పడింది. వారితో పాటు ఉత్సుకతతో చూడడానికి వచ్చిన జనం పేలుడు జరిగిన చోట్ల ఇష్టం వచ్చినట్లు తొక్కిపారేయడంతో కీలక సాక్ష్యాలు లభ్యం కాకుండా పోయాయి. పేలుడు జరిగాక జనం హాహాకారాలతో అటు ఇటు పరుగులు పెట్టడం సహజమే. కానీ ఆ పరుగులు కూడా కీలక సాక్ష్యాలలో భాగంగా ఉండవచ్చు. వారు కాకుండా బైటివారు రావడం వలన పేలుడు జరిగిన తర్వాత పరిసరాలలో చెల్లాచెదురుగా పడిపోయే వివిధ సాక్ష్యాలు గల్లంతయ్యాయి.
మెరుగుపర్చిన పేలుడు పరికరంలో (మెపేప –Improvised Explosive Device – IED) ఏయే పదార్ధాలు వాడారు, పేలుడు విధ్వంసం ఏ విధంగా జరిగింది, ఎలా విస్తరించింది తదితర వివరాలు ఫోరెన్సిక్ నిపుణుల విశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తాయి. వి.వి.ఐ.పి ల సందర్శన, జనం నియంత్రణలో లేకపోవడం వలన ఈ సాక్ష్యాలను పెద్దగా సేకరించలేకపోయామని ఐ.జి స్థాయి అధికారి ఒకరు చెప్పారు.
హై-గ్రేడ్ పేలుడు
“ఆ రెండు పేలుడు స్ధలాలను మేము భద్రం చేసే లోపే అనేకమంది జనం యథేచ్ఛగా తిరగడం వలన నేర స్థలం తీవ్రం స్ధాయిలో చెదిరిపోయింది” అని సంఘటన స్థలానికి మొదటగా చేరుకున్న వారిలో ఉన్న ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఒకరు చెప్పారని ‘ది హిందు‘ తెలిపింది. “ముఖ్యమంత్రితో సహా అనేకమంది వి.ఐ.పిలు, మీడియా వ్యక్తులు రావటంతో సాక్ష్యాలు భారీగా తొక్కిసలాటకు గురయ్యాయి. ఉత్సుకతతో చూడడానికి వచ్చిన జనం కూడా వీరికి జతకలిశారు. అయినప్పటికీ కొన్ని పదార్ధాలను మేము సేకరించగలిగాము. పరిశోధనలో అవి సహాయం చేయవచ్చు” అని ఐ.జి తెలిపాడు.
“అది హై-గ్రేడ్ పేలుడు. కానీ పేలుడు పదార్ధాల పరిమాణం మాత్రం తక్కువే. అది మెపేప అవడమే దానికి కారణం. పేలుడులో ఏ విధమైన పదార్ధాలు వాడినదీ ఇంకా ఒక నిర్ధారణకు రాలేదు. కేసులో బిగించవలసిన వదులు ముడులు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని ముడి వేయడానికి ప్రయత్నిస్తున్నాము” అని ఐ.జి తెలిపాడు. దిల్ షుక్ నగర్ బస్టాండు (రాజీవ్ చౌక్) వద్ద, సమీపంలోని ఒక బస్ షెల్టర్ వద్ద అమర్చిన సిసి కెమెరాల వీడియో ఫుటేజీ పోలీసులు పరిశీలిస్తున్నారని కూడా ఆయన తెలిపాడు.
కేంద్ర, రాష్ట్రాలకు చెందిన అనేక భద్రతా విభాగాలు పరిశోధనలో నిమగ్నం అయ్యాయి. రాష్ట్ర సి.ఐ.డి పోలీసులతో పాటు పోలీసు విభాగం నియమించిన ప్రత్యేక నిపుణుల బృందం నగరంలో క్లూలు సేకరించడానికి శ్రమిస్తున్నారు. కేంద్రం నుండి వచ్చిన ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ‘ (ఎన్.ఐ.ఎ) అధికారులు పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్.ఎస్.జి అధికారులు, చెన్నై నుండి వచ్చిన బ్లాక్ క్యాట్ కమాండోలు వారికి సహకరిస్తున్నారు. హైదరాబాద్ లోని ‘సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ‘ నిపుణులు కూడా సాక్ష్యాల సేకరణలో తమ పని తాము చేస్తున్నారు.
ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పేలుడులో ఇంతవరకు 16 మంది చనిపోగా 117 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఐదుగురు పరిస్ధితి ఇంకా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐ.పి.సి సెక్షన్ 3, 5, పేలుడు పదార్ధాల చట్టం సెక్షన్ 16, 17, 18, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
చనిపోయినవారు, గాయపడిన వారిలో అనేకమంది యువకులని పత్రికలు తెలిపాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో ఉన్న పుస్తకాల షాపుల్లో పుస్తకాలు కొనడానికి వచ్చినవారు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినడానికి, టీ తాగడానికి వచ్చినవారు పేలుడులో చిక్కుకున్నారని అవి తెలిపాయి. చుట్టుపక్కల అనేక కోచింగ్ సెంటర్లు ఉండడం వలన అక్కడ విద్యార్ధులు పెద్ద సంఖ్యలో తిరుగుతుంటారు. ఎక్సైజ్ విభాగంలో ఎస్.ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకుని సంబంధిత మెటీరియల్ కొనుక్కోవడానికి వచ్చినవారు కనీసం ఇద్దరు మరణించినవారిలో ఉన్నట్లు వివిధ పత్రికలు తెలిపాయి.
నిర్దిష్ట హెచ్చరిక పంపాము
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అధికారులు, హైదరాబాద్ లో పేలుడు జరగవచ్చని గురువారం ఉదయమే తాము నిర్దిష్ట సంకేతాలు పంపించామని మరోసారి చెప్పడం విశేషం. అదే నిజమైతే తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు విఫలం అయినట్లే. హెచ్చరికలు సాధారణంగా అన్నీ రాష్ట్రాలకు ఎప్పుడూ పంపేవేనని పేలుడు తర్వాత జరిపిన విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఇది నిజం కాదని కేంద్ర హోమ్ శాఖ ఆధీనంలోని భద్రతా బలగాల సమాచారం స్పష్టం చేస్తున్నది.
హైదరాబాద్, బెంగుళూరు, కోయంబత్తూరు, హుబ్లి నగరాలలో టెర్రరిస్టు దాడులు జరగవచ్చని తాము నిర్దిష్ట సమాచారం ఇచ్చామని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ సమాచారంతో పాటు అజ్మల్ కసబ్, అఫ్జల్ గురు లను ఉరి తీసినందుకు ప్రతీకారంగా పాకిస్ధాన్ ఆధారిత టెర్రరిస్టులు ప్రధాన నగరాలలో దాడులకు దిగవచ్చని ఫిబ్రవరి 19, 20 తేదీలలో రాష్ట్రాలన్నింటికీ హెచ్చరిక సందేశాలు పంపించామని వారు తెలిపారు. నిర్దిష్ట హెచ్చరికలను కూడా సాధారణ హెచ్చరికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణించినట్లు ముఖ్యమంత్రి మాటలు సూచిస్తున్నాయి. అయితే పేలుళ్లకు ఫలానా సంస్థ బాధ్యులుగా దర్యాప్తు జరపకుండా చెప్పడం భావ్యం కాదని హోమ్ మంత్రి చేసిన వ్యాఖ్యానం గమనార్హం.
హైదరాబాద్ లో జరిగిన పేలుళ్లకు బాధ్యులుగా ముస్లిం యువకులను మొదట అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టిన భద్రతా బలగాలు, ఆనక, పేలుళ్లకు అసలు కారకులు హిందు ఉగ్రవాద సంస్థలని తెలియడంతో విమర్శలకు గురయ్యాయి. స్వామి అసీమానంద, సునీల్ జోషి, స్వామిని ప్రజ్ఞ సింగ్ తదితర హిందు సంస్థల నాయకులు మాలెగావ్, మక్కా మసీదు తదితర పేలుళ్లకు పాల్పడ్డారని జాతీయ విచారణ సంస్థల పరిశోధనలో వెల్లడి కావడంతో భారత దేశంలోని ఉగ్రవాద దాడుల లోని మరో కోణం వెల్లడి అయింది. బహుశా హోమ్ మంత్రి పాటించిన జాగ్రత్తకు ఈ నేపధ్యమే పని చేసి ఉండవచ్చు. ఆర్ఎస్ఎస్, బిజెపి లు క్యాంపులు నిర్వహించి టెర్రరిస్టు శిక్షణ ఇస్తున్నాయని ఇటీవల చింతన శిబిరంలో హోమ్ మంత్రి షిండే చేసిన ప్రకటన ఎలాగూ ఉంది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా తన వ్యాఖ్యలకు షిండే ‘అపాలజీ‘ చెప్పినప్పటికి, ‘అపాలజీ‘ చెప్పినంత మాత్రాన షిండే వ్యాఖ్యలు ‘అవాస్తవాలు కాదని‘ అర్ధం చేసుకోవద్దని (It doesn’t mean that his comments are factually incorrect) కాంగ్రెస్ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కకుండా ఆగలేదు.
క్లూలు భద్రంగా ఉంచాలి
ఉగ్రవాద దాడులతో పాటు హత్యలు లాంటి తీవ్రనేరాలు జరిగినపుడు నేర స్ధలాలు అత్యంత కీలకమైన సాక్ష్యాలను నేర పరిశోధకులకు అందిస్తాయి. ప్రజలందరూ ఈ సంగతిని దృష్టిలో ఉంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కొసారి శవం పడి ఉన్న తీరు కూడా కీలక సాక్ష్యంగా ఉపయోగపడవచ్చు. హత్యా స్ధలంలో చిందరవందరగా పడి ఉండే వస్తువులు నిర్దిష్ట కోణంలో నేరం గురించిన సమాచారాన్ని ఇస్తాయి. అందుకే ఫోరెన్సిక్ నిపుణులు నేర స్ధలాలను ఫొటోలు తీసి భద్రపరుస్తారు. నిపుణులు వచ్చేలోపే శవాలను కదిలించడం గాని, అక్కడి వస్తువులను కదల్చడం గాని చేస్తే నేర పరిశోధకుల పని కష్టంగా మారుతుంది. (డెంజెల్ వాషింగ్టన్, ఏంజలీనా జోలి లు నటించిన హాలీవుడ్ సినిమా ‘బోన్ కలెక్టర్’ ఈ అంశాలను అద్భుతంగా వివరిస్తుంది.) కనుక నేర స్ధలాలను ఎంత భద్రంగా ఉంచితే నేరస్ధులను పట్టుకోవడం అంత సులువు. వి.వి.ఐ.పిలు కూడా ఈ సంగతిని దృష్టిలో ఉంచుకోవాలని వేరే చెప్పనవసరం లేదు.


ఈ విషాద సంఘటన బాధితులకు నా ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నాను.
నిన్న జరిగిన సంఘటన లో నాయకులు సంఘటనా స్థలం సందర్శిండం కంటే, ఆసుపత్రులలో గాయపడిన వారిని పరామర్శించడం , మృతుల కుటుంబాలను కలిసి వారి బాధ, పంచుకొని ధైర్యం చెప్పడం చేసి ఉంటె బాధితులకు కొంత అయినా ఉరట కలిగేది. నాయకులు ప్రమాద సంఘటన సందర్శన ఒక అవసరం లేని, కాని తప్పనిసరి అయిన విషయం. ఎందుకంటే, అలా వెళ్ళకపోతే ఇతర పార్టీ ల నాయకులు మీడియా వాళ్ళు అది ఒక బాధ్యతా రాహిత్యమైన ప్రవర్తన గా ప్రచారం చేస్తారు.
మీరు చెప్పినట్లు సాక్ష్యాల సేకరణ, నేరం గురించి అర్థం చేసుకోవడానికే కాకుడా, దీనికి బాద్యులైన వారిని చట్టం ముందు దోషులు గా నిలబెట్టడానికి కుడా చాల అవసరం. కాకపోతే గత అనుభవాల దృష్ట్యా అసలు దోషులు దొరుకుతారా, విచారణ జరుగుతుందా అనే తీవ్రమైన నిరాశ కుడా కలుగుతోంది. విచారణ ఉసే లేనప్పుడు ఇంకా సాక్ష్యాల తో పనేముంది.
వరుసగా జరుగుతున్నా ఇలాంటి సంఘటనల గురించి ఆలోచిస్తుంటే, ఎప్పటికైనా బాంబులు పేల్చే వాళ్ళకే విసుగు వచ్చి మానెయ్యాలి గాని మనం వీటిని అరికట్టలేమా అనే తీవ్రమైనా నిరాశ , నిసృహాలు కలుగుతున్నాయి.
Reblogged this on Raja's Realms.