హైదరాబాద్ బాంబు పేలుళ్లు, ముందే సమాచారం?!


ఉస్మానియా ఆసుపత్రిలో -ది హిందూ

ఉస్మానియా ఆసుపత్రిలో -ది హిందూ

హైదరాబాద్ మళ్ళీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. అత్యంత రద్దీగా ఉండే దిల్ షుక్ నగర్ బస్ స్టాండ్ ప్రాంతంలో రెండు చోట్ల అమర్చిన సైకిల్ బాంబులు పేలడంతో అనేకమంది మరణించగా మరెంతోమంది గాయపడ్డారు. 11 మంది చనిపోయారని, మరో 80 మంది గాయపడ్డారని, గాయపడినవారిలో ఐదు లేక ఆరుగురు తీవ్రంగా గాయపడినందున వారి పరిస్ధితి ప్రమాదకరంగా మారిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పత్రికలు, ఛానళ్లతో క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ చెప్పాడు.

ముఖ్యమంత్రి పత్రికలతో మాట్లాడడం ముగిసిన వెంటనే మరొకరు మరణించారని మృతుల సంఖ్య 12కి చేరిందని ఈ టి.వి 2 తెలిపింది. కాగా జెమిని న్యూస్, టి.వి 9 అంతకు ముందు మరణించిన వారి సంఖ్య 16 గా చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడిన తరువాత మళ్ళీ 11కి తగ్గించుకున్నాయి. ఒక ఛానల్ అయితే ఏకంగా 26 మంది మరణించారని ప్రకటించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రితో పాటు కేంద్ర హోమ్ మంత్రి కూడా ప్రకటించడంతో ఏ సంఖ్య నిజమో రేపటికి గానీ తెలిసేట్లు లేదు.

వనస్ధలిపురం వద్ద ఒక పేలని బాంబును పోలీసులు నిర్వీర్యం చేసినట్లు ఛానళ్ళు చెబుతున్నాయి. మరేదో ధియేటర్ వద్ద మరొక పేలని బాంబు నిర్వీర్యం చేసినట్లు కూడా చెబుతున్నారు. ఈ రెండూ ఒకటో కాదో తెలియడం లేదు. ఒక్కో చానల్ ఒక్కో మాట చెబుతుండడంతో అయోమయ పరిస్ధితి నెలకొంది. ‘ఎక్స్ క్లూజివ్’ రంధిలో పడి వార్తలను నిర్ధారించుకోకుండా ఛానళ్లు ప్రసారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దాదాపు ఛానళ్ళు అన్నీ అవే దృశ్యాలు ప్రసారం చేస్తున్నా దేనికదే ‘ఎక్స్ క్లూజివ్’ అని చెప్పుకోవడం అర్ధం కాని విషయం. మొదటి పేలుడు సాయంత్రం 7:01 గం. కీ రెండవ పేలుడు 7:05 కి జరిగిందని పత్రికల సమాచారం.

దాడి టెర్రరిస్టులు చేసిందిగా కనిపిస్తోందని రాష్ట్ర డిజిపి దినేష్ రెడ్డి చెప్పాడని ది హిందూ తెలిపింది. “సంఘటన గురించి పూర్తి సమాచారం లేనప్పటికీ ఇది టెర్రరిస్టు దాడిలా కనిపిస్తోంది. కనీసం 10 మంది చనిపోయారు” అని ఆయన తెలిపాడు. ముఖ్యమంత్రి సమాచారం ఆ తర్వాతది కనుక 11 మంది మరణం నిర్ధారణగా చెప్పుకోవచ్చు. దినేష్ రెడ్డి ఢిల్లీలో అంతర్గత భద్రత పైన సమావేశంలో పాల్గొని విమానాశ్రయంలో దిగగానే పేలుళ్ల కబురు అందుకుని నేరుగా పేలుళ్లు జరిగిన చోటికి వచ్చినట్లు తెలుస్తోంది. “ఒక పేలుడు హైదరాబాద్ కమిషనరేట్ ఏరియాలో జరగగా మరొకటి సైబరాబాద్ కమిషనరేట్ ఏరియాలో జరిగింది” అని దినేష్ రెడ్డి తమ జ్యూరిష్ డిక్షన్ భాషలో పేలుడు జరిగిన ప్రాంతాలేమిటో చెప్పారు. పేలుళ్లు జరిగిన రెండు ప్రాంతాల మధ్య దూరం 150 గజాలేనని ముఖ్యమంత్రి చెప్పిన విషయం గమనిస్తే ఈ జ్యూరిష్ డిక్షన్ భాష అయోమయం కలిగించడం ఖాయం. దిల్ షుక్ నగర్ ఏరియా ఈ రెండు కమిషనరేట్ ఏరియాల సరిహద్దులో ఉండడం గమనార్హం.

కేంద్ర హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఢిల్లీలో చెప్పినదాని ప్రకారం మొదటి పేలుడులో 8 మంది రెండో పేలుడులో ముగ్గురు చనిపోయారు. కానీ ఛానళ్లలో మాట్లాడుతున్న ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మొదటి పేలుడు చిన్నది కాగా రెండో పేలుడు భారీ స్ధాయిలో జరిగింది. మరింత సమయం గడిచి ప్రభుత్వ విభాగాలన్నీ సమాచారం పరస్పరం ఇచ్చి పుచ్చుకుని స్థిరమైన సమాచారం పైన వారొక నిర్ణయానికి వచ్చేవరకూ ఈ తేడాలు తప్పవు కాబోలు. మొదటి పేలుడు ఒక పార్కు వద్ద, రెండవది తినుబండారాల జాయింటు వద్ద జరిగాయని ది హిందు తెలిపింది. కాగా పేలుడు జరిగిన చోట రెండు పెద్ద పండ్ల మార్కెట్లు ఉన్నాయని ఛానళ్లు చెప్పాయి. డెయిలీ భాస్కర్ వెబ్ సైట్ మూడు పేలుళ్లు జరిగాయని రాసింది.

బాంబులు సైకిళ్ళకు తగిలించి పేల్చి ఉండవచ్చని పోలీసులు చెబుతుండగా, కేంద్ర హోమ్ మంత్రి పేలింది సైకిల్ బాంబులే అని చెప్పాడు. కేంద్ర హోమ్ కార్యదర్శి ఆర్.కె.సింగ్ ప్రకారం ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ’ బృందం బిఎస్ఎఫ్ విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. నేషనల్ సెక్యూరిటీ గార్డు బృందం కూడా ఘటన స్థలానికి బయలుదేరింది. చెన్నై నుండి బ్లాక్ క్యాట్ కమేండోల బృందం హైదరాబాద్ బయలుదేరింది. పేలుడు అనంతర విశ్లేషణలో వీరు నిపుణులని తెలుస్తోంది. దుర్ఘటన తర్వాత ప్రజలను అక్కడి నుండి వెళ్లగొట్టడం పోలీసులకు తలకు మించిన పనైంది. తమ వారి కోసం జనం చేస్తున్న హాహాకారాలతో దిల్ షుక్ నగర్ ప్రాంతం నిండిపోయింది.

కేంద్ర హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రకటన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇబ్బందిగా మారింది. టెర్రరిస్టు చర్యలు జరగవచ్చని తమకు రెండు రోజులకు ముందే సమాచారం వచ్చిందని, ఆ సమాచారాన్ని అన్నీ రాష్ట్రాలకు పంపామని ఆయన ఢిల్లీలో అట్టహాసంగా ప్రకటించాడు. దానితో తెలుగు ఛానళ్ళు ‘ముందే చెప్పినా అంత నిర్లక్ష్యమా?’ లాంటి ప్రశ్నలతో స్క్రోలింగ్ లు నడిపాయి. ముఖ్యమంత్రి సమావేశంలో ఈ అంశాన్ని ఎవరో లేవనెత్తగా ఆయన కొంత తడబాటుకి లోనైనట్లు కనిపించింది. “మన రాష్ట్రానికే కాదు, అన్నీ రాష్ట్రాలకు ఆ హెచ్చరికలు వెళ్ళాయి. కొన్ని రైల్వే విభాగాలకు కూడా హెచ్చరికలు వెళ్ళాయి. సాధారణ హెచ్చరికలో భాగమే అవి” అని ఆయన సమాధానం ఇచ్చాడు. ‘పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం’ అంటే ఇదేనా? ముందే చెప్పామని చెబితే అది కేంద్రానికి క్రెడిట్. కానీ రాష్ట్రానికి అది చిక్కులు తెస్తుంది. ముందే చెప్పినా అది రొటీనే అని రాష్ట్రం చెబితే కేంద్రానికి చురక. కానీ రాష్ట్రానికి బాధ్యత తప్పుతుంది. మధ్యలో ప్రజలకు అయోమయం.

అజ్మల్ కసబ్ ఉరి తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని టెర్రరిస్టులు ప్రకటించారని కానీ కేంద్రం పట్టించుకోలేదని మొదట ప్రకటించిన బిజెపి నాయకుడు వెంకయ్య నాయుడు తర్వాత ప్రజలు సంయమనం పాటించి ప్రభుత్వాలకు, పోలీసులకు సహకరించాలని కోరాడు. పేలుళ్లకు ఎవరూ బాధ్యత ప్రకటించకపోవడంతో ఊహాగానాలు కూడా పెద్దగా సాగడం లేదు. ఆ మేరకు నయం. పేలుళ్ల తర్వాత దిల్ షుక్ నగర్ లో సెల్ ఫోన్లు పని చేయలేదని తెలుస్తోంది. పుకార్లు వ్యాపించకుండా ఉండడానికి పోలీసులే ఈ పని చేశారని తెలుస్తోంది.

బాంబుల్లో ఏ పదార్ధం ఉపయోగించిందీ తెలియడానికి మరి కొన్ని గంటలు ఆగాలి. పేలుడు పదార్ధాన్ని బట్టి బాధ్యులను పసిగట్టే సమాచారం భద్రతా సంస్థల వద్ద ఉన్నది కనుక అప్పటికైనా కారకులెవరో చూచాయగా తెలియవచ్చు.

3 thoughts on “హైదరాబాద్ బాంబు పేలుళ్లు, ముందే సమాచారం?!

వ్యాఖ్యానించండి