అమెరికాకి చెందిన కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ ఒకటి మంగళవారం ఓ జోకు పేల్చింది. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడానికి తంటాలు పడింది. ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న సైబర్ దాడుల వెనుక చైనా ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ హస్తం ఉందని కనిపెట్టినట్లు వర్జీనియా నుండి పని చేసే ‘మాండియంట్’ కంపెనీ ప్రకటించింది. షాంఘై నగరంలో ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలియని ఒక భవంతి నుండి ‘Advanced Persistent Threat’ (ఎపిటి) వస్తున్నట్లు కనుగొన్నామని తెలిపింది. సైబర్ దాడుల గురించి వ్యక్తుల ఈ మెయిల్లను దొంగిలించడం గురించి, అమెరికన్ కార్పొరేట్ కంపెనీల సమాచారం దొంగిలించడం గురించి అమెరికా అధ్యక్షుడు హెచ్చరిక లాంటిది జారీ చేసిన వారం రోజులకే మాండియంట్ నివేదిక వెలువడటం విశేషం. కాగా తామే ‘సైబర్ దాడులకు బాధితులం’ అని చైనా ప్రకటిస్తూ మాండియంట్ ప్రకటనను కొట్టిపారేసింది.
రెండవ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పి.ఎల్.ఎ) బ్యూరోకి చెందిన జనరల్ స్టాఫ్ డిపార్టుమెంట్ (జి.ఎస్.డి) మూడో విభాగం సైబర్ దాడులకు కేంద్రంగా భావిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. పి.ఎల్.ఎ కి చెందిన మిలట్రీ యూనిట్ కవర్ డిసిగ్నేటర్, దానిని ‘యూనిట్ 61398′ గా పేర్కొంటుందని కంపెనీ నివేదిక తెలిపింది. ఈ భవంతి కార్యకలాపాలను స్టేట్ సీక్రెట్’ గా చైనా ప్రభుత్వం చెబుతుందని, ఇక్కడి నుండే ప్రమాదకరమైన నెట్ వర్క్ ఆపరేషన్లు జరుగుతున్నాయని నివేదిక తెలిపింది. కనీసం 141 సంస్ధలకు చెందిన వందల టెరాబైట్ల డేటాను ఎ.టి.పి1 గా కంపెనీ పేర్కొన్న ‘యూనిట్ 61398’ దొంగిలించిందని తెలిపింది. డజన్ల కొద్దీ సంస్థల నుండి ఏక కాలంలో డేటా దొంగిలించగల సామర్ధ్యాన్ని, ఉద్దేశాన్ని ఇది ప్రదర్శించిందని తెలిపింది.
చైనా ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. అమెరికా కంపెనీ చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని ప్రకటించింది. విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హాంగ్ లీ, మాండియంట్ కంపెనీ కనుగొన్నదని చెబుతున్న అంశాల సాధికారతను ప్రశ్నించాడు. “అలాంటి సాక్ష్యాలను అసలు ఎలా కనుగొనగలరు? సైబర్ దాడులు తరచుగా అంతర్జాతీయ స్ధాయిలో జరుగుతాయి. అజ్ఞాతంగా జరగడం ఆ దాడుల స్వాభావిక లక్షణం” అని హంగ్ లీ ప్రశ్నించాడు. అలాంటి దాడులకు ఆధారాలు (source) కనుగొన్నామని చెప్పడమే అనుమానాస్పదం అని హాంగ్ లీ సూచించాడు.
“సైబర్ దాడులకు చైనా దేశమే ప్రధాన బాధితురాలు. అలాంటి కార్యకలాపాలకు చైనా వ్యతిరేకం. ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యం మరియు అన్ ప్రొఫెషనల్. అది సమస్యను పరిష్కరించడానికి ఏ మాత్రం దోహదపడదు” అని హాంగ్ లీ వ్యాఖ్యానించాడు. తమ దేశ కంప్యూటర్ నెట్ వర్క్ ఎమర్జన్సీ రెస్పాన్స్ బృందం తయారు చేసిన నివేదిక ప్రకారం చైనాలోని 14 మిలియన్ కంప్యూటర్ల పై జరిగిన దాడులకు విదేశాల్లోని 73,000 ఐ.పి నెంబర్లతో సంబంధం ఉన్నది. వాటిలో అమెరికా నుండి వచ్చే దాడులదే అగ్రస్థానం” అని హాంగ్ లీ తెలిపాడు.
ఇరాన్ లోని యురేనియం శుద్ధి కర్మాగారాలలోని కంప్యూటర్లపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా తయారు చేసిన స్టక్స్ నెట్, ఫ్లేమ్ అనే అత్యాధునిక వైరస్ లు దాడి చేసి ఇరాన్ అణు విద్యుత్ కార్యక్రమాన్ని విధ్వంసానికి గురి చేసిన చరిత్ర నిన్న మొన్నటిదే. తమ వైరస్ లు ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బ తీసాయని అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు సంతోషం ప్రకటించిన వార్తలను పశ్చిమ దేశాల పత్రికలు ప్రచురించాయి కూడా. అందులో బి.బి.సి కూడా ఒకటి. అలాంటి చరిత్ర ఉన్న అమెరికా గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడమే ఈ కధనంలోని వింత.
సైబర్ దాడులు, గూఢచర్యం చేయని దేశం అరుదుగా మాత్రమే ఉంటుంది. పైగా చైనా ఆర్ధికంగా పోటీగా ఎదుగుతున్న నేపధ్యంలో ఆ దేశాన్ని సైనికంగా చుట్టుముట్టింది అమెరికా. ‘ఆసియా పైవోట్’ వ్యూహాన్ని అమలు చేస్తున్నానని ఒబామా అధ్యక్షుడు అయిన ప్రారంభ రోజుల్లోనే ప్రకటించాడు. ఆ మేరకు రాజకీయ, ఆర్ధిక, సైనిక వ్యూహాల్ని దూకుడుగా అమలు చేస్తున్నాడు కూడా. ఆఫ్రికాలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించడానికి మాలి, అల్జీరియా దేశాల్లో తిరుగుబాట్లు, కిడ్నాప్ లు రెచ్చగొట్టడం, మళ్లీ ఆ తిరుగుబాట్లను అణచివేసే పేరుతో అమెరికా పూర్తి మద్దతుతో ఫ్రాన్సు సైన్యాలు దిగడం వెనుక చైనా ప్రాబల్యాన్ని నిలువరించే వ్యూహం ఉన్నది. వీటితో పాటు సైబర్ దాడులు అమెరికా, యూరప్ లకు స్వాభావిక లక్షణం. ఆ దేశాల సామ్రాజ్యవాద ప్రయోజనాలు అందుకు పురిగొల్పుతాయి. అలాంటిది సైబర్ దాడుల పేరుతో చైనాను నిందించడం అంటే ఆ దేశాన్ని ఒంటరిని చేయడానికి మరో ఫ్రంట్ ని తెరవడం తప్ప అందులో నిజాయితీ మాత్రం లేదు.
