లైంగిక అత్యాచారాలు గొప్పోళ్ల ఇళ్లకు దూరమా? అంగుళం, అంగుళమూ సంపదలు ఉట్టిపడే పాల రాతి చలువ గోడల మధ్యకు ఆకలి చూపులు చొరబడవా? ఊలు దారాలకు డబ్బు కట్టలు దట్టించి నేసిన మడత నలగని సూటు వెనుక చీకటి అంతరంగాలకు తావు లేదా? వజ్రపుటుంగరాలు, గోల్డెన్ రిస్టు వాచీలు ధరించే చేతులు అసభ్య చేష్టలు ఎరుగవా? ప్రపంచ ప్రఖ్యాత సితార్ మేస్ట్రో కూతురుగా పుట్టి తండ్రి సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అనౌష్క శంకర్ చెప్పిన చేదు నిజాలు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాయి.
తాను చిన్న పిల్లగా ఉన్నపుడు, ఎదుగుతున్నపుడు కూడా తెలిసిన వారి చేతులలోనే అసభ్య లైంగిక చేష్టలు ఎదుర్కున్నానని అనౌష్క శంకర్ తెలియజేసింది. తన తల్లిదండ్రులు అత్యంత నమ్మకస్తుడుగా భావించిన వ్యక్తి చేతుల్లో తాను అనేక సంవత్సరాల పాటు “లైంగికంగానే కాక, భావోద్వేగ పరంగా కూడా వేధింపులు” ఎదుర్కున్నానని అనౌష్క తెలిపింది. ఇప్పటికీ కూడా భయోత్పాతంతో వణికిపోయిన ఆ రోజుల నాటి జ్ఞాపకాలు నీడలా వెన్నాడుతుంటాయని, ఫలితంగా ఒక స్త్రీగా తరచుగా భయంతో గడుపుతున్నానని వెల్లడించింది. లండన్ లో జరిగిన ‘ఒన్ బిలియన్ రైజింగ్’ కార్యక్రమానికి పంపిన వీడియోలో మాట్లాడుతూ ఆమె ఈ సంగతి చెప్పింది.
“ఒక స్త్రీగా నేను చాలా తరచుగా భయంలో బతుకుతున్నానని నాకు తెలుసు. రాత్రిళ్లు ఒంటరిగా నడవాలంటే భయం, సమయం ఎంత అని అడిగే పురుషుడి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలన్నా భయమే…” అని అనౌష్క తెలిపింది. “నేను ఎదుగుతుండగా, నాకు తెలిసిన అనేకమంది మహిళలకు మల్లే నేను అనేక విధాలుగా వేధింపులు ఎదుర్కొన్నాను. శరీరాన్ని వెతుకుతూ, తాకుతూ పాకే చేతుల్ని, పరుషంగా అసభ్యంగా తిట్టే నోళ్లనీ… ఇంకా ఎలా ఎదుర్కోవాలో తెలియని అలాంటి అనేక చర్యలను ఎదుర్కొన్నాను. వారి విషయంలో ఎలా మారాలో నాకు తెలియలేదు” అని 31 సంవత్సరాల సితార్ విద్వాంసురాలు వెల్లడించింది.
అమెరికా నాటక రచయిత, ఫెమినిస్టు అయిన ఈవ్ ఎన్స్లర్ ప్రారంభించిన ‘One Billion Rising’ ఉద్యమం మహిళలపై జరుగుతున్న హింసలకు వ్యతిరేకంగా ఉద్దేశించినది. మానవ వికాస చరిత్రలో అతి పెద్ద ప్రపంచ స్థాయి ఉద్యమంగా నిర్వాహకులు తమ ఉద్యమాన్ని పేర్కొంటున్నారని ‘ది హిందూ’ తెలిపింది. లండన్ లోని తన ఇంటిలో రికార్డు చేసిన వీడియోను అనౌష్క నిర్వాహకులకు అందజేసింది. ఢిల్లీలో 23 సంవత్సరాల విద్యార్ధిని పైన అత్యంత క్రూరంగా జరిగిన లైంగిక అత్యాచారం నేపధ్యంలో “ఇక జరిగింది చాలు” అని ఎలుగెత్తి చాటవలసిన సమయం వచ్చిందని అనౌష్క పిలుపు ఇచ్చింది.
“ఆమె (ఢిల్లీ అత్యాచారం బాధితురాలు) కోసం, ఆమె లాంటి మహిళల కోసం నేను ఉద్యమిస్తున్నాను. నా దేశపు అద్భుతమైన మహిళలతో కలిసి నేను తిరగబడుతున్నాను. నాలో ఉన్న పసి పిల్ల కోసం, తనకు జరిగిన దానిని ఎప్పటికీ క్షమించలేని, తనకు జరిగినదాని నుండి ఎప్పటికీ కోలుకోలేని ఆ పసి పిల్ల కోసం నేను తిరగబడుతున్నాను” అని అనౌష్క ఉద్వేగభరితంగా పలికింది.
అత్యాచారం జరిపే వ్యక్తి కుటుంబ సభ్యుడు గానీ, దగ్గరి కుటుంబ స్నేహితుడు గానీ అయితే ఆడ పిల్లలు ఎంత మౌనంగా బాధ, వేదనలను అణిచిపెట్టుకుంటారో, ఎంత అబధ్రతగా పెరిగి పెద్దవుతారో అనౌష్క బాల్యం, ఎదుగుదల స్పష్టం చేస్తున్నాయి.