ఆ కుటుంబానికి ఇక వినోదం(దిని) దూరం


రోదిస్తున్న వినోదిని తల్లి

Photo: Deccan Chronicle

ఒక అమ్మాయి జీవితంలో సంతోషం నింప వలసిన ప్రేమ, కాలకూట విషాన్ని విరజిమ్మి చివరికి ఆ జీవితాన్నే బలిగొన్న విషాదాంతం ఇది. ‘ప్రేమ’ రూపంలో వ్యక్తమయిన ‘పురుష దురహంకారం’, వినోదిని తిరస్కారంతో అసలు రంగు వెల్లడించుకుని జడలు విప్పిన ఉన్మత్తంతో ‘యాసిడ్ దాడి’గా ప్రతీకారం తీర్చుకుంది. ఫలితంగా మూడు నెలల పాటు తీవ్ర శారీరక, మానసిక వేదన అనుభవించిన వినోదిని మంగళవారం శాశ్వతంగా కన్నుమూసింది. మెడ, కళ్ళు, చెవులు భాగాలను తీవ్రంగా కాల్చుకుతిన్న యాసిడ్ తన ప్రభావాన్ని చివరి వరకు కొనసాగించడంతో ఆమె శరీరంలోని ప్రోటీన్లు బాగా పడిపోయి మరణానికి దారి తీసిందని చెన్నైలోని అత్యున్నత స్థాయి బర్న్స్ ఆసుపత్రి కలిగి ఉన్న కిల్పౌక్ మెడికల్ కాలేజీ నిపుణులు తెలిపారు.

పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోని కరైకల్ నివాసి అయిన 23 సంవత్సరాల వినోదిని నవంబరు 14 తేదీన యాసిడ్ దాడికి గురయింది. బి.టెక్ గ్రాడ్యుయేట్ అయిన వినోదిని చెన్నై నగరంలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సైదాపేట లోని వర్కింగ్ వుమెన్స్ హాస్టల్ లో ఆమె నివాసం. ఆమె తండ్రి జయపాల్ కరైకల్ లోని ఒక ప్రైవేటు పాఠశాల వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. సురేష్ అలియాస్ అప్పు అని యువకుడు వినోదిని తండ్రికి పరిచయస్ధుడు. నిర్మాణ కూలిగా పని చేసే సురేశ్ జయపాల్ తో స్నేహం పెంచుకుని ఆయనకి కొంత డబ్బు అప్పుగా కూడా ఇచ్చాడు. ఆ పరిచయంతో వినోదినిని పెళ్లి చేసుకుంటానని సురేష్ చేసిన ప్రతిపాదనను వినోదిని కుటుంబం తిరస్కరించింది.

దీనితో పగ పెంచుకున్న సురేష్ అవకాశం కోసం ఎదురు చూశాడు. దీపావళికి తల్లిదండ్రులు, బంధువులను చూడడానికి వినోదిని కరైకల్ వచ్చింది. నవంబరు 14 తేదీన తిరిగి చెన్నై బయలుదేరి తండ్రితో కలిసి కరైకల్ లో బస్టాండుకు నడిచి వెళ్తోంది. చెన్నైకి వెళ్ళే బస్సు ఎక్కుతున్న సమయంలో సురేష్ దాడి చేసి నత్రజని ఆమ్లాన్ని వినోదిని ముఖం పైకి వెదజల్లాడు. ఆమె తండ్రి కొద్దిపాటి గాయాలతో తప్పించుకోగా వినోదిని తీవ్రంగా గాయపడింది. ముక్కు, చెవులు, కళ్ళు, గొంతు, చేతులపైన పడిన యాసిడ్ ఆమె చూపును, ఊపిరి మార్గాన్ని దెబ్బతీసింది.

vinodhini“వినోదిని తండ్రి అతని డబ్బుని పూర్తిగా తిరిగి చెల్లించినా సురేశ్ వెంటపడడం మానలేదు. ఒకసారి పోలీసులకి ఫిర్యాదు కూడా చేశాము. పోలీసులు అతన్ని హెచ్చరించినా అవకాశం వచ్చినప్పుడల్లా ఆమె తండ్రిపై ఒత్తిడి తేవడం కొనసాగించాడు. కానీ వినోదిని పైన దాడి చేస్తాడని మేము ఎప్పుడూ అనుకోలేదు. పెళ్లి చేసుకుంటానని చెప్పినపుడు ఆమె ఉన్నత చదువుని గుర్తు చేసి అది సాధ్యం కాదని గట్టిగా చెప్పాము. అతని ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పాము” అని వినోదిని బాబాయి రమేష్ చెప్పాడు.

దాడి తర్వాత కరైకల్ లోనే ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేశాక పుదుచ్చేరి లోని ‘జిప్ మర్’ తీసుకెళ్లాలని వారు సూచించారు. నవంబర్ 15 తేదీన చెన్నైలోని ప్రభుత్వ కిల్పౌక్ ఆసుపత్రికి తరలించారు. కిల్పౌక్ ఆసుపత్రి కాలిన గాయాలను నయం చేయడంలో ప్రసిద్ధి చెందిన ఆసుపత్రి. యాసిడ్ దాడి బాధితులకు చికిత్స చేయడంలో ప్రత్యేకత పొందింది. కానీ యాసిడ్, వినోదిని శరీరం లోపలి భాగాలకు విస్తరించి లోతుగా తినేయడంతో ఆమె క్రమంగా అతి ముఖ్యమైన ప్రోటీన్ లను కోల్పోతూ వచ్చింది. ముక్కు, కళ్ళు, చెవులకు తిరిగి పూడ్చలేని విధంగా నష్టం జరిగింది. ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్ జయరామన్ రిటైర్ కావడంతో ఆయన వద్దనే చికిత్స తీసుకుంటానని పట్టుబట్టిన వినోదిని కోరిక మేరకు ఆయన పని చేసే ప్రైవేటు ఆసుపత్రికి ఆమెను తరలించారు. వినోదిని గాయాలు మానడానికే డాక్టర్లు అనేక వారాల పాటు ఎదురు చూశారు. గాయాలకు డ్రస్సింగ్ చేస్తూ, గాయాలు మానితే జరిగిన నష్టం ఏపాటిదో అంచనా వేయడానికి ఎదురు చూశారు. కానీ వారం లోపే ఆమె రెండు కళ్లకూ చూపు తిరిగి రాదని డాక్టర్లకు అర్ధం అయింది.

ది హిందూ ప్రకారం వినోదినిని పదే పదే ఆసుపత్రులు మార్చారు. ఆమె తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్ధితి దీనికి కారణం అని తెలుస్తోంది. ప్రారంభంలో చికిత్స ఆలస్యం కావడం వలన యాసిడ్ గాయాలు తీవ్ర స్థాయికి చేరాయని కూడా తెలుస్తోంది. వినోదినికి చికిత్స చేస్తున్న ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జయరామన్ ప్రకారం కాలిన గాయాలు వాటికి గల కారణాలను బట్టి ప్రధానంగా మూడు రకాలు. మంటలు, విద్యుత్ వల్ల గాయాలయితే వెనువెంటనే ప్రభావం కలుగుతుంది. కానీ యాసిడ్ లాంటి రసాయన పదార్ధాల వలన కాలితే అవి క్రమ క్రమంగా ప్రభావం చూపుతాయి. యాసిడ్ సాంద్రతను బట్టి మొదట చర్మం తర్వాత క్రమంగా కండ, కొవ్వు కూడా తినేస్తుంది.

రోదిస్తున్న తండ్రి జయపాల్ -ది హిందూ

రోదిస్తున్న తండ్రి జయపాల్ -ది హిందూ

కాలిన గాయాలు 40 శాతం దాటితే తీవ్రంగా గాయపడినట్లు లెక్క. గాయాలు లోతైనవి అయితే 30 శాతం కాలినా మరణం సంభవించవచ్చు. లోతు గాయాలకు తొడ భాగం నుండి మాంసం, చర్మం సేకరించి కాలిన భాగాలను పునర్నిర్మించే సర్జరీ తప్ప మరో మార్గం లేదు. వినోదినికి ఈ రకం గాయాలు కావడంతో ఆమె పరిస్ధితిని సరిగా అంచనా వేయడం డాక్టర్లకు సాధ్యం కాలేదు. కోలుకున్నట్లే కనిపించిన వినోదిని లోతు గాయాలు ప్రోటీన్లు బాగా కోల్పోయేందుకు దారి తీసి గుండెపోటు సంభవించింది. “ఆమె గుండెను పునరుద్ధరించడానికి మేము రెండుసార్లు ప్రయత్నించాము. రక్తం కూడా ఎక్కించాం. కానీ ఆమె శరీరానికి సరైన పోషక పదార్ధాలు అందకపోవడంతో ప్రోటీన్ల స్థాయి బాగా పడిపోయింది” అని డాక్టర్ జయరామన్ తెలిపాడు.

వినోదిని మరణం ఆమె కుటుంబ సభ్యులకు తీవ్రమైన విషాదాన్ని మిగుల్చింది. తనను కూడా చంపెయ్యమని ఆమె తల్లి డాక్టర్లను బతిమాలుతున్న దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. ఆమెపై దాడి చేసి పొట్టనబెట్టుకున్న సురేష్ ని ఉరి తీస్తే సరిపోదని, తన కూతురు లాగా అతను కూడా తీసుకుని తీసుకుని చనిపోయేలా చేయాలని వినోదిని తండ్రి నేలకు కూలబడి రోదించిన దృశ్యం అందరినీ కలచివేసింది. “ఆమెకు పోస్ట్ మార్టం చేయొద్దు. వాడు ఆమెని ఇప్పటికే తీవ్రంగా నాశనం చేశాడు. ఇంకా నాశనం చెయ్యడం మాకు ఇష్టం లేదు. డాక్టర్లు ఆమెను బతికించలేక పోయారు. ఇక పోస్ట్ మార్టం చేసి ఏమి లాభం?” అని ప్రశ్నిస్తూ వినోదిని బాబాయి రమేష్ రోదిస్తూ పోస్ట్ మార్టం కు అడ్డుపడ్డాడు. డాక్టర్లు, బంధువులు ఎంతో నచ్చజెప్పిన మీదట ఆయన చివరికి అంగీకరించాడు. నగరంలోని వివిధ కాలేజీల నుండి విద్యార్ధినీ, విద్యార్ధులు వినోదిని ఇంటికి వచ్చి సంతాపం తెలిపారు. ఆమెతో పని చేసే ఉద్యోగులు కూడా అక్కడికి వచ్చి విషాద పర్యంతం అయ్యారు.

సురేష్ పైన నమోదు చేసిన కేసును హత్య కేసుగా మార్చుతున్నట్లు పోలీసులు తెలిపారు. కానీ ఆడపిల్లలకు ప్రేమోన్మాదుల నుండి రక్షణ కల్పించే సామాజిక వాతావరణం ఏర్పడనంత వరకు యాసిడ్ దాడులకు, ఇతర లైంగిక అత్యాచారాలకు ఇప్పట్లో ముగింపు రావడం అసాధ్యం. యువతీ, యువకుల్లో ప్రేమ భావనల పట్లా, సహజసిద్ధ ఆకర్షణ పట్లా ఆరోగ్యకరమైన అవగాహన కలుగజేసే వాతావరణం సమాజంలో లేదు. “నాకు దక్కనిది, ఇంకెవ్వరికీ దక్కడానికి వీలు లేదు” అంటూ ఆడ పిల్లలను ప్రాణం, మనసు, హృదయం, మెదడు ఉన్న వ్యక్తిగా గుర్తించని దురహంకార స్వభావాలను పెంచి పోషించే సంస్కృతి మన పిల్లల చుట్టూ వ్యాపించి ఉంది. సినిమాలు, పాటలు తదితర కళారూపాల్లో కూడా మహిళా వ్యతిరేక భావజాలానికి ఆజ్యం పోసే భావనలు చొప్పించబడుతున్నాయి. ఈ నేపధ్యంలో చూసినపుడు మరణ శిక్షలు ప్రాణాలు తీస్తాయే తప్ప భావజాలాన్ని మార్చలేవు కనక కఠిన శిక్షలు పరిష్కారంలో కేవలం ఒకానొక భాగం అని మాత్రమే అర్ధం అవుతుంది. మరింత మంది కరైకల్ సురేశ్ లు, గుంటూరు మనోహర్ లు తయారు కానీ సమాజమే ఆడపిల్లలపై అఘాయిత్యాలకు శాశ్వత పరిష్కారం కాగలదు.

3 thoughts on “ఆ కుటుంబానికి ఇక వినోదం(దిని) దూరం

  1. హత్య ఏ కారణంతో చేసినా అది హత్యే. కానీ ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. విదేశాలలో ఎక్కడా ప్రేమ పేరుతో హత్యలూ లేదా యాసిడ్ దాడులు జరగడం లేదు. ఆడవాళ్ళకి డాక్టర్, టీచర్ లాంటి ఉద్యోగాలు తప్ప వేరే ఉద్యోగాలు చేసే అవకాశం లేని అరబ్ దేశాలలోకూడా అటువంటి దాడులు జరగడం లేదు. కానీ ఇండియాలో మాత్రమే అటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి? “తమ కూతురిని గవర్నమెంట్ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చేస్తాం” అనో లేదా “తమ కంటే డబ్బున్న కుటుంబానికి చెందినవానికి ఇచ్చి పెళ్ళి చేస్తాం” అనో పట్టుబట్టేవాళ్ళు ఇండియాలో మాత్రమే ఉన్నారు. ఇలాంటివాళ్ళు ఉన్న దేశంలో చిన్నచిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళకి తమకి పెళ్ళి సంబంధం దొరకదనే భయం కలగడం సహజం. పలాసలో విద్యార్థినిపై యాసిడ్ దాడి చేసిన దామోదర్ కూడా తాను ప్రైవేట్ ఉద్యోగి కావడం వల్లే తనకి పెళ్ళి సంబంధం దొరకదనుకుని విరక్తికి లోనయ్యాడనే విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి. ప్రేయసులని హత్యలు చెయ్యడం వల్ల సమాజం ఏమీ మారదు. ఆడది తన కంటే డబ్బున్నవాణ్ణే పెళ్ళి చేసుకోవాలి అనే పురుషాధిక్యవాద భావనని పెంచి పోషించేది పురుషాధిక్య సమాజమే అయినప్పుడు స్త్రీలని చంపితే ఏమి లాభం వస్తుంది? హత్యలు చెయ్యడమే ఈ సమస్యకి పరిష్కారం అని అనుకుంటే నూటికి తొంబై మంది మగవాళ్ళు ఈ భూమి మీద మిగలరు.

  2. ఇంగ్లండు లో పారాసేటమాల్ అనే టాబ్లెట్ లు షాపులో కొనుక్కొని ఎక్కువ గా అవి తీసుకుని , ఆత్మ హత్యా ప్రయత్నాలు చాస్తారు చాలా మంది. ఒక్క సారిగా ఎక్కువ టాబ్లెట్లు కొనే పరిస్థితి ని నివారించడానికి ఇక్కడ టాబ్లెట్ల సంఖ్యను తక్కువ చేసిన ప్యాకెట్ లనే అమ్మాలని ఒక చట్టం తెచ్చారు. ఆ తరువాత ప్రాణాంతకం గా తయారయే ( ఎక్కువ టాబ్లెట్స్ మింగి ) ఆత్మహత్యా ప్రయత్నాలు సగం వరకూ తగ్గాయని పరిశీలనల వల్ల తెలిసింది.
    భారత దేశం లో ప్రాణాంతకమైన యాసిడ్ లు మంచి నీళ్ళ లా అమ్ముతూ ఉంటారు. ఏ విధమైన నియంత్రణా లేకుండా !
    దీని మీద దృష్టి పెట్టి, ప్రభుత్వం వారు ఒక చట్టం తీసుకు రావడం అత్యవసరం. అట్లా చస్తే , అవి అగంతకులకు అందుబాటు లో ఉండవు !
    అన్ని యాసిడ్ల కన్నా తీవ్రమైన కాల కూట విషమైన మనసు , ప్రవ్రుత్తి తో ప్రవర్తించే ఉన్మాదుల కు , ఎన్ని చట్టాలు వచ్చినా వృధా యే కదా , వారి మనసు మారనంత కాలం !

వ్యాఖ్యానించండి