2001 సంవత్సరంలో పార్లమెంటుపై దాడి జరిపిన కేసులో అరెస్టు అయి అప్పటినుండి జైలులో మగ్గుతున్న అఫ్జల్ గురుకి కోర్టు విధించిన మరణ శిక్షను శనివారం ఉదయం అమలు చేసారు. అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడంతో ఆయనకు విధించిన ఉరి శిక్షను అమలు చేసామని ప్రభుత్వం ప్రకటించింది. రాజకీయ లబ్ది పొందడానికే ఈ సమయంలో ఆయనని ఎన్నికలముందు ఉరి తీసారన్న ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఉరి శిక్ష అమలుపై కాంగ్రెస్ సంతోషం ప్రకటించగా “ఆలస్యం అయింది, అయినా చేసింది మంచి పనే” అని బి.జె.పి వ్యాఖ్యానించింది. కసబ్ ఉరితీతతో పాటు అఫ్జల్ గురు ఉరిశిక్ష చుట్టూ కూడా కాంగ్రెస్, బి.జె.పి ల మధ్య రాజకీయ ప్రతిష్టల రాజకీయాలు ముసురుకుని ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఆ పార్టీల స్పందన ఉన్నది.
న్యూఢిల్లీలో కాశ్మీరీ విద్యార్ధులు అఫ్జల్ గురు ఉరి శిక్షకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పార్లమెంటుపై దాడి కేసుకు తనకు సంబంధం లేదని అఫ్జల్ మొదటి నుండి చెప్పుకుంటున్నాడు. ఒక దశలో ‘ఉరి తీయాలనుకుంటే తియ్యండి. ఈ నాన్చుడు ఎందుకు’ అని అఫ్జల్ గురు వ్యాఖ్యానించినట్లు కూడా వార్తలు వచ్చాయి.”జీవన్మృతుల జాబితాలో ఉండాలని నాకు లేదు. జైలులో జీవితం నరకప్రాయంగా ఉంది. నా శిక్షపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాను” అని 2008లో ఐ.ఎ.ఎన్.ఎస్ వార్తాసంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్జల్ తెలిపాడు. తన ఉరిశిక్షపై యు.పి.ఎ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగలదా అన్న అనుమానం కూడా ఆయన వ్యక్తం చేశాడు. ఉరితీసే వరకూ తనను కాశ్మీరు జైలులో ఉంచాలని అఫ్జల్ కోరినా ప్రభుత్వం అనుమతించలేదు.
ఎల్.కె.అద్వాని ప్రధాని అయితే తనను త్వరగా ఉరి తీసే అవకాశం ఉందని అప్పటి ఇంటర్వ్యూలో అఫ్జల్ గురు ఆకాంక్షించాడు. అద్వాని ప్రధాని అయితే తనకు జైలు నరకం నుండి విముక్తి దొరుకుతుందని ఆయన వ్యాఖ్యానించాడు. “ఎల్.కె.అద్వాని ప్రధాని కావాలని నా కోరిక. ఎందుకంటే ఆయనే త్వరగా ఒక నిర్ణయానికి వచ్చి నన్ను ఉరితీయమని చెప్పగలడు” అని అఫ్జల్ గురు అన్నాడని ఐ.ఎ.ఎన్.ఎస్ తెలిపింది. కాని ఆయన కోరిక నెరవేరలేదు.
అఫ్జల్ గురు శవాన్ని జైలులోనే పూడ్చిపెట్టామని ప్రభుత్వం తెలిపింది. కాశ్మీరులోని పి.డి.పి పార్టీ ఈ చర్యను వ్యతిరేకించింది. శవాన్ని బంధువులకు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించింది. కాగా మానవ, పౌర హక్కుల సంస్ధలు అఫ్జల్ ఉరితీతను వ్యతిరేకించాయి. భారత శిక్షాస్మృతి నుండి ఉరిశిక్షను తొలగించాలని అవి డిమాండ్ చేసాయి. కాశ్మీరీల నిరసన ప్రదర్శనలను భజరదంగ్ దళ్ కార్యకర్తలు ప్రతిఘటించడంతో జంతర్ మంతర్ వద్ద ఘర్షణలు. తోపులాటలు జరిగాయి. ఆ దృశ్యాలను ది హిందూ అందజేసిన కింది ఫొటోలో చూడవచ్చు.
- కాశ్మీరీలపై భజరంగ్ దళ్ దాడి
- దాడి నివారణకు పోలీసుల ప్రయత్నం
- శ్రీనగర్ లోని షాలిమార్ మసీదు వద్ద అఫ్జల్ గురు కోసం కాశ్మీరీల ప్రార్ధనలు
- ఉరి అనంతరం విలేఖరుల సమావేశంలో జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా








nerasthulu teevramaina neralu chesinapudu vaariki vuri sikhshs kante kiraataka mainadi bhayankara maina sikhshalu undali.Ante kaani. kiratakakamga pravarthinchina vaallanu marana sikhshs lekunda vadileyyadam emto ardham kaadu. EE vishayamlo poura hakkula sanghaalu aalochinchali ani naa vuddesam.