అనుకున్నదే అయింది. ఢిల్లీ బస్సు సామూహిక అత్యాచారం తర్వాత మాటల్లో, హామీల్లో అగ్ని కణాలు రువ్విన ప్రభుత్వ పెద్దలు చేతల్లో తుస్సుమనిపించారు. మహిళల భద్రతకే తమ ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యం ఇస్తుందని డంబాలు పలికిన ప్రధాని మన్మోహన్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీలు జస్టిస్ వర్మ కమిటీలోని ప్రధాన సిఫారసులను గాలికి వదిలేశారు. ప్రధాన సిఫారసులను నిరాకరించిన అప్రతిష్టను కప్పిపుచ్చుకోవడానికో యేమో తెలియదు గానీ వర్మ కమిటీ నిరాకరించిన మరణ శిక్షను అరుదైన కేసుల్లో విధించడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
భద్రతా బలగాల చేతుల్లో కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన రాష్ట్రాల మహిళలు ఎదుర్కొంటున్న అమానవీయమైన లైంగిక హింస నుండి వారికి విముక్తి కల్పించాలనీ, యూనిఫారం ధరించిన వ్యక్తులు (సైనికులు, పోలీసులు, తదితర భద్రతా బలగాలు) సాగిస్తున్న అత్యాచారాలను సాధారణ నేర చట్టాల పరిధిలోకి తేవాలన్న అతి ముఖ్యమైన సిఫారసు గురించి కేంద్ర కేబినెట్ ప్రతిపాదించిన ఆర్డినెన్స్ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. సంఘర్షణాత్మక రాష్ట్రాల్లో ప్రజలు తమ ప్రాధమిక హక్కుల కోసం సాగిస్తున్న పోరాటాలను అణచివేయడానికి వీలుగా ప్రభుత్వాలు అమలులోకి తెచ్చిన ‘సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం’ (AFSPA) ను సమీక్షించాలన్న వర్మ కమిటీ సిఫారసుపైన కూడా ఆర్డినెన్స్ లో ఒక్క ఊసూ లేదు. వర్మ కమిటీ సిఫారసుల్లోని ముఖ్యమైన అంశాలు లేకుండానే రాష్ట్రపతి సంతకంతో ఆదివారం నాటికి అది చట్టంగా రూపుదాల్చబోతున్నది.
ఇండియా టుడే పత్రిక ప్రకారం ఫిబ్రవరి 1 తేదీన కాంగ్రెస్ కోర్ కమిటీ సోనియా నేతృత్వంలో సమావేశమై ఉన్నపళంగా ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వానికి హుకుం జారీ చేసింది. సోనియమ్మ నుండి ఉత్తర్వులు అందుకున్న కేంద్ర కేబినెట్ అదే రోజు సాయంత్రం సమావేశమై మహిళలపై అత్యాచారాలు నివారించడానికి ఆర్డినెన్స్ జారీ చేయడానికి తాము నిర్ణయించామని ప్రకటించింది. హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే, న్యాయ మంత్రి అశ్విని కుమార్ లు తప్ప ఆర్డినెన్స్ లోని అంశాలు కేబినెట్ మంత్రులకు కూడా సమావేశానికి వచ్చేవరకూ తెలియవని ‘ది హిందూ’ తెలిపింది.
మరో మూడు వారాల్లో పార్లమెంటు సమావేశాలు పెట్టుకుని ఇంత హడావుడిగా ఆర్డినెన్స్ జారీ చేయవలసిన అవసరం కేబినెట్ కి ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానాలను కూడా ప్రభుత్వ పెద్దలు సిద్ధంగా ఉంచుకున్నారు. ఒకటి: తమది మాటల ప్రభుత్వం మాత్రమే కాదు, చేతల ప్రభుత్వం కూడా అని చెప్పుకోవడం; రెండు: జస్టిస్ వర్మ కమిటీ 29 రోజుల్లోనే నివేదిక సమర్పించి ప్రభుత్వానికి మానసికంగానూ, నివేదికలోనూ సవాలు విసరడం.
అతి అరుదైన లైంగిక అత్యాచార కేసుల్లో నిందితులకు మరణ శిక్ష గానీ, సహజ జీవిత కాలం పాటు జైలులో గడిపే శిక్ష గానీ విధించాలని ఆర్డినెన్స్ లో ప్రతిపాదించారని మంత్రులను ఉటంకిస్తూ పత్రికలు తెలిపాయి. అత్యాచారం చేయడం వలన బాధితులు శాశ్వతంగా కోమాలోకి వెళ్ళినా, అత్యాచారం సందర్భంగా తీవ్రంగా గాయపరిచినా మరణశిక్షకు నిందితులు అర్హులవుతారు. ప్రేమ పేరుతో వెంటపడుతూ వేధించడం (స్టాకింగ్), వోయరిజం, బలవంతంగా గుండు గీయడం, వివస్త్రను చేసి ఊరేగించడం లాంటి చర్యలను నేరాలుగా పరిగణించడానికి ఆర్డినెన్స్ లో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వీటిని కొత్తగా నేర చట్ట సవరణ బిల్లులో చేర్చడానికి నిర్ణయించినప్పటికీ చిన్న (పెట్టీ) నేరాలుగానే పరిగణిస్తారు. లైంగిక అత్యాచారానికి ఇప్పటివరకు గరిష్ట శిక్ష 10 సంవత్సరాలు మాత్రమే కాగా దానిని 20 సం. కు పెంచాలన్న వర్మ కమిటీ సిఫారసును కేబినెట్ ఆమోదించింది.
వైవాహిక అత్యాచారాలను నేరాలుగా పరిగణించాలన్న వర్మ కమిటీ సిఫారసును కేబినెట్ తిరస్కరించింది. భద్రతా బలగాలు చేసే అత్యాచారాలను సాధారణ నేర చట్టాల పరిధిలోకి తేవాలన్న సిఫారసును కూడా తిరస్కరించింది. భద్రతా బలగాలు, పోలీసులు సాగిస్తున్న అత్యాచారాలకు జాతీయ భద్రత, బలగాల ఆత్మ స్థైర్యము మొదలయిన ముసుగులతో రక్షణ కల్పించడం కొనసాగించడానికే కేబినెట్ మొగ్గు చూపిందని అర్ధం చేసుకోవచ్చు.
యాసిడ్ దాడులకు గురయిన బాధితులకు వైద్య ఖర్చులు పూర్తిగా చెల్లించాలన్న సిఫారసును కేబినెట్ తిరస్కరించింది. తద్వారా వచ్చే నష్టపరిహారం తక్కువగా ఉండొచ్చన్న కారణంతో దీనిని తిరస్కరించినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. అత్యాచారాలను నిర్దిష్ట లైంగికతతో నిర్వచించాలన్న వర్మ కమిటీ సిఫారసు తిరస్కరణకు గురయింది. ఎం. వెంకయ్య నాయుడు నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ పరిశీలిస్తున్న ‘నేర చట్ట సవరణ బిల్లు -2012’ ప్రతిపాదించినట్లుగా జెండర్ న్యూట్రాలిటీ వైపుకే కేబినెట్ మొగ్గు చూపింది. దేశ వ్యాపితంగా మహిళా సంఘాలు చేస్తున్న డిమాండ్ నే వర్మ కమిటీ తన సిఫారసుగా పేర్కొంది. అయినప్పటికీ దానిని కేబినెట్ ఆమోదించలేదు.
కేబినెట్ ఆర్డినెన్స్ ను మహిళా సంఘాలు, లెఫ్ట్ పార్టీలు విమర్శించాయి. అత్యంత గోప్యంగా, హడావుడిగా ఆర్డినెన్స్ తేవడం ద్వారా పారదర్శకత లేకుండా చేశారని మహిళా సంఘాలు విమర్శించాయి. ప్రజలతో, సంఘాలతో, సంస్థలతో చర్చించి పరిపుష్టమైన రీతిలో చేయవలసిన చట్టాన్ని హడావుడి ఆర్డినెన్స్ తో నీరుగార్చారని AIPWA, జాగోరి, పార్టనర్స్ ఫర్ లా అండ్ డవలప్ మెంట్ తదితర సంస్థల నాయకులు, మానవహక్కుల లాయర్లు విమర్శించారు. కొద్ది రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ఉండగా ఈలోపు ఆర్డినెన్స్ జారీ చేయడం ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధం అని సిపిఎం నాయకురాలు బృందా కరత్ విమర్శించింది. అత్యంత శ్రమకోర్చి వర్మ కమిటీ చేసిన సిఫారసులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆమె విమర్శించారు.
వర్మ కమిటీ సిఫారసులు, నేర చట్ట (సవరణ) బిల్లు -2012… ఈ రెండింటిలోని మెరుగైన అంశాలను తీసుకుని ఆర్డినెన్స్ తయారు చేశామని న్యాయ శాఖ మంత్రి అశ్వినీ కుమార్ ప్రకటించాడు. కానీ ఈ రెండింటిలో ప్రభుత్వాలు నడిపే వర్గాలకు ప్రమాదం లేని అంశాలను మాత్రమే తీసుకుని ఆర్డినెన్స్ తయారు చేయడం అసలు వాస్తవం.