తన సినిమా ‘విశ్వరూపం’ సినిమా విడుదల కాకుండా ఆగిపోవడం వెనుక రాజకీయ కారణాలున్నాయని కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. సినిమా చుట్టూ ముసురుకున్న వివాదం పూర్తిగా ‘రాజకీయం’ అనీ, ఇందులో మతపరమైన కారణాలు లేనే లేవని ఆయన నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పాడు. ఫిబ్రవరి 4 తేదీన వెలువడనున్న హై కోర్టు తీర్పు కోసం తాను ఎదురు చూస్తానని, ఈ లోపు సుప్రీం కోర్టుకి వెళ్ళే ఉద్దేశ్యాలు తనకు లేవని స్పష్టం చేశాడు. దేశాన్ని విడిచి వెళ్ళిన ఎం.ఎఫ్.హుస్సేన్ ను వేధించినట్లే తనను కూడా వేధిస్తున్నారని, ఇదే తరహాలో భవిష్యత్తులో కూడా వేధింపులు ఎదురయితే దేశం (రాష్ట్రం?) విడిచి వెళ్ళే ఆలోచనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించాడు. ఇదిలా ఉండగా సినిమా పట్ల తమిళనాడు ప్రభుత్వ వైఖరిని అనేకమంది ఖండించారు.
జనవరి 25 తేదీన విడుదల కావలసిన ‘విశ్వరూపం’ సినిమా తమిళనాడులో ఇంకా విడుదల కాలేదు. సినిమా వల్ల ముస్లింల మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ ముస్లిం సంఘాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినందున సినిమా విడుదలను రెండు వారాల పాటు నిషేధిస్తున్నామని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం దానికి తక్షణ కారణం. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా కోర్టు మెట్లు ఎక్కిన కమల్ హాసన్ మొదట విజయం సాధించినట్లే కనిపించింది. కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చాక సినిమాని స్థానికంగా నిషేధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, పిటిషనర్ కు అనుకూలంగా ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కనుక సినిమాను తమిళనాడు ధియేటర్లలో ప్రదర్శించుకోవచ్చని తమిళనాడు హైకోర్టు సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశాడు. ఈ లోపు వైరి పక్షాలతో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావడానికి ప్రయత్నించాలని ఆయన పిటిషనర్ కి సూచించినట్లు తెలుస్తోంది.
కానీ కమల్ కష్టాలు అంతటితో ముగిసిపోలేదు. సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులపై ఆగమేఘాల మీద స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా అప్పీలుకి వెళ్లడంతో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచి, సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన రెండు అభ్యంతరాలను ద్విసభ్య బెంచి పరిగణించి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా స్టే కొనసాగింపుకు ఉత్తర్వులు ఇచ్చిందని పత్రికలు తెలిపాయి. అవి:
ఒకటి, సినిమా విడుదల కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించిన సి.ఆర్.పి.సి సెక్షన్ 144, సబ్ సెక్షన్లు (4), (5) ప్రకారం నిషేధం ఎత్తివేయవలసిందిగా పిటిషనర్ ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉన్నా దానిని వినియోగించుకోకుండా నేరుగా కోర్టుకు వెళ్ళడం;
రెండు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించడానికి ముందుగానే సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం, దీని వలన పిటిషనర్ కి వ్యతిరేకంగా అనేక ఫిర్యాదులు పెండింగ్ లో ఉండగానే మధ్యంతర ఉత్తర్వుల ద్వారా అంతిమ ఉత్తర్వులకు సమానమైన అనుకూలతను పిటిషనర్ పొందగలిగాడు.
ఈ రెండు కారణాలు చూపిస్తూ సింగిల్ జడ్జి తీర్పును ద్విసభ్య బెంచి పక్కన పెట్టింది. దానితో రాష్ట్ర ప్రభుత్వం విధించిన రెండు వారాల నిషేధం తిరిగి అమలులోకి వచ్చినట్లయింది. సినిమాకి వ్యతిరేకంగా దాఖలయిన పిటిషన్లు అన్నింటినీ ఒకటిగా చేసి విచారించాలని సింగిల్ జడ్జిని ద్విసభ్య బెంచి కోరింది.
ఇంకో సెక్యులర్ దేశం చూసుకుంటాను
పరిస్ధితి ఇలాగే కొనసాగితే తాను తన జీవితంలో మూడోసారి దివాళా తీయడం ఖాయమని కమల్ హాసన్ బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. తన నటన వృత్తిని కొనసాగించలేని పక్షంలో తాను మరొక సెక్యులర్ దేశం చూసుకుని అక్కడికి వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించాడు. “(ఎం.ఎఫ్) హుస్సేన్ ఆపని చేయగలిగినపుడు, హాసన్ కూడా చేస్తాడు… నేను విసిగిపోయాను. నేను ఒక కళాకారుడిని. దీని తర్వాత నేను ఉండడానికి ఒక సెక్యులర్ రాష్ట్రం చూసుకోవాలి… కాశ్మీరు నుండి కేరళ వరకు, తమిళనాడు మినహాయించి… తమిళనాడు నన్ను వెళ్లిపొమ్మని చెబుతోంది” అని కమల్ వ్యాఖ్యానించాడు. ఎం.ఎఫ్ హుస్సేన్ ను ప్రస్తావించినపుడు మరొక సెక్యులర్ రాజ్యానికి (దేశానికి) వెళ్ళే ఉద్దేశ్యం ఉన్నట్లు చెబుతున్నట్లు కనిపించిన కమల్ హాసన్, ‘కాశ్మీరు నుండి కేరళ వరకు’ అన్నపుడు మరొక సెక్యులర్ రాష్ట్రం అని తన ఉద్దేశ్యం అయినట్లు అర్ధం వస్తోంది.
అయితే ఆ తర్వాత ముంబైలో హిందీ ప్రీమియర్ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడిన మాటల్లో ఈ సందేహం నివృత్తి అయింది. “కోపంలో… భావోద్వేగం ఒక్కసారిగా బైటికి తన్నుకొచ్చిన సందర్భంలో దేశం వదిలిపెట్టి వెళ్లిపోతానని నేను అన్నాను. దాని అర్ధం నేను అలా చేస్తానని కాదు… ఇక్కడి పేరు ప్రతిష్టలను నేను ఆనందంగా అనుభవిస్తున్నాను. కానీ ఇలాంటిది మళ్ళీ జరిగితే గనక, వదిలి వెళ్లడానికి నేను తీవ్రంగా ఆలోచిస్తాను. నేను సీరియస్ గానే చెబుతున్నాను” అని కమల్ విలేఖరులతో అన్నాడు.
తాను ఇంతవరకు సంపాదించింది అంతా పెట్టి సినిమా తీసానని, ఒక నిర్దిష్ట తేదీ లోపల 100 కోట్ల రూపాయల బడ్జెట్ తిరిగి రానట్లయితే తన ఆస్తులన్నింటిని తీసుకోవచ్చని ఋణ దాతలకి చెప్పానని అంతకుముందు ఆయన చెన్నైలో విలేఖరులకు తెలిపాడు. తన జీవితం అంతా రాజకీయాలకు అతీతంగా గడిపానని, తనకు అనేకమంది ముస్లిం మిత్రులు ఉన్నారని చెప్పుకున్నాడు. సినిమా విడుదల ఆలస్యం కావడం వలన పెద్ద ఎత్తున నష్టం వచ్చిందని, ఆ నష్టం 30 నుండి 60 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని తెలిపాడు.
జయ ప్రతీకారం?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ప్రకారం ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత కమల్ హాసన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికే ‘విశ్వరూపం’ సినిమా విడుదలను వివాదాస్పదం చేసింది. ‘తెల్ల పంచె చుట్టుకున్న వ్యక్తి దేశానికి ప్రధాని కావాలని నా కోరిక’ అని కమల్ హాసన్ కొద్ది రోజుల క్రితం తన మనసులో మాట చెప్పడంతో ఆయనపై జయలలిత పగబట్టిందని కరుణానిధి వ్యాఖ్యానించాడు. జయలలిత కోపానికి మరొక కారణం కూడా ఉందని పత్రికలు, ఛానళ్ళు చెబుతున్నాయి. ‘విశ్వరూపం’ సినిమా శాటిలైట్ హక్కుల కోసం ‘జయ టి.వి’ ప్రయత్నించగా కమల్ అందుకు ఒప్పుకోలేదని, జయ టి.వి కంటే ఎక్కువ ఇవ్వజూపిన మరొక చానల్ కు శాటిలైట్ హక్కులు అమ్ముకున్నాడని అవి చెబుతున్నాయి. ఇందులో నిజం ఎంతో, ఊహ ఎంతో తెలియదు. తెలిసే అవకాశం కూడా లేదు. సినిమా హాళ్లకంటే ముందే కేబుల్ టి.వి ప్రదర్శనకు హక్కులు ఇస్తానని ప్రకటించి సినిమా ఎగ్జిబిటర్ల నుండి ఆగ్రహం చవిచూసాడని మాత్రం కమల్, ఎగ్జిబిటర్ల మధ్య నడిచిన వాద ప్రతివాదాల ద్వారా జనానికి తెలిసింది.
ముఖ్యమంత్రి జయలలిత మాత్రం లా అండ్ ఆర్డర్ సమస్య ఏర్పడుతుందని తనకు ఇంటలిజెన్స్ సమాచారం రావడం వల్లనే తమ ప్రభుత్వం రెండు వారాలు ప్రదర్శనపై నిషేధం విధించిందని చెబుతూ తన చర్యను సమర్ధించుకొంది.
విస్తృత మద్దతు
కమల్ హాసన్ కు సహజంగానే అనేకమంది మద్దతు వచ్చారు. విశ్వరూపం విడుదల పై చెలరేగిన వివాదంలో రాజకీయాలు చొరబడడంతో ఆ విధంగా వచ్చిన మద్దతు ఒక భాగం కాగా, కళాకారుల నుంచీ, నిష్పక్షపాత పరిశీలకులనుండి వచ్చిన మద్దతు ఒక భాగం. తమిళనాడు సూపర్ స్టార్ రజనీ కాంత్ మొదటి నుంచి కమల్ కి మద్దతు ఇస్తూ వచ్చాడు. జయలలిత ప్రత్యర్థి కనుక కరుణానిధి మద్దతు అనివార్యం. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం నాయకులు ఆయనకు మద్దతుగా నిలవడం ఒక విశేషం.
కేంద్ర హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా కమల్ హాసన్ కు బేషరతు మద్దతు ధ్వనించే విధంగా ప్రకటన చేశాడు. “మనది స్వేచ్ఛా సమాజం. ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. కళాకారులకు ఇక్కడ స్వేచ్ఛ ఉంది. మనకి ఒక రాజ్యాంగం ఉంది. అందరూ దాన్ని గౌరవించాలి. తాము ఎంచుకున్న పనిలో కొనసాగేందుకు కళాకారులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో సినిమా విడుదల కావడంలో సమస్యలు ఎందుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం విచారిస్తుంది” అని షిండే ఢిల్లీలో విలేఖరులతో అన్నాడు.
ది హిందూ పత్రిక కమల్ హాసన్ కు పూర్తి మద్దతు ఇచ్చింది. విశ్వరూపం సినిమా అద్భుతంగా ఉందంటూ ఆ పత్రికలో ఒక సమీక్ష కూడా ప్రచురితం అయింది. విశ్వరూపం సినిమా విడుదలకు మద్దతుగా ఆ పత్రిక బుధవారం ప్రత్యేకంగా సంపాదకీయం రాయడం విశేషం. సినిమా ప్రదర్శనపై విధించిన నిషేధం సమర్థనీయం కాదని సదరు సంపాదకీయం వ్యాఖ్యానించింది. న్యాయం చేస్తూ తీర్పు ప్రకటించవలసిన కోర్టు చర్చల ద్వారా పరిష్కరించుకొమ్మని తిరిగి పిటిషనర్ నే కోరడం ఏమిటని ప్రశ్నించింది. కోర్టు సలహాలు ఇవ్వొచ్చు గానీ ఈ కేసులో వివాద పరిష్కారానికి కోర్టు అసలే ప్రయత్నం చేయలేదని ఎత్తి చూపింది. ‘ఆరక్షణ్’ సినిమాపై విధించబడిన రెండు నెలల నిషేధాన్ని సుప్రీం కోర్టు కొద్ది నెలల క్రితం కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేసింది. ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్’ వద్ద అనుమతి పొందిన తర్వాత సినిమాలపై నిషేధం విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని సుప్రీం కోర్టు చెప్పిందని తెలియజేసింది.
బిజెపి నాయకులనుండి కూడా కమల్ హాసన్ కు మద్దతు వచ్చింది. అయితే ఎం.ఎఫ్.హుస్సేన్ ప్రవాసంతో తన పరిస్ధితిని పోల్చుతూ కమల్ చేసిన ప్రకటన ఆ పార్టీకి గొంతులో వెలక్కాయ పడ్డట్లు అయింది. హిందూ దేవతలను నగ్నంగా గీశాడని ఆరోపిస్తూ ఆయనపై పదుల కొద్దీ కేసులను హిందూ సంస్థలు, వ్యక్తులు బనాయించారు. ఆయనను చంపడానికి పిలుపులు కూడా ఇవ్వబడ్డాయి. దానితో ఆయన కతార్ ప్రభుత్వం ఇవ్వజూపిన పౌరసత్వాన్ని అంగీకరించి అక్కడికి తరలిపోయాడు. చివరికి ప్రవాసంలోనే ఆయన చనిపోయాడు. హుస్సేన్ తో కమల్ తెచ్చిన పోలిక పరోక్షంగా హుస్సేన్ చిత్రాల ప్రదర్శనలపై హిందూ సంస్థలు చేసిన దాడులను గుర్తుకు తేవడంతో బిజెపి నాయకుల మద్దతు తిరిగి వారికే ఎదురు తిరిగింది.
భారత దేశంలో చూసినా, మరే దేశంలో చూసినా కళ అనేది ప్రధానంగా డబ్బుకి బందీగా మారిపోయింది. శాస్త్ర పరిజ్ఞానం అత్యున్నత స్థాయికి అభివృద్ధి చెందిన నేపధ్యంలో ప్రజల ఊహలను, ఫాంటసీలను అద్భుత రీతిలో తెరకు ఎక్కించడం సాధ్యం అవుతోంది. దానితో సినిమాలకు ఎన్నడూ లేనంతగా పిచ్చి ముదిరిపోయింది. సినిమా కళాకారులను కళాకారులుగా మాత్రమే చూడడం కాకుండా వారిని వాస్తవ జీవితాలలో ప్రతిక్షేపించుకునే పరిస్ధితికి యువత చేరుతోంది. చివరికి సినిమా కళాకారులకు ఓట్లు వేసి చట్ట సభలకు ఎన్నుకునే పరిస్ధితి కూడా దాటిపోయింది. కళ అనేది పెట్టుబడికి ఇబ్బడిముబ్బడిగా లాభాలు సంపాదించి పెట్టేదిగా మారడం దీనికి ప్రధాన కారణం. అంటే కళా రంగాన్ని కూడా పెట్టుబడి తన అదుపులోకి తెచ్చుకోవడం. ఈ క్రమంలో ప్రజల కళారూపాలు సైతం వ్యాపారీకరణకు అనువుగా మారిపోతున్న ధోరణి కళ్లెదుటే ఉన్న సత్యం. డబ్బు ఉన్న చోట రాజకీయాలు మూగడం అనివార్యమే. తాము సంపాదించిన నల్ల డబ్బును పన్నులనుండి కాపాడుకోడానికి రాజకీయ నాయకులను ఆశ్రయించే సినిమా కళాకారులు, అదే డబ్బు కోసం జరిగే రాజకీయాల రొంపిలోకి తమ ప్రమేయం లేకుండా కూడా జారిపోవడం తప్పించుకోలేని పరిణామం.
There were demonstrations in other states(AP,Karnataka,Kerala) too initially, but the respective state govts didn’t take them seriously so the move got released and now running smoothly.
why TN took it seriously..?
Its well known fact that, AIDMK is going to have a tie-up with NDA after 2014 elections and its even going to support Mr.Modi as prime minister, an Idea which the minorities hate. So, Jayalalita govt is trying to do some balancing act now by banning this movie. probably she wants to show that she care for Muslims too, in this way. A clear case of minority appeasement. (as MF Hussain’s case is majority appeasement)
ఇది వాస్తవం కళను ఎంత తొందరగా వ్యాపారకబంధ హస్తాల నుంచి తొలిగిస్తే అమ్త తొందరగా మానవ ప్రగతి పున:ప్రారంభం అవుతుంది.
I watched that film. There are no objectionable scenes in it.