కీచులాటలు ఇండియా, పాక్ లవి, కాశ్మీర్ రొట్టె ఐరాసకు


Perminent representatives of India and Pakistan in UN: Hardip Sing Puri (left) and Masood Khan

Perminent representatives of India and Pakistan in UN: Hardip Sing Puri (left) and Masood Khan

రెండు పిల్లుల రొట్టె తగాదాని కోతి తీర్చినట్లయింది ఇండియా, పాకిస్థాన్ దేశాల పరిస్ధితి. కాశ్మీర్ లో ఐక్యరాజ్యసమితి పరిశీలక బృందం కొనసాగాలా లేదా వద్దా అని ఇండియా, పాకిస్థాన్ లు కీచులాడుకుంటుంటే ఆ సంగతి తేల్చవలసింది మీ ఇద్దరిలో ఎవ్వరూ కాదు మేమే అని ఐరాస తేల్చి చెప్పింది. అమెరికా, యూరప్ దేశాలకు ప్రపంచ స్థాయిలో రాజకీయ ముసుగుగా పనిచేసే ఐరాస చేతి లోకి ఒక అధికారం వెళ్ళడం అంటే అది అమెరికా, యూరప్ చేతుల్లోకి వెళ్ళినట్లే. కాశ్మీర్ విషయంలో తాజాగా ఐరాస వేదికపై తలపడిన ఇండియా, పాక్ లు తద్వారా కాశ్మీర్ ప్రజల భవిష్యత్తు ఆ ప్రజల చేతుల్లో మాత్రం లేదని ప్రపంచానికి తేటతెల్లం చేశారు.

కాశ్మీర్ ని ‘నియంత్రణ రేఖ’ (Line of Control – LoC) వద్ద రొట్టెముక్క లాగా ఇండియా, పాకిస్థాన్ దేశాలు రెండుగా విభజించుకొన్న సంగతి తెలిసిందే. ఈ విభజన రేఖను ఇరు దేశాలు ఉల్లంఘించకుండా ఉండడానికి ఐక్యరాజ్యసమితి ఎల్.ఒ.సి రేఖ వద్ద ఒక పరిశీలక బృందాన్ని నియమించి నిర్వహిస్తోంది. ‘యునైటెడ్ నేషన్స్ మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్థాన్’ (UNMOGIP) పేరుతో ఈ బృందం 1949 నుండి బాధ్యతలు నిర్వహిస్తోంది. ఐరాసలో శక్తివంతమైన 15 సభ్య దేశాల ‘భద్రతా సమితి’ తీర్మానం మేరకు అప్పట్లో ఈ పరిశీలక బృందాన్ని నియమించారు.

మారిన పరిస్ధితుల్లో ఈ బృందం అవసరం ఇక లేదు గనక దాన్ని వెనక్కి పిలిపించాలని భారతదేశం మంగళవారం చర్చను లేవదీసింది. ఐరాస భద్రతా సమితి వేదికపైన శాంతి పరిరక్షణ విషయమై పాకిస్థాన్ నిర్వహించిన ‘ఓపెన్ డిబేట్’ కార్యక్రమంలో పూరి ఈ అంశం ప్రస్తావించాడు. ఐరాసలో ఇండియా శాశ్వత ప్రతినిధి హర్దీప్ సింగ్ పూరి ఈ అంశాన్ని లేవనెత్తాడు. 1972లో ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య ‘సిమ్లా ఒప్పందం’ జరిగిందని, ఐరాస బృందం బాధ్యతలను ఆ ఒప్పందం నిర్వర్తిస్తున్నదనీ, కనుక అది ఇక అక్కడ ఉండవలసిన అవసరం లేదనీ హర్దీప్ చర్చను లేవనెత్తాడు.

సిమ్లా ఒప్పందం దరిమిలా తమ మధ్య విభేదాలను “శాంతియుత ద్వైపాక్షిక చర్చల ద్వారా” పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయని ఆయన గుర్తు చేశాడు. UNMOGIPని వెనక్కి పిలిపిస్తే దాని కోసం కేటాయించిన నిధులు ఇతర ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ బాధ్యతలు నిర్వహించడానికి ఐరాసకు అక్కరకు వస్తాయని పూరి సూచించాడు. తద్వారా పొదుపు పాటించవలసిన ప్రస్తుత పరిస్ధితుల్లో ఐరాస నిధులు మరింత ఉపయోగకరమైన పద్ధతిలో వినియోగించడానికి అవకాశం లభిస్తుందని ఆయన ఊరించాడు.

అయితే పూరి సూచనను పాకిస్థాన్ వెంటనే తిరస్కరించింది. పూరి వాదనను ఐరాస లోని పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి మసూద్ ఖాన్ అంగీకరించలేదు. జమ్ము అండ్ కాశ్మీర్ లో ఐరాస బాధ్యతలు కొనసాగించాల్సిందేనని ఆయన వాదించాడు. ఇండియా, పాక్ దేశాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఐరాస బృందం ఇప్పటికీ పర్యవేక్షిన్నదనీ భద్రతా సమితి తీర్మానం ప్రకారం ఎల్.ఒ.సి వద్ద ఐరాస బాధ్యతలు “పూర్తిగా సముచితం, సందర్భ సహితం, కొనసాగుతుంది” అని మసూద్ ఖాన్ నొక్కి వక్కాణించాడు.

ఇరు దేశాల మధ్య కుదిరిన ‘ద్వైపాక్షిక ఒప్పందం’ ఏదీ ఐరాస బృందం పాత్రను గానీ, దాని చట్టబద్ధతను గానీ చేపట్టలేదని ఖాన్ అన్నాడు. “నిజం ఏమిటంటే ఇండియా, పాకిస్థాన్ దేశాలు రెండూ ఐరాస బృందానికి ఆతిథ్యం ఇస్తున్నాయి” అని ఖాన్ తెలిపాడు. UNMOGIP బృందం కింద కాశ్మీర్ లో 39 మంది మిలట్రీ పరిశీలకులు, 25 మంది అంతర్జాతీయ పౌర అధికారులు, 48 మంది స్థానిక పౌర సిబ్బంది పని చేస్తున్నారు.

పిల్లి, పిల్లి మధ్య తలెత్తిన రొట్టె పంపకం తగవు కోతి వచ్చి తీర్చినట్లు, ఇండియా, పాకిస్థాన్ తగవును తీర్చడానికి ఐరాస రంగ ప్రవేశం చేసింది. ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్ ప్రతినిధి మార్టిన్ నెసిర్కి “ఐరాస బృందం పనిని ముగించే అధికారం ఒక్క భద్రతా సమితికి మాత్రమే ఉంది” అని తేల్చి చెప్పాడు. 15 సభ్య దేశాలు గల భద్రతా సమితి తీర్మానం చెయ్యకుండా బృందం పనిని ముగించలేమని ఆయన తెలిపాడు. బృందాన్ని “భద్రతా సమితి తీర్మానం ద్వారా 1948లో ఏర్పాటు చేశారు. మళ్ళీ భద్రత సమితి తీర్మానం చేస్తే తప్ప UNMOGIP పనిని ముగించడానికి వీలు లేదని సెక్రటరీ జనరల్ ఎప్పుడూ చెప్పే విషయమే” అని మార్టిన్ తెలిపాడు. పిటిఐ కి పంపిన ఒక ఈ మెయిల్ ద్వారా మార్టిన్ ఈ విషయం తెలిపాడని ది హిందూ తెలియజేసింది.

ఐరాస అధిపతి ప్రతినిధి ఇచ్చిన తీర్పు చివరికి పాకిస్ధాన్ వాదనకు అనుకూలంగా పరిణమించింది. కాశ్మీర్ విషయంలో బైట దేశాల జోక్యం సహించేది లేదనీ, ఐరాసకు కూడా ఇందులో పాత్ర లేదనీ కాశ్మీర్ సమస్య కేవలం ద్వైపాక్షిక సమస్య మాత్రమేనని భారత దేశం మొదటినుండీ వాదిస్తోంది. ఇండియా సందర్శనకు బైట దేశాల అధిపతులు ఎవరు వచ్చినా వారి చేత “కాశ్మీర్ సమస్య, ద్వైపాక్షిక సమస్య. దానిని ఇరు దేశాలు శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇందులో బైట దేశాల జోక్యం తగదు” అని ఒక ప్రకటన ఇప్పించడం భారత పాలకులకు ఆనవాయితీ. ఈ నేపధ్యంలో తాజా వివాదం ద్వారా ఇండియా కోరి ‘కొరివితో తల గోక్కోనట్లు’ అయింది.

పాకిస్ధాన్ తో ఉన్న ఏ సమస్యల పరిష్కారానికైనా ఐరాస జోక్యాన్ని ఇండియా తిరస్కరిస్తుంది. “ద్వైపాక్షిక సమస్యలను ద్వైపాక్షిక పద్ధతిలోనే పరిష్కరించబడాలి” అని తాజా వివాదం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మరొక సారి నొక్కి చెప్పాడు కూడా. అయితే ఇండియా వాదన ఎలా ఉన్నప్పటికీ చర్చల విషయంలో తల దూర్చడానికి సందు దొరికినప్పుడల్లా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలు ప్రయత్నిస్తుంటాయి. విదేశాలతో ఆర్ధిక కాంట్రాక్టులు, పెట్టుబడులు, రుణాలు తదితర అవసరాలు వచ్చినప్పుడల్లా బేరసారాలకు ఒక సాధనంగా కాశ్మీర్ వివాదం ఇరు పక్షాలకూ ఉపయోగపడుతూ ఉంటుంది.

ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్, లిబియా, ఈజిప్టు, ట్యునీషియా, సిరియా తాజాగా మాలి, అల్జీరియాలలో జరిగినట్లే భవిష్యత్తులో ఇండియా వ్యవహారాల్లో తలదూర్చడానికి, అవసరమైతే సైనిక జోక్యం చేసుకోవడానికి కూడా అంతర్జాతీయ శక్తులకు కాశ్మీర్ సమస్య వాటంగా అందుబాటులో ఉంది. అలాంటి జోక్యాన్ని సిరియా, ఇరాక్, లిబియా, ఇరాన్ ప్రభుత్వాల తరహాలో ప్రతిఘటించి దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకునే పనికి భారత పాలకులు సిద్ధపడతారా అన్నది అనుమానమే. దేశీయ వనరులను కబళించే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం మోరలు చాచిన పాలకుల వైఖరి అందుకు ప్రబల దృష్టాంతం. కాగా ఇండియా, పాకిస్ధాన్ లతో పాటు అంతర్జాతీయ సామ్రాజ్యవాద శక్తుల ప్రయోజనాల కింద బడుగు కాశ్మీర్ ప్రజల ప్రయోజనాలు నలిగిపోవడం అసలు విషాదం.

3 thoughts on “కీచులాటలు ఇండియా, పాక్ లవి, కాశ్మీర్ రొట్టె ఐరాసకు

  1. మీరు రాసిన టపాలో ఎక్కడా కశ్మీర్ ప్రజల ఆకాంక్షలు గానీ కశ్మీర్ చరిత్రగానీ లేదు.కేవలం దాన్నొక సరిహద్ధు సమస్యగానో, విదేశీ వ్యవహారల అంశంగానో చూసారు.కశ్మీర్ ప్రజల స్వయం ప్రతిపత్తి ఎప్పటి నుండో నలుగుతున్న అంశం.దానికి భారత ప్రభుత్వం ఎలా మోకాలడ్డుతుందో కూడా తెలిసిందే. కశ్మీర్ విషయంలో అక్కడి ప్రజలు ఎప్పటీనుంచో అంతర్జాతీయ మద్ధతును కోరుతున్నారు. దీని వల్ల ఏదో వొరుగుతుందన్న వైఖరితో కాకుండా కశ్మీర్ ప్రజల ఒంటరితనాన్ని అది పోగొడుతుంది కాబట్టి ప్రజాస్వామిక వ్వాదులు కూడా అంతర్జాతీయ జోక్యం (అది అనేక సమస్యలతో ముడి పడి ఉన్నప్పటికీ) విషయంలో కశ్మీరీల ఆకాంక్షకే వదలి వేసి, తమ మద్దతును కొనసాగిస్తూ వచ్చారు.
    కానీ ఈ వైఖరి ఏమాత్రమూ టపాలో లేదు. పైగా ఇరాన్ తరహాలో సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవాలనే ధోరణిని కూడా మీరు వెలిబుచ్చారు. నిజానికి కశ్మీర్ లో తమ ఉనికిని కాపాడుకోగలిగిన ప్రజాస్వామిక శక్తులకు కొదవలేదు. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉంది. కాబట్టి మీరు తెచ్చిన అనేక దేశాల పోలికలు ఇక్కడ సరిపోవు. సామ్రాజ్య వాదశక్తుల విషయంలో మీ ఆందోళన పరిగణించవలసినదే అయినా ఇక్కడ కశ్మీర్ ప్రజల ఆకాంక్షకే ప్రాధాన్యత ఇవ్వాలి. మీ వైఖరి కశ్మీర్ పై భారత ప్రభుత్వ వైఖరికి చాలా దగ్గరిగా ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి.

  2. నాగరాజు గారు, మీరు గమనించింది నిజమే. కాశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు ప్రస్తావన లేకపోవడం వలన కాశ్మీర్ సమస్య భారత్ సార్వభౌమ హక్కు సమస్య అన్నట్లుగా అర్ధం వచ్చింది. స్వయం నిర్ణయాధికార ప్రస్తావన ఒక పేరాలో చేయాలనుకుని చివరికి వచ్చేసరికి అది మర్చిపోయి ముగించాను.

    అయితే అంతర్జాతీయ మద్దతు అంశంపై మీరు చెప్పిన కోణానికి అనేక పరిమితులు ఉన్నాయి. అంతర్జాతీయ మద్దతు అనగానే ముందుకు వచ్చేది అమెరికా, యూరప్ లే. జి77 దేశాలు లేదా అలీన దేశాల కూటమి చొరవ తీసుకుంటే తప్ప అంతర్జాతీయ మద్దతు చివరికి పశ్చిమ రాజ్యాలకు అవకాశంగా మారుతుంది. ఏదేమైనా ఈ కోణాన్ని తర్కించాల్సిందే.

    ఇక్కడ బుక్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. అక్కడికి వెళ్ళాలన్నది ముందు అనుకున్న పని. బహుశా ఆ తొందరలో మరిచినట్లున్నాను. గతంలో రాసిన టపాల్లో ఆ అంశాన్ని వివరించాను.

వ్యాఖ్యానించండి