ఆఫ్రికాలో ఆల్-ఖైదా బూచి, మాలిలో ఫ్రాన్సాఫ్రిక్


మాలి రాజధాని బమాకోలో ఫ్రాన్సు సైన్యం -ఫొటో: మెయిల్

మాలి రాజధాని బమాకోలో ఫ్రాన్సు సైన్యం -ఫొటో: మెయిల్

ప్రపంచంలో ఏ మూలైనా సరే, ఆల్-ఖైదా ఉనికి గురించి ఆందోళన మొదలయిందంటే, అక్కడ పశ్చిమ రాజ్యాలు సైనిక జోక్యానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయని అర్ధం. దేశాల సార్వభౌమ హక్కులను కాలరాస్తూ సైనికంగా జోక్యం చేసుకోవాలని భావించినా, దేశాధ్యక్షుల భవనాలపై బాంబింగ్ కి నిర్ణయం జరిగినా, లేదా ఇంకేదైనా చట్ట విరుద్ధమైన అక్రమ చర్యలకు దిగుతున్నా, అమెరికాతో పాటు ఇతర పశ్చిమ రాజ్యాలు ఇన్నాళ్లు కమ్యూనిస్టు బూచిని చూపేవారు. కమ్యూనిస్టు బూచి చూపే అవకాశం లేని చోట్ల మాదక ద్రవ్యాల మాఫియా లేదా నియంతృత్వం లాంటి సాకులు చూపేవారు. ఇపుడు పశ్చిమ రాజ్యాల చేతుల్లో ఉన్న తాజా ఆయుధం ‘ఇస్లామిక్ టెర్రరిజం.’ ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే ‘ఆల్-ఖైదా.’ ఇపుడు మాలిలో జరుగుతున్నది అదే. మాలితో పాటు అల్జీరియాను కూడా కబళించడానికి ఫ్రాన్సు ప్రయత్నిస్తున్నట్లు అల్జీరియాలో తలెత్తిన బందీల సమస్య ద్వారా స్పష్టం అవుతోంది.

‘ఫ్రాన్సాఫ్రిక్’ అంటే ఆఫ్రికా ఖండంలో ఫ్రాన్సు సాగిస్తున్న నయా వలస దోపిడిని సూచించే పదం. తన పాత ఆఫ్రికా వలసలతో ఫ్రాన్సు ఎప్పటికీ సత్సంబంధాలను కొనసాగించాలన్న అర్ధంతో ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడొకరు వాడుకలోకి తెచ్చిన ఈ పదం వాస్తవంలో ఆఫ్రికాపై ఆ దేశానికి గల ఆర్ధిక, వాణిజ్య పరమైన, కొండొకచో సైనిక పరమైన ఉడుం పట్టును సూచించేదిగా మారిపోయింది. ఆల్-ఖైదా టెర్రరిస్టులు మాలి అనే పశ్చిమాఫ్రికా దేశంలో ముస్లిం టెర్రరిస్టులను ఓడించే పేరుతో ఫ్రాన్సు తన సైనికులను ఆ దేశంలో దింపి ఏక కాలంలో వాయు, భూతల యుద్ధం చేస్తోంది. ఉత్తర ఆఫ్రికా దేశాల్లో విస్తృతంగా వ్యాపించి ఉన్న తౌరెగ్ తెగ గిరిజన ప్రజలు తమ ప్రయోజనాలు తాము కాపాడుకోవడానికి అనాదిగా చేస్తున్న ప్రయత్నాలను ఇపుడు ఆల్-ఖైదా బూచి చూపి ప్రత్యక్ష సైనిక అణచివేతతో అడ్డుకోడానికి ఫ్రాన్సు తెగబడింది. ఫ్రాన్సు సైనిక జోక్యానికి అమెరికా, బ్రిటన్, జర్మనీ తదితర ‘నాటో’ సైనిక మండలి దేశాల ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ఉన్నది.

గత సంవత్సరం నుండి మాలి లో తిరుగుబాటు ప్రారంభించిన తౌరెగ్ లు ఉత్తర మాలిని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వీరు ప్రధానంగా మూడు సంస్థల నేతృత్వంలో తిరుగుబాటుకి దిగారు. అవి: ఆన్సర్ దినే, ముజావో (MUJAO – Movement for Jihad in West Africa), అకిమ్ (AQIM – Al-Qaeda in the Islamic Maghreb). తిరుగుబాటు బలగాలు మాలి రాజధాని బమాకోకు 700 కి.మీ దూరంలోని కొన్నా పట్టణం వరకు చేరుకోవడంతో వారి పురోగమనాన్ని అడ్డుకుని తరిమేయడానికి ఫ్రాన్సు సైనిక జోక్యం తప్పనిసరి అయిందని పశ్చిమ పత్రికలు చెబుతున్నాయి.

పటము: ది హిందూ

పటము: ది హిందూ

అయితే, ఫ్రాన్సు తన జెట్ ఫైటర్లు, గన్ హెలికాప్టర్లు మొ.న ఆధునిక ఆయుధాలతో తీవ్రస్థాయి దాడి చేసినప్పటికీ ఆల్-ఖైదా బలగాలు ఇస్లామిక్ బలగాల పురోగమనాన్ని అడ్డుకోలేకపోయాయని పత్రికల నివేదికలు చెబుతున్నాయి. కొన్నా వద్ద యుద్ధం కొనసాగుతుండగానే రాజధాని బమాకోకు 300 కి.మీ దూరంలో ఉన్న దియాబాలి పట్టణం వద్ద మరో యుద్ధ ఫ్రంట్ ను తిరుగుబాటుదారులు తెరిచారని అవి చెబుతున్నాయి. మాలిలో తిరుగుబాటు బలగాలపై ఫ్రాన్సు దాడి ఆపాలని డిమాండ్ చేస్తూ అల్జీరియాలో పదుల సంఖ్యలో విదేశీయులను బందీలుగా పట్టుకోవడంతో అల్జీరియాకు కూడా సంక్షోభం పాకింది. కాగా అల్జీరియా బందీల వ్యవహారం, మాలితో పాటు అల్జీరియాను కూడా తమ సైనిక చక్ర బంధంలోకి తెచ్చుకోవడానికి నాటో పన్నిన వ్యూహం అని ‘గ్లోబల్ రీసెర్చ్’ సంస్థ తెలియజేసింది. ఫ్రాన్సు యుద్ధ విమానాలు ఉత్తర మాలి అంతటా జెట్ ఫైటర్లతో బాంబు దాడులు చేస్తున్నాయని, ఈ దాడుల్లో అనేకమంది పిల్లలతో సహా పౌరులు మరణిస్తున్నారని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గత సోమవారం తెలిపింది.

2012 ప్రారంభం నుండి మాలి దేశంలోని 2/3 వంతుల భాగం (ఫ్రాన్సు వైశాల్యం కంటే ఎక్కువ) తిరుగుబాటుదారుల స్వాధీనంలో కొనసాగుతోంది. తమను తాము ఇస్లామిస్టు తిరుగుబాటుదారులుగా చెప్పుకున్న వీరు క్రమంగా రాజధానికి సమీప నగరాలను ఆక్రమించుకునే పనిలో ఉన్నారు. ఆఫ్రికా దేశాల నేతృత్వంలోని ఉమ్మడి మిలటరీ బలగాలు మాలిలో సైనిక జోక్యం చేసుకోవడానికి గత డిసెంబర్ లో ఐరాస భద్రతా సమితి ఒక తీర్మానం ద్వారా అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 2013లో ఆఫ్రికా బలగాలను దించడానికి ఐరాస యోచిస్తుండగా ఈ లోపుగానే ఫ్రాన్స్ తన సైనికులను దించి మాలి పట్టణాలు, గ్రామాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఫ్రాన్సు చర్యకు నాటో కూటమి తన పూర్తి మద్దతు ప్రకటించింది. ఫ్రాన్సుకు మద్దతుగా రెండు C-160 మిలట్రీ విమానాలు పంపడానికి జర్మనీ ఏర్పాట్లు చేస్తోంది. ఎకోవాస్ (Ecowas – Economic Community of West African States) కూటమికి ఐరాస ఇచ్చిన సైనిక అనుమతిని తనకు అనుకూలంగా నాటో కూటమి వినియోగిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

సహజ సంపదలకు నిలయం

ఇతర ఆఫ్రికా దేశాలకు మల్లే మాలి అనేక సహజ వనరులకు నిలయం. ముఖ్యంగా ఖనిజ వనరులు మాలిలో విస్తారంగా లభిస్తాయి. ఆయిల్ నిల్వలు కూడా అక్కడ విస్తారంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. విలువైన బంగారం, వజ్రాలతో పాటు, అరుదైన యురేనియం నిల్వలు కూడా మాలిలో ఉన్నాయి. ముడి ఇనుము, బాక్సైట్, మాంగనీసు, రాగి, పాలరాయి, జిప్సం, పాస్ఫేట్లు, లిథియం, లిగ్నైట్, రాతి ఉప్పు, డైలమేట్ తదితర ఖనిజ వనరులను అక్కడ ఇంకా తవ్వకాలకు నోచుకోలేదు. బంగారం నిల్వలలోనూ, ఉత్పత్తిలోనూ ఆఫ్రికాలో మాలి మూడో పెద్ద దేశం. మరిన్ని బంగారం నిల్వల కోసం అక్కడ అన్వేషణ సాగుతోంది. 1324 నాటి మాలియన్ సామ్రాజ్య కాలం నుండి బంగారు గనులకు మాలి పేరు పొందింది. ఇప్పటికే ఏడు బంగారం గనుల్లో ఉత్పత్తి జరుగుతుండగా మరో ఏడు కొత్త గనులు త్వరలో ఉత్పత్తి ప్రారంభిస్తాయి.

మాలి నగరం గావో కు సమీపంలోనే 200 పైగా టన్నుల యురేనియం నిల్వలు ఇటీవల కనుగొన్నారు. అనేక కంపెనీలు ఇప్పుడు అనేక చోట్ల యురేనియం అన్వేషణ సాగిస్తున్నాయి. దాదాపు పదహారు చోట్ల వజ్రాల గనులను ఇప్పటివరకూ కనుగొన్నారు. గార్నెట్ తదితర అరుదైన అయస్కాంత ఖనిజాలు మాలిలో లభిస్తున్నాయి. పెగ్మటైట్ ఖనిజాలు, క్వార్ట్‌జ్ లాంటి కార్బొనేట్ ఖనిజాలు కూడా అక్కడ లభిస్తున్నాయి. గణనీయ మొత్తంలో (2 మిలియన్ టన్నులకు పైనే) ఉన్న ముడి ఇనుప ఖనిజ నిల్వలను ఇంకా ముట్టుకోలేదు. కనీసం నాలుగు చోట్ల బాక్సైట్ ఖనిజ నిల్వలను కనుగొనగా, మూడు చోట్ల మాంగనీసు నిల్వలు కనుగొన్నారు. ప్రపంచ వ్యాపితంగా ఆయిల్, గ్యాస్ ధరలు పై పైకి ఎగబాకుతున్న నేపధ్యంలో సదరు వనరుల అన్వేషణకు మాలి ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతోంది. ఉప సహారా దేశాల ఆయిల్ ఉత్పత్తులను పశ్చిమ దేశాలకు రవాణా చేయడానికి మాలి భూ మార్గం లాభకరమైన మార్గంగా అవతరిస్తోంది.

పశ్చిమ దేశాలు మాలి దేశంపై ఎందుకు కేంద్రీకరించాయో ఇప్పటికే అర్ధం అయి ఉండాలి. లాభాలు తెచ్చి పెట్టే సహజ వనరులు ప్రపంచంలో ఏమూల ఉన్నా అక్కడికి గద్దల్లా వాలిపోవడం పశ్చిమ దేశాల నైజం. వనరుల కోసం అంటే ఎవరూ అంగీకరించరు గనక కమ్యూనిస్టు, టెర్రరిజం, ఆల్-ఖైదా తదితర భూతాలను అవి కనిపెడతాయి. ఏ భూతమూ లేకపోతే తామే ఒక భూతాన్ని ప్రవేశపెట్టడం పశ్చిమ రాజ్యాలకు, ముఖ్యంగా అమెరికా ఆ తర్వాత ఫ్రాన్సు, బ్రిటన్ లకు వలస కాలం నుండి ఉన్న దురలవాటు. మాలి లో విజృంభిస్తున్న ముస్లిం తిరుగుబాటుదారులు అనాదిగా అణచివేతకు గురవుతున్న తౌరెగ్ తెగల ప్రజాస్వామిక ఆకాంక్షలను ఆలంబనగా చేసుకుని అక్కడ చోటు సంపాదించారు. తౌరెగ్ గిరిజనులతో పాటు లిబియా, ఆఫ్ఘనిస్థాన్, మధ్య ఆసియా తదితర దేశాలనుండి వచ్చిన ఇస్లామిక్ టెర్రరిస్టులు కూడా మాలి ప్రభుత్వంపై పోరాడుతున్నారు. సిరియాలో సెక్యులరిస్టు ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అమానుషమైన పేలుళ్లకు, హత్యాకాండలకు పాల్పడుతున్న ఆల్-ఖైదా టెర్రరిస్టులను తిరుగుబాటుదారులుగా, ప్రజాస్వామిక పోరాట వాదులుగా ఆకాశానికి ఎత్తుతున్న పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు అదే ఆల్-ఖైదా టెర్రరిస్టులపై మాలిలో బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.

తౌరెగ్ మిలట్రీ -ఫొటో: africanarguments.org

తౌరెగ్ మిలట్రీ -ఫొటో: africanarguments.org

తౌరెగ్ తిరుగుబాట్లు

ఆల్ జజీరా ప్రకారం ఆఫ్రికాలో తౌరెగ్ తెగ ప్రజలు రెండు నుండి మూడు మిలియన్ల వరకూ ఉంటారు. వీరు సాంప్రదాయకంగా పచ్చిక మైదానాలలో నివసించే దేశ దిమ్మరులు. సహారా, సహేల్ ల వ్యాపితంగా వీరు విస్తరించి ఉన్నారు. లిబియా, ఉత్తర నైజర్, దక్షిణ అల్జీరియా, ఉత్తర మాలి, బర్కినాఫాసో లలో ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. ఒక్క ఉత్తర మాలిలోనే మిలియన్ పైగా నివసిస్తున్నారు. తరతరాలుగా వీరు నిర్లక్ష్యానికి, అణచివేతకు గురవుతున్నారు. ఫ్రాన్సు వలస పానల ముగిశాక వీరు మాలి, నైజర్ లలో తిరుగుబాటు లేవదీశారు. 1962-64, 1990-95, 2007-09 సంవత్సరాల్లో వీరి తిరుగుబాట్లు వివిధ ఒప్పందాలతో ముగిసాయి. ఒప్పందాలను ప్రభుత్వాలు ఉల్లంఘించడంతో వారి సమస్యలు ఎన్నడూ పరిష్కారానికి నోచుకోలేదు. వనరుల పంపకంలో తగిన వాటా వారికి కలగానే మిగిలిపోయింది.

గడాఫీ సైనిక బలగాల్లో చోటు సంపాదించుకున్న తౌరెగ్ లు ఉన్నత స్థాయి జీవన సౌకర్యాలను అనుభవించారు. గడాఫీ మరణంతో దాదాపు రెండు నుండి మూడు వేల వరకూ సుశిక్షిత సైనికులు మాలిలోని స్వస్థాలకు తిరిగి వచ్చారు. వీరి నాయకత్వంలో పునరుద్భవించిన తాజా తిరుగుబాటు క్రమంగా ఇస్లామిస్టుల చేతుల్లోకి వెళ్ళినట్లు కనిపిస్తోంది. లేదా తౌరెగ్ ల న్యాయమైన తిరుగుబాటుకు ఆల్-ఖైదా ముద్ర వేయడానికి అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి చూస్తే తౌరెగ్ ల వాస్తవ ప్రజాస్వామిక ఆకాంక్షల కంటే విదేశాల నుండి వారితో చేరిన ఇస్లామిక్ మిలిటెంట్లకే ఎక్కువగా ప్రచారం లభిస్తోంది. ఫలితంగా తౌరెగ్ ల తిరుగుబాటు టెర్రరిస్టు తిరుగుబాటుగా ముద్ర పొందుతోంది. అయితే తిరుగుబాటులో పాల్గొంటున్న సంస్థలన్నీ తౌరెగ్ లకు వాస్తవ ప్రతినిధులుగా భావించనవసరం లేదు. ముఖ్యంగా ఆల్-ఖైదా పట్ల మొగ్గు చూపే శక్తులు పశ్చిమ దేశాలకు ప్రాక్సీ సంస్థలుగా గుర్తించాలి. పశ్చిమ దేశాల సైనిక చొరబాటుకు తగిన రాజకీయ, భౌతిక పరిస్ధితులను కల్పించడం వీరి ప్రధాన లక్ష్యంగా ఇప్పటికే అనేక ఉదాహరణలు తెలియజేశాయి.

శాంతికి మోకాలడ్డు

ది హిందూ నివేదన ప్రకారం ఐరాస భద్రతా సమితి గత కొన్ని నెలలుగా మాలి పై కేంద్రీకరించి చర్చలు సాగిస్తోంది; పశ్చిమ ఆఫ్రికా దేశాలను విశ్వాసంలోకి తీసుకుంటూ సమస్య పరిష్కారానికి కృషి సాగిస్తూ వచ్చింది. వివిధ పక్షాలన్నీ శాంతియుతంగా చర్చలు జరపాలని జులై 2012 లోనే ప్రతిపాదించి కృషి చేస్తోంది. పశ్చిమాఫ్రికా దేశాల వాణిజ్య కూటమి ఎకోవాస్ ఐరాస ప్రయత్నాలకు సహకరిస్తూ వచ్చింది. ముస్లిం సంస్థ అన్సర్ దినే, మాలి ప్రభుత్వం ల మధ్య చర్చలకు అది మధ్యవర్తిత్వం వహించింది. ఇంకా ఇతర గ్రూపులతో కూడా ఎకోవాస్ ద్వారా మాలి ప్రభుత్వం చర్చలు సాగించింది. శాంతి ప్రయత్నాలకు సహకరిస్తానని ఫ్రాన్సు కూడా హామీ ఇచ్చింది. అయితే హామీని ఉల్లంఘిస్తూ ఫ్రాన్సు అకస్మాత్తుగా సైనిక జోక్యానికి దిగడంతో ఐరాస సాగిస్తున్న శాంతి ప్రయత్నాలన్నీ తల్లకిందులయ్యాయి.

ఎకోవాస్, ఆఫ్రికన్ యూనియన్ కూటములు తామే ఒక శాంతి సైనిక బలగాలను మాలికి పంపుతామని భద్రతా సమితిని అనుమతి కోరాయి. African-led International Support Mission to Mali – AFISMA పేరుతో తాము మాలికి బలగాలు పంపుతామనీ, అందుకు తగిన శిక్షణ, సహకారం తమకు ఇవ్వాలని సదరు కూటములు కోరాయి. మాలి సంక్షోభం పరిష్కారానికి వివిధ ప్రాంతీయ చర్యలను అవి ప్రతిపాదించాయి. గూఢచార సమాచార సేకరణ, రవాణా సౌకర్యాలు, బలగాల తరలింపు, ప్రజల తరలింపు, మానవతా సాయం తదితర అంశాలతో కూడిన బ్లూ ప్రింట్ ను పశ్చిమాఫ్రికా దేశాల కూటములు ఐరాసకు సమర్పించాయి. ఐరాస సెక్రటరీ జనరల్ కూడా మాలి కి రాజకీయ పరిష్కారమే మంచిదని చెబుతూ ఆఫ్రికా దేశాల చొరవకు మద్దతు ఇచ్చాడు.

మాలి సమస్య పరిష్కారంలో ఆసక్తి ఉన్నట్లయితే ఈ చర్యలకు ఆర్ధిక, శిక్షణ మద్దతు ఫ్రాన్సు ఇచ్చి ఉండవచ్చు. కానీ ఆఫ్రికా దేశాలు తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటే పశ్చిమ దేశాలకు ఇక అక్కడ చోటు దొరకదు. దానితో ఈ పరిష్కారానికి ఫ్రాన్సు, అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలు ఆసక్తి చూపలేదు. పైగా మాలి లో తాము జోక్యం చేసుకోబోమని కూడా ఫ్రాన్సు రక్షణ మంత్రి జీన్-వేస్ లేడ్రియన్ ప్రకటించాడు. ఇప్పుడు అదే మంత్రి మాలిలో ఇప్పటికే బాంబులు కురిపిస్తున్న 2500 ఫ్రెంచి బలగాలకు తోడుగా మరో 1000 బలగాలు పంపుతున్నట్లు ప్రకటిస్తున్నాడు. తద్వారా ప్రపంచ శాంతికి మొదటి శత్రువులము తామేనని పశ్చిమ రాజ్యాల తరపున మరొక సారి నిస్సిగ్గుగా చాటుకుంటున్నాడు. ఆఫ్రికాలో క్రమంగా అదృశ్యం అవుతున్న తమ ప్రభావాన్ని పునరుద్ధరించుకోవాలన్న దుష్ట పన్నాగంతోనే శాంతి ప్రక్రియను అడ్డుకుని సైనిక జోక్యానికి ఫ్రాన్సు తెగించింది.

ఫ్రాన్సు తదితర పశ్చిమ దేశాలు మాలిలో సాగిస్తున్న మృత్యు క్రీడలో అంతిమంగా మాలి ప్రజలు సమిధలు అవుతుండగా, తౌరెగ్ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు, వారి న్యాయమైన స్వాతంత్ర్య కాంక్షలు అణచివేతకు గురవుతున్నాయి. ఈ పరిస్ధితుల్లో మాలిలో ఫ్రాన్సు సైనిక జోక్యాన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ముక్త కంఠంతో తిరస్కరించవలసిన అవసరం ఉంది.

One thought on “ఆఫ్రికాలో ఆల్-ఖైదా బూచి, మాలిలో ఫ్రాన్సాఫ్రిక్

  1. పింగ్‌బ్యాక్: హృదయం ద్రవించుకుపోయే కీన్యా మాల్ రక్తపాతం -ఫోటోలు | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s