దామిని స్మృతిలో…


దామిని, అమానత్, నిర్భయ పేరేదైతేనేం?

ఆమె…………………..

హింసోన్మత్త పశు వాంఛలు కాటువేసిన గాయం

పెను నిద్దురలోని దేశ అంతరాత్మని తట్టి లేపిన స్పర్శ

లాఠీలను గేలి చేసిన నినాదాలకు స్వరపేటిక

నీటి ఫిరంగులకు ఎదురొడ్డిన కన్నీటి జలపాతం

భారత మహిళ అదృశ్య కారాగార వాసానికి

దేదీప్య కాంతుల వెలుగు నిచ్చిన సాహసి!

పాలకుల ఉదాసీనత, పాలితుల కర్తవ్యాలు

తర్కించి, నిగ్గు దేల్చిన బాధల పాటల పల్లవి!

రెండు గంటల్లో వెయ్యి జీవితాల హింసాత్మక దాడిని

ఎదుర్కొని, ప్రతిఘటించి, భరించి, సొమ్మసిల్లి,

తేరుకుని, కళ్ళు తెరిపించి, కన్నుమూసి

నూతనోత్తేజం నింపిన చైతన్య దీప్తి!

వేలాది పేజీల, మాటల, గంటల నాణ్యమైన చర్చలకు

మేత అందించిన త్యాగమయి!

లక్షలాది బాధిత స్త్రీల ఆర్తనాదాలకు

మార్మోగే రాగాకృతి అమర్చిన శిధిల విపంచి!

పెఠేల్మని పేలుతున్న విశ్వాస శిల్ప శిధిలాలను

ఉమ్మడి చైతన్య హస్తాలతో కాచుకుని

పునరాకృతి ఇవ్వొచ్చని

కాసింత నమ్మకాన్నిచ్చిన అనామిక!

పేరేదైతేనేం, పుట్టుక ఎక్కడైతేనేం?

స్పందనకు కూడా వర్గ స్పృహ ఉందన్న

చేదు నిజాన్ని విప్పి చూపిన చరిత్ర సంతకం ఆమె!!!

-విజయ శేఖర్

7 thoughts on “దామిని స్మృతిలో…

  1. మీడియా చేసే ఓవర్ యాక్షన్ లేదా మీడియా ప్రభావిత ఓవర్ యాక్షన్ వల్ల మన దేశంలో రేప్‌ల సంఖ్య 1% కూడా తగ్గదు. ఆమెని రేప్ చేసినవాళ్ళకి మరణ శిక్ష వేస్తే ఆమె మెడికల్ కాలేజ్ విద్యార్థిని కావడం వల్లే ఆ రేపిస్ట్‌లకి మరణ శిక్ష వేశారనే విషయం ఇతర రేపిస్ట్‌లకి అర్థమైపోతుంది. అప్పుడు రేపిస్ట్‌లు డాక్టర్‌లని వదిలేసి టీచర్‌లనో, ఇతర స్త్రీలనో పట్టుకుని రేప్ చేస్తారు.

  2. నేరస్తులు మూర్ఖులే. కాదనను. కానీ పంగనామాలు పెట్టుకున్నవాళ్ళలాగ లోకం గురించి ఏమీ తెలియనివాళ్ళు మాత్రం కాదు.

  3. మార్క్సిస్ట్‌నని చెప్పుకునే మీరు మౌలిక అంశాలని మర్చిపోయి ఉపరితల అంశాలని పట్టుకుని వేలాడుతున్నారు. ఈ బొమ్మ చూడండి, అర్థమవుతుంది: http://streevimukti.mlmedia.net.in/173324082

  4. విశేఖర్ గారూ, మీ కవితాత్మక వ్యాఖ్యానం హృద్యంగా, కదిలించేలా ఉంది.

    >> పెఠేల్మని పేలుతున్న విశ్వాస శిల్ప శిధిలాలను
    ఉమ్మడి చైతన్య హస్తాలతో కాచుకుని
    పునరాకృతి ఇవ్వొచ్చని
    కాసింత నమ్మకాన్నిచ్చిన అనామిక!>>
    .. ఈ పాదాలు ఎంత వాస్తవం!

    Praveen గారూ,
    రేపిస్టులకు ఏమేం అర్థమవుతాయో; అలాంటి నేరగాళ్ళు మూర్ఖులైనా వారిదగ్గర ఎంతెంత తెలివి ఉంటుందో మీ వ్యాఖ్యల ద్వారా పాఠకులకు బాగా తెలుస్తున్నాయి!

  5. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశంలో డబ్బున్నవాళ్ళకి ఒక న్యాయం, పేదవాళ్ళకి ఇంకొక న్యాయం ఉంటుందని చాలా మందికి తెలియదా? రాజీవ్ గాంధీ హంతకులకి మరణ శిక్ష వెయ్యడం వల్ల తమిళనాడులో హత్యలు తగ్గాయని అన్నట్టుంది మీ వాదన.

వ్యాఖ్యానించండి