వైద్యంకోసం కాదు, జనానికి భయపడే సింగపూర్ తరలించారు -రాయిటర్స్


Undertakers and hospital staff carry the body of the Delhi gang rape victim into a van as they leave Mount Elizabeth Hospital for the morgue in Singapore December 29, 2012. REUTERS/Edgar Su

Undertakers and hospital staff carry the body of the Delhi gang rape victim into a van as they leave Mount Elizabeth Hospital for the morgue in Singapore December 29, 2012. REUTERS/Edgar Su

ఉవ్వెత్తున ఎగసిన ప్రజల ఆగ్రహానికి భయపడే భారత ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ అత్యాచారం బాధితురాలిని సింగపూర్ తరలించారని బ్రిటన్ వార్తా సంస్ధ రాయిటర్స్ నిర్ధారించింది. ప్రభుత్వ అత్యున్నత ఆసుపత్రులయిన ఎ.ఐ.ఐ.ఎం.ఎస్, సఫ్దర్ జంగ్ హాస్పిటల్ తో పాటు ఇతర వైద్య నిపుణులనూ,  పోలీసు అధికారులనూ ఇంటర్వూ చేసిన రాయిటర్స్ సంస్ధ ఈ నిర్ధారణకి వచ్చింది. బాధితురాలిని సింగపూర్ తరలించడానికి వ్యతిరేకంగా గొంతువిప్పిన కొంతమంది ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ వైద్య నిపుణులకు ‘తీవ్ర పరిణామాలు తప్పవంటూ’ హెచ్చరికలు వచ్చాయని రాయిటర్స్ తెలిపింది. దానితో ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత ఉన్నవారెవరూ మాట్లాడలేదనీ, మాట్లాడినా పేరు చెప్పడానికి ఇష్టపడలేదనీ తెలిపింది. బాధితురాలు మరణించడం తధ్యమని ఇండియాలో ఉండగానే అర్ధం అయిందనీ, ఇండియాలో మరణిస్తే ప్రజాగ్రహం చేయిదాటిపోతుందని ఇంటలిజెన్స్ వర్గాలు ఉప్పందించడంతో హుటాహుటిన సింగపూర్ తరలించారనీ రాయిటర్స్ తెలియజేసింది.

“ఆమె మరణం వరకూ దారితీసిన ఘటనలను ఒకచోట చేర్చి చూస్తే అత్యాచారంపై ప్రజల ఆగ్రహాన్ని నీరు గార్చడానికి ఢిల్లీ అధికారులు ఏ విధంగా తంటాలు పడిందీ అర్ధం అవుతుంది. ఆమెకు అత్యంత మెరుగైన చికిత్స అందిస్తున్నామని మొదట చెప్పిన అధికారులు ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండడంతో, జరగకూడనిది జరిగితే, అప్పటికే ఎగువ పరిమితులను తాకిన ప్రజల నిస్పృహ మరింత ఉధృతమై తమ నియంత్రణ దాటిపోతుందని ప్రభుత్వ పెద్దలు భయపడడం ప్రారంభించారు.” అని రాయిటర్స్ తెలిపింది.

రాయిటర్స్ సంస్ధ ఇంకా ఇలా తెలియజేసింది. “క్రిష్టమస్ రాత్రి బాగా పొద్దుపోయాక అమ్మాయికి గుండెపోటు రావడంతో ప్రభుత్వం గుండెల్లో హెచ్చరిక గంటలు మోగడం మొదలయింది. తీవ్రమైన పరిస్ధితుల్లో ఉన్న అమ్మాయిని సఫ్దర్ జంగ్ హాస్పిటల్ కి తెచ్చి అప్పటికి తొమ్మిది రోజులు. బతకడానికి ఉండే అవకాశాలను 1 నుండి 6 వరకు ఉండే స్కేలుపైన డాక్టర్లు అంచనావేస్తారు. (6 అంటే బతకడానికి అవకాశాలు ఖచ్చితంగా లేనట్లు. 1 అయితే బతికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నట్లు.) అలాంటి స్కేలుపైన అమ్మాయి బతకడానికి గల అవకాశాలు క్రిస్టమస్ రాత్రికి 5 గా లెక్కించారు. (అంటే అమ్మాయి బతకాలంటే ఏదో అద్భుతం జరగాలన్నట్లే.) గుండెనొప్పి తర్వాత ఆమె గుండె రేటు అత్యంత బలహీనస్ధాయికి పడిపోయింది. మూడు, నాలుగు నిమిషాలు ప్రయత్నించి డాక్టర్లు ఆమె గుండెను మళ్ళీ కొట్టుకునేట్లు చేయగలిగారు. కానీ ఆ తర్వాత మెదడుకి రక్తసరఫరా లేకపోవడంతో ఆమె స్పృహలోకి రాలేదు. ఆ క్షణం మొదలుకొని దామిని మళ్ళీ కళ్ళు తెరవలేదు.”

“గాయపడిన పేగులనుండి ఇన్ఫెక్షన్ ఆమె రక్తంలోకి చొరబడడంతో సదరు ఇన్ఫెక్షన్ కీలక శరీర భాగాలన్నింటికి విస్తరించి ప్రమాదకరంగా పరిణమించింది. ‘రాజధాని నగరంలో మహిళలకు రక్షణ కరువు’ అన్న అంశం కేంద్రంగా సంఖ్యలోనూ, తీవ్రతలోనూ మున్నెన్నడూలేనంత ఉధృతంగా చెలరేగిన ఆందోళనలతో కుదుళ్లు కదిలిపోయినంతగా వణికిపోయిన ప్రభుత్వానికి అమ్మాయి మరణించడం అంటే మరింత ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్ధితి. దానితో మరుసటిరోజే కేంద్ర కేబినెట్ సమావేశం కావడం, అమ్మాయిని ఎయిర్ అంబులెన్స్ లో సింగపూర్ తరలించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిపోయింది.

అమ్మాయి ఇండియాలో మరణిస్తే ఆమెను మెరుగైన చికిత్సకోసం విదేశాలకు ఎందుకు తరలించలేదన్న ప్రశ్న ఉదయిస్తుందనీ, సోనియా గాంధీ తన చికిత్సకోసం విదేశాలకు వెళ్ళగా లేనిదీ దామిని ఎందుకు వెళ్లలేదని ప్రశ్నలు ఎదురవుతాయనీ సింగపూర్ తరలించడానికి అదికూడా ఒక కరణమేననీ అధికారులు చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. కానీ రాయిటర్సే గుర్తించినట్లుగా ప్రపంచంలో వైద్య చికిత్సలకు భారత దేశమే పెట్టింది పేరు. ప్రపంచం నలుమూలలనుండీ వైద్యం కోసం రోగులు అనేకమంది భారతదేశం వస్తుంటారు. “కీలకమైన చికిత్సల కోసం భారతదేశం నుండి రోగులు విదేశాలకు వెళ్ళడం అత్యంత అరుదు. నిజానికి చికిత్సకోసం అనేకమంది ఇండియాకి రావడమే ఎక్కువ” అని రాయిటర్స్ రాసిందంటే భారతదేశ వైద్యరంగం స్ధాయి అర్ధం చేసుకోవచ్చు. పైగా దామినికి అత్యంత మెరుగైన చికిత్స అందిస్తున్నామని ప్రభుత్వంతో పాటు డాక్టర్లు కూడా చెబుతూనే ఉన్నారు. కనుక విదేశాలకు ఎందుకు తీసుకెళ్లలేదు అన్నది సమాధానం చెప్పలేని ప్రశ్నేమీ కాదు. అంతేకాకుండా పేరుపొందిన అనేకమంది వైద్య నిపుణులు విదేశాలకు తరలించాల్సిన అవసరం ఏమిటని కూడా ప్రశ్నించారు. సింగపూర్ తరలింపు రాజకీయ నిర్ణయమేనని కొందరు డాక్టర్లు చెప్పారు కూడా.

ప్రభుత్వం భయం అంతా ప్రజల ఆగ్రహజ్వాలల గురించే. ఒక పక్క కేబినెట్ సమావేశం జరుగుతుండగా ఆ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు, రేపిడ్ యాక్షన్ బలగాలు, గూఢచారులతో నింపవలసిన పరిస్ధితి. అంతకు కొద్దిరోజులముందు ఆ ప్రాంతం నిండా జనమే. హోరెత్తే నినాదాలతో, వేలాదిమంది విద్యార్ధులు, ఉద్యోగులు, గృహిణులు, వృద్ధులు రాజప్రాసాదాలను బెంబేలెత్తించారు. దుర్ఘటనపై మండిపడుతూ నిరసనకారుల్లో కొందరు భారతదేశ ప్రధాన అధికార భవనాలైన సౌత్, నార్త్ బ్లాక్ గోడలను ఎగబాకుతుంటే మరికొందరు రాష్ట్రపతి భవన్ ఇనప గేట్లు ఎక్కి నినాదాలతో కంపింపజేశారు. “ఢిల్లీలో క్షేమంగా ఉన్న మహిళలు ఇద్దరే ఇద్దరు. వారు సోనియా గాంధీ, షీలా దీక్షిత్ లు” అంటూ పరిహసించిన జనానికి సమాధానం ఇచ్చిన నాధుడు లేడు, పోలీసు లాఠీలు, టియర్ గ్యాస్ కేనిస్టర్లు, వాటర్ కెనాన్లు తప్ప.

అంతమంది విద్యార్ధులు, యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి నిరసిస్తారని ప్రభుత్వం ఊహించలేకపోయిందని ఒక ప్రభుత్వ అధికారి చెప్పినట్లుగా రాయిటర్స్ తెలియజేసింది. రాష్ట్రపతి భవన్ వరకూ నిరసనకారులు చొచ్చుకు రావడంతో వారు ఎర్రగీత దాటినట్లుగా ప్రభుత్వం భావించిందని రాయిటర్స్ తెలిపింది. అందుకే పోలీసులు విరుచుకుపడ్డారన్న సూచన ఇందులో ఉంది. కానీ పోలీసు దమనకాండకు వాస్తవ కారణం ఇదికాదనీ రష్యా అధ్యక్షుడు పుటిన్ తో పదుల వేలకోట్ల రక్షణ ఒప్పందాలు ‘రైసినా హిల్స్’ భవనాల్లో జరగనుండడంతో జనాన్ని క్లియర్ చేయడానికి జనంపై ఉక్కుపాదం మోపారనీ పత్రికలు గతంలోనే స్పష్టం చేశాయి.

కేబినెట్ నిర్ణయం అయ్యాక పనులు చకచకా జరిగిపోయాయి. ఎయిర్ అంబులెన్స్ నడిపే ప్రవేటు వైద్యసర్వీసుల సంస్ధ మేదాంత మెడిసిటీ ని రంగంలోకి దించారు. దామిని ప్రయాణం చేయగల స్ధితిలో ఉన్నదోలేదో కూడా మేదాంత డాక్టర్లే నిర్ణయించారు. ఆమెతో పాటే వెళ్ళిన డాక్టర్ మెహతా తన బాధ్యత ఆమె ప్రయాణించగలదో లేదో చెప్పడమేననీ, తరలించాలన్న నిర్ణయం ప్రభుత్వానిదేననీ తెలిపాడు. అవయవ మార్పిడి ఆసుపత్రులు ఉన్న బ్రిటన్, కెనడా లను కూడా పరిశీలించరానీ కానీ 4000 కి.మీ దూరంలో ఉన్న సింగపూర్ మంచిదని అంతిమంగా నిర్ణయించారనీ రాయిటర్స్ తెలిపింది. ‘అవయవ మార్పిడి’ అంటూ చేసిన హడావుడిని డాక్టర్లెవరూ విశ్వసించలేదు. ఎందుకంటే అవయవ మార్పిడి అంటూ జరిగితే అది అమ్మాయి ఆరోగ్యం స్ధిరపడిన నెలల తర్వాతే  తప్ప వెంటనే జరిగేదేమీ కాదు. అమ్మాయి ఆరోగ్యం కోసమే అని చెప్పాక ఆమె కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం చెప్పలేదు. తీరా చూస్తే విమాన ప్రయాణంలో అమ్మాయి బి.పి మరింతగా పడిపోయింది. ఫలితంగా ఆమె అత్యంత ఆందోళనకర స్ధితిలో ఉండగా తమ ఆసుపత్రిలో చేర్చారని సింగపూర్ ఆసుపత్రి ప్రకటించింది. గుండెతో పాటు మెదడు, ఊపిరితిత్తులు, పొత్తికడుపు ఏవీ సహకరించడం వారు తెలిపారు.

“నిన్న ఆమెను ఇక్కడ చేర్చాక మా వైద్యబృందం జరిపిన పరీక్షల ప్రకారం ఆమె అప్పటికే గుండెపోటుకి గురికాగా అదనంగా పొత్తికడుపు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరి ఉంది. మెదడుగా గుర్తించదగిన గాయం తగిలింది” అని సింగపూర్ ఆసుపత్రి సి.ఇ.ఓ కెల్విన్ లో చెప్పాడని రాయిటర్స్ తెలిపింది. ఆమె పరిస్ధితి క్షీణిస్తోందని ఆదేరోజు తర్వాత లో తెలిపాడు. అంతిమ క్షణాలు సమీపిస్తున్నాయని అక్కడఉన్న కుటుంబ సభ్యులకు చెప్పేశారు. “తను ఇంత త్వరగా వెళ్లిపోతుందని మేము అనుకోలేదు. రాత్రి 9:30 కి డాక్టర్లు మమ్మల్ని లోపలికి పిలిచారు. తామిక చేసేదేమీ లేదని చెబుతూ సారీ చెప్పారు. ముఖ్యమైన అవయవాలు ఆగిపోయాయని తెలిపారు.” అని దామిని తమ్ముడిని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది.

“మేము లోపలికి వెళ్ళి ఆమెవద్దనే ఆ రాత్రంతా గడిపాము. ఆమె గుండెరేటు క్రమంగా పడిపోవడం తెరపై చూసాము. అదలా పడిపోతూ సున్న వద్ద ఆగిపోయింది. అప్పటికి సమయం ఉదయం 4:05”

ఆ విధంగా దామిని అలుపెరుగని పోరాటం సింగపూర్ లో తనకు మద్దతుగా నిలిచిన కోట్లాది భారతీయులకు దూరంగా ముగిసిపోయింది. భారత ప్రజలు మరోసారి తమ పరిస్ధుతులపై ప్రభుత్వం గల్లా పట్టి నిలదీసే అవకాశాన్ని కోల్పోయారు. కాదు, కాదు. కోల్పోయేలా చేయడంలో భారత ప్రభుత్వ పెద్దలు సఫలం అయ్యారు. భారత ప్రజలే ఉవ్వెత్తున ఉద్యమించి ఉండకపోతే అమానత్/దామిని/నిర్భయ కధ భారత ప్రభుత్వం సంవత్సరంవారీగా ప్రకటించే అత్యాచారాల లెక్కల్లో ఒకటిగా మాత్రమే మిగిలి ఉండేది.

6 thoughts on “వైద్యంకోసం కాదు, జనానికి భయపడే సింగపూర్ తరలించారు -రాయిటర్స్

  1. ఎల్లప్పుడూ మనకు ప్రభుత్వాల తప్పులే కనబడతాయి. కనబడాలి కూడా – లేకపోతే మనం పాలిత ప్రజలం కాము కదా!

    చనిపోయిన ఆ అమ్మాయి స్నేహితుడే చెప్పినట్లు, ఘటన జరిగి నగ్నంగా అసహాయ స్థితిలో దీనంగా వారిరువురూ అక్షరాలా రోడ్డు మీద పడి ఉన్న సమయంలో – ఇంత ఆగ్రహ జ్వాలలు వెళ్ళగక్కిన – దేశరాజధాని ప్రజల్లో అనేకులు వారి ప్రక్కనుండే చూస్తూ దూసుకు పోయారు కాని – దాదాపు ఒక గంట దాకా – యెవరూ స్పందించ లేదు.

    మరి దీనికి ప్రజలు యెవరిని తప్పుబడుతున్నారు?
    ఈ విషయంలో యెవరూ పశ్చాత్తాపపడుతున్నట్లు వినబడలేదు.

    దాని సంగతి యేమిటి?
    నిత్యం కేవల ప్రభుత్వపు తప్పులు వెదకి నిందించుకుంటూ కూర్చుంటే మన బాధ్యతలు తీరిపోతాయా ప్రజలారా?

  2. ఢిల్లీ సంఘటన తర్వాత వరుసగా ప్రచురితమవుతున్న పోష్టులు అనేక కోణాలలో చర్చకు దోహదపడుతున్నాయి. ఒక (అత్యాచారాన్ని)స్త్రీపై జరిగిన భౌతిక దాడిని ఎలా చూడాలి, దానిపై సమాజం, సమాజం నెత్తిన పీడలా కూర్చున్న పెద్దలు ఎలా స్పందిస్తున్నారు, అసలు ఈ సంఘటన ఇంతగా జనానికి పట్టడానికి కారణమేమిటి, ఈ సంఘటన జరగడానికి నేపథ్యం ఏమిటి వంటి విషయాలు అనేక మంచిచెడ్డలతో కలగలిపి చర్చ జరిగింది. ఇక రమ గారు రాసిన పోష్టులో అయితే అనేక కీలకమైన అంశాలను ఆమె ప్రస్తావించడం జరిగింది. వీటన్నింటినీ పాఠకుల దృష్టికి మరోసారి తెస్తూనే మరికొన్ని విషయాలను పాఠకుల ముందుంచడానికి కొన్ని మాటలను రాస్తున్నాను.

    ఒక అమానవీయమైన ఘాతుకం జరిగినపుడు ప్రవీణ్ గారు డేటింగ్ కల్చర్ వంటి విషయాలపై తన వైఖరిని రాసి పాఠకుల తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఒక సంఘటన జరిగినపుడు, తీవ్రమైన మానసిక ఉద్వేగాలు నెలకొని ఉన్నపుడు డేటింగ్ వంటి అంశాలను, సామ్రాజ్యవాద సంస్కృతితో కలగలిపి ఆయన ప్రస్తావించాడు. ఇటు సామ్రాజ్య వాద సంస్కృతిని వ్యతిరేకించడంతో పాటుగా, డేటింగ్ వంటి విషయాలపై తన వ్యతిరేకతను ప్రకటించి పాఠకుల వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. సందర్భ శుద్ధి లేక పోవడం, సంక్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడంలోనూ, వ్యక్తీకరించడంలోనూ సరైన శిక్షణ లేక పోవడం వలన ఎదురైన ఇబ్బంది ఇది. ఈ సందర్భంగా రాజ శేఖర రాజు చేసిన వ్యాఖ్యలు విలువైనవి.

    ఇక ఈ సంఘటన జరగగానే మన పెద్దలు తమ స్వభావ్వాన్ని వెల్లడించడానికి ఏ మాత్రమూ జంకలేదు. తమ ప్రజాస్వామిక వ్యతిరేకతనూ, వాచాలతనూ నిర్లజ్జగా వ్యక్తీకరించుకున్నారు. ఇక రాజ్యం అయితే తను ఊహించని ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి నానా కుప్పిగంతులు వేసింది. సోనియా గాద్గదికంగా వచించింది. జయా బచ్చన్ అయితే కన్నీరే పెట్టుకుంది. ఈ వ్యక్తీకరణలు నిజమైనవేనా లేకుంటే మరొకటా అన్న కోణాన్ని వెల్లడి చేస్తూ, రమ గారు ఒక ప్రశ్నావళినే పాఠకుల ముందుంచారు. ఇవి పాలకుల స్వభావాన్ని వెల్లడి చేసేవి.

    అత్యాచారం వంటి విషయాలను ఎలా పరిగణించాలి అనే విషయాన్నితెలియజేస్తూ బాధితుల గొంతుకలతో వచ్చిన పోష్టులు, ఢిల్లీ సంఘటనపై వివిధ వ్యక్తులు మాట్లాడిన మాటలపై వచ్చిన వ్యాఖ్యలు రెండు విషయాలను ముందుకు తెస్తున్నాయి. ఒకటి: అది కూడా శరీరంపై జరిగిన దాడి లాంటిదే. ఈ వైఖరి బాధితులకు మనో దైర్యాన్ని ఇవ్వడమే కాకుండా, సెక్స్‍కు సంబంధించిన అనేక విషయాలను మాట్లాడానికి భూమికను కలిగిస్తోంది. రెండవది: సమాజంలో భాగంగా ఉన్న ఒక వ్యక్తిపై (స్త్రీపై) ఇలాంటి దాడి జరిగినపుడు అది శారీరకమైన అంశాలతో పాటుగా, సాంస్కృతిక, మానసిక, ఉద్వేగ సంబంధమైన అంశాలను కూడా ముందుకు తెస్తుంది. దాడికి గురైన వ్యక్తి స్పందన ఎలా ఉంది, సమాజం దాని గురించి ఎలా స్పందిస్తోంది వంటి విషయాలను ఇది చర్చకు తెస్తుంది. ఇది అనివార్యంగా మనముంటున్న సమాజపు మంచి చెడ్డలను అభిప్రాయాల రూపంలో, వ్యక్తీకరణల రూపంలో మన కళ్ళముందుకు తెస్తుంది. సమాజాన్ని అధ్యయనం చేయడానికి ఇవి విలువైన అనుభవాలుగా ఉపయోగపడతాయి. ఈ నేపథ్యం నుండి వీటిని అర్థం చేసుకోవాలి.

    ఈ సంఘటనపై మధ్యతరగతి ప్రజల నుండి తీవ్రమైన ఆగ్రహం వెల్లడైంది. ఉపాది, విద్య వంటి విషయాలలో మధ్యతరగతిలో వస్తున్న మార్పును ఇది సూచిస్తోంది. లింగ బేధాలను పక్కన పెట్టి, తమ బిడ్డలను కొత్త చదువులకు, కొత్త కొత్త ఉపాదులకు మధ్య తరగతి ఈ మధ్యనే అనుమతిస్తోంది. దీని వెనుక డాలర్ డ్రీమ్స్ కూడా ఉన్న మాట నిజమే. ఏది ఏమైనా ఆడపిల్లలను కూడా ఖర్చుతో కూడిన సాంకేతిక విద్య నందించడానికీ, ఉద్యోగం నిమిత్తం దూర ప్రాంతాలకు పంపడానికి, పని వేళల హద్ధులను కూడా దాటడానికి వారు అంగీకరిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ సంఘటన మధ్యతరగతిలో అభద్రతను, ప్రభుత్వాల పట్ల అపనమ్మికనూ కలిగిస్తుంది. కనుకనే మధ్య తరగతి ప్రజానీకం తీవ్రంగా స్పందించింది. వేతన జీవుల ఈ ఆగ్రహం ప్రభుత్వానికి కూడా అర్థం అయింది. అందుకనే అది కొంతయినా కదిలింది.

    ఇక ఈ సందర్భంగా చట్టాల ప్రస్తావన కూడా వచ్చింది. మనకున్న చట్టాలు సరిపోతాయా, లేదా అనే చర్చ కూడా వచ్చింది. మనకున్న దురవస్థ ఏమిటంటే చట్టాలు చేయించడం ఒక ఎత్తయితే, వాటిని అమలు చేయమని అడగడం మరో ప్రస్థానంలాగా అవుతోంది. ఇంతా చేసి చట్టాలు అసహాయుల మీద పని చేసినంత తీవ్రతగా అయిన వాళ్ళమీద తమ ప్రతాపం చూపలేక పోవడం కూడా ఉంది.

    చివరగా మన ఆధునికత గురించి చెప్పుకోవలసిన మాట మరొకటి ఉంది. ఒక వైపు ఇది మధ్య తరగతికి చెందిన స్త్రీలకు కొత్త అవకాశాలను కలిగిస్తోంది. ఇది పురోగామి అంశంగా కనిపించినప్పటికీ, దానికిమరో వైపున లక్షలాదిమంది మట్టి మనుషులను తమ నేల నుండి, చేతివృత్తుల నుండి పరాయీకరించి, కూలీలుగా, వలస జీవులుగా, అధోజగత్ జీవులుగా, కూనీకోరులుగా,లుంపెన్ మూకలుగా ఇది మారుస్తోంది. ఇలాంటి వాళ్ళే ఇప్పుడు మన ముందు నిందితులు. మన ఆధునికత మధ్య తరగతి స్త్రీలకు కొత్త అవకాశాలను చవి చూపిస్తూనే, ఇంతకు ముందటి భద్రతనూ, గుర్తింపునూ కూడా రద్దు చేస్తూ ఆమెనొక అంగంగా, శరీరంగా పరిగణించడం వల్లనే ఈ ఘోరం జరిగింది. శరీర వ్యాపారం కేంద్రంగా అభిరుచులూ, విలువలూ తయారవుతున్న కాలంలో హింస, పాశవికత ఎంత తారాస్థాయికి చేరుకుంటుందో మనమిప్పుడు చూసాం. స్త్రీ గడప దాటడానికి సమయాసమయాలను లెక్కించే సమాజం ఒక వైపు , మరో వైపు స్త్రీ అంటే శరీరం తప్ప మరొకటి కాదనే వైఖరితో ఎదురవున్న వాస్తవాలను ఈ పోష్టులు వెలుగులోకి తెచ్చాయి.

  3. నాగరాజు గారు, నేను ఈ ఘటన విషయంలో విశేఖర్ గారి అత్యుత్సాహాన్ని విమర్శించడానికి ప్రధాన కారణం ఆయన పోస్ట్‌లలో వర్గ స్పృహ లోపించడం. కేవలం సామ్రాజ్యవాద సంస్కృతి గురించి ఇక్కడ మాట్లాడలేదు. పల్లెటూరిలో చేతబడి చేసిందనే అనుమానంతో ఒక స్త్రీని రేప్ చేసి ఊరంతా నగ్నంగా ఊరేగించినా పట్టించుకోనివాళ్ళు ఒక మహానగరంలోని మెడికల్ కాలేజ్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన తరువాత తమ వ్యక్తిగత భద్రత విషయంలో భయపడ్డారు. తమ దాక వస్తే గానీ దేన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకునే వ్యక్తివాదం ఇక్కడ స్పష్టంగా బయటపడింది. ఒరిస్సాలోని రౌర్‌కేలా పట్టణంలో ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆమె తండ్రి ఆమెని ఒక నాటువైద్యుని దగ్గరకి తీసుకెళ్ళాడు. నాటు వైద్యుడు ఆమెకి చికిత్స చెయ్యడంలో విఫలమై, ఆమెకి మున్నీ అనే మహిళ దృష్టి తగిలిందని చెప్పాడు. ఆ అమ్మాయి బంధువులు ఆ నాటు వైద్యుని మాటని నమ్ముతున్నట్టు నటించి, వాంఛలు తీర్చుకోవడానికి ఇదే మంచి సమయం అనుకుని, ఆ నాటు వైద్యుడు చెప్పిన మహిళని ఇంటి నుంచి బయటకి లాగి బహిరంగంగా రేప్ చేశారు. అడ్డువచ్చిన ఇద్దరు స్త్రీలని కొట్టారు. ఆ ఇద్దరినీ లాక్కెళ్ళి రైలు పట్టాల మీద పడేసి కిరోసీన్ పోశారు. పారిపోవడానికి ప్రయత్నిస్తే అగ్గి పుల్ల వెలిగించి విసురుతామని బెదిరించారు. ఈ ఘటన ఢిల్లీ బస్‌లో జరిగిన రేప్ ఘటన కంటే తక్కువ తీవ్రత ఉన్నదా? ఈ వార్త ఒరిస్సా రాష్ట్రంలోని వార్తా పత్రికలలో వచ్చింది కానీ జాతీయ పత్రికలలో రాలేదు. ఢిల్లీ బస్‌లో జరిగిన రేప్ ఘటన గురించిన వార్త మాత్రం అంతర్జాతీయ పత్రికలలో కూడా వచ్చింది. ఒక మెడికల్ కాలేజ్ విద్యార్థిని జీవితంపై మాత్రమే ఎందుకింత శ్రద్ధ? జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో చేతబడి అనుమానం వల్లో, దృష్టి తగలడం అనుమానం వల్లో రేప్‌కి గురవుతోన్న మహిళలు మాత్రం మనుషులు కాదా? వీళ్ళపై శ్రద్ధ ఉండకూడదా?

  4. తీగె లాగితే డొంకంతా కదిలినట్టు , ఢిల్లీ లో జరిగిన ఈ అత్యాచారం, దేశ ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చింది, ప్రస్తుతానికి కనీసం అట్లాంటి విషయాల గురించి బహిరంగం గా మాట్లాడు కోడానికీ , తమ తమ నిరశన లు ఏదో ఒక రూపం లో తెలుపడానికీ !
    గమనించ వలసిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే , ప్రపంచీకరణ, సాంకేతిక అభివృద్ధీ , ప్రస్తుతం దేశం లోనూ , ప్రపంచం లోనూ జరుగుతున్న అత్యాచారాలూ , అన్యాయాలూ అందరికీ ( కనీసం ఇంటర్నెట్ ఉన్న వారందరికీ ) తెలుస్తున్నాయి. అంతే కాక , అట్లాంటి సంఘటనలు కూడా అంతర్జాతీయమే !
    ( ఆంటే అవి మన దేశానికి ప్రత్యేకం ఏమీ కాదు ! ) కానీ జరగవలసినది ఏమిటంటే , కేవలం తెలుసుకోవడమే కాకుండా ,వాటి నివారణకూ , తగ్గించడానికీ తీసుకోవలసిన నిర్మాణాత్మక చర్యలు స్పష్టం గా లోపిస్తున్నాయి. వీటికి కారణాలు అనేకం. ” మనసుంటే మార్గం ఉంటుంది ” ” ఆ మనసు ‘ ఎంత మందికి ఉంది ?

  5. స్త్రీ గడప దాటడానికి సమయాసమయాలను లెక్కించే సమాజం ఒక వైపు , మరో వైపు స్త్రీ అంటే శరీరం తప్ప మరొకటి కాదనే వైఖరితో ఎదురవున్న వాస్తవాలను ఈ పోష్టులు వెలుగులోకి తెచ్చాయి.

    చాలాబాగా చెప్పారు. రమ గారు టపాకు లింకివ్వగలరా?

  6. Unknown గారూ, ‘కూతుళ్లకి కాదు, కొడుకులకి కాపలా కాయండి’ టైటిల్ తో ఉన్న టపాయే రమ గారు రాసినది. అది హోమ్ పేజిలో కనపడుతోంది. ఐనా మీ సౌలభ్యం కోసం లింక్ ఇస్తున్నాను.

    http://wp.me/p1kSha-3D9

వ్యాఖ్యానించండి