ఢిల్లీ అత్యాచారంపై టపాలు, ఒక పరిశీలన


Art by Sarah Williams (New York Times)

Art by Sarah Williams (New York Times)

రచన: నాగరాజు

ఢిల్లీ సంఘటన తర్వాత వరుసగా ప్రచురితమవుతున్న పోష్టులు అనేక కోణాలలో చర్చకు దోహదపడుతున్నాయి. ఒక (అత్యాచారాన్ని)స్త్రీపై జరిగిన భౌతిక దాడిని ఎలా చూడాలి, దానిపై సమాజం, సమాజం నెత్తిన పీడలా కూర్చున్న పెద్దలు ఎలా స్పందిస్తున్నారు, అసలు ఈ సంఘటన ఇంతగా జనానికి పట్టడానికి కారణమేమిటి, ఈ సంఘటన జరగడానికి నేపథ్యం ఏమిటి వంటి విషయాలు అనేక మంచిచెడ్డలతో కలగలిపి చర్చ జరిగింది. ఇక రమ గారు రాసిన పోష్టులో అయితే అనేక కీలకమైన అంశాలను ఆమె ప్రస్తావించడం జరిగింది. వీటన్నింటినీ పాఠకుల దృష్టికి మరోసారి తెస్తూనే మరికొన్ని విషయాలను పాఠకుల ముందుంచడానికి కొన్ని మాటలను రాస్తున్నాను.

ఒక అమానవీయమైన ఘాతుకం జరిగినపుడు ప్రవీణ్ గారు డేటింగ్ కల్చర్ వంటి విషయాలపై తన వైఖరిని రాసి పాఠకుల తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఒక సంఘటన జరిగినపుడు, తీవ్రమైన మానసిక ఉద్వేగాలు నెలకొని ఉన్నపుడు డేటింగ్ వంటి అంశాలను, సామ్రాజ్యవాద సంస్కృతితో కలగలిపి ఆయన ప్రస్తావించాడు. ఇటు సామ్రాజ్య వాద సంస్కృతిని వ్యతిరేకించడంతో పాటుగా, డేటింగ్ వంటి విషయాలపై తన వ్యతిరేకతను ప్రకటించి పాఠకుల వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. సందర్భ శుద్ధి లేక పోవడం, సంక్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడంలోనూ, వ్యక్తీకరించడంలోనూ సరైన శిక్షణ లేక పోవడం వలన ఎదురైన ఇబ్బంది ఇది. ఈ సందర్భంగా రాజ శేఖర రాజు చేసిన వ్యాఖ్యలు విలువైనవి.

ఇక ఈ సంఘటన జరగగానే మన పెద్దలు తమ స్వభావ్వాన్ని వెల్లడించడానికి ఏ మాత్రమూ జంకలేదు. తమ ప్రజాస్వామిక వ్యతిరేకతనూ, వాచాలతనూ నిర్లజ్జగా వ్యక్తీకరించుకున్నారు. ఇక రాజ్యం అయితే తను ఊహించని ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి నానా కుప్పిగంతులు వేసింది. సోనియా గాద్గదికంగా వచించింది. జయా బచ్చన్ అయితే కన్నీరే పెట్టుకుంది. ఈ వ్యక్తీకరణలు నిజమైనవేనా లేకుంటే మరొకటా అన్న కోణాన్ని వెల్లడి చేస్తూ, రమ గారు ఒక ప్రశ్నావళినే పాఠకుల ముందుంచారు. ఇవి పాలకుల స్వభావాన్ని వెల్లడి చేసేవి.

అత్యాచారం వంటి విషయాలను ఎలా పరిగణించాలి అనే విషయాన్నితెలియజేస్తూ బాధితుల గొంతుకలతో వచ్చిన పోష్టులు, ఢిల్లీ సంఘటనపై వివిధ వ్యక్తులు మాట్లాడిన మాటలపై వచ్చిన వ్యాఖ్యలు రెండు విషయాలను ముందుకు తెస్తున్నాయి. ఒకటి: అది కూడా శరీరంపై జరిగిన దాడి లాంటిదే. ఈ వైఖరి బాధితులకు మనో దైర్యాన్ని ఇవ్వడమే కాకుండా, సెక్స్‍కు సంబంధించిన అనేక విషయాలను మాట్లాడానికి భూమికను కలిగిస్తోంది. రెండవది: సమాజంలో భాగంగా ఉన్న ఒక వ్యక్తిపై (స్త్రీపై) ఇలాంటి దాడి జరిగినపుడు అది శారీరకమైన అంశాలతో పాటుగా, సాంస్కృతిక, మానసిక, ఉద్వేగ సంబంధమైన అంశాలను కూడా ముందుకు తెస్తుంది. దాడికి గురైన వ్యక్తి స్పందన ఎలా ఉంది, సమాజం దాని గురించి ఎలా స్పందిస్తోంది వంటి విషయాలను ఇది చర్చకు తెస్తుంది. ఇది అనివార్యంగా మనముంటున్న సమాజపు మంచి చెడ్డలను అభిప్రాయాల రూపంలో, వ్యక్తీకరణల రూపంలో మన కళ్ళముందుకు తెస్తుంది. సమాజాన్ని అధ్యయనం చేయడానికి ఇవి విలువైన అనుభవాలుగా ఉపయోగపడతాయి. ఈ నేపథ్యం నుండి వీటిని అర్థం చేసుకోవాలి.

ఈ సంఘటనపై మధ్యతరగతి ప్రజల నుండి తీవ్రమైన ఆగ్రహం వెల్లడైంది. ఉపాది, విద్య వంటి విషయాలలో మధ్యతరగతిలో వస్తున్న మార్పును ఇది సూచిస్తోంది. లింగ బేధాలను పక్కన పెట్టి, తమ బిడ్డలను కొత్త చదువులకు, కొత్త కొత్త ఉపాదులకు మధ్య తరగతి ఈ మధ్యనే అనుమతిస్తోంది. దీని వెనుక డాలర్ డ్రీమ్స్ కూడా ఉన్న మాట నిజమే. ఏది ఏమైనా ఆడపిల్లలను కూడా ఖర్చుతో కూడిన సాంకేతిక విద్య నందించడానికీ, ఉద్యోగం నిమిత్తం దూర ప్రాంతాలకు పంపడానికి, పని వేళల హద్ధులను కూడా దాటడానికి వారు అంగీకరిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ సంఘటన మధ్యతరగతిలో అభద్రతను, ప్రభుత్వాల పట్ల అపనమ్మికనూ కలిగిస్తుంది. కనుకనే మధ్య తరగతి ప్రజానీకం తీవ్రంగా స్పందించింది. వేతన జీవుల ఈ ఆగ్రహం ప్రభుత్వానికి కూడా అర్థం అయింది. అందుకనే అది కొంతయినా కదిలింది.

ఇక ఈ సందర్భంగా చట్టాల ప్రస్తావన కూడా వచ్చింది. మనకున్న చట్టాలు సరిపోతాయా, లేదా అనే చర్చ కూడా వచ్చింది. మనకున్న దురవస్థ ఏమిటంటే చట్టాలు చేయించడం ఒక ఎత్తయితే, వాటిని అమలు చేయమని అడగడం మరో ప్రస్థానంలాగా అవుతోంది. ఇంతా చేసి చట్టాలు అసహాయుల మీద పని చేసినంత తీవ్రతగా అయిన వాళ్ళమీద తమ ప్రతాపం చూపలేక పోవడం కూడా ఉంది.

చివరగా మన ఆధునికత గురించి చెప్పుకోవలసిన మాట మరొకటి ఉంది. ఒక వైపు ఇది మధ్య తరగతికి చెందిన స్త్రీలకు కొత్త అవకాశాలను కలిగిస్తోంది. ఇది పురోగామి అంశంగా కనిపించినప్పటికీ, దానికిమరో వైపున లక్షలాదిమంది మట్టి మనుషులను తమ నేల నుండి, చేతివృత్తుల నుండి పరాయీకరించి, కూలీలుగా, వలస జీవులుగా, అధోజగత్ జీవులుగా, కూనీకోరులుగా,లుంపెన్ మూకలుగా ఇది మారుస్తోంది. ఇలాంటి వాళ్ళే ఇప్పుడు మన ముందు నిందితులు. మన ఆధునికత మధ్య తరగతి స్త్రీలకు కొత్త అవకాశాలను చవి చూపిస్తూనే, ఇంతకు ముందటి భద్రతనూ, గుర్తింపునూ కూడా రద్దు చేస్తూ ఆమెనొక అంగంగా, శరీరంగా పరిగణించడం వల్లనే ఈ ఘోరం జరిగింది. శరీర వ్యాపారం కేంద్రంగా అభిరుచులూ, విలువలూ తయారవుతున్న కాలంలో హింస, పాశవికత ఎంత తారాస్థాయికి చేరుకుంటుందో మనమిప్పుడు చూసాం. స్త్రీ గడప దాటడానికి సమయాసమయాలను లెక్కించే సమాజం ఒక వైపు , మరో వైపు స్త్రీ అంటే శరీరం తప్ప మరొకటి కాదనే వైఖరితో ఎదురవున్న వాస్తవాలను ఈ పోష్టులు వెలుగులోకి తెచ్చాయి.

(రచయిత: నాగరాజు)

4 thoughts on “ఢిల్లీ అత్యాచారంపై టపాలు, ఒక పరిశీలన

  1. తాను సామూహిక అత్యాచారానికి గురయిన మూడు సంవత్సరాల తర్వాత అత్యాచారం గురించి చెబుతూ సొహైలా అబ్దులాలి రాసిన వ్యాసం నాకు లభ్యమయింది. దానిని కూడా అనువాదం చేసి ప్రచురిస్తాను. -విశేఖర్

  2. నేను సామ్రాజ్యవాద సంస్కృతి గురించి వ్యాఖ్యలు వ్రాయకముందే సోమా చౌధురి అనే ఆవిడ వ్రాసిన వ్యాసం ఒకటి చదివాను. “పల్లెటూర్లలో చేతబడుల అనుమానాలతో మహిళలపై ఇంత కంటే దారుణాలు జరుగుతుంటాయి, వాటిపై లేని వ్యతిరేకత ఢిల్లీ బస్‌లో జరిగిన రేప్‌పై ఎందుకు ఉంది?” అని ఆవిడ అడిగిన ప్రశ్న చదివాను. అదే విషయం నేను ఇక్కడ కూడా వ్రాసాను. జర్నలిస్ట్ అయిన సోమా చౌధురి గారు పల్లెటూర్లలో చేతబడుల నెపంతో మహిళలపై జరుగుతోన్న దాడులపై గతంలో పరిశోధన చేశారు. అందుకే ఢిల్లీ రేప్‌పై ప్రతిస్పందనల గురించి చదివిన తరువాత ఆవిడకి ఆ సందేహం వచ్చింది. చేతబడి నెపంతో జరిగే రేప్‌ల గురించి నేను పదిహేనేళ్ళ క్రితం కూడా పేపర్‌లలో చదివాను. అవి నాకు బాగానే గుర్తున్నాయి కాబట్టి నాకు కూడా అదే సందేహం వచ్చింది.

  3. న్యాయమైనప్పటికీ అన్నింటికీ ఒకే ప్రతిస్పందన రావడం అరుదైన విషయమే. ఎక్కడయినా మధ్య తరగతికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. వాళ్ళు రాజ్యం మూలాలు కదిలి పోయే ప్రశ్నలు వేయడం అరుదు. వారి స్వభావాన్ని రావిశాస్త్రి చాలా వివరంగానే రాసాడు.
    అయితే ప్రవీణ్ గారు ప్రస్తావించిన రెండూ ఒక దానికొకటి పోటీ కాదు. సమాజపు వాస్తవికతను ఇలాంటి ప్రశ్నలు పట్టిస్తాయి.

  4. నేను పుట్టినది 1983లో. నాకు 1995 వరకు చేతబడి అంటే ఏమిటో తెలియదు. ఒక దళితుడు చేతబడి చేశాడనే అనుమానంతో అతన్ని సజీవ దహనం చెయ్యడం, ఒక మహిళ చేతబడి చేసిందనే అనుమానంతో ఆమెని రేప్ చేసి ఊరంతా నగ్నంగా ఊరేగించడం లాంటి వాటి గురించి తెలుగు పత్రికలలో వార్తలు చదివిన తరువాతే నాకు చేతబడి అంటే ఏమిటో తెలిసింది. భూస్వామ్య సమాజంలో ఆడదానికి శీలం ప్రాణంతో సమానం అని అంటారు. కానీ అదే భూస్వామ్య సమాజంలో ఒక మహిళని మంత్రగత్తె అని అనుమానంతో రేప్ చేసి, ఆమెని ఊరంతా నగ్నంగా ఊరేగిస్తున్నప్పుడు ఆమె శీలం గురించి ఎవరికీ అంత పట్టింపు ఉన్నట్టు కనిపించదు. ఢిల్లీ బస్‌లో జరిగిన రేప్ విషయానికి వద్దాం. ఆ ఘటన జరిగిన తీరు చూస్తోంటే అది పాత నేరస్తులు చేసిన పనిలాగే కనిపిస్తోంది. వాళ్ళు అమ్మాయిని రేప్ చేశారు. ఆమె బట్టల మీద ఉన్న వీర్యపు మరకల ఆధారంగా పోలీసులు తమని గుర్తుపడతారనే అనుమానంతో ఆమె బట్టలు విప్పి, ఆమెని బస్ నుంచి బయటకి తోసేశారు. ఆమె చనిపోతే అది సీరియస్ కేస్ అవుతుందనీ, అది తమ మెడకి పాములా చుట్టుకుంటుందనీ మాత్రం వాళ్ళు ఊహించలేదు. పల్లెటూర్లలో చేతబడుల నేపంతో జరిగే రేప్‌లు & సజీవ దహనాల సంస్కృతి ఇంత కంటే మెరుగైనదేమీ కాదు. Class contradictions ఉన్న సమాజంలో urban middle class వాళ్ళకి rural peasant class గురించి ఆలోచించాలని అనిపించదు. ఈ వైరుధ్యాల వల్ల పల్లెటూర్లలో జరిగే అత్యంత దారుణాల గురించి కూడా కావాలని ఆలోచించకుండా ఉంటారు. ఇన్ని దారుణాల గురించి మరచిపోయి టివి చానెల్‌లు బాగా పబ్లిసిటీ ఇచ్చిన ఒకటిరెండు ఘటనల విషయంలో తీవ్రమైన ఆందోళనలు చెయ్యడం వల్లే వాళ్ళ ఆందోళనలలో నిజాయితీ లేదనిపించింది.

వ్యాఖ్యానించండి