గాయపడింది నేను, నా గౌరవం కాదు -సొహైలా అబ్దులాలి


యుక్త వయసులో సొహైలా అబ్దులాలి -ఫొటో: మానుషి

యుక్త వయసులో సొహైలా అబ్దులాలి -ఫొటో: మానుషి

(న్యూయార్క్ టైమ్స్ పత్రికలో జనవరి 7, 2013 తేదీన ప్రచురించబడిన ఆర్టికల్ కి ఇది యధాతధ అనువాదం. సొహైలా అబ్దులాలి రచన ఇది. 17 సంవత్సరాల వయసులో అత్యాచారానికి గురై, పోలీసుల సహకార నిరాకరణవల్ల దోషులకు శిక్ష పడకపోయినా, తల్లిదండ్రుల మద్దతుతో పరిపూర్ణ రచయితగా, కార్యకర్తగా, వక్తగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సొహైలా అబ్దులాలి మొత్తం సమాజానికి స్ఫూర్తిమంతురాలు. అత్యాచారం జరిగిన మూడేళ్ల తర్వాత అత్యాచారం గురించి వివరిస్తూ తానే ‘మానుషి’ పత్రికకు వ్యాసం రాసి శీలం సంకెళ్లను ఫెటేల్ మని బద్దలు చేసిన సంచలన సాహసికురాలు సొహైలా. బాధిత యువతులు, మహిళల పట్ల సమాజం ఎలా వ్యవహరించాలో ఆమె చేసిన సూచనలు సదా ఆచరణీయం.)

ముప్ఫై మూడు సంవత్సరాల క్రితం, నాకు 17 యేళ్లప్పుడు బోంబేలో నివసిస్తుండగా సామూహిక అత్యాచారానికి గురయ్యాను. దాదాపు చావుకు దగ్గరగా వెళ్ళాను. మూడు సంవత్సరాల తర్వాత (సమాజం పాటించిన) మౌనం పట్లా, అత్యాచారం చుట్టూ అల్లుకుని ఉన్న దురవగాహనలపట్లా ఆగ్రహం చెంది, నా అనుభవాన్ని వివరిస్తూ నా పేరుతోనే ఒక తీక్షణమైన వ్యాసం రాశాను. ఒక మహిళా పత్రిక దానిని ప్రచురించింది. అది మా కుటుంబంలోనే కాక మహిళా ఉద్యమంలో ఒక అలజడిని రేకెత్తించింది. ఆ తర్వాత అది నిశ్శబ్దంగా అదృశ్యమయింది. అనంతరం, గత వారం నా ఈ మెయిల్ చూస్తుండగా అది నాకు మళ్ళీ కనిపించింది. ఢిల్లీలో ఒక యువతిపై జరిగిన అత్యాచారం, మరణం దరిమిలా చేలెరేగిన ప్రజాగ్రహంలో భాగంగా ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి దానిని ఇంటర్నెట్ లో పెట్టారు. జనం దాన్ని విపరీతంగా చదివారు. అప్పటినుండి నాకు సందేశాలు వరదలా వచ్చిపడుతున్నాయి.

అత్యాచారానికి సంకేతంగా మారడం సంతోషదాయకం ఖచ్చితంగా కాదు. అత్యాచారాల బాధితులందరికీ నేను ప్రాతినిద్యం వహించడం లేదు కూడా. అత్యంత క్రూరంగా అత్యాచారానికి గురై డిసెంబర్ లో మరణించిన యువతితో పాటు అనేకమంది ఇతరులవలే కాకుండా నా కధ ముగిసిపోలేదు. నేనా కధను ఇంకా ఇంకా చెబుతూనే ఉండగలను.

బతకడం కోసం నేను పోరాటం చేసిన ఆ రాత్రి నేనెందుకు పోరాడుతున్నానో తెలియలేదు. నేను, నా మగ స్నేహితుడు మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక కొండపైకి సరదాగా అలా నడుచుకుంటూ వెళ్లాము. ఆయుధాలు ధరిగించిన నలుగురు వ్యక్తులు మమ్మల్ని పట్టుకుని కొండపైకి ఒక నిర్మానుష్యమైన చోటికి తీసుకెళ్లారు. అక్కడ నాపైన అనేక గంటలపాటు వాళ్ళు అత్యాచారం చేశారు. మమ్మల్నిద్దరినీ బాగా కొట్టారు. మమ్మల్ని చంపాలా లేదా అని వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుని, చివరికి వదిలిపెట్టారు.

17 యేళ్ళ వయసులో నేను చిన్నపిల్లని. బతికి ఉన్నందుకు జీవితం నాకు పెద్ద బహుమతే ఇచ్చింది. గాయపడి, వేదనతో ఒక బృహత్తరమైన కుటుంబాన్ని చేరుకోగలిగాను. వారు నాపక్క నిలబడి ఉండగా నా వైపుకి అనేకం నడిచివచ్చాయి. వాస్తవికమైన ప్రేమను పొందగలిగాను. పుస్తకాలు రాశాను. జంతువుల్లో కంగారు ని చూశాను. బస్సుల్ని పట్టుకున్నాను; రైళ్లు మిస్ అయ్యాను.  మిరుమిట్లు గొలిపే పిల్ల నాకు కుమార్తెగా ఉన్నది. శతాబ్దం మారిపోయింది. నా మొదటి తెల్ల వెంట్రుక కనపడింది.

చాలా చాలా మంది ఇతరులు ఎన్నటికీ ఆ అనుభవాన్ని పొందలేరు. మునుముందు మంచే జరుగుతుందన్న ఆశలు వాస్తవంలోకి వచ్చే రోజులు వారు చూడలేరు. మీ జీవితంలో జరిగిన ఒకే ఒక సంఘటన మీ జీవితానికి కేంద్ర సమస్యగా ఇక ఇప్పటికీ ఉండని రోజు; ప్రతి మగ గుంపూ మీపైన దాడి చేస్తుందేమోననీ భయపడుతూ వెనక్కి తిరిగి తిరిగి చూడని రోజు; మీ ఊపిరిని బంధించి ఆపేసే బాధామయ గతం కాకుండా  ఒక అందమైన అంగవస్త్రాన్ని మెడచుట్టూ అందంగా అలంకరించుకోగల రోజు; భయవిహ్వలతను ఇక ఎంతమాత్రం దరిచేరనీయని రోజు… వారు చూడలేరు.

ఇప్పుడు -ఫొటో: డి.ఎన్.ఎ ఇండియా

సొహైలా, ఇప్పుడు -ఫొటో: డి.ఎన్.ఎ ఇండియా

అత్యాచారం భయంకరమైనది. కానీ భారత స్త్రీల మెదళ్ళలోకి చొప్పించబడుతున్న కారణాలవల్ల అది భయంకరమైనది కాదు. అది ఎందుకు భయంకరం అంటే: నిన్ను అతిక్రమిస్తుంది; నీకు భయం గొలుపుతుంది; మరొకరెవరో నీ శరీరాన్ని అదుపులోకి తీసుకుని అత్యంత ఆంతరంగిక రీతిలో గాయపరుస్తారు. నీ “శీలం’ పోతుంది గనుక అది భయంకరమైనది కాదు; మీ తండ్రి, సోదరులకు గౌరవభంగం కలుగుతుంది కాబట్టి అది భయంకరం కాదు. పురుషుల మెదళ్లు వారి జననాంగాల్లో ఉంటుందనడాన్ని తిరస్కరించినట్లే, నా శీలం నా యోనిలో ఉంటుందన్న నమ్మికను నేను తిరస్కరిస్తాను.

ఈ సమాసంలో నుండి గౌరవాన్ని తీసేసినా, అత్యాచారం ఇంకా భయంకరమైనదే. కానీ అది వ్యక్తిగతంగా భయంకరమైనది; సామాజికంగా కాదు. (మహిళలపై అత్యాచారాలు సామాజిక సమస్య కాదన్నట్లు ఇక్కడ అర్ధం వస్తోంది. కానీ రచయిత్రి అర్ధం అది కాదు. అత్యాచారాన్ని వ్యక్తిగతస్ధాయిలో తగిలిన గాయంగా మాత్రమే చూడాలనీ, దానిని సామాజీకరించి బాధితురాలిని పతితగా చూడరాదనీ రచయిత్ర సూచిస్తోంది.) (అప్పుడే) దాడికి గురయిన మహిళలకు నిజంగా ఏది అవసరమో అది ఇవ్వగలం: తప్పు చేసినదానిలా ఎలా భావించాలో, ఎలా సిగ్గుపడాలో చెప్పడం లాంటి చెత్తతో నిండిన భారాన్ని వారిపై మోపడం కాకుండా ఓ భయంకరమైన బాధని ఎదుర్కోవలసి వచ్చినందుకు సహానుభూతిని అందజేయాలి.

నాపై దాడి జరిగిన వారం తర్వాత, సమీప నగర శివారులో అత్యాచారానికి గురయిన ఒక మహిళ గాధ విన్నాను. ఆమె ఇంటికి వచ్చి, వంటగదిలోకి వెళ్ళి, తనకు తాను నిప్పు అంటించుకుంది. ఆమె చనిపోయింది. నాకామె కధ చెప్పిన వ్యక్తి ఆమె తన భర్త గౌరవాన్ని కాపాడడానికి ఎంత స్వార్ధరహిత్యంగా వ్యవహరించిందో ఆరాధనాపూర్వక స్వరంతో వర్ణించి చెప్పింది. మా తల్లిదండ్రులకు బహుధా కృతజ్ఞురాలిని; ఇలాంటిదాన్ని నేనప్పటికి అర్ధం చేసుకోలేను.

చట్టం రేపిస్టులకు నిజమైన శిక్షలు వేయాలి. బాధితులకి రక్షణ కల్పించాలి. కానీ కుటుంబాలు, సమాజాలు మాత్రమే ఇలాంటి సహానుభూతినీ, మద్దతునూ ఇవ్వగలవు. తన కుటుంబం తోడు లేకపోతే ఒక టీనేజి యువతి తనపై అత్యాచారం చేసినవాడి ప్రాసిక్యూషన్ లో ఎలా పాల్గొనగలుగుతుంది? భార్యపై జరిగిన అత్యాచారం ఆమెపై జరిగిన అతిక్రమణగా కంటే తన అవమానంగానే భర్త భావిస్తే అతని భార్య నిందితుడిపై ఎలా నేరారోపణ చేయగలదు?

17 యేళ్ళ వయసులో, అంత బాధాకరమైన రీతిలో గాయపరచబడడం, అవమానపరచబడడాలనే నా జీవితంలో అత్యంత భయానకమైనదిగా నేను భావించాను. 49 యేళ్ళ వయసులో నా భావన తప్పని నాకు తెలుసు; అత్యంత భయానకమైనది ఏమిటంటే నా 11 సంవత్సరాల కుమార్తె గాయానికీ, అవమానానికీ గురి కావడం. నా కుటుంబ గౌరవం కోసం కాదు, కానీ ఎందుకంటే తను ప్రపంచాన్ని నమ్ముతోంది. తానా నమ్మకాన్ని కోల్పోతుందేమోనన్న ఆలోచనే అనంతమైన బాధను కలిగిస్తోంది. నేనిప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే 17 యేళ్ళ నన్ను కాదు ఓదార్చాలని భావిస్తునది, నా తల్లిదండ్రులను. చెదిరిపోయిన ముక్కలను ఒకటిగా చేయవలసిన కర్తవ్యభారం వారిపై పడింది మరి!

ఇక్కడే మన పని ఉంది. తరువాతి తరాన్ని సాకుతున్న మనపైనే ఆ భారం ఉంది. విముక్తి పొందిన, గౌరవప్రదమైన పెద్దలుగా అవతరించేలా మన కొడుకులకు, కూతుళ్లకు బోధించడంలోనే మన కర్తవ్యం ఉంది.  మహిళలను గాయపరిచేవారు ఒక ఎంపికలోకి వెళ్తున్నారనీ, వారికి శిక్ష తప్పదనీ వారికి తెలియాలి.

నాకు 17 సంవత్సరాల వయసప్పుడు,  భారత దేశంలో గత కొన్ని వారాల్లో మనం చూసినట్లుగా వేలాదిమంది జనం అత్యాచారానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారని ఊహించుకుని ఉండగలిగేదాన్ని కాదు. అయినప్పటికీ చేయవలసిన పని ఇంకా చాలానే ఉంది. అణచివేతలు పరిఢవిల్లడానికి అనుమతించే పితృస్వామ్యం, కులం ఇంకా సామాజిక, లైంగిక అసమానతలతో కూడిన విస్తార వ్యవస్ధలను నిర్మిస్తూ మనం అనేక తరాలు గడిపేశాము. కానీ వాతావరణం లాగా అత్యాచారం అనివార్యం ఏమీ కాదు. ‘ఆమే అతనికి అవకాశం ఇచ్చిందా?’ లాంటి పైశాచికాలను మనం పరిత్యజించాల్సిన అవసరం ఉంది. మనం బాధ్యతను ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంచాలి: మహిళలను అతిక్రమించే పురుషులపైనా మరియు అతను తప్పించుకోడానికి అవకాశం ఇచ్చి అతని బాధితురాళ్లనే వేళ్లెత్తి చూపించే మనందరిపైనా.

2 thoughts on “గాయపడింది నేను, నా గౌరవం కాదు -సొహైలా అబ్దులాలి

వ్యాఖ్యానించండి