బుద్ధి జీవులు ఆగ్రహోదగ్రులైన వేళ -ఫోటోలు


అనేకానేక ప్రభుత్వ, ప్రవేటు ఆఫీసులు, కాల్ సెంటర్లు, ఐ.టి కంపెనీలు తదితర ఆధునిక రంగాల్లో పనిచేస్తున్న మేధోవర్గ ప్రజలు రోడ్డు మీదికి రావడం అరుదు. వారు తమను తాము భద్రజీవులుగా భావించుకోవడం దానికి ఒక కారణం కావచ్చు. డిసెంబరు 16 తేదీన జరిగిన దారుణకృత్యం తర్వాత తమకు కూడా భద్రత లేదని వీరికి తెలిసివచ్చింది. ఆర్ధిక భద్రత అనేది జీవితంలో ఒక భాగమేననీ, సామాజిక భద్రత కావాలంటే రోడ్డు మీదికి రాక తప్పదని వారి అవగాహనలోకి వచ్చింది. జరిగిన ఘోరం తీవ్రత ఒక అంశం అయితే, నేరం జరిగిన సమయం, స్ధలం అనేకమందిని గగుర్పాటుకు, భయాందోళనలకు గురి చేసింది. అప్పటిదాకా పనిస్ధలంలో పడ్డ శ్రమనుండి సేదదీరడానికి స్నేహితుడు/స్నేహితురాలితో కలిసి సరదాగా సినిమాకి వెళ్ళి బస్సులో ఇంటికి చేరడం దాదాపు ప్రతి మధ్య, ఉన్నత మధ్య తరగతి జీవికి అందుబాటులో ఉండే మామూలు కల. అలాంటి సాధారణ కలకూడా నెరవేర్చుకోలేని పరిస్ధితి దేశరాజధానిలో ఉన్నదని తెలిస్తే ఎవరికి భయం కలగదు?

అందుకే ఎన్నడూ గడపడాటని జనం అనేకమంది సంఘాల ప్రమేయం లేకుండా ఢిల్లీ వీధుల్లో కదం తొక్కారు. ప్రజల ఆందోళన అర్ధం చేసుకోవడం మాని ప్రభుత్వాలు యధావిధిగా పోలీసులను వారిపైకి ఉసికొల్పాయి. ఫలితంగా చరిత్రాత్మ రైసినా హిల్స్, ఇండియా గేట్ ల వద్ద వీధి యుద్ధాలు చెలరేగాయి. ‘ఆక్యుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమాల సందర్భంగా అమెరికా, యూరప్ నగరాల్లో కనిపించిన దృశ్యాలు ఈసారి ఢిల్లీ వీధుల్లో, రాజ్యాధిపతుల నివాసాలకు సమీపంలోనే దర్శనమిచ్చాయి. ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్, ఎన్.బి.సి న్యూస్ పత్రికలు అందజేసిన కింది ఫోటోల్లో భద్రతపై భ్రమలు కోల్పోయిన బుద్ధి జీవుల ఆగ్రహావేశాలనూ, వారిపై పోలీసులు సాగించిన నిర్బంధకాండనూ చూడవచ్చు.

One thought on “బుద్ధి జీవులు ఆగ్రహోదగ్రులైన వేళ -ఫోటోలు

  1. ఏదైనా తమదాకా వస్తేనేగాని అర్థం చేసుకోరు కొందరు. ప్రభుత్వ, ప్రవేటు ఆఫీసులు, కాల్ సెంటర్లు, ఐ.టి కంపెనీలు తదితర ఆధునిక రంగాల్లో పనిచేస్తున్న మేధోవర్గ ప్రజలు ఏనాడైనా వామపక్ష విద్యార్థులు చేస్తున్న ఉద్యమాలను కాని, ఆందోళనలను కాని సమర్థించారా? ఇప్పటికైనా తమకు బధ్రత లేదే అని బయటకు వచ్చారు కాని బధ్రత ఎలా సాధ్యమో ఇంకా వారికి అర్థం కాలేదని నేననుకుంటాను. వాల్ స్ట్రీట్ వ్యతిరేకులుగాని, వీరు గాని ఇప్పుడు ఆందోళన చెందుతున్నారే కాని, దానికి ప్రత్యామ్నాయమేది అనే విషయంలో సరిఅయిన అవగాహన లేదనే చెప్ప వచ్చు.

వ్యాఖ్యానించండి