దక్షిణ కొరియా పేడోఫైల్ కు కెమికల్ కేస్ట్రేషన్ శిక్ష


Chemical castrationలైంగిక అత్యాచారాల నిరోధం విషయంలో భారత ప్రభుత్వానికి దక్షిణ కొరియా ఒక దారి చూపినట్లు కనిపిస్తోంది. అత్యాచార నేరస్ధులకు ‘రసాయన పుంస్త్వనాశనం’ (chemical castration) ఒక శిక్షగా విధించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇప్పటికే ప్రతిపాదించగా దక్షిణ కొరియా కోర్టు ఒక పెడోఫైల్ (చిన్నపిల్లలపై అలవాటుగా లైంగిక అత్యాచారం చేసే వ్యక్తి) కి మొదటిసారిగా ‘రసాయన పుంస్త్వ నాశనం’ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. కెమికల్ కేస్ట్రేషన్ కు అనుగుణంగా 2011లో చట్టం చేసిన తర్వాత దక్షిణ కొరియాలో ఈ శిక్ష వేయడం ఇదే మొదటిసారి.

పదే పదే చిన్నపిల్లలపట్ల లైంగికంగా ఆకర్షితులవుతూ అత్యాచారాలు చేసే ప్రమాదం ఉన్న వ్యక్తులకు హార్మోన్ చికిత్సగానీ, కెమికల్ కేస్ట్రేషన్ గానీ శిక్షగా విధించడానికి 2011 చట్టం దక్షిణ కొరియా కోర్టులకు అవకాశం కల్పించింది. ఇంటిపేరు ప్యో గా పిలవబడుతున్న నిందితుడు నవంబరు 2011 నుండి మే 2012 వరకూ కనీసం ఆరుసార్లు చిన్న పిల్లలపై అత్యాచారాలకు పాల్పడ్డాడని కొరియా వార్తా సంస్ధ యోన్హాప్ ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. స్మార్ట్ ఫోన్ చాట్ సర్వీస్ ద్వారా పిల్లలను ఆకర్షించి అనంతరం ప్యో, వారిపై అత్యాచారాలు జరిపేవాడని సదరు వార్తాసంస్ధ తెలిపింది.

తాను చేసే అత్యాచారాన్ని వీడియో తీసే ఘనకార్యానికి కూడా ప్యో పాల్పడేవాడట. మైనర్ పిల్లలను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి వాటిని ఆన్ లైన్ లో పెడతానని బెదిరించి మళ్ళీ మళ్ళీ అత్యాచారానికి పాల్పడ్డాడట. మారణాయుధాలతో బెదిరించికూడా అత్యాచారాలు చేసేవాడని వార్తా సంస్ధ తెలియజేసింది. వినడానికి కూడా ఘోరంగా ఉన్న ఈ వ్యవహారానికి ‘రసాయన పుంస్త్వ నాశనమే’ సరైన శిక్ష అని దక్షిణ కొరియా కోర్టు నిర్ధారించింది. “సుదీర్ఘకాలం పాటు ప్యో అనేకమంది బాధితులపై నేరాలు జరిపాడు. అతనికి వికారమైన లైంగిక ధోరణి ఉన్నదనీ, తనంతటతానుగా తన లైంగిక ప్రేరేపణలను నియంత్రించుకోవడం అతనికి అసాధ్యమనీ కోర్టు భావిస్తోంది” అని జడ్జి కిమ్ కి-యౌంగ్ తన రూలింగ్ లో పేర్కొన్నాడు.

15 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతోపాటు, పదేళ్లపాటు ప్యో (31 సంవత్సరాలు) గురించిన సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోర్టు తీర్పు చెప్పింది. జైలునుండి విడుదలయ్యాక 20 సంవత్సరాలపాటు తన కదలికల సమాచారం తెలియడానికి వీలుగా కాలికి ఎలక్ట్రానిక్ పరికరం అమర్చుకోవాలని కూడా తీర్పు చెప్పింది. లైంగిక ప్రేరణలకు చికిత్స పొందడం కోసం  200 గంటలపాటు హార్మోన్ ధెరపీ చేయించుకోవాలని ఆదేశించింది. ప్యో జైలునుండి విడుదల కావడానికి రెండు నెలల ముందు వైద్య చికిత్సగా లైంగిక ప్రేరణను తగ్గించడానికీ, నిర్భంధ (నియంత్రించుకోలేని) లైంగిక వూహలను తగ్గించడానికీ మందులు వాడతామని కొరియా న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. లైంగిక స్తంభనా సామర్ధ్యాన్ని తగ్గించే విధంగా ఈ చికిత్స ఉంటుందనీ సదరు మంత్రిత్వ శాఖ తెలిపింది.

ది హిందూ ప్రకారం జర్మనీ, డెన్మార్క్, స్వీడన్, పోలండ్ దేశాలు అనేక యేళ్లుగా ‘రసాయన పుంస్త్వ నాశనం’ శిక్షను అమలు చేస్తున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం కూడా ఈ జాబితాలో ఉంది. ఆసియా ఖండంలో ఈ శిక్షను అమలు చేయనున్న మొదటి దేశం దక్షిణ కొరియాయేనని యోన్హాప్ ని ఉటంకిస్తూ ది హిందూ తెలిపింది. అయితే వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ప్రకారం గతంలో (2011) ద.కొరియా ప్రభుత్వం పార్క్ అనే 44 యేళ్ళ వ్యక్తికి కెమికల్ కేస్ట్రేషన్ శిక్ష విధించింది. 1984, 2002ల మధ్య 9, 10 సంవత్సరాల బాలికలు నలుగురిపై అత్యాచారం జరిపాడు. గత 20 యేళ్లుగా జైలుకి వెళ్తూ వస్తూ ఉన్న పార్క్ కి పోయినేడు కెమికల్ కేస్ట్రేషన్ చేయాలని కోర్టు నిర్ణయించినట్లు తెలిసినా అది అమలయిందో లేదో తెలియలేదు.

ఢిల్లీ బస్సులో అమానుషరీతిలో జరిగిన సామూహిక అత్యాచారం దరిమిలా దేశంలో చెలరేగిన ఆందోళనల్లో అనేకమంది అత్యాచార దోషులకు పుంస్త్వ నాశనాన్ని  శిక్ష వేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. రేపిస్టులకు మరణశిక్ష వేయాలని కూడా భారీ యెత్తున డిమాండ్ వచ్చింది. అన్నీ కేసుల్లో కాకపోయినా అత్యంత అరుదైన అత్యాచార కేసుల్లో మరణ శిక్ష విధించడానికి చట్టంలో సవరణ చేయబోతున్నట్లు కూడా కొందరు సూచిస్తున్నారు. ఢిల్లీ అత్యాచారం కేసులో మరణశిక్ష కోరనున్నట్లు పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ కేసులో హత్య, హత్యా ప్రయత్నం నేరాలు కూడా ఇమిడి ఉన్నందున అత్యాచారానికి మరణశిక్ష విధించినట్లు కాబోదు.

ఏమిటి ఈ రసాయన పుంస్త్వనాశనం?

Image: beijingshots.com

Image: beijingshots.com

రసాయన పదార్ధాలతో కూడిన వైద్య చికిత్స ద్వారా లైంగిక కోర్కెల ఉధృతాన్ని తగ్గించడం లేదా పూర్తిగా లేకుండా చేయడాన్ని ‘రసాయన పుంస్త్వనాశనం’గా పిలుస్తున్నారు. సర్జికల్ కేస్ట్రేషన్ అంటే పురుషులకైతే వృషణాలను, స్త్రీలకైతే అండాశయాన్నీ పూర్తిగా తొలగించడం ద్వారా అలైంగికులుగా మారుస్తారని తెలుస్తోంది. కెమికల్ కేస్ట్రేషన్ దీనికి భిన్నమైనది. వైద్య చికిత్స ఆపితే పుంసత్వం పునరుద్ధరించబడుతుందని వికీపీడియా ద్వారా తెలుస్తోంది. అయితే దీనివలన శరీరంలో శాశ్వతంగా పక్క ఫలితాలు (side effects) కలుగవచ్చు. ఎముకల్లో సాంద్రత తగ్గిపోయి ఆస్టియో పోరాసిస్ జబ్బు రావచ్చు. కొవ్వు పెరగడం, మగవారికి ఛాతీ పెరగడం లాంటివి సంభవించవచ్చు కూడా. కానీ ఈ పక్క ఫలితాలు అరుదుగా రావచ్చని తెలుస్తోంది.

రసాయన చికిత్స ఫలితాలు ఎలా ఉన్నా అత్యాచారాలను శాశ్వతంగా నివారించాలంటే సామాజిక సంబంధాల్లో ఆరోగ్యకరమైన చైతన్యం అత్యున్నత స్ధాయికి తీసుకెళ్లాడమే ఏకైక మార్గం. అది జరగాలంటే వ్యవస్ధ స్ధాయిలోనే జరగాలి. వ్యవస్ధ అంటే ఆర్ధిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వ్యవస్ధలన్నీ పరిగణనలోకి వస్తాయి. ఆర్ధిక సంబంధాలే తతిమా వ్యవస్ధలను శాసించే వాస్తవాన్ని గమనంలోకి ఉంచుకుంటే వివిధ వర్గాల మనుషుల మధ్య ఇప్పడున్న ఆర్ధిక సంబంధాలు విప్లవకరమైన రీతిలో మారితీరాలి. అది మళ్ళీ మనుషుల చేతుల్లోనే ఉంది. కాకపోతే ఇప్పుడు వ్యవస్ధలను నియంత్రిస్తున్న ఆధిపత్య వర్గాల స్ధానంలో సమానత్వాన్ని కాంక్షించే కార్మికవర్గం చేరి  కళ్ళేలను తమ చేతుల్లోకి తీసుకోవాలి. వ్యవస్ధాగత సమస్య దేనికైనా ఇదే అంతిమ పరిష్కారం.

5 thoughts on “దక్షిణ కొరియా పేడోఫైల్ కు కెమికల్ కేస్ట్రేషన్ శిక్ష

  1. పక్క ఫలితాలు (side effects) ….

    ఈ పదప్రయోగం అంత బాగున్నట్లుగా తోచదు. ‘ప్రక్క ఫలితం’ (పక్క అన్నది సరైన మాట కాదు) అన్న పదబంధం‌ కంటే ఇతర ప్రయోగాలు పరిశీలించండి:

    అనుసంగ ప్రభావము , తదుపరి పరిణామము (ref: http://telugudictionary.telugupedia.com/search.php?q=side+effect)

    నిజానికి అనుసంగ అన్నది తప్పు. సమాసమూ బాగాలేదు. ఆనుషంగికప్రభావం అంటే బాగుంటుంది.

  2. శ్యామలరావు గారూ, మీ సూచనకు ధన్యవాదాలు.

    వాడుకలో పక్క అనే ఎక్కువ అంటారు కదా. అందువలన క్రావడి ఇవ్వలేదు. ‘ఆనుషంగిక’ అన్నది సంస్కృతం అనుకుంటా కదా. సంస్కృతం జోలికి పోకుండా పలకడానికి సులువైన పదాలు కొత్తవి కనిపెట్టి వాడుకలోకి తెస్తే ఎక్కువ ఉపయోగం అని కానిపిస్తుంది.

    ఇతర భాషల పదాలను కూడా తనలో కలిపేసుకోవడం ద్వారా, నిరంతరం మార్పులకు లోనుకావడానికి సిద్ధంగా ఉండడం ద్వారా ఇంగ్లీషు విస్తృతి వృద్ధి చెందినట్లే, తెలుగు భాష కూడా సూత్రాలు, వ్యాకరణాల సంకెళ్లను వదిలించుకుంటే మరింత అభివృద్ధి అయి విస్తృతంగా వాడుకలోకి వస్తుందేమో అని కూడా నాకనిపిస్తుంది. ఇవి నా అభిప్రాయాలు మాత్రమే. మీ సూచనను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాను.

  3. అవును శేఖర్ గారు.. వ్యవస్థను పీడిస్తున్న అన్ని సమస్యలకు మూలం అక్కడే ఉంది. సమానత్వ రాజ్యం వచ్చిన రోజే అన్నీ పరిష్కారమవుతాయి.

వ్యాఖ్యానించండి