కోర్టుల్లో ఓటమి పరంపరను నరేంద్ర మోడీ దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. గుజరాత్ గవర్నర్ నియమించిన లోకాయుక్తకు తన ఆమోదం లేనందున నియామకాన్ని రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టు గడప తొక్కిన మోడి అక్కడ కూడా ఓటమి చవిచూశాడు. తొమ్మిదేళ్లకు పైగా రాష్ట్ర లోకాయుక్త పదవిని ఖాళీగా అట్టిపెట్టిన నీతివంతమయిన ముఖ్యమంత్రి మోడి గవర్నర్ చొరవను హర్షించే కనీసనీతిని ప్రదర్శించలేకపోయాడు. తనను తాను అజేయుడుగా భావించుకునే అపోహనుండి మోడీ బైటికి రావాలని గుజరాత్ హైకోర్టు చేత అత్యంత అవమానకరంగా అభిశంసన పొందినప్పటికీ సుప్రీం కోర్టుకి వెళ్లడానికే నిశ్చయించిన మోడి మళ్ళీ ఆదేస్ధాయిలో సుప్రీం అభిశంసనను చవిచూశాడు.
మంత్రివర్గాన్ని సంప్రదించకుండా గవర్నర్ కమల బేనివాల్ గుజరాత్ రాష్ట్ర లోకాయుక్తగా జస్టిస్ ఆర్.ఎస్.మెహతాను నియమించిందని మోడి ప్రభుత్వం చేసిన వాదనను సుప్రీం కోర్టు అంగీకరించలేదు. “అప్పటి చీఫ్ జస్టిస్ తో గవర్నర్ జరిపిన సంప్రదింపులు పరిపూర్ణంగా ఉన్నాయని వాస్తవాలు తెలియజేస్తున్నాయి. అటువంటి పరిస్ధితుల్లో జస్టిస్ మెహతా నియామకం చట్టవిరుద్ధం కాజాలదు” అని జస్టిస్ బి.ఎస్.చౌహాన్, జస్టిస్ ఇబ్రాహీం కలీఫుల్లాలతో కూడిన సుప్రీం బెంచి పేర్కొంది. హైకోర్టు 2:1 మెజారిటీతో ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా గుజరాత్ ప్రభుత్వం చేసిన అప్పీలు చెల్లనేరదని తేల్చిచెప్పింది.
“(అవినీతి వ్యతిరేక న్యాయమూర్తి) లోకాయుక్త విచారణనుండి తప్పించుకోవడానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం’ కింద ఈ కోర్టు న్యాయమూర్తి జస్టీస్ ఎం.బి.షా ఛైర్మన్ గా ప్రత్యేక ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసుకోవడం గమనార్హమైన విషయం” అని బెంచి తన తీర్పులో పేర్కొంది. కేవలం అవినీతి విచారణ కోసమే ఏర్పాటుచేయబడ్డ రాజ్యాంగబద్ధ లోకాయుక్త వ్యవస్ధకు నాయకత్వాన్ని ఇవ్వకుండా రాష్ట్ర ప్రబుత్వం సొంతగా విచారణ కమిషన్ నియమించుకోవడంలో ఉద్దేశ్యం స్పష్టమే. గుజరాత్ మారణహోమం నిందితులకు శిక్షలు పడకుండా సొంత ఇష్టుల నియామకాలతో, అయిష్టుల బదిలీలతో, బెదిరింపులతో, చివరికి హత్యలతోనూ మొత్తం రక్షణ, న్యాయ వ్యవస్ధలనే తలకిందులు చేసిన మోడి అదేవిధంగా తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి లోకాయుక్తను తొమ్మిదేళ్లకుపైగా ఖాళీగా ఉంచగలిగాడు. ఇలాంటివారికి కదా అవినీతి ఉద్యమ సామ్రాట్ అన్నా హజారే ‘నీతిమంతుడు’ అంటూ సర్టిఫికెట్ ఇచ్చినది!
ఈ కేసు అత్యంత అసంబద్ధమైన వ్యవహారాలను వెలికి తెచ్చిందని జస్టిస్ చౌహాన్ వ్యాఖ్యానించాడని ది హిందూ తెలిపింది. నవంబర్ 24, 2003 తేదీన జస్టిస్ ఎస్.ఎం.సోనీ రాజీనామా చేశాక తొమ్మిదేళ్లకుపైగా లోకాయుక్త పోస్టు ఖాళీగా ఉండడం ఏమిటని ఆయన ప్రశ్నించాడు. లోకాయుక్తను నియమించడానికి చాలా కొద్దిసార్లు మాత్రమే అది కూడా అర్ధ మనస్సుతో ప్రయత్నాలు జరిగాయనీ, చివరికీ ఏకారణం వల్లనైతేనేమీ నియామకం అయితే జరగలేదనీ ఆయన పేర్కొన్నాడు.
సుప్రీం బెంచి గవర్నర్ ని కూడా వదల్లేదు. లోకాయుక్త నియామకంతో మంత్రివర్గానికి సంబంధం లేదని గవర్నర్ భావించడం సరికాదని తెలిపింది. “(గవర్నర్) తన పాత్రను తప్పుగా అంచనా వేశారు. లోకాయుక్త నియామకంలో మంత్రివర్గ పాత్ర లేదనీ కనుక హైకోర్టు చీఫ్ జస్టిస్ నీ, ప్రతిపక్ష నాయకుడినీ సంప్రదించి తానే నియమించవచ్చనీ భావించారు. రాజ్యాంగంలో ఊహించిన ప్రజాస్వామిక ప్రభుత్వ వ్యవస్ధకు అనుగుణంగా గవర్నర్ వైఖరి లేదు” అని మొట్టికాయ వేసింది. “రాష్ట్ర ప్రభుత్వ నాయకునిగా మంత్రివర్గ సలహా, సంప్రతింపుల ద్వారా మాత్రమే గవర్నర్ లోకాయుక్తను నియమించగలరు. స్వతంత్రంగా రాజ్యాంగబద్ధ అధికారంతో ఆపని చేయలేరు” అని బెంచి తన తీర్పులో పేర్కొంది.
గత సంవత్సరం జనవరిలో సైతం నరేంద్ర మోడి గుజరాత్ హైకోర్టు చేత తీవ్రమైన అభిశంసనాపూర్వక వ్యాఖ్యలను ఎదుర్కొన్నాడు. హైకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయాన్ని తీసిపారేయడం ఏమిటని మోడిని తీవ్రస్ధాయిలో ప్రశ్నించింది. “హైకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయంయొక్క ప్రాధాన్యతను అంగీకరించడానికి ముఖ్యమంత్రి స్పష్టంగా తిరస్కరించాడు. ప్రజాస్వామ్యం యొక్క సారమయిన చట్టబద్ధపాలనపై నమ్మకాన్ని బద్దలు చేయడమే ఇది” అని జస్టిస్ వి.ఎం.సహాయ్ తన తీర్పులో పేర్కొన్నాడు. హైకోర్టు ద్విసభ్య బెంచి సభ్యులు భిన్న తీర్పులు ఇవ్వడంతో మూడవ జడ్జిగా సహాయ్ ని కోర్టు నియమించింది. గవర్నర్ నిర్ణయం వైపుకి సహాయ్ మొగ్గడంతో మోడి వాదన హైకోర్టులో ఓడిపోయింది.
“ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం యొక్క మూర్ఖ ప్రవర్తన, అవివేకాలను” గమనించాక గవర్నర్ (కమలా బెనివాల్) “రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ద్వారా తనకు సంక్రమించిన విచక్షణాధికారాలను సరైన రీతిలో వినియోగించి జస్టిస్ మెహతాను నియమించింది” అని జస్టిస్ సహాయ్ పేర్కొన్నాడు. ముఖ్యమంత్రి వైఖరివలన రాజ్యాంగపరంగా ఒక మినీ సంక్షోభం ఏర్పడిందని ఆయన పేర్కొన్నాడు. మంత్రివర్గం సలహా తీసుకున్నా తీసుకోకపోయినా గవర్నర్ లోకాయుక్తను నియమించడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్ధను ముట్టడినుండీ, దౌర్జన్యాలనుండీ కాపాడడానికేనని హైకోర్టు మెజారిటీ తీర్పు అభిప్రాయపడింది.
చీఫ్ జస్టిస్ సూచించిన పేరు తమకు ఆమోదయోగ్యం కాదనీ మరొకరి పేరును సూచించాలనీ ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్ కి రాసిన లేఖను ఆమోదిస్తే అది చట్టబద్ధపాలన పూర్తిగా కూలిపోవడానికీ, ప్రజాస్వామిక సూత్రాలు తుడిచిపెట్టుకుపోవడానికీ దారితీసి ఉండేదని పేర్కొంది. మంత్రివర్గం అభ్యంతరాలు పరిశీలించి అవి సరికాదని తేల్చుకుని తన నిర్ణయాన్ని చీఫ్ జస్టిస్ ప్రకటించాక దానిని ఆమోదించడం తప్ప ముఖ్యమంత్రికి గత్యంతరం లేదనీ, తదనుగుణంగా జస్టిస్ మెహతా పేరును మంత్రివర్గం గవర్నర్ కి సిఫారసు చేసి ఉండాల్సిందని పేర్కొంది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం బహిరంగంగా చీఫ్ జస్టిస్ నిర్ణయం ప్రాధాన్యతను తిరస్కరించడం సంక్షోభంలాంటి పరిస్ధితిని సృష్టించిందని పేర్కొంది.
సుప్రీం కోర్టు తీర్పులో గానీ, గుజరాత్ హైకోర్టు తీర్పులో గానీ చట్టబద్ధపాలన, ప్రజాస్వామిక సూత్రాలు, న్యాయవ్యవస్ధ సమగ్రత లాంటి ఉదాత్తమైన పదబంధాలు కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితమైన ఆదర్శ భావనలు. అవేవీ ప్రజలకు అందుబాటులో లేవని ప్రతిరోజూ తెల్లవారుఝామున వచ్చిపడే ప్రతి పత్రిక ద్వారా తెలుస్తూనే ఉంది. ఎప్పుడో బుద్ధి పుట్టినపుడు “సుమోటుగా స్వీకరిస్తున్నాం” అంటూ హడావుడి చేసే కోర్టు పెద్దలకు తెలియనదేమీ కాదది. తాటాకు చప్పుళ్ళు చేసే లోకాయుక్తలాంటి అలంకార పదవీ నియామకంలో ఒక రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ మాట చెల్లనందుకే ఘనతవహించిన కోర్టు ప్రభువులు (మిలార్డ్) ఇంతగా ఆవేదన చెందుతున్నారు. నిత్యం పొలాల్లో, కార్ఖానాల్లో, ఎండనకా, వాననకా రెక్కలు ముక్కలు చేసుకుని ఉత్పత్తి తీసే కష్టజీవి నోటికాడ ముద్దని కోటి కోట్ల స్విస్ బ్యాంక్ ఖాతాలుగా తన్నుకుపోతున్న ఘరానా దోపిడీపట్ల ప్రజలు ఇంకెలా స్పందించాలి?
