మరిన్ని రక్షణలతో రూపొందనున్న కొత్త అత్యాచార నిరోధ చట్టానికి ఢిల్లీ అత్యాచారం బాధితురాలి పేరు పెట్టడానికి సూచన వచ్చింది. కేంద్ర మంత్రి శశిధరూర్ ఈ సూచన చేశాడు. అమ్మాయి పేరుని ఇంతవరకూ బైటపెట్టకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన శశిధరూర్ అమ్మాయి తల్లిదండ్రులు, సోదరులు అంగీకరిస్తే నూతన సవరణలతో కూడిన చట్టానికి అమ్మాయి పేరే పెట్టాలని ఆయన కోరాడు. బాధితురాలి తల్లిదండ్రులు, సోదరులు అందుకు తమకు అభ్యంతరం లేదని తెలియజేశారని ‘ది హిందూ’ తెలిపింది. ప్రభుత్వానికి ఈ ఆలోచన ఉన్నదీ లేనిదీ తెలియరాలేదు.
వివాదాస్పద వ్యాఖ్యలకు, తనకు తోచిందాన్ని ఎటువంటి సంకోచం లేకుండా చెప్పడానికీ శశిధరూర్ పేరుగాంచాడు. “ఢిల్లీ అత్యాచార బాధితురాలి పేరుపై గోప్యతను ఇంకా కొనసాగించడంవల్ల ఏమి ప్రయోజనమో ఆశ్చర్యంగా ఉంది. ఆమె పేరుతోనే ఆమెను వాస్తవ వ్యక్తిగా గుర్తించి ఎందుకు గౌరవించకూడదు?” అని శశిధరూర్ తన ట్విట్టర్ పేజీలో ప్రశ్నించాడు. “ఆమె తల్లిదండ్రుల అభ్యంతరం లేకపోతే అత్యాచార వ్యతిరేక చట్టానికి ఆమె పేరు పెట్టి గౌరవించాలి. ఆమె కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు; ఒక పేరు కలిగిన మానవి” అని శశిధరూర్ వ్యాఖ్యానించాడు. మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి సూచనకు అనేకమంది మద్దతు పలికారు. కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.
చట్టం ప్రకారం లైంగిక అత్యాచారం ఎదుర్కొన్నా బాధితురాలి పేరు బైటపెట్టడం నేరం. అత్యాచార బాధితురాలికి సంబంధించిన పేరుగానీ, ఆమెను గుర్తించేందుకు దారితీసే సమాచారాన్ని గానీ పత్రికల్లో ముద్రించినా లేక ఇతరత్రా ప్రచురించినా ఐ.పి.సి సెక్షన్ 228-ఎ ప్రకారం నేరం. సదరు నేరం చేసినవారికి రెండు సంవత్సరాల వరకూ జైలు శిక్ష వెయ్యవచ్చని చట్టం చెబుతోంది. బాధితురాలిని గుర్తించేందుకు సాయపడే విధంగా కొన్ని విషయాలు ప్రచురించినందుకు రెండు ఆంగ్లపత్రికలపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారని ‘ఎకనమిక్ టైమ్స్’ తెలిపింది.
ఐ.ఎ.ఎన్.ఎస్ వార్తా సంస్ధ ప్రకారం ఆ రెండు పత్రికల్లో ఒకటి మెయిల్ టుడే. ఇండియా టుడే వార పత్రికను నడిపే ‘లివింగ్ మీడియా గ్రూప్’ మెయిల్ టుడే టాబ్లాయిడ్ ను నడుపుతోంది. బాధితురాలి పేరుతో పాటు ఆమె సోదరుడు మరియు ఆమె ఇల్లు ఫోటోలను మెయిల్ టుడే పత్రిక ప్రచురించినట్లు ఐ.ఎ.ఎన్.ఎస్ తెలిపింది. పత్రిక పబ్లిషర్, ఎడిటర్, రిపోర్టర్ లతో పాటు మొత్తం అయిదుగురిపైన కేసు నమోదు చేశామని వసంత్ విహార్ (ఢిల్లీ) పోలీసులు చెప్పారు. అయితే కేసు విషయం తమకు తెలియదని మెయిల్ టుడే ఎడిటర్ సందీప్ బాంజాయ్ చెబుతున్నాడు.
తమకూతురి సంసరణార్ధం తమ గ్రామంలో ఆమె పేరుతో ఒక ఆసుపత్రి నెలకొల్పాలని అమ్మాయి తండ్రి ఇప్పటికే కోరి ఉండడంతో శశిధరూర్ సూచన ఆచరణీయమని పలువురు భావిస్తున్నారు. అమ్మాయి తల్లి, తండ్రి అంగీకరించినట్లయితే ఆమె పేరును బైటపెట్టే అవకాశం చట్టంలో కూడా ఉన్నట్లుగా సుప్రీం కోర్టు లాయర్లను ఉటంకిస్తూ ఇండియా టుడే పత్రిక తెలిపింది. “ఈ చట్టం తల్లిదండ్రులకు ప్రైవసీ కల్పిస్తుంది. కానీ వారికి అభ్యంతరం లేకపోతే పేరు చెప్పవచ్చు” అని సుప్రీం కోర్టు లాయర్ కీర్తి సింగ్ తెలిపిందని ఇండియా టుడే చెబుతోంది.
తల్లిదండ్రుల అంగీకారం
శశిధరూర్ ద్వారా సూచన ప్రచారంలోకి వచ్చినప్పటికీ అంతకుముందే ఈ అంశంపై పత్రికలు, ఇంటర్నెట్ లో స్వల్ప స్ధాయిలో చర్చ నడుస్తోంది. మంత్రి ప్రవేశంతో అది ప్రధాన వార్తల్లో ఒకటిగా మారిపోయింది. ఈ నేపధ్యంలో అమ్మాయి తల్లిదండ్రులు తమ అంగీకారం తెలిపారు. “ఈ లక్ష్యం కోసం మా అమ్మాయి పేరు బహిరంగం అయితే మాకు అభ్యంతరం లేదు. సవరించబడిన అత్యాచార వ్యతిరేక చట్టానికి ప్రభుత్వం మా అమ్మాయి పేరు పెడితే ఆమెకది గౌరవం అవుతుంది. కనుక మాకు అభ్యంతరం లేదు” అని అమ్మాయి తండ్రి, సోదరుడు చెప్పినట్లుగా పి.టి.ఐ తెలిపింది.
తెలుగు సినీ దర్శకుడు రమణ గడ్డం ఢిల్లీ అత్యాచార ఘటనను తన కొత్త సినిమాలో చొప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలకు అమ్మాయి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. తాను తీస్తున్న కొత్త సినిమాలో ఢిల్లీ అత్యాచారాన్ని హైలైట్ చేసే విధంగా నూతన దృశ్యాలను చిత్రీకరించడానికి రమణ గడ్డం భావించినట్లుగా పత్రికలు తెలిపాయి. అలా చేయాలంటే ముందు తమను కలవాలనీ, తమని కలిసి సినిమా కధ గురించి చెప్పాలనీ కోరారు. సినిమాలో ఏమి చెప్పదలిచాడో దర్శకుడు తమకు తెలియజేయాలని అమ్మాయి సోదరుడు కోరాడు.
బాధితురాలి కుటుంబానికి వివిధ ప్రభుత్వాలు ప్రకటించిన సహాయం ఇంకా వారికి అందలేదని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ (అమ్మాయి గ్రామం ఉన్న రాష్ట్రం) ప్రభుత్వం 20 లక్షల రూపాయల సహాయం ప్రకటించగా, ఢిల్లీ ప్రభుత్వం 15 లక్షల రూపాయల సాయంతో పాటు కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కూడా ప్రకటించింది. చేయడానికి ప్రకటనలు చేసినప్పటికీ అదేమీ తమకు అందలేదని సోదరుడు చెప్పాడు. ‘ప్రభుత్వం ప్రకటన చేసింది అదే తమకు సంతోషం’ అని అమ్మాయి తండ్రి వ్యాఖ్యానించినట్లు ది హిందూ తెలిపింది. అమ్మాయి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నదన్న వార్తలను ఆమె కుటుంబ సభ్యులు ఖండించారు. అందులో నిజం లేదని వారు తెలిపారు.
గోప్యత ఇంకా ఎందుకు?
అత్యాచారం ఎదుర్కొన్న మహిళల గుర్తింపు గోప్యంగా ఉంచడం ద్వారా వారికి సమాజం నుండి ఎదుర్కొనే వివక్షనుండి రక్షణ కల్పించాలన్నది చట్టం ఉద్దేశ్యం. వారి కుటుంబ సభ్యులకు కూడా సంఘంలోని అవాంఛనీయ వ్యక్తులు, శక్తుల నుండి సూటిపోటి మాటలు, అసభ్యవర్తన ఎదురుకాకుండా అలాంటి గోప్యత కొంతమేరకు రక్షణ ఇస్తుంది. కానీ ఢిల్లీ అత్యాచారం కేసులో అమ్మాయి ఇక లేదు కనుక గోప్యతవల్ల అదనపు ప్రయోజనమేమీ కనపడడం లేదు. పైగా అమ్మాయి ‘సాహస హృదయి’ (బ్రేవ్ హార్ట్)గా పత్రికలు, ప్రజలు కొనియాడుతున్న పరిస్ధితే దేశంలో ఉంది. శీలం లాంటి పనికిమాలిన మచ్చలకు అతీతంగా ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఇపుడు దేశ ప్రజల హృదయాల్లో గూడుకట్టుకుని స్ధిరపడిపోయింది.
ఐదుగురు మగవాళ్ళు (మృగాలు అంటే మృగాలకి అవమానం అన్న సూచనతో ఏకీభవిస్తున్నాను) కాళ్ళు, చేతులు నొక్కి పట్టి అత్యాచారానికి ఒడిగడుతున్నా బేలగా మారకుండా మొక్కవోని ధైర్యంతో శక్తికొద్దీ అమ్మాయి ప్రతిఘటించిందని పోలీసుల చార్జి షీటు చెబుతోంది. ప్రతిఘటించడానికి వినియోగించే నాలుగు అవయవాలను కదిలించలేకపోయినప్పటికీ అందుబాటులో ఉన్న నోటితో కొరికి తనను తాను కాపాడుకోవాలని అమ్మాయి తీవ్రంగా ప్రయత్నించడం సామాన్యమైన విషయం కాదు. భయవిహ్వలత ను అధిగమించగల మానసిక స్ధైర్యమ్ కూడా దానికి అవసరం. ఛార్జిషీటు ప్రకారం నిందితుల్లో ముగ్గురు శరీరాలపై (చేతులకు) కొరికిన గాయాలు ఉన్నాయి. ఒకే దెబ్బతో ఒకేసారి పదులమంది ఫైటర్లను కిలోమీటర్ల దూరంలోకి విసిరి కొట్టే సినిమా హీరోలతో అమ్మాయి పోరాటం అసలు పోల్చడానికే వీలులేనిది. అలాంటి అమ్మాయి వీరోచిత మరణం పేరులేని మరణంగా ఉండిపోవడానికి వీలులేదు.
మారణానంతరం కూడా గోప్యత కొనసాగించడం ద్వారా ప్రజల ఆగ్రహజ్వాలలను ప్రభుత్వం అదుపులో పెట్టగలగడం ముఖ్యంగా గమనించవలసిన విషయం. సింగపూర్ నుండి ఇండియాకి అమ్మాయి పార్ధివదేహాన్ని ఎప్పుడు తెస్తున్నదీ ప్రభుత్వం సరయిన సమాచారం ఇవ్వలేదు. మృతదేహం ఢిల్లీకి వచ్చాక ఎన్నడూ లేనంతగా కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్ల మధ్య వాహనాలపై తరలించారు. అంత్యక్రియలు గ్రామంలో జరుగుతాయన్నట్లుగా మొదట సూచించి చివరికి ఢిల్లీలోనే కానివ్వడం, అదికూడా బంధువులను కూడా అనుమతించకపోవడం… అన్నీ గోప్యంగానే ఉంచబడ్డాయి. చివరికి అమ్మాయి అస్ధికల ప్రయాణం కూడా గోప్యంగానే సాగింది. అస్ధికలను తీసుకుని ఆమె తల్లిదండ్రులు ఫలానా రైలులో వారి గ్రామానికి వస్తారని, అందులో ఐదు బెర్త్ లు రిజర్వ్ కూడా చేశారనీ సమాచారం విడుదల చేశారు. వారికోసం వారి గ్రామస్ధులతో పాటు, ఆ గ్రామ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా రైలురాక కోసం ఎదురు చూశారు. తీరా చూస్తే వారిని విమానం ద్వారా వారణాసికి పంపి అక్కడినుండి గ్రామం వెళ్ళే ఏర్పాట్లు చేశారు.
“అమ్మాయి అస్ధికాలతో సహా వస్తున్న ఆమె కుటుంబం కోసం మేమంతా మంగళవారం ఉదయం ఎదురుచూస్తున్నాం. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నాం. రైలులో ఆరు బెర్తులను ప్రభుత్వమే బుక్ చేసిందని అమ్మాయి తండ్రి మాకు సమాచారం ఇచ్చాడు కూడా” అని అమ్మాయి బాబాయి చెప్పాడని ఇండియా టుడే తెలిపింది. చుట్టుపక్కల గ్రామాల వారంతా రైల్వే స్టేషన్ కు అంతా ప్రయాణం కాగా చివరినిమిషంలో ప్రభుత్వం విమానం టికెట్లు బుక్ చేసింది. వారణాసివద్ద ఉన్న బేబత్ పూర్ విమానాశ్రయంలో దిగుతున్నారని తెలియడంతో ప్రజలు ఉసూరుమన్నారు. అయితే తమ అమ్మాయి మరణం దేశాన్ని కదిలించినందుకు వారు ఆ విధంగా సంతృప్తి చెందారు. విధాన నిర్ణేతలను సైతం కదిలించి చట్టాల సవరణకు దారితీసేలా ప్రజలు ఉద్యమం చేసి సఫలీకృతం కావడంపట్ల వారు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
ఒక అన్యాయంపైన ప్రజలు మూకుమ్మడిగా స్పందిస్తే పాలకులకు కలిగే భయం ఏస్ధాయిలో ఉంటుందో ఈ అంశాలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వాలు నడుపుతున్న వ్యక్తులు, వర్గాలు నిరంతరం చేసేదీ, చేస్తున్నదీ అన్యాయాలూ, ఘోరాలే. భద్రజీవులయిన మధ్య తరగతి, ఉన్నత మధ్యతరగతి ప్రజలే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినపుడు ఆ ఉద్యమ వేడి కోర్టులు, సి.బి.ఐ, సి.వి.సి లను తాకడంతో అనేకమంది బడా వ్యక్తులపై కేసులు నడుస్తున్న పరిస్ధితి దాపురించింది. అమ్మాయి 13 రోజులపాటు సాగించిన మృత్యుపోరాటం ఢిల్లీ వీధులను గంగవెర్రులెత్తించింది. రష్యా అధ్యక్షుడు పుటిన్ తో రైసినా హిల్స్ భవనంలోనే వేలకోట్లు ముడుపులు ముట్టే డిఫెన్స్ ఒప్పందాలు జరగనుండడంతో అందుకోసం అక్కడ నిరసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించడానికి అమానుష నిర్భంధం ప్రయోగించినా, ఆనక లెంపలు వేసుకోవలసిన పరిస్ధితి.
అలాంటి ఆందోళన అమ్మాయి మృత్యువార్తతో చేయిదాటితే, అది దేశం అంతా విస్తరిస్తే ప్రభుత్వాల పునాదులు కదలొచ్చు. మహిళాలోకం ఎదుర్కొంటున్న అత్యంత బాధాకరమైన, అయినప్పటికీ ప్రభుత్వాల ఉదాసీనతే సమాధానంగా ఎదురవుతున్న, ఒక ముఖ్యమైన సమస్యపై ఆందోళన నిరంతరాయంగా కొనసాగితే అదింకా అనేక చర్చలను లేవదీస్తుంది. చర్చలోని సమస్యతో ముడిపడి ఉన్న ఇతర సమస్యలు కూడా చర్చలోకి వస్తాయి. ఆ చర్చ చివరికి వ్యవస్ధ మూలాలనే ప్రశ్నించే స్ధాయికి చేరుతుంది. స్వాతంత్ర్యం అంటున్నదేదీ మహిళలతోపాటు ఇంకా అనేక బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు అందుబాటులోకి రాలేదన్న సంగతి తేలిపోతుంది. మరోవైపు ఇప్పటికే వ్యవస్ధ తీరుతెన్నులపై అసంతృప్తితో వ్యవస్ధ మార్పుకోసం ఉద్యమిస్తున్న శక్తులకి ఇది ఊతమిస్తుంది. సామాన్య జనానికి తమ శక్తిని తాము రుచిచూసే అనుభవం కూడా కలుగుతుంది. ఒకసారి అలాంటి అనుభవం రుచిమరిగితే ప్రజలను ఆపడం ఇక ఎవరితరమూ కాదు. ఢిల్లీ నిప్పురవ్వ దావానలమై వ్యవస్ధల పునాదులను కదిలించే శక్తిని సంతరించుకుంటుంది. సంతృప్త వర్గాలకు ఇది ఇష్టం ఉండదని వేరే చెప్పనవసరంలేదు.
అందుకే ప్రభుత్వాలు అనేక విషయాల్లో అనేకసార్లు అనవసర గోప్యతను పాటిస్తాయి. అనవసర గోప్యత అని మనకి అనిపించినా వారికది అవసరమే. బ్యాంకుల్లో వేలకోట్లు అప్పులు తీసుకుని ఎగవేసినవారి పేర్లు చెబితే అది దేశభద్రతకు ప్రమాదం అంటే బుద్ధున్నవాడేవ్వడూ నమ్మడు. కానీ ఆ అబద్ధాన్ని సాక్ష్యాత్తూ పార్లమెంటులోనే ప్రజాప్రతినిధులు నిస్సిగ్గుగా వల్లిస్తారు. దేశం డబ్బుని విదేశాలకి తరలించుకెళ్లినవారి పేర్లు ఆయా బ్యాంకులు చెప్పినా మన ప్రభుత్వాలు బైటికి చెప్పవు. అదేమంటే విదేశాలతో రహస్య (నిర్వహణ) ఒప్పందాలు ఉన్నాయి అంటాయి. కూడంకుళం అణు కర్మాగారం విషయమై ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారని అక్కడి ప్రజలే అడిగినా చెప్పరు. పైగా ఏకంగా దేశద్రోహం కేసులే మోపుతారు. ప్రజల వనరులను విదేశీ కంపెనీలకి అప్పజెప్పే విధంగా ప్రభుత్వాలు విదేశీ కంపెనీలతో కుదుర్చుకునే ఎం.ఒ.యు (memorandum of understanding) లు భారత ప్రజలకు ఇవ్వరు. సమాచారహక్కు చట్టం ప్రయోగించినా సరే. (కాకపోతే కేసవుతుంది; ఆ కేసు తేలాడానికి ఏళ్ళూ, పూళ్ళూ పడుతుంది.)
ప్రభుత్వాల గోప్యత అంటే ప్రజలకి నిజం చెప్పకపోవడం. ఢిల్లీ అమ్మాయి విషయంలో గోప్యతవల్ల ఒనగూరే ప్రయోజనానికి పరిమితి ఉంది. అది అనంతమైనదేమీ కాదు. పరిమితిదాటినా గోప్యత కొనసాగిందంటే అది అనుమానాలకు అతీతమైనది కాదు.
UPDATE
వ్యక్తుల పేర్లతో చట్టాలకు పేరు పెట్టే అవకాశం ఐ.పి.సిలో గానీ సిఆర్.పి.సిలో గానీ లేదని ప్రభుత్వం ప్రకటించింది. “విషయాన్ని జాతీయ దృష్టితో చూడాలి. అత్యాచార వ్యతిరేక చట్టాలలో మార్పులు తేవడానికి ఈ అమ్మాయి ఉత్ప్రేరకంగా పనిచేసింది. పేరు పెట్టే ఉద్దేశ్యం లేదు” అని హోం మంత్రిత్వశాఖ అధికారులు చెప్పారని ‘ది హిందూ’ తెలిపింది. ప్రభుత్వం సంగతి ఎలా ఉన్నప్పటికీ అమ్మాయి తల్లిదండ్రుల అంగీకారంతో పేరు బైటికి రావడం జరిగితే, రాబోయే కొత్త చట్టాన్ని అమ్మాయి పేరుతో సంబోధించే అవకాశాలు ఎలాగూ ఉన్నాయి.
విషయాన్ని జాతీయ దృష్టితో చూడాలి. అత్యాచార వ్యతిరేక చట్టాలలో మార్పులు తేవడానికి ఈ అమ్మాయి ఉత్ప్రేరకంగా పనిచేసింది. పేరు పెట్టే ఉద్దేశ్యం లేదు” అని హోం మంత్రిత్వశాఖ అధికారులు చెప్పారని ‘ది హిందూ’ తెలిపింది.
మంచి నిర్ణయం. ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ప్రస్తుతం కానీ, భవిశ్యత్తులో కానీ, ఒక్క మాట రావడానికి కూడా ఆస్కారం ఉండా కూడదు. ఇప్పుడు సలహా ఇచ్చిన వారు ఒక విషయాన్ని మరిచిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం, విప్లవాత్మక మార్పులే తేవబోతోంది. రసాయనాల ద్వారా నపుంసకులుగా మార్చడం కూడా పరిశీలనలో ఉంది అని వార్తలున్నాయి. అటువంటప్పుడు చట్టానికి ఆమె పేరు పెట్టడం వలన, భవిశ్యత్తులో చాలా మంది ఆమె గురించి తప్పుగా మాట్లాడుకునే అవకాశం ఉంది అని నాకనిపిస్తోంది. ప్రస్తుతం వస్తున్న చట్టాలు ఎలా దురుపయోగం అవుతున్నాయో మీకు తెలీదని నేను అనుకోను. ఈ చట్టం కూడా అలా దురపయోగం అయితే (అవకూడదనే కోరుకుంటున్నాను), ఈ చట్టాన్ని కూడా నిందించాల్సి వస్తుంది. కాబట్టి, ఆ చట్టానికి తన పేరు పెట్టకుండా ఉంటేనే మంచిదని నేను భావిస్తున్నాను. భవిశ్యత్తును గురించి ఆలోచించాలన్నది నా సూచన.
“చట్టం ప్రకారం లైంగిక అత్యాచారం ఎదుర్కొన్నా బాధితురాలి పేరు బైటపెట్టడం నేరం. అత్యాచార బాధితురాలికి సంబంధించిన పేరుగానీ, ఆమెను గుర్తించేందుకు దారితీసే సమాచారాన్ని గానీ పత్రికల్లో ముద్రించినా లేక ఇతరత్రా ప్రచురించినా ఐ.పి.సి సెక్షన్ 228-ఎ ప్రకారం నేరం. సదరు నేరం చేసినవారికి రెండు సంవత్సరాల వరకూ జైలు శిక్ష వెయ్యవచ్చని చట్టం చెబుతోంది.”
అదేంటండి మన తెలుగు మీడియా ,మరియు మన తెలుగు పత్రికలు ప్రతి రోజు రేప్ కు గురైన అమ్మాయిల పేర్లు మరియు ఫోటో లు ప్రచురిస్తున్నారు.
Ramana Reddy గారూ, అత్యాచారానికి గురైన అమ్మాయిల పేర్లూ, ఫొటోలూ తెలుగు మీడియా ప్రచురిస్తోందా? పైగా ప్రతిరోజూ!
మీరు వ్యంగ్యంగా రాయలేదనుకుంటాను.
మీ అభిప్రాయంలో వాస్తవం లేదండీ. ఈ విషయంలో మన మీడియా బాధ్యతగానే వ్యవహరిస్తోంది. ఫొటో కాదు, బాధితురాలి పేరు కూడా రాయకుండా జాగ్రత్త తీసుకుంటుంటారు.
ఎందుకండి మొన్న నే ఉస్మానియాలో చదివే విద్యార్థిని అత్యాచారమ్ హత్య అని పేపర్ లో రాలేదా?ఆమె ఫోటొ కూడా వేసారు.
Ramana Reddy గారూ! మీరు పేర్కొన్నది ప్రధానంగా హత్య కేసు. ఇలాంటి ప్రత్యేక సందర్భం కవర్ చేసిన పద్ధతిని బట్టి అత్యాచార వార్తలన్నీ ఇలాగే కవర్ చేస్తున్నారంటూ
జనరలైజ్ చేయకూడదు కదా?