ఆమె పేరు ఎలిసాని డ క్రజ్ సిల్వా, వయసు 17. అతని పేరు ఫ్రాన్సినాల్డో డ సిల్వా కర్వాలో, వయసు 22. సామాజికంగా అమ్మాయి, అబ్బాయిల ఎత్తు పట్ల నెలకొని ఉన్న అభ్యంతరాలను త్రోసిరాజని వీరిద్దరూ జంట కట్టారు. అందుకే వారు ముచ్చటైన జంట! ఇంకా పెళ్లి కాలేదు గానీ ఆ ఆలోచనలో ఉన్నారు. ఈ బ్రెజిల్ అమ్మాయికి పిట్యూటరీ గ్రంధిలో ట్యూమర్ ఏర్పడడంతో అనూహ్యంగా ఎదిగిపోయి 6 అడుగుల 8 అంగుళాల ఎత్తుకు చేరుకుంది. డాక్టర్లు ఆపరేషన్ చేసి ట్యూమర్ ని తొలగించారు గనుక ఇంకా ఎత్తు పెరిగే అవకాశం తప్పిపోయింది. మోడల్ కావాలనుకుంటున్న ఎలిసాని తోటి పిల్లలు ఏడిపిస్తుండడంతో స్కూల్ మానేసి ఇంట్లోనే చదువుకుంది. నిర్మాణ కార్మికుడుగా పని చేసే ఫ్రాన్సినాల్డో ‘ఎత్తైన గర్ల్ ఫ్రెండ్ ఐతే ఏమిటి? ఆమె అందమైన ముఖం నాకు నచ్చింది’ అంటున్నాడట. ఈ ఫోటోలను డెయిలీ మెయిల్ అందించింది.







