దండోరా వెయ్యనందుకు కట్టేసి కొట్టిన అగ్ర కులస్ధులు


అగ్రకుల దాడిపై దళిత సంఘాల ఆందోళన

అగ్రకుల దాడిపై దళిత సంఘాల ఆందోళన

కులవ్యవస్ధ అణచివేత తన వాస్తవ రూపంలోనే కొనసాగుతున్నదని కర్ణాటకలో జరిగిన ఘటన రుజువు చేస్తున్నది. సంప్రదాయక కులాచారం ప్రకారం దండోరా వెయ్యడానికి నిరాకరించాడని 38 సంవత్సరాల రంగస్వామిని అగ్రకులస్ధులు స్తంభానికి కట్టేసి చితకబాదారు. కొట్టాక కూడా దండోరా వేయడానికి ఒప్పుకోకపోతే అతని ఇద్దరు కూతుళ్లను కూడా కొడతామనీ, వారికి ప్రమాదం కలగజేస్తామనీ బెదిరించారు. రోజువారీ కూలి చేసుకుంటూ బతికే రంగస్వామి అగ్రకులజుల కులాధిపత్య దాడికి బలై చెన్నరాయపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.

తన భర్తను అగ్రకుల పెత్తందారులు చెట్టుకు కట్టేసి ఎలా కొట్టింది గౌరమ్మ పత్రికలకు కన్నీళ్లతో వివరించింది. “అతని బట్టలని చించేశారు. స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు. మా ఇద్దరు కూతుళ్ళు బడికి వెళ్తున్నారు. వారిని కూడా కొడతామని బెదిరించారు. తమ ఆజ్ఞలను పాటించకపోతే అన్నంతపనీ చేస్తామని హెచ్చరించారు.” అని గౌరమ్మ చెప్పిందని ‘ది హిందూ’ తెలిపింది.

వచ్చేవారం బద్దికెరే గ్రామంలో గ్రామ పండుగ జరగనుంది. గ్రామం అంతా తిరుగుతూ పండగ తేదీలను దండోరా వేసి చెప్పాలని గ్రామస్ధులు రంగస్వామికి ఆర్డర్ వేశారు. రోజు కూలీ పైన ఆధారపడి బతికే రంగస్వామి అందుకు నిరాకరించాడు. దానితో అగ్రకులస్ధులకు కోపం వచ్చింది. “వచ్చేవారం జరగబోయే గ్రామ పండుగ గురించి చాటింపు వేయడానికి ఒప్పుకోనందుకే ఇదంతా జరిగింది. డిసెంబర్ 17 తేదీన ఆటోరిక్షాలో కొంతమంది మా ఇంటికి వచ్చారు. వచ్చీరాగానే అతన్ని లాక్కెళ్లి ఆటోలో పట్టుకెళ్లిపోయారు. ఆటో వెనకాలే నేను పరుగెత్తేకెళ్లేసరికి అక్కడ అతన్ని కట్టేసి కొడుతున్నారు.” అని గౌరమ్మ తెలిపింది.

అగ్రకుల పెద్దలని తాను ఎంతగా కాళ్ళావేళ్లాపడి బతిమాలినా వినలేదని గౌరమ్మ వాపోయింది. “ఈ ఘటన గురించి పోలీసులకి చెబితే మా కూతుళ్ళకి కూడా హాని చేస్తామని బెదిరించారు” అని గౌరమ్మ తెలిపింది. రంగస్వామిని కాపాడడానికి అతని బంధువులు మూర్తి, కుమార్ లు అక్కడికి పరుగెట్టుకొచ్చారు. వారు కూడా రంగస్వామిని కాపాడడంలో విఫలం అయారు. తమముందే రంగస్వాని కొట్టడం కొనసాగించినా చూడడం మాత్రమే చేయగలిగారు. “వాళ్ళు 200 మంది వరకూ ఉన్నారు. మేము ఇద్దరమే. మమ్మల్ని కూడా బండ బూతులు తిట్టారు. వాళ్ళ ఆదేశాలు వినకపోతే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని మమ్మల్నీ హెచ్చరించారు” అని మూర్తిని ఉటంకిస్తూ ది హిందూ తెలిపింది.

ఘటనపై రంగస్వామి కుటుంబం నుగ్గెహళ్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మొత్తం 12 మందిపై ఫిర్యాదు చేశారు. షెడ్యూల్డ్ కులాలు, తెగల అత్యాచారాల నిరోధక చట్టం కింద పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబరు 18న కేసు నమోదయినా ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. నిందితులను అరెస్టు చెయ్యడానికి నాలుగు పోలీసు బృందాలను పంపామని అధికారులు చెబుతున్నారు. హస్సన్ జిల్లాకు చెందిన వివిధ దళిత సంఘాలు కమిషనర్ ఆఫీసు ముందు ఆందోళన నిర్వహించారు. దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

కూలి మానుకుని దండోరా వేయనందుకు చితకబాదిన ఘటనలు కర్ణాటకలో గతంలో కూడా చాలానే జరిగాయి. తరతరాలుగా అణచివేతకు గురయిన పరిస్ధితుల్లో దళితులకు అభివృద్ధి కావడానికి చదువులు, భూములు, ఇతర ఆస్తులు ఏవీ సమకూరలేదు. ఏ ఆస్తులూ వారికి లేనపుడు వారంతట వారు అభివృద్ధి కావడం, చదువుకుని ప్రతిభపొంది ఉద్యోగాలు సాధించడం సాధ్యం కానిపని. ఈ దృష్టితోనే రాజ్యాంగం రచించిన పెద్దలు, బి.ఆర్.అంబేడ్కర్ పోరాటం మేరకు విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు ప్రతిపాదించారు.

దళితులు ఇప్పటికైనా భూములు, పరిశ్రమలు సంపాదించగలిగి ఉండి ప్రభుత్వాలపై ఆధారపడకుండా ఉండగల ఆర్ధిక సామర్ధ్యాన్ని పొందగలిగితే రిజర్వేషన్ల అవసరం ఏమీ ఉండదు. కానీ దళితులు ఆర్ధిక సామర్ధ్యాన్ని పొందగలిగేవిధంగా పరిస్ధితులు ఎందుకు లేవో రంగస్వామి ఎదుర్కొన్న కుల అణచివేత ప్రత్యక్ష సాక్ష్యం. కులిమానుకుని దండోరా వేయమని ఆధిపత్యం చెలాయించడం అంటే ఎప్పటికీ దండోరా వేసుకుంటూ బతకమనే. కుల అణచివేతకూ, ఇప్పటికీ అణచివేతలోనే కొనసాగుతున్న దళితుల దారిద్రానికీ కారణం ఏమిటో రంగస్వామి దరిద్రమే చెబుతోంది. ఇప్పటికీ రిజర్వేషన్ల అవసరం ఎందుకు ఉన్నదో కూడా రంగస్వామి ఎదుర్కొన్న కులదాడి స్పష్టం చేస్తున్నది.

One thought on “దండోరా వెయ్యనందుకు కట్టేసి కొట్టిన అగ్ర కులస్ధులు

  1. mimmalni chusi jali padalo…emanukovalo teliyatam ledu..,oka sc evarina edinaa amte SC ST Act vumdi..kani agra kulastulanu ade matamte..no case..,oka chinna issue chupinchi desam amtaa alane vumdi amtunnaru…assalu sc st oc ani kavalani reservations kosam vida seesukoni…ila antam sari kadu…meeru heading kuda assalu bago ledu”oka karmikudni kottin vinam”amte bagundedi..chesedi mee lanti valle ultimate aim imka develope avvaledu ani reservations penchu kovatam…kiran@DSP

వ్యాఖ్యానించండి