బాధితురాలి తెగువ, ధైర్యం అపూర్వం -డాక్టర్లు


Gang rape protests“ఆమె గొప్ప ధైర్యవంతురాలు. తనపై దాడి జరిగిన మొదటి క్షణం నుండి ఈ రోజువరకూ పోరాడుతూనే ఉంది” ఈ మాటలన్నది సఫ్దర్ జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.డి.అధాని. బాధితురాలిని కంటికి రెప్పలా కాపాడుతున్న డాక్టర్ల ప్రకారం లైంగిక అత్యాచారం జరిగిన కేసుల్లో ఇంత తీవ్రమైన, లోతైన, బాధాకరమైన గాయాలను మరే కేసులోనూ వారు చూడలేదు. పెద్ద పేగు మొత్తాన్ని సర్జరీ ద్వారా తొలగించినట్లు కొన్ని పత్రికలు చెబుతుండగా గాంగ్రీన్ సోకిన భాగాన్ని మాత్రమే తొలగించినట్లు కొన్ని పత్రికలు చెబుతున్నాయి. మొత్తం మీద చూస్తే జీర్ణ వ్యవస్ధ పనిచేయడానికి అత్యవసరమైన పెద్ద పేగు పనిని బాధితురాలు పూర్తిగా కోల్పోయింది. అటువంటి విపత్కర స్ధితిలో డాక్టర్ల చికిత్సకు రోగులు స్పదించడం అరుదుగా జరుగుతుంది. కాగా, ఢిల్లీ అత్యాచారం బాధితురాలు మానసిక, శారీరక శక్తి క్షీణస్ధాయిలో ఉన్నప్పటికీ బతకడం కోసం తీవ్రంగా పోరాడుతోంది.

కడుపులో పైకి కనపడని ఇతర గాయాలను కనిపెట్టడం కోసం డాక్టర్లు వివిధ పరికరాలతో ప్రయత్నించడం తెలిసిన విషయమే. డాక్టర్లు చేసే ఈ ప్రయత్నం రోగికి బాధాకరంగా ఉంటుంది. శారీరక శక్తితో పాటు మానసిక శక్తి కూడా ఇలాంటివాటికి చాలా అవసరం. ‘elective exploratory laparotomy’ గా పిలిచే ప్రక్రియను బాధితురాలిపై డాక్టర్లు బుధవారం రాత్రి ప్రయోగించారు. ఈ ప్రక్రియ ద్వారా కడుపులో ఇతర చోట్ల ఉన్న గాయాలు, లోపలి శరీర భాగాలు ఉన్న స్ధితి మొ.వి తెలుస్తాయి. ఈ ప్రక్రియను బాధితురాలు ప్రమాదస్ధాయిని ఎదుర్కోకుండా అధిగమించిందని డా. అధాని తెలిపాడు. గురువారం ఉదయానికల్లా ఆమె పరిస్ధితి స్ధిరపడిందని ఆయన తెలిపాడు.

బాధితురాలు ఇంకా ఐ.సి.యు లోనే కొనసాగుతోంది. రక్తపోటు, మూత్ర విసర్జన, ఊపిరి రేటు మొదలైన ముఖ్యమైన ప్రక్రియలు ఆమోదకరమైన పరిమితిలో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అయితే, ఇతర ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతూ, ఐ.సి.యు నుండి ఆమెను బైటికి తేవడమే తమ తక్షణ కర్తవ్యమని అధాని తెలిపాడు. “తనంతటతాను ఊపిరి పీల్చుకోవడానికి ఆమె గట్టిగా ప్రయత్నిస్తోంది. రక్తనాళాల ద్వారా పోషకాహారం (Total Parenteral Nutrition) ఇవ్వడం మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పేగు కోల్పోవడం వలన నోటిద్వారా ఆహారం తీసుకునే పరిస్ధితి లేదని డాక్టర్లు చెప్పారు. వారి ప్రకారం ఇటువంటి పరిస్ధితిలో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం చాలా ఉంటుంది.

“ఊహించదగిన ప్రమాదాల్లో అది ఒకటి. దానిని నివారించడానికి మొదటి రోజునుండి ఆమెకు తగుమొత్తంలో యాంటీ బయాటిక్స్ ఇస్తున్నాము. పేగు భాగం గాంగ్రియస్ కండిషన్ లో ఉన్నది. ఎంతకీ లొంగని గాయాలు కూడా ఉన్నాయి” అని డా. అధాని తెలిపాడు. అంత తీవ్రమైన గాయాలు ఉన్నప్పటికీ అద్భుతమైన పోరాట పటిమను బాధితురాలు ప్రదర్శిస్తున్నదని ఆయన తెలిపాడు. “ఆమె స్ధిరంగా ఉంది. దాదాపు అప్రమత్తంగానే ఉంటోంది. దాడితో పాటు మా ఎక్స్ ప్లోరేటరీ జోక్యాలన్నింటికీ తట్టుకుని నిలబడింది. ఆమె గొప్ప ధైర్యవంతురాలు. తనపై దాడి జరిగిన మొదటి క్షణం నుండి ఈ రోజువరకూ పోరాడుతూనే ఉంది” అని డా. అధాని తెలిపాడు.

“ఆమె మెలకువగానే ఉంది. కానీ వెంటిలేషన్ కోసం లోపల ట్యూబ్ ఉన్నందున మాట్లాడలేకపోతున్నది. సైగల ద్వారా మాట్లాడగలుగుతోంది. ఆమె అప్రమత్తంగానే ఉన్న సంగతి మాకు తెలుసు. అందువలన పదే పదే ఆమెతో మాట్లాడి భంగం కలిగించడం లేదు” అని డా. అధాని తెలిపాడు.

బాధితురాలు అత్యంత పేదరాలు. పత్రికల ప్రకారం ఆమె తల్లిదండ్రులు కడుపునిండా తిండికి నోచుకోని కటిక పేదలు. పస్తులు ఉండడం వారికి మామూలు విషయం. తరచుగా రొట్టెకు ఉప్పు కలుపుకుని తినడం వారి పేద అలవాటు. తమకు ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మి డాక్టర్ కావాలన్న తన కూతురి కలను నిజం చేయడానికి వారు సిద్ధపడ్డారు. తరాలు తిన్నా తరగని ధన రాశులనూ, వేలాది ఎకరాల భూములనూ, ఇంకా అనేక రకాల ఆస్తులను కలిగి ఉండి కూడా మగ నలుసుకోసం ఆడపిల్లను పురిట్లోనే హత్యచేస్తున్న దుర్మార్గులు ఉన్న కాలంలో ఉన్నదంతా కూతురికోసం ఊడ్చిపెట్టి పస్తులుండగల బాధితురాలి తల్లిదండ్రులు నిస్సందేహంగా గొప్పవారు. పేదరికంతో పాటు “ఆడపిల్ల ‘ఆడ’ పిల్లే” అన్న సామాజిక దురాచారంతో  పోరాడి గెలిచిన తల్లిదండ్రుల ఇంట మగరికంతో పోరాడే కూతురు ఉండడం సహజమే కావచ్చు!

ఆందోళనలు, విమర్శలు

బాధితురాలికి సహాయం చెయ్యడానికి అనేకమంది ముందుకు వస్తున్నట్లు పత్రికలు తెలిపాయి. ఆసుపత్రికి స్వయంగా వచ్చి రక్తం దానం చెయ్యడానికి ముందుకు వస్తున్నారు. విద్యార్ధులు, ఉద్యోగులు, నర్సులు, కార్మికులు, ఇతర రోగులకు సాయంగా వచ్చినవారు మొదలయినవారు వారిలో ఉన్నారు. కొందరు ధనసహాయం చేయడానికి ముందుకు వచ్చారు. బాధితురాలు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. “రక్తం ఇస్తామంటూ నేరుగా మాదగ్గరికి వస్తున్నారు. ఇంకేసాయం అవసరమైనా చేస్తామంటున్నారు. మా వైద్య విద్యార్ధులు కూడా ఆమెకు సాయం చేస్తామని ముందుకు వచ్చారు. అమానుషమైన దాడిపట్ల దేశం మొత్తం ఆగ్రహిస్తోంది. ఆమెకు మద్దతుగా ప్రజలంతా ముందుకు వస్తున్నారు” అని డా. అధాని చెప్పాడని ‘ది హిందూ’ తెలిపింది.

మహిళలకు రక్షణ ఇవ్వడంలో ఘోరంగా విఫలం అవుతున్న ప్రభుత్వంపై అనేకమంది ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఇంటిముందు ఆందోళన నిర్వహిస్తున్నవారిపై బుధవారం పోలీసులు విరుచుకుపడ్డారు. వాటర్ కెనాన్ లు ప్రయోగిస్తూ నిర్బంధానికి తెగించారు. ఢిల్లీ పోలీసుల ప్రవర్తనను వివిధ వర్గాల ప్రజలు, నాయకులు, పశ్చిమ పత్రికలు గర్హించారు. ఢిల్లీలో మహిళలపై సాగుతున్న అత్యాచారాలపై షీలా దీక్షిత్ అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిని పలువురు నిరసించారు. డి.యు, జె.ఎన్.యు, జామియా మిలియా ఇస్లామియా ల విద్యార్ద్ధులు, సంఘాలు ఆమెను రాజీనామా చేయాలని కోరాయి. అందరిలాగే షరతులులేని స్వేచ్ఛను అనుభవించే హక్కు మహిళలకు ఉన్నదనీ, ఇంట్లోనైనా వీధిలోనైనా వారేమీ ధరించారన్నదానితో సంబంధం లేకుండా, హింసా భయం లేకుండా బతికే హక్కు మహిళలకు ఉన్నదనీ ఆ హక్కును ప్రభుత్వాలు, పోలీసులు, న్యాయవ్యవస్ధ ఎటువంటి శషభిషలు లేకుండా నిలబెట్టాలనీ వారు డిమాండ్ చేశారు.

మహిళలపై హింసకు పాల్పడరాదంటూ ఢిల్లీ పోలీసులు చేస్తున్న ప్రకటనలో అసలు మహిళలే లేరనీ, పైగా ఒక మగ నటుడి చేత ప్రకటన చేయిస్తున్నారనీ విద్యార్ధి, మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇది, మగవారు మగవారిగానే ఉంటూ ఆడవారిని సంరక్షించాలని కోరడమేనని వారి విమర్శ.

వ్యాఖ్యానించండి