జసింత సల్దానా ఆత్మహత్య, మరి కొన్ని వివరాలు


Jasintha's husband and childrenజసింత సల్దానా ఆత్మహత్యపై మరికొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్ట్రేలియా రేడియో ‘2డే ఎఫ్.ఎం’ జాకీలు రెండోసారి ఆసుపత్రికి ఫోన్ చేసినప్పుడు కూడా జసింతయే దానిని అందుకున్న విషయం, ఆత్మహత్యకు ముందు రాసిన మూడు లేఖల్లోని ఒకదానిలో తన ఆత్మహత్యకు రేడియో జాకీలనే బాధ్యులను చేసిన విషయం, రేడియో ప్రసారం తర్వాత జసింత రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం, రోజూ తనకు ఫోన్ చేసే భార్య ఈసారి ఫోన్ చెయ్యకపోవడంతో తను క్షేమంగా ఉన్నదో లేదో చూడమని కోరినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోని విషయం, సల్దానా ఆత్మహత్యపై వివరాలు కోరుతూ ఆమె భర్త ప్రశ్నలు ఇచ్చినప్పటికీ ఆసుపత్రి యాజమాన్యం స్పందించని విషయం వెలుగులోకి వచ్చాయి.

తన చావుకు రేడియో జాకీలే బాధ్యులని వారిని సంబోధిస్తూ జసింత లేఖ రాసినప్పటికీ కొన్ని బ్రిటిష్ పత్రికలు ఇతర కారణాలు చొప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె కుటుంబ కలహాలే ఆత్మహత్యకు దారి తీసి ఉండొచ్చని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, ఆసుపత్రిలో సిబ్బంది మధ్య ఉన్న తగాదాలు ఆత్మహత్యకు పురికొల్పి ఉండవచ్చని చెప్పేందుకు మరి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ వాదనల్లో నిజం లేదని డెయిలీ మెయిల్ పత్రిక వెల్లడించిన విషయాలు స్పష్టం చేస్తున్నాయి.

శవం పంచనామా సందర్భంగా ఆత్మహత్యకు ముందు జసింత గదిలో మూడు లేఖలు, చేతితో రాసినవి, దొరికిన సంగతి బైటికి వచ్చింది. ఒక లేఖలో మోసపూరితమైన ఫోన్ కాల్ సంగతి, ఇంకో లేఖలో తన అంత్యక్రియలు ఎక్కడ జరగాలన్న విషయం, మూడో లేఖలో సీనియర్ సిబ్బందిపై విమర్శలు ఉన్నాయని ‘ది హిందూ’ తెలిపింది. ‘ది సండే టైమ్స్’ పత్రిక సీనియర్ సిబ్బందిపై విమర్శలు చేసిన లేఖను ప్రధానంగా ప్రస్తావించింది. బూటకపు కాల్ కంటే ముందే జసింతకు ఇతర సిబ్బందితో తగాదా ఉన్నదనీ, సదరు తగాదా విషయంలో మరొక సిబ్బందిపై తగిన చర్య తీసుకోలేదంటూ జసింత అసంతృప్తితో ఉన్నదనీ సండే టైమ్స్ పత్రిక చెబుతోంది. ఆ అసంతృప్తే ఆత్మహత్యకు పురికొల్పి ఉండవచ్చన్న సూచనను ఆ పత్రిక పరోక్షంగా చేసింది.

అయితే డెయిలీ మెయిల్ కధనం ఈ సూచనను తిరస్కరిస్తున్నట్లుగా ఉంది. రేడియో జాకీలను తన ఆత్మహత్యకు బాధ్యులుగా చేస్తూ జసింత రాసిన విషయాన్ని డెయిలీ మెయిల్ ఎత్తిచూపింది. ఆత్మహత్య లేఖల ఒరిజినల్ కాపీలను కాకుండా అందులోని విషయాలను టైప్ చేసిన కాపీలను పోలీసులు జసింత కుటుంబానికి అందజేశారు. జసింత కుటుంబం చెప్పిందాని ప్రకారం ఆమె తన ఆత్మహత్యకు రేడియో జాకీలను బాధ్యులుగా పేర్కొంది. రేడియో జాకీల ప్రవర్తన పట్ల ఆమె తీవ్ర ఆగ్రహాన్ని లేఖలో వ్యక్తం చేసింది. బూటకపు ఫోన్ కాల్ చేసి కేట్ మిడిల్టన్ ఆరోగ్య సమాచారాన్ని రేడియో జాకీలు సంపాదించిన గంట లోపే వారు మళ్ళీ ఆసుపత్రికి ఫోన్ చేశారని డెయిలీ మెయిల్ తెలిపింది. రెండోసారి కూడా జసింతయే ఫోన్ ఎత్తింది. తాము నిజమైన రాణి, యువరాజు లము కాదనీ, ఫోన్ కాల్ సమాచారాన్ని రేడియోలో ప్రసారం చేయనున్నామని జాకీలు చెప్పడంతో జసింత హతాశురాలయినట్లు తెలుస్తోంది. మీడియాతో వ్యవహరించడంపై ఏ మాత్రం అనుభవం లేని జసింత అయోమయానికీ, భయానికీ లోనయిందని డెయిలీ మెయిల్ అభిప్రాయపడింది.

ఫోన్ కాల్ విషయంలో ఆసుపత్రి సిబ్బంది జసింతకు మద్దతుగానే ఉన్నారని ఆసుపత్రి యాజమాన్యం చెప్పినప్పటికీ సీనియర్ సిబ్బంది మాత్రం ఆమెను హెచ్చరించారని డెయిలీ మెయిల్ పత్రిక తెలిపింది. ఆసుపత్రి యాజమాన్యం వ్యవహారం పట్ల జసింత కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. జసింత భర్త బెనెడిక్ట్, వారి ఇద్దరు పిల్లలు ఆసుపత్రిని సమాధానాలు కోరుతూ ప్రశ్నలను సమర్పించారు. కానీ వారు ఇంతవరకూ సమాధానాలు పొందలేదు. జసింత చనిపోయాక ఆసుపత్రి తరపున పరామర్శించడానికి తమను ఎవరూ కలవలేదని జసింత భర్త పత్రికలకు తెలిపాడు. అంతేకాకుండా తన భార్య చనిపోయిన సంగతి పోలీసులనుండే తెలిసింది తప్ప ఆమె పనిచేసే ఆసుపత్రివారు చెప్పలేదని జసింత కుటుంబం పత్రికలకు తెలిపింది.

డెయిలీ మెయిల్ ప్రకారం: జసింత ప్రతిరోజూ సాయంత్రం బ్రిస్టల్ లోని తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడేది. కానీ ఆమె ఆత్మహత్య చేసుకున్న ముందురోజు (గురువారం)మాత్రం ఆమెనుండి ఫోన్ రాలేదు. ఆందోళన చెందిన జసింత భర్త శుక్రవారం తెల్లవారు ఝామున ఆసుపత్రికి ఫోన్ చేసి తన భార్య క్షేమంగా ఉన్నదీ లేనిదీ చూడవలసిందిగా కోరాడు. అతని ఫోన్ అందుకున్న నర్సు దానిని పట్టించుకోలేదు. ఉదయం 9:30 ప్రాంతంలో మరొక సహచర ఉద్యోగి జసింత రూంకి వెళ్ళి చూడడంతో ఆమె శవమై కనిపించింది.

కుటుంబ కలహాల వల్ల జసింత ఆత్మహత్యకు పాల్పడిందన్న ఊహాగానాలను జసింత కుటుంబం తీవ్రంగా ఖండించింది. జసింత అక్క, చెల్లెళ్ళు ఇలాంటి వార్తల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన చెల్లెలు ఆసుపత్రి క్వార్టర్స్ లో ఉన్నప్పటికీ ప్రతిరోజూ తన భర్త, పిల్లలకు ఫోన్ చేసి మాట్లాడుతుందనీ, చాలా అన్యోన్యమైన కుటుంబాన్ని పట్టుకుని అవాకులు చవాకులు పేలవద్దని ఆమె అక్క మాబెల్ సల్దానా కోరినట్లుగా డెయిలీ మెయిల్ తెలిపింది. ఇండియాలో ఉన్న తమకు కూడా తరచుగా ఫోన్ చేసి మాట్లాడుతుందనీ, తన చెల్లెలు భర్త చనిపోవడంతో తన కూతురిని జసింతే సాకుతోందనీ, త్వరలో ఆ అమ్మాయిని దత్తత తీసుకోవడానికి నిర్ణయించుకుందనీ మాబెల్ తెలిపింది.

వ్యాఖ్యానించండి