డిసెంబరు 7 వ తేదీన భారతీయ నర్సు జసింత సల్దానా బ్రిటన్ లో ఆత్మహత్యకు పాల్పడింది. బ్రిటిష్ రాణిగారి కొడుకు గారి కోడలుగారు గర్భం ధరించి వేవిళ్లతో బాధపడుతున్న నేపధ్యంలో ఆమెకు సపర్యలు చేస్తున్న క్రమంలో జసింత సల్దానా అన్యాయంగా బలవన్మరణానికి గురయింది. సిగ్గూ, ఎగ్గూ లేని అనైతిక మీడియా ప్రమాణాలను అభివృద్ధి చేసుకున్న పశ్చిమ మీడియా విసిరిన గాలానికి చిక్కిన జసింత అర్ధాంతరంగా తనువు చాలించింది. తన చావుద్వారా బ్రిటిష్ రాచకుటుంబం చుట్టూ కమ్మిన మాయపొరను జసింత గేలిచేసింది. రాచరికపు ఆరాధనలో పడి దొర్లుతున్న మొట్టమొదటి ప్రజాస్వామ్య స్వర్గపు పౌరులకు అసలు ప్రజాస్వామ్యం దక్కిందేలేదని వెల్లడి చేసింది.
ఎంత రాణిగారి మనవరాలయినా ఆమె కూడా మనిషే కనుక ఆమె కూడా కాపురం చేస్తుంది గనుక గర్భం తప్పదు. రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టిన సొంత కష్టాన్ని సగర్వంగా తినిబతికే కూలి తల్లికైనా, దోపిడీ సొమ్ముని భోంచేస్తూ అద్దె దర్జాలు వెలగబెట్టే రాజుగారి కోడలికైనా వేవిళ్లు ఒకటే. కడుపులో అప్పుడే ప్రాణం పోసుకుంటున్న పిండానికి తాను ఏ కడుపులో పండుతోందీ తెలియదు గనుక పేద, గొప్ప తేడా లేకుండా తన తల్లిని ఒకేవిధంగా ఇబ్బంది పెడుతుంది. తొమ్మిది నెలలపాటు తల్లిగర్భంలో హడావుడి చేయడానికి ఏర్పాట్లు చేసుకునే క్రమంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏ తల్లికైనా తప్పవు. అత్యంత సాధారణమైన, మానవ సహజమైన ఈ చిన్న విషయాన్ని కూడా సొమ్ము చేసుకోవడానికి పెట్టుబడిదారీ విష(పు)పత్రికలు తెగించడం వల్ల బ్రిటిష్ రాణిగారి కొడుకుగారి కోడలుగారి వేవిళ్లు పరోక్షంగా ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేశాయి.
ఏం జరిగింది?
వేవిళ్లతో సతమతం అవుతున్న కేట్ మిడిల్టన్ లండన్ లోని ‘కింగ్ ఎడ్వర్డ్ VII ఆసుపత్రి’ లో చికిత్స పొందుతోంది. జసింత సల్దానా ఆ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఆస్ట్రేలియాకి చెందిన రేడియో ‘2డే ఎఫ్.ఎం’లో పనిచేస్తున్న ఇద్దరు డి.జె లు మైఖేల్ క్రిష్టియన్, మెల్ గ్రీగ్ లు డిసెంబర్ 4 తెల్లవారు ఝాము 5:30 గంటలకు సదరు ఆసుపత్రికి ఫోన్ చేశారు. రేడియో డి.జె లమని వారు చెబితే ఏ సమాచారమూ తమకు ఇవ్వరు గనుక తాము ఏకంగా బ్రిటిష్ రాణి, ఆమె తనయుడు యువరాజు చార్లెస్ లము అని చెప్పుకున్నారు. ఆ సమయంలో ఆసుపత్రి రిసెప్షన్ పనిచేయదు. డ్యూటీ నర్సుగా ఉన్న సల్దానా వారి ఫోన్ ఎత్తింది. దేశం దేశమే నెత్తిన పెట్టుకునే రాణి, యువరాజులనుండి ఫోన్ కాల్ అంటే అది నిజమా, బూటకమా అన్న ఆలోచన ఎవరికి వస్తుంది, వారు బ్రిటిష్ రహస్య గూఢచారి జేమ్స్ బాండ్ అయితే తప్ప? “నా మనవరాలు కేట్ కి ఫోన్ ఇవ్వండి” అన్న రాణిగారి కోరిక ప్రకారం జసింత కాల్ ను మరో నర్సుకి బదిలీ చేసింది. కేట్ ఆరోగ్యం స్ధిరంగానే ఉందనీ, వాంతులేవీ కాలేదనీ ఆ రెండో నర్సు ఫోన్ లో బదులిచ్చింది.
ఫోన్ కాల్ ని రికార్డు చేసిన రేడియా నిర్వాహకులు దానిని ప్రసారం చేశారు. ఈ ప్రసారం అంతర్జాతీయంగా గగ్గోలు పుట్టించింది. రేడియో డి.జేలు రాచరిక కుటుంబం ఏకాంతానికి (ప్రైవసీ) భంగం కలిగిస్తారా అంటూ పత్రికలు, చానెళ్లు, రేడియోలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాచకుటుంబం వ్యక్తిగత జీవితంలోకి ఎలా చొరబడతారని ప్రశ్నలు గుప్పించాయి. ఆసుపత్రిలో సరయిన భద్రతా ఏర్పాట్లు చేయకుండా ఎలా ఉన్నారంటూ హడావుడి చేశాయి. ప్రఖ్యాతి పొందిన పశ్చిమ పత్రికలు, చానెళ్లు రాచకుటుంబం యొక్క మానవహక్కులకు భంగం కలగడం సహించరాని విషయమని తేల్చేసాయి. ఈ గొడవతో జసింత భయపడిపోయింది. తనకేమాత్రం సంబంధం లేని గొడవ తనను చుట్టుముడుతున్నదని భయపడిన జసింత సల్దానా డిసెంబర్ 7 న ఆసుపత్రి ఆవరణలోని తన క్వార్టర్ లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
జసింత ఆత్మహత్యతో పత్రికల ఆగ్రహం ఆసుపత్రిపైనుండి రేడియో పైకి మళ్ళింది. అంతర్జాతీయంగా చెలరేగిన గొడవతో రేడియో డి.జె లిద్దరూ సస్పెండ్ అయ్యారు. డిసెంబర్ 10 తేదీన వారిద్దరూ విలేఖరుల ముందు ప్రత్యక్షం అయి కన్నీరు కార్చారు. ఇలా జరుగుతుందనుకోలేదని, ఫోన్ లో తాము చేసిన నటన విజయవంతం అవుతుందని కూడా తాము నమ్మలేదనీ వాపోయారు. ఉన్నత రాజవంశంలోని వ్యక్తుల యాసతో తమ మాటలు సరిపోలుతాయని తాము అనుకోలేదనీ ఆశ్చర్యం ప్రకటించారు. ఇది తన జీవితంలో తాను చేసిన అత్యంత తేలికయిన మోసపూరిత ఫోన్ కాల్ గా మైఖేల్ అభివర్ణించాడు.
సమస్య పక్కదారి
వీరి వాదన పరోక్షంగా జసింత సల్దానా భారతీయతను లేదా బ్రిటిషేతర జాతీయతను ఎత్తిచూపుతోంది. జసింత స్ధానంలో స్ధానిక ఉచ్ఛారణ తెలిసిన వ్యక్తి ఉన్నట్లయితే తమ మోసాన్ని ఇట్టే పసిగట్టేవారనీ, తమ మోసాన్ని పసిగట్టకపోవడమే అసలు తప్పనీ సూచిస్తోంది. అయితే ఇక్కడ విస్మరించిన విషయం ఏమిటంటే వీరికి సమాచారం ఇచ్చింది జసింత కాదు. బ్రిటిష్ జాతీయురాలయిన మరో నర్సు కేట్ మిడిల్టన్ ఆరోగ్య సమాచారాన్ని వెల్లడి చేసింది తప్ప జసింత కాదు. రేడియో జాకీల వాదనను ప్రముఖంగా ప్రసారం చేసిన పశ్చిమ మీడియా ఈ విషయాన్ని మాత్రం వెనక్కి నెట్టేసింది.
సమాచారం ఇవ్వడమే తప్పయితే అది జసింత చేసింది కాదు. అయినప్పటికీ ఆమె ఆత్మహత్య చేసుకోవడాన్ని బట్టి ఆమెపై ఎంత వత్తిడి వచ్చిందో స్పష్టం అవుతోంది. సమాచారం ఇచ్చిన వ్యక్తిని వదిలి ఫోన్ కాల్ ని బదిలీ చేసిన వ్యక్తిని ఆసుపత్రి యాజమాన్యం బాధ్యురాలిని చేయడం వల్లనే ఆమె బలవన్మరణానికి గురయిందని కొన్ని పత్రికలు విశ్లేషించాయి. అయితే జసింతపై తాము ఎలాంటి ఒత్తిడి చేయలేదని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. కానీ “జసింతతో తర్వాతెప్పుడయినా ఇష్టాగోష్టిగా మాట్లాడాలని చెప్పిన మాట వాస్తవమే” అని వారు అంగీకరించారు. వారి ఇష్టాగోష్టి మాటలు ఏ స్ధాయిలో ఉన్నాయో జసింత ఆత్మహత్యే చెబుతోంది!
రేడియో జాకీలిద్దరూ ఆస్ట్రేలియా లోని ప్రైవసీ చట్టాలను ఉల్లంఘించినట్లుగా కొందరు చెబుతున్నారు. అందువలన వారు నేరారోపణలు ఎదుర్కోవచ్చని కూడా చెబుతున్నారు. లండన్ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ఆస్ట్రేలియా రాష్ట్రం న్యూ సౌత్ వేల్స్ పోలీసులతో సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ నేరారోపణలు నమోదు చేస్తున్నట్లు మాత్రం ఎవరూ చెప్పలేదు. నిజానికి రేడియో డి.జె లను బాధ్యులను చెయ్యడం అసంగతం. ఎందుకంటే పశ్చిమదేశాల పత్రికలు, చానెళ్లు, రేడియోలకు ఇలాంటి వ్యవహారాలు కొత్త కాదు. అపవిత్రం గానీ, అనైతికం గానీ అంతకంటే కాదు. ముఖ్యంగా తాజా గొడవకు బాధ్యులయిన ‘2డే ఎఫ్.ఎం’ రేడియో ఇలాంటి మోసపూరిత వ్యవహారాలు చాలానే నిర్వహించింది.
నర్సు ఆత్మహత్యకు దారితీయడం వలనా, అది కూడా బ్రిటిష్ రాచకుటుంబం వ్యవహారం కావడం వలనా ఇపుడు ఈ మాత్రం చర్చ జరుగుతోంది గానీ సెలబ్రిటీల ప్రవేటు వ్యవహారాలపైనే ఆధారపడి బతుకుతున్న పత్రికలు, చానెళ్లు పశ్చిమ దేశాల్లో కోకొల్లలు. వ్యక్తిగత జీవితాలపై పుకార్లు సృష్టించి బతికే మీడియాని అభివృద్ధి చేసుకున్నాక అందులో చిన్నపాత్ర పోషించిన ఒకరిద్దరు రేడియో జాకీలను బలిచేయడం అంటే సమస్యను పక్కదారి పట్టించడమే. కేట్ మిడిల్టన్ గర్భం చుట్టూ అవాంఛనీయమైన ఉత్సుకతా వాతావరణాన్ని పశ్చిమ మీడియాతో పాటు పాలక వ్యవస్ధలు కూడా సృష్టించిపెట్టాయి. ఈ వాతావరణంలో జసింత అన్యురాలు. వ్యక్తిగతమైన, కుటుంబగతమైన సున్నిత వ్యవహారాలను బహిరంగ వేదికలపైకి తెచ్చి సొమ్ముచేసుకునే ఒకానొక ధనయజ్ఞంలో ఆమె ఇమడలేక సమిధగా ఆహుతయింది.
గర్భధారణే అద్భుతం?
కేట్ మిడిల్టన్ గర్భం ధరించిందని తెలిసాక తెల్లదేశాలు అదేదో పరమాద్భుతంగానే మురిసిపోయాయి. కేట్ గర్భధారణ మానవసమాజ పరిణామంలో మరో మూలమలుపు అన్నట్లుగా పశ్చిమ పత్రికలు హడావుడి మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మీడియాగా తమనుతాము చెప్పుకునే తెల్లమీడియా కింగ్ ఎడ్వర్డ్ VII ఆసుపత్రి మెట్లపై తిష్ట వేసి కేట్ గర్భధారణ పరిణామాలు ఎప్పటికప్పుడు కవర్ చేయడానికి పోటీలు పడుతున్నాయి. ఈ జ్వరం మీడియాకే పరిమితం కాదు. బ్రిటిష్ రాణి మనవరాలు గర్భం ధరించినందుకు అభినందనలు చెప్పడానికి పశ్చిమదేశాల నాయకులు కూడా వరుసకట్టారు. బ్రిటన్ లోని రాజకీయ పార్టీలు, మతపెద్దలు కేట్ గర్భధారణ వార్త విని ఆనందం ప్రకటించాయి. దేశం మొత్తం సంబరాలు జరుపుకోవలసిన అద్భుతమైన వార్తగా ప్రకటించాయి. రాచరిక కుటుంబంలో అడుగుపెట్టనున్న మరో వారసుడి/రాలు కి స్వాగతం పలికేందుకు 24/7 కార్యక్రమాలను కొన్ని చానెళ్లు ప్రారంభించాయి. యువరాజు కోడలి వేవిళ్లపై ఊహాగానాలు చేస్తూ అయినవీ, కానివీ పుకార్లు చెప్పుకోవడంలో అవి మునిగిపోయాయి. ఈ సంరంభంలో సిరియాలో పశ్చిమదేశాల కుట్రలు గానీ, ఈజిప్టులో మరో డిక్టేటర్ గా అవతరిస్తున్న మహమ్మద్ మోర్శి కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చేలెరేగిన ప్రజాందోళనలు గానీ వెనక్కి వెళ్లిపోయాయంటే అతిశయోక్తి కాదు.
కేట్ గర్భధారణపై పశ్చిమ పత్రికల అసంబద్ధ ధోరణికి డెయిలీ మెయిల్ ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. “Queen of the Yummy Mummies and Her Tiny Trendsetter” అనే టైటిల్ తో కేధరీన్ ఒస్లర్ రాసిన కధనం ఒక పరాకాష్ట. పిండం ఇంకా పిల్లో, పిల్లోడుగానో భూమ్మీదకి రాకుండానే దేశంపై గణనీయమైన ప్రభావాన్ని కలగజేస్తున్నదని ఆమె రాసింది. “నిజానికి, బుల్లి యువరాణి లేదా యువరాజు తాను పాలించనున్న భూమిపై తన మొదటి ఊపిరి తీయకుండానే గణనీయమైన ప్రభావాన్ని సొంతం చేసుకుంటుంది” అని కేధరీన్ తన కధనంలో అభివర్ణించింది. ఇంకా రూపం కూడా తీసుకోని ఒక పిండం చేత గణనీయమైనరీతిలో ప్రభావితం అయే స్ధితిలో బ్రిటిష్ సమాజం ఉంటే, ఆ సమాజం ఎంతటి దయనీయమైన పరిస్ధితిలో ఉన్నట్లు? కేవలం ఒక గర్భధారణపైనే వార్తా కధనాలు రాసే పత్రికలు, స్పెషల్ స్టోరీలు నడిపే చానెళ్లు ఉన్న ఆ సమాజం ఏ అభివృద్ధి సాధించినట్లు?
ఉన్నత మధ్యతరగతి భావదాస్యం
అసలు రాచరికం అంటేనే ప్రజాస్వామ్య వ్యవస్ధకు బద్ధ విరుద్ధం. ప్రజల చేతికి అధికారాన్ని ఇచ్చేదే ప్రజాస్వామ్యం అని చెప్పే ప్రజాస్వామిక సూత్రాలకు రాచరికం ప్రధమ శత్రువు. అలాంటి రాచరిక వ్యవస్ధపై ఆరాధన 21వ శతాబ్దపు ప్రజాస్వామ్యంలో కూడా ఠీవిగా నిలబడి ఉన్నదంటే, అది కూడా ప్రపంచపు మొట్టమొదటి ప్రజాస్వామిక స్వర్గంగా జబ్బలు చరుచుకునే బ్రిటన్ లోనే ఆ పరిస్డితి ఉన్నదంటే అది వారి ప్రజాస్వామ్యంలోని డొల్లతనమే. 21వ శతాబ్ధంలోకి కూడా బ్రిటిష్ రాచరికం నిర్విఘ్నంగా నడిచి రావడమే కాక అది బ్రిటిష్ రాజ్య వ్యవస్ధపై అత్యున్నత ప్రభావశీలతను కొనసాగిస్తోంది. సంపదలు, అధికారం, శ్రమ జీవుల అణచివేతపై ఆధారపడి బతుకుతున్న సామాజిక వ్యవస్ధ కనుకనే అక్కడ ప్రజాస్వామ్య విలువల కంటే రాచరిక విలువలే అగ్రస్ధానంలో కొనసాగుతున్నాయి.
ఇలాంటి వ్యవస్ధలో ఉన్నత మధ్యతరగతి వర్గాలు (upper-middle class) సూపర్ ధనికర్గాలకు చేరువలో ఉంటాయి. ఉన్నతవర్గాలకు సేవలు చేసే క్రమంలో తాము కూడా సూపర్ ధనికవర్గం స్ధాయికి చేరుకోవాలని వారు ఉవ్విళ్లూరుతారు. సూపర్ ధనికుల దర్జా, హోదా, సంస్కృతి లపట్ల వారికి ఆరాధన. కింది వర్గాలపై సూపర్ ధనికులు చెలాయించే ఆధిపత్యం అన్నా వారికి ఆరాధనే. ప్రవేటు, ప్రభుత్వ వ్యవస్ధల్లో ఒక స్ధాయికి చేరుకుని ఇంకా పైకి వెళ్లాలని పరితపిస్తూ, వెళ్లలేక పైవర్గాలపై ఆరాధనతోనూ, కిందివారిపై ఆధిపత్యంతోనూ సరిపెట్టుకుంటారు. సామాన్యులపై తమ పెత్తనానికి వీరిచ్చే సమర్ధనలు మొత్తం వ్యవస్ధపై ఉన్నతవర్గాల దోపిడీ ఆధిపత్యానికి సమర్ధనలుగా మారతాయి.
రాచరికానికి భావదాస్యులయిన ఈ ఉన్నత మధ్యతరగతి వర్గాలు మీడియాలోకూడా చొరబడితే రాచరికానికీ, ఆధిపత్యానికీ బోలెడు పబ్లిసిటీ. కేట్ మిడిల్టన్ గర్భధారణని ఆకాశానికెత్తడం అంటే వీరికి ఒక కోణంలో తమను తాము ఉన్నతవర్గంగా భావించుకోవడం కాగా, మరో కోణంలో సామాన్యుడిపై ఆధిపత్య దాహాన్ని సంతృప్తిపరచుకోవడం. తద్వారా వీరు మొత్తంగా వ్యవస్ధలోని అసంబద్ధతకూ, ఆధిపత్యానికీ, సామాన్యుడి అణచివేతకూ సమర్ధకులు మరియు సానుకూల ప్రచారకులు. కేధరీన్ ఒస్లర్ లు వీరిలో ఒకరు మాత్రమే. ‘రాచరికపు ఆరాధన’ అనే జ్వర పీడితులయిన ఈ గుంపులోకి జసింత సల్దానా లాంటివారు బలవంతంగా చొప్పించబడిన ఫలితమే ఆమె ఆత్మహత్య. రాచరికపు ఆరాధనా ప్రవాహంలో పడి కొట్టుకుపోలేక ఉక్కిరిబిక్కిరి అయిన జసింత తనను తాను బలితీసుకుంది.
జసింత సల్దానా బ్రిటన్ యాసకి కొత్తకాదు. 2003లోనే ఆమే అక్కడ నర్సు గా రిజిస్టర్ అయింది. నాలుగేళ్ల క్రితం కింగ్ ఎడ్వర్డ్ VII ఆసుపత్రికి బదిలీ కాకముందు ఆమె బ్రిస్టల్ లో అనేక సంవత్సరాలు నర్సుగా పనిచేసింది. కనుక రేడియో జాకీల ఉన్నత తరగతి యాసను మోసపూరితమైనదిగా ఆమె గుర్తించలేకపోయిందని చెప్పడం అసలు సమస్యనుండి దృష్టి మళ్లించడమే. ఒకవేళ ఆమెకు అనుమానం వచ్చినట్లయితే బ్రిటిష్ రాణిని అని చెప్పుకునే గొంతును తరిచి తరిచి ప్రశ్నించే సాహసం ఎవరూ చేయరు. ఆమె స్ధానంలో బ్రిటన్ లో పుట్టి పెరిగిన స్ధానిక జాతీయ నర్సు ఉన్నా ఆ సాహసం చేయరు. ఎందుకంటే ‘ఎక్కడ ఉండవలసినవారు అక్కడే ఉండాలి’ కనుక. అయినప్పటికీ సమాచారం ఇచ్చిన వ్యక్తి జసింత కాదు.
కింగ్ ఎడ్వర్డ్ VII ఆసుపత్రి సెలబ్రిటీలకు, రాచకుటుంబానికీ సేవలు చేసే ఆసుపత్రి. అందువలన సదరు ఆసుపత్రి యాజమాన్యానికి సహజంగానే తమ ఆసుపత్రి గౌరవ ప్రతిష్టల పట్ల పట్టింపు ఎక్కువగా ఉంటుంది. కేట్ వేవిళ్ల సమాచారం, అది రెండు ముక్కలే అయినా, బైటికి పొక్కగానే బ్రిటిష్ మీడియా పెద్ద ఎత్తున మొరగడం మొదలుపెట్టింది. వేవిళ్ల సమాచారం బైటికి పొక్కడం వలన రాజకుటుంబీకులు ఎంతో వేదన అనుభవించారనీ, ఆసుపత్రివారు తగిన భద్రత పాటించలేదనీ విమర్శలు గుప్పించింది. ఈ విమర్శలతో ఒత్తిడికి గురయిన ఆసుపత్రి ప్రతిష్ట సల్దానాకు ‘మాట్లాడే పనుంది, రావాలంటూ’ ఆదేశాలు పంపింది. ఆసుపత్రి ప్రోటో కాల్ ప్రకారం రిసెప్షన్ మూసేసి ఉన్నపుడు డ్యూటీ నర్సులు ఫోన్ కాల్స్ ని బదిలీ చేయకూడదని ‘సండే టైమ్స్’ పత్రిక తెలిపింది. ఆసుపత్రి నియమ నిబంధనలు ఉల్లంఘిచి ఆసుపత్రికీ, తనకూ అవమానం తెచ్చిపెట్టినట్లు భావించడంతో జసింత తీవ్ర చర్యకు సిద్ధపడిందని అర్ధం కావడానికి మేధావులు కానవసరం లేదు.
రాచకుటుంబానికి నాలుగేళ్లుగా సేవలు చేస్తూ అందుకోసం భర్త, ఇద్దరు పిల్లలను బ్రిస్టల్ లోనే వదిలి ఒంటరిగా ఆసుపత్రి వద్దనే నివశించడానికి నిర్ణయించుకున్న జసింత ‘రాణి గారి నర్సు’లలో ఒకరిగా పేరు తెచ్చుకుని కూడా అదే రాజకుటుంబం కోసం ప్రాణం మీదికి తెచ్చుకుంది.
జసింత సల్దానా భర్త బెనెడిక్ట్ బర్బోజా ఆసుపత్రి యాజమాన్యం పై తీవ్ర అసంతృప్తి ప్రకటించాడు. తన భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం పోలీసులద్వారా తప్ప ఆసుపత్రి ద్వారా తెలియలేదని ఆయన చెప్పాడు. తనను పలకరించడానికి గానీ, కనీసం తన భార్య శవాన్ని చూడడానికి గానీ ఆసుపత్రి యాజమాన్యం నుండి ఎవరూ రాలేదని, తమ సొంత ఉద్యోగి మరణం ఆసుపత్రిని కదిలించలేదని బెనెడిక్ట్ వ్యాఖ్యానించాడు. రేడియో జాకీలు ప్రైవసీ చట్టాలను ఉల్లంఘించినందుకు విచారణ చేస్తున్నారన్న వార్తే తప్ప, జసింత మరణంపై విచారణ జరుగుతున్న వార్త ఏదీ వెలువడలేదు. జసింత బలవన్మరణంపై విచారణ చేయాలన్న ఆలోచన బ్రిటన్ ప్రభుత్వం నుండి కూడా వచ్చినట్లు లేదు.
బ్రిటిష్ రాచకుటుంబం పట్ల తెల్లమీడియా ఆరాధన ఇంతటితో ఆగేదేమీ కాదు. రాయల్ బేబీ సామాజిక సంచలనం మరెన్నో కధనాలకూ, పుకార్లకూ ప్రాణం పోయడం కొనసాగుతుంది. ఆధిపత్య వర్గాల ఆర్ధిక ఆధిపత్యం కొనసాగాలంటే సామాజిక రంగంలో కింది వర్గాల భావదాస్యం కొనసాగడం అత్యవసరం. కనుక ఇది ఇంతటితో ముగిసేది కాదు.





దీనికి ఇంత వ్యాఖ్యానం అవసరమా?
రావు గారూ, జసింత ఆత్మహత్య చుట్టూ ఒక వ్యవస్ధ నడవడిక ఉంది. ఆ నడవడిక వ్యవస్ధలోని సామాన్యులందరికీ అనుకూలంగా లేదు. అందుబాటులో కూడా లేదు. ఉన్నత వర్గాల్లోని ఒక స్త్రీ గర్భధారణ సమాచారం మరొక సామాన్య స్త్రీకి బతుకు లేకుండా చేసిందంటే అది ముఖ్యమైన విషయమేనని నా అభిప్రాయం. అందుకే ఇంత వ్యాఖ్యానం.
పాపం కొల్లూరి రావు గారు అప్పుడే చరిత్ర మరచిపోయినట్లున్నారు. మనదేశానికి నాగరికత వారే నేర్పారని ప్రపంచ వ్యాప్తం గా డబ్బా కొట్టు కోవటం అప్పుడే మరచిపోయారేమొ! వారి నాగరికత నేడు ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్ నేట్ ద్వారా కల్తీ లేకుండా అందరికి తెలుస్తున్నది. మనదేశ చరిత్రలో విదేశీ దాడువలన సతి,బాల్య వివాహాలు మొదలైన ఆచారాలు వచ్చాయి. అవి పోయి కూడా చాలా దశాబ్దాలు అవుతున్నాది. ఈ నాగరిక తెల్ల జాతి వారిలో ఉన్నదుర్గుణాలు ఇంకా కొనసాగటామ్మొ ఎమనుకోవాలి? అది 21వ శతాబ్ద కాలంలో. ఇప్పటికి ముసలి రాణిగారిని చూసి ముచ్చట పడుతూ, మురిసిపోయే సముద్రపు దొంగల సంస్కృతి వారిది. వీళ్లు ఆధునికులు అనుకోవటం మనదేశ ప్రజల తప్పు. ఈరోజు చూస్తున్నాముగదా, వారి విషయాల కొస్తే అబార్షన్ కొరకు పెట్టుకొన్న ఫైల్స్ మాయం అయిపోతాయి,నర్స్ కు జరిగిన విషయాన్ని ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క విధంగా రాస్తూ, ప్రజలని గందరగోళానికి గురిచేస్తూ, విషయాన్ని చప్పబడేలా చేయటానికి వారు శాయశక్తుల కృషి చేస్తున్నారు. తప్పు జరిగితే కనీసం ఒప్పుకోకుండా నర్స్ కావాలనే అత్మహత్య చేసుకొందనే విధంగా పేపర్ లు ఘోషించటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పేద ధనిక కోణంలో చూడటం శేఖర్ కి అలవాటు కావచ్చు. అందువలనకొంతమంది చదువరులకు ఆసక్తిని కలిగించకపోయి ఉండవచ్చేమో! ఇది అంత తేలికగా తీసి పారేసే విషయం కాదు. ఆదేశాన్ని మనదేశ ప్రభుత్వం నిలదీయాల్సిన అవసరం ఉంది. ఆ నర్స్ వారికి విదేశి వనిత. ఇదే పని వారి దేశం వారికి ఇక్కడ జరిగితే వాళ్లు ఎలా ప్రతిస్పందిస్తారు? పేపర్లలో గగ్గోలు పెట్టి మనదేశం పరువు విశ్వవ్యాప్తం గా తీయరా?