చదివించే బాధ్యత వదిలి ప్రవేటు స్కూళ్లను మేపుతున్న ప్రభుత్వం


ఫొటో: edu.learnsoc.org

ఫొటో: edu.learnsoc.org

(ఆర్టికల్ రచయిత: చందుతులసి)

పూర్వం బతకలేక బడి పంతులు అని ఓసామెత ఉండేది. అంటే తమ చదువుకు ఏ ఉద్యోగం దొరక్కపోతే… ( ఆ రోజుల్లో ఉద్యోగం అంటే ఏ బ్రిటీష్ దొర దగ్గర గుమాస్తానో, లేదంటే ఏదో సహాయకుని పదవి. ) వీధిలో బడి మొదలు పెట్టేవారు. ఈ రోజుల్లో లాగా ఫీజులు కూడా ఉండేవి కావు. తల్లిదండ్రుల స్తోమతను బట్టి ఒక పైసానో, రెండు పైసలో ఇచ్చేవారు. ఆ రోజుల్లో అదే ఎక్కువ. మళ్లీ ఏ దసరాకో పిల్లలతో సహా వీధీ వీధి తిరిగి…’అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లలకు చాలు పప్పు బెల్లాలు…’ అంటూ అంతో ఇంతో వసూలు చేసేవారు.

అలా తమ జీవితంపై అసంతృప్తి కొంత, ఆ నాటి భూస్వామ్య భావజాలం కొంత కలిగి ఉన్న నాటి పంతుళ్లు పిల్లలను దారుణంగా కొట్టేవారు. ఎంతగా అంటే చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడ దీయడం; గోడ కుర్చీని గంటలు గంటలు వేయించడం; (ఈ గోడ కుర్చీ 90 ల్లో నాకు అనుభవమే) ఇలా కఠిన శిక్షలు విధించేవారు. అలా కొడితేనే చదువు బాగా వస్తుందని పాపం తల్లిదండ్రులూ నమ్మేవారు. ఈ శిక్షలు తట్టుకోలేకే చాలా మంది పిల్లలు పాఠశాలకు వెళ్లడం మానేసేవారట. అసలు బడి పేరు చెబితేనే భయపడి జ్వరాలు వచ్చే వాళ్లూ ఉండేవారట ఆరోజుల్లో. ఇలా అదే భావజాలం నేటికీ వారసత్వంగా వచ్చింది. పిల్లలను శిక్షిస్తేనే చదువు వస్తుందని నమ్మే వారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు.

స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని బ్రిటీష్ విధానాలు యధావిధిగా కొనసాగినట్లు గానే, విద్యా విధానం కూడా ఏ మార్పు లేకుండా కొనసాగింది. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఎటువంటి విద్యావిధానం కావాలనే దానిపై అసలు స్పష్టత లేదు. స్వతంత్రం వచ్చిన ఇరవై ఏళ్లకు మొదటి విద్యా విధానం -1968తో తీసుకొచ్చారు.

అదీ కాక మనదేశంలో ఎవరైనా టీచర్ కావచ్చు. పది మధ్యలో మానేసిన వాడు, తొమ్మిది దాకా పాఠాలు చెపుతాడు. అదీ ఏదో ఇంటిదగ్గర ట్యూషన్ కాదు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేటు పాఠశాలల్లోనే. ఇంటర్ ఫెయిలైతే పదో తరగతికి, డిగ్రీ పూర్తైతే ఇంటర్ కీ, చివరకు ఇంజనీరింగ్ లో కూడా… అదే సంవత్సరం పూర్తైన వాళ్లూ….ఫస్టియర్ వాళ్లకు క్లాసులు చెపుతున్నారు.

” విద్యార్థి అంటే ఎవరు, శిశువుకు ఎంత జ్ఞానం ఉంటుంది. పిల్లలకు ఏ విధంగా పాఠాలు చెప్పాలి ” అనే విషయాలు తెలీకుండానే, ఎటువంటి శిక్షణ లేకుండానే టీచర్లు అవుతారు. అదీ కాక విద్య నేర్చుకునే దశలో మొదటి మూడు నాలుగు సంవత్సరాలు చాలా కీలకం. ఈ దశలోనే పిల్లలకు చదువు పట్ల, సమాజం పట్ల సానుకూల దృక్పథం కలిగించాలి. చదువనేది భారమైన పని కాదని….సరదాగా సాగిపోయేలా ఉండేలా చెప్పాలి. కానీ ప్రాధమిక పాఠశాలలనైతే పట్టించుకున్న నాథుడే ఉండడు.

పల్లెటూళ్లలో గేదెలు కాసే వాళ్లు ఉంటారు. గేదెలని రోజంతా మేపే తీరిక లేని వాళ్లవి…. ఊరందరి గేదెలని వాళ్లే మేతకు తీసుకెళ్తారు. వాటిలో వెళ్లిన గేదెలకు సరైన మేత దొరకదు, నీళ్లు దొరకవు, ఏదో పేరుకే గుంపులో వెళ్లి సాయంత్రం అయ్యాక ఇంటికి వస్తాయి. అవి ఇంటికి రాగానే మళ్లీ వాటి యజమాని మేత వేయాల్సిందే.

ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల పిల్లల పరిస్థితి అలాగే తయారైంది. ఏదో పేరుకో బడికి వెళ్లడం, రావడం. అంతే. డబ్బున్న వాళ్లైతే కొంచెం మంచి స్కూళ్లకు పంపిస్తారు. డబ్బు లేని కూలీనాలీ పిల్లల పరిస్థితి గుంపులో గోవిందా! ఇటువంటి దారుణ పరిస్థితుల మధ్య కూడా ఎవరో ఒకరిద్దరు అంకిత భావం కలిగిన టీచర్లు ఉంటారు. పిల్లలకు అంతో ఇంతో బోధిస్తారు. వాళ్ల వల్లే ఆ పాఠశాలలు మనుగడ సాగిస్తున్నాయి.

పదో తరగతో, ఇంటరో చదివిన వాళ్లూ….పిల్లల సైకాలజీ గురించి, అసలు పాఠాలు ఎలా చెప్పాలో తెలీకుండానే పంతుళ్లుగా అనేక మంది ప్రైవేటు స్కూళ్లలో ఉన్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే….ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు డిగ్రీలు, బీఈడీలు చదివి తర్వాత అనేక పరీక్షలు రాసి పోస్టుకు ఎంపికవుతారు. అంటే వాళ్లు ప్రైవేటు స్కూళ్లలో టీచర్ల కన్నా తెలివైన వారు, ఉన్నత విద్యావంతులని తెలుస్తోంది. కానీ తల్లిదండ్రులు మాత్రం ప్రభుత్వం పాఠశాలలంటే చిన్న చూపు చూస్తారు. కారణం ఏమిటంటే, ఆ మాత్రం అరకొర చదువుతోనే పాఠాలు చెప్పుతున్న ప్రైవేటు టీచర్ల మాదిరి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు జరగవు. ప్రభుత్వం ఏదో ఏటా అరకొరగా నిధులు కేటాయిస్తుంది తప్ప…అవసరాల మేరకు కాదు.

ఓ రకంగా విద్యారంగం నుంచి ప్రభుత్వం తప్పుకునేందుకు ఎప్పటినుంచో కుట్ర జరుగుతోంది. అందులో భాగంగానే ప్రభుత్వం పాఠశాలల్ని క్రమంగా నిర్వీర్యం చేసి..పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు వెళ్లేలా పరోక్షంగా ప్రభుత్వమే సహకరిస్తోంది. తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు కదా. అలా తల్లిదండ్రుల ఇంగ్లీష్ మీడియం వెర్రిని ప్రైవేటు స్కూళ్లు సొమ్ము చేసుకుంటున్నాయి.

(రచయిత: చందుతులసి)

One thought on “చదివించే బాధ్యత వదిలి ప్రవేటు స్కూళ్లను మేపుతున్న ప్రభుత్వం

వ్యాఖ్యానించండి