యాక్సిడెంట్ బాధిత ఈశాన్య మహిళపై చేయి చేసుకున్న వీర పోలీసు


Photo: The Hindu (Snap Taken by woman victim)

Photo: The Hindu (Snap Taken by woman victim)

టూ వీలర్ తో కారుని గుద్దిన వ్యక్తిని వదిలి కారు నడుపుతున్న మణిపురి మహిళ (పేరు: Swar Thounaojam) పై చేయిచేసుకున్న వీర ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉదంతం ఇది. ప్రమాదం చేసిన వ్యక్తిని వదిలిపెట్టి మొదటి తప్పు చేసిన కానిస్టేబుల్ మహిళపై చేయిచేసుకుని మరో నేరానికి పాల్పడ్డాడు. ప్రమాదస్ధలి వద్ద గుమికూడిన జనం కూడా మహిళనే తిట్టి, కొట్టినంతపనిచేసి, అసభ్యంగా తాకరానిచోట్ల తాకి భారత సమాజ నాగరికత యొక్క సగటు సభ్యత పాతాళస్ధాయిలోనే కునుకు తీస్తోందని చాటుకున్నారు. ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’ అన్న మాటలు ఒట్టి బడాయి కోతలేనని నిరూపించారు.

32 సంవత్సరాల మణిపురి మహిళ బెంగుళూరులో ధియేటర్ ఆర్టిస్టు. బుధవారం (డిసెంబర్ 5) పని ముగిశాక ఆమె నగరంలో కారులో ఇంటికి వెళ్తోంది. మధ్యలో బసవనగుడి ఏరియాలో డి.వి.జి రోడ్ జంక్షన్ వద్ద ఎర్ర లైటు చూసి కారు ఆపింది. ఇంతలో వెనకనుండి మోటార్ సైకిల్ పై వేగంగా వస్తున్న వ్యక్తి ఆగిఉన్న కారుని గుద్దేశాడు. దానితో కారు బంపర్ దెబ్బతింది. యువతి వెంటనే కారు దిగి కారును పరీక్షిస్తుండగానే బైక్ పై వచ్చిన వ్యక్తి ఆమెను అసభ్యంగా తిట్టడం మొదలుపెట్టాడు. గొడవకి మూగిన జనం కూడా మణిపురి మహిళని వెక్కిరిస్తూ, తిడుతూ, ఏడిపించడం మొదలుపెట్టారని మహిళని ఉటంకిస్తూ ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.

భయాందోళనలకు గురయిన మహిళ రోడ్డుకి అటువైపు ట్రాఫిక్ కానిస్టేబుల్ కనపడడంతో సహాయం చేయమంటూ అతనివద్దకు పరుగెత్తింది. మహిళ చెప్పేది వినడం మాని ట్రాఫిక్ కానిస్టేబుల్ దురుసుగా ఆమె జబ్బ పుచ్చుకుని పక్కకి గిరాటేశాడు. కానిస్టేబుల్ ప్రవర్తన జనానికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఆమెను చుట్టుముట్టి తాకారానిచోట్ల తాకుతూ వెకిలి చేష్టలకు దిగారు. “టూ వీలర్ వ్యక్తిదే తప్పని పోలీసుకి వివరించి చెప్పడానికి నేను ప్రయత్నించాను. కానీ ఆయన చాలా దురుసుగా వ్యవహరించాడు” అని మహిళ చెప్పిందని ‘ది హిందూ’ తెలిపింది. “నీకు కన్నడ తెలియదు. నువ్విక్కడిదానివి కాదు” అంటూ పోలీసు తననే దుర్భాషలాడాడని ఆమె తెలిపింది.

ఇంకా ఘోరం ఏమిటంటే కారుని గుద్దిన వ్యక్తిని ప్రశ్నించడం మాని అక్కడినుండి కామ్ గా వెళ్లిపోవాలని కానిస్టేబులే చెప్పాడు. ఇదంతా జరుగుతుండగానే అక్కడ గుమికూడిన జనం ఆమెతో అసభ్యంగా వ్యవహరిస్తూనే ఉన్నారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే మణిపురి మహిళ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదల్లేదు. కానిస్టేబుల్ ప్రోత్సాహంతో అక్కడినుండి వెళ్లిపోతున్న టూ వీలర్ యజమానిని భౌతికంగా అడ్డుకోవడానికి ప్రయత్నించింది. దానితో వీర కానిస్టేబుల్ మరోసారి నేరస్ధుడికి తోడువచ్చాడు. ప్రమాదం చేసిన వ్యక్తిని ఆపడానికి ప్రయత్నించిన మహిళను పక్కకునెట్టడమే కాకుండా చెంపపై కొట్టాడు.

ఈ సమయంలో సగటు మనిషి చేతుల్లోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఆమెకు అక్కరకు వచ్చింది. తన మొబైల్ ఫోన్ బైటికి తీసి గబగబా మోటార్ సైకిల్ యజమానినీ, పోలీసుని ఫోటో తీసింది. ఆ తర్వాత గుంపు తాకిడి మరింత శ్రుతిమించింది. ఆమె బట్టలను లాగుతూ, ఎగతాళి చేస్తూ లోలోపలి మృగత్వాన్ని వెళ్ళగక్కారు. ఒకడయితే చొక్కా విప్పి అసభ్య సంకేతాలతో వెకిలి చేష్టలకు దిగితే మరొకడు తాను కట్టుకున్న లుంగీని పైకెత్తి తన మలినబుద్ధిని ప్రదర్శించుకున్నాడు. గుంపులో ఇంకా అనేకమంది తనవైపు అసభ్య సంకేతాలు చూపిస్తూ వెక్కిరింతలకు పాల్పడ్డారు. ఈ లోపు ప్రమాదానికి కారకుడయిన వ్యక్తి తప్పించుకుపోయాడు. మరో పెట్రోలింగ్ వాహనం వచ్చేదాకా పావుగంట సేపు మణిపురి మహిళ జీవితానికి సరిపడా వేదనను చవిచూసింది. ఆ తర్వాత ఆమె బసవనగుడి పోలీసు స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసినప్పటికీ అతని పేరు చెప్పడానికి పోలీసులు నిరాకరించారని పత్రిక తెలిపింది.

భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో తమకు రక్షణ లేదని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆరోపిస్తుంటారు. ఈ ఆరోపణను బెంగుళూరులో జరిగిన తాజా ఘటన నిజం చేస్తోంది. ఇదే నగరంలో కొద్ది నెలల క్రితం బెంగుళూరు యువకుడొకరు హత్యకు గురయితే విచారణ సజావుగా జరగలేదని ఆరోపణలు వచ్చాయి. ఈశాన్య ప్రజల రూపురేఖలవల్ల జనంలో వారిని ప్రత్యేకంగా నిలుపుతాయి. అంతమాత్రాన వారిని ఎగతాళి చెయ్యవచ్చనీ, తేలికగా చూడవచ్చనీ, ఆడవారయితే వారి శరీరాల్ని తడిమి మృగానందాన్ని పొందవచ్చనీ భావించడం హీన సంస్కృతి. దోపిడిలోకి, అణచివేతకోవలోకి వచ్చే ప్రతి ప్రక్రియలోనూ మహిళలు రెట్టింపు బాధని అనుభవించవలసి రావడం నేటి సామాజిక జీవనంలోని చేదు నిజం. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు జాతిపరమైన వివక్షకు గురికావడం ఒక అణచివేత కాగా ఈశాన్య మహిళలు అదనంగా బహిరంగ ప్రదేశాల్లో సైతం లైంగిక వేధింపులకు గురికావడం రెట్టింపు అణచివేత.

పై ఫోటో చూసినట్లయితే గుంపులో ఉన్నవారంతా టిప్పు టాపు దుస్తులు ధరించి ఉన్నవారే. సూటు బూటు(తు), టీ షర్టులు ధరించిన వీరు అక్షరాస్యులేనని తెలుస్తూనే ఉంది. వీరి అక్షరాస్యత వీరికి బుద్ధి, సంస్కారం నేర్పలేదన్నమాట!  ఆ మాటకొస్తే నిరక్ష్యరాస్యులయితే ఈ స్ధాయిలో మకిలితనాన్ని చూపేవారు కాదేమో. తోటి మనిషిని గౌరవించాలన్న కనీస సంస్కారాన్ని తెలుసుకోవడానికి ఏ చదువు కావాలి?

వ్యాఖ్యానించండి