కుల వేధింపులతో దళిత పూజారి ఆత్మహత్య


Cartoon: roundtableindia.co.in

Cartoon: roundtableindia.co.in

కుల వివక్షతో ఆలయ పాలక సిబ్బంది పాల్పడుతున్న వేధింపులకు తట్టుకోలేక తమిళనాడులో 23 సంవత్సరాల దళిత పూజారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూజారి పదవినుండి తప్పుకోవాలనీ, అసలు గుడిలోకే రాకూడదనీ పాలక సిబ్బంది వేధించడంతో దళిత పూజారి ఎస్.నాగముత్తు మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు పెట్టకుండా పట్టించుకోక పోవడంతో ఒక స్వచ్ఛంద సంస్ధ సాయంతో కోర్టుకి కూడా వెళ్ళాడు.  వేధింపులపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోర్టు ఆదేశాలిచ్చినా వేధింపుల్లో మార్పులేకపోవడంతో నాగముత్తు ఆత్మహత్య లేఖ రాసి చనిపోయాడని ది హిందూ తెలిపింది.

ధేని జిల్లా, పెరియాకుళం సర్కిల్, టి.కళ్లుపట్టి గ్రామంలోని కైలాసనాధ దేవాలయంలో ఎస్.నాగముత్తు గత ఏడేళ్లుగా పూజారిగా పని చేస్తున్నాడు. ప్రధాన పూజారికి సహాయకుడుగా పనిచేసే నాగముత్తు ఆయన లేనపుడు ప్రధాన బాధ్యతలు కూడా నిర్వర్తించేవాడు. దళితుడు పూజారిగా ఉండడం ఏమిటని కొద్ది నెలలుగా భక్తజనం అభ్యంతరం పెడుతున్నారని తెలుస్తోంది. నాగముత్తు వలన భక్తులు గుడికి రావడానికి జంకుతున్నారని కనుక కనీసం పండగ దినాల్లోనూ, ఇతర పుణ్య దినాల్లోనూ పూజలనుండి అతను దూరంగా ఉండాలని ఆలయ పాలక సిబ్బంది ఆదేశాలిచ్చారు.

ఆలయ కమిటీ ఆదేశాలని నాగముత్తు తిరస్కరించాడు. ఏ ప్రతిపదికపైన తనను అడ్డుకుంటారని ప్రశ్నించాడు. నాగముత్తు తిరుగుబాటుని పెద్దలు సహించలేకపోయారు. తమనే ప్రశ్నిస్తావా అంటూ నాగముత్తుని కమిటీ సిబ్బంది చితకబాదారు. తనను కొట్టినవారిపై నాగముత్తు ధెంకరై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నాగముత్తుకి రశీదు కూడా ఇచ్చారు. అయితే పోలీసులు కేసులు పెట్టలేదు. ఈ లోపు ఫిర్యాదుని వెనక్కి తీసుకోవాలని నాగముత్తు తండ్రి సుబ్బరాజుని అగ్రకులాలకు చెందిన పెద్దలు డిమాండ్ చేశారు. పెరియాకుళం పంచాయితీ ప్రెసిడెంటు కూడా అలా డిమాండ్ చేసినవారిలో ఉన్నాడు. అప్పటికి కూడా నాగముత్తు ఒప్పుకోలేదు.

నాగముత్తు ఈసారి డి.ఎస్.పి ని కలిశాడు. తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని కోరాడు. కేసు నమోదు చేయడానికి బదులు డి.ఎస్.పి కూడా ఫిర్యాదుని వెనక్కి తీసుకోవాలని నాగముత్తుకి సలహా ఇచ్చాడు. పోలీసులపై నమ్మకం కోల్పోయిన నాగముత్తు మధురై నుండి పని చేసే ‘ఎవిడెన్స్’ అనే స్వచ్ఛంద సంస్ధను కలిశాడు. ఎవిడెన్స్ సంస్ధ మధురైలో ఉన్న మద్రాస్ హైకోర్టు బెంచి వద్ద పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ ని విచారించిన బెంచి పోలీసులు వెంటనే కేసు రిజిస్టర్ చేసి విచారణ ప్రారంభించాలని ఆగస్టు 31 తేదీన ఆదేశాలిచ్చింది.

సెప్టెంబర్ 2 తేదీన ధెంకరై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐ.పి.సి సెక్షన్ 294(బి), 323, 506(1) ల కింద నేరారోపణ నమోదు చేశారు. ఎస్.సి/ఎస్.టి అత్యాచారాల నిరోధ చట్టం 1989 [సెక్షన్ 3(1)(x)] కింద కూడా కేసు పెట్టారు.  కానీ ఆ తర్వాత కూడా విచారణ ప్రారంభం కాలేదు. దోషులు అరెస్టు కాలేదు. ఈ లోపు నాగముత్తుపై బెదిరింపులు కొనసాగాయి. కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి పెరిగింది. రోజు రోజుకీ వేధింపులు పెరిగిపోయిన ఫలితంగా డిసెంబరు 7 తేదీన అతను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆత్మహత్య లేఖలో నాగముత్తు 7 గురు పేర్లను రాసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. తనను బెదిరిస్తుండడం వలన తనకూ, తన కుటుంబానికీ తగిన రక్షణ కల్పించాలని పోలీసులను కోరినప్పటికీ పట్టించుకోలేదని నాగముత్తు తన లేఖలో పేర్కొన్నాడు. అతని విగత శరీరానికి ధేని లోని ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం జరిపారు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని తీసుకోవడానికి నాగముత్తు బంధువులు ఒప్పుకోలేదు. ఆత్మహత్యకు కారకులయినవారిని వెంటనే అరెస్టు చేయాలని నాగముత్తు బంధువులు, ఇతర దళిత ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆత్మహత్య లేఖలో పేర్కొనబడిన ఏడుగురిపైనా కేసులు నమోదు చేశామని ధేని జిల్లా ఎస్.పి ప్రవీణ్ కుమార్ నచ్చజెప్పినప్పటికీ ఆందోళన విరమించడానికి వారు ఒప్పుకోలేదు. నిందితులను అరెస్టు చేసేవరకూ ఆందోళనను విరమించేది లేదని వారు పట్టుబట్టినట్లు ది హిందూ, టి.ఓ.ఐ తెలిపాయి.

భారతదేశంలో కుల వివక్ష బలీయంగా కొనసాగుతోందని నాగముత్తు ఆత్మహత్య మరోసారి స్పష్టం చేసింది. భగవంతునితో భక్తుడిని అనుసంధానం చేయ్యడానికి బత్తి అయినా పని చేస్తుందేమో కానీ ప్రాణం, వ్యక్తిత్వం ఉన్న ఒక దళిత పూజారి పనికిరాడని భక్త జనం భావిస్తూనే ఉన్నారు. పూజారి వ్యవస్ధ దానికదే అగ్రకులాధిపత్యానికీ, మేధో ప్రతిభ కొన్ని కులాలకే పరిమితం అనిచెప్పే వెనుకబాటు ఛాందసత్వానికీ ప్రాతినిధ్యం వహించే వ్యవస్ధ. సమస్త మానవ శ్రమలకీ, వాటి ఫలితాలకీ మనిషిని కాకుండా భౌతిక ఉనికిలేని అమూర్త భావనలను బాధ్యుని చేసే అసంబద్ధ వ్యవస్ధ. అలాంటి వ్యవస్ధ కులవివక్షకు దూరంగా ఉండాలనీ, ఉంటుందనీ ఆశించడం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడమే.

నాగముత్తు కేసులో కులవివక్ష నిజానికి పెద్ద వార్త కాదు. కుల వివక్షను అంతం చేసే ఉద్దేశ్యంతో, వివక్షను పాటించేవారిని శిక్షించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేశామని చెప్పిన ఘనత వహించిన చట్టాలు వాస్తవంలో అమలు కావడం లేదన్నదే ఇక్కడ అసలు వార్త. వివక్షలకు దూరంగా ఉంటామని ప్రమాణం చేసి వచ్చే గ్రామ సర్పంచి స్వయంగా వివక్ష పాటించడమే కాక దళితులను తానే బెదిరిస్తాడు. కులవివక్షతో తనను కొట్టారని ఫిర్యాదు చెయ్యబోతే పోలీసులే ఆ ఫిర్యాదుని తీసుకోరు. పై అధికారులకి చెబితే వారు కూడా ఫిర్యాదు వద్దనే చెబుతారు. చివరికి డబ్బు, సమయం ఖర్చుపెట్టుకుని కోర్టుకి వెళ్తే తప్ప ఫిర్యాదు నమోదు కాదు.

ఫిర్యాదు నమోదయినా విచారణ జరగదు. అరెస్టులు జరగవు. చట్టాలనీ, ఆ చట్టాలను అమలు చేసేవారినీ ఆశ్రయించాక కూడా తన్నులుతిన్న దళితులు పోలీసుల చేత చీవాట్లు తింటూ, తన్నే ఆధిపత్యం ఉన్న వర్గాల చేత బెదిరింపులు ఎదుర్కొంటూ బిక్కు బిక్కు మంటూ రోజులు వెళ్లదీయాలి. అయినా కేసులు ఉండవు, కేసులుంటే విచారణ ఉండదు. రక్షణ అసలే ఉండదు. చివరికి వేధింపులు భరించలేక, విరక్తితో ఆత్మహత్య చేసుకోవడమే దళిత పూజారికి భారత చట్టాలు కల్పించిన గొప్ప భద్రత!

3 thoughts on “కుల వేధింపులతో దళిత పూజారి ఆత్మహత్య

  1. ఇది చాలా హృదయవిదారకమైన సంఘటన.
    వ్యవస్థాగతమైన వైఫల్యాల కారణంగానే సాహసమూ వివేకమూ మూర్తీభవించిన వ్యక్తిత్వంగల యువకుడు నిస్సహాయస్థితిలో గత్యంతరం లేక బలవన్మరణానికి పాల్వడ్డాడు.

    పోలీసుల అలసత్వం క్షమించరానిది! అతడి పిటిషన్ ని విచారించిన హైకోర్టు బెంచి పోలీసులు వెంటనే కేసు రిజిస్టర్ చేసి విచారణ ప్రారంభించాలని ఆగస్టు 31 తేదీన ఆదేశాలిచ్చింది. కాని అంతవరకూ అలసత్వం వహించిన పోలీసుల వైఖరి చట్టధిక్కరణక్రింద జమకట్టి వారిని యెందుకు శిక్షించలేదో అంతుబట్టటం లేదు. కోర్టువారు ఉదాశీనవైఖరి వహించారని ఆక్షేపించటం లేదు నేను. కాని కోర్టువారు పోలీసులపట్ల ఉదారంగా వ్యవహరించినట్లు కనబడటం వలన ది వారి ఉద్దేశం కాకపోయినా) తీరని నష్టం‌ కలిగింది. ఈ విషయం మీద ఇంతకంటే యెక్కువగా వ్యాఖ్యానించటం అసంగతం – అదీ‌కోర్టు వారి తీర్పును చదవకుండా. కోర్టువారి రికమెండేషను ప్రకారం పోలీసులు తూతూమంత్రం వ్యవహారం కాగితాలమీదకు యెక్కించారు కాని క్రియాత్మకంగా వ్యవహరించలేదు.

    ఇకనైనా ఈ‌వ్యవహారంలో దోషులకు నిజంగా‌ కఠిన శిక్షలు పడతాయని ఆశిద్దాం.

  2. > వేధింపులు భరించలేక, విరక్తితో ఆత్మహత్య చేసుకోవడమే దళిత పూజారికి భారత చట్టాలు కల్పించిన గొప్ప భద్రత!

    ఈ‌మాటలు ఆమోదయోగ్యం కావు. మీ ముక్తాయింపు అసంగతం.

    వేధించిన పాపం చట్టాలదా? చట్టాలని కప్పదాట్లు వేయిస్తున్న మనుషులదా?ఆలోచించంచండి.

    నాకు తెలిసినంత వరకు, ఇందులో చట్టాలు చేసిన అపరాధం యేమీ‌ లేదు. అవి అమలు జరిపే మనస్సులకు మకిలి ఉంటే చట్టాలు స్వయంగా చేతులు చాచి యేమీ‌చేయలేవు కదా?

    కాబట్టి చట్టాలను నిందించటాన్ని హర్షించలేము. మరింత పకడ్-బందీ చట్టాలు కావాలనటం కన్నా మరింత మనస్సు పెట్టి చట్టాలను చక్కగా అమలు జరపాలనుకోవటం ఉచితంగా ఉంటుంది.

  3. శ్యామలరావు గారూ,

    చట్టాలు, సూత్రాలు, ఉపదేశాలు, ఆదేశాలు ఇలాంటివన్నీ సొంత ఉనికిని కలిగి ఉండేవి కావు. వాటంతట అవి ఏమీ చేయలేవు. వాటికి తగిన ఆచరణ రూపాన్ని ఇచ్చేది మనుషులే. చట్టాలు కల్పించిన భద్రత ఇదే అని నేనన్నది ఆ చట్టాలను అమలు చేయాల్సిన మనుషులను ఉద్దేశించే తప్ప చట్టాలను కాదు.

    అలాగే చట్టాలు, న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సూత్రాలు, రాజ్యాంగ ఆదర్శాలు ఎంత గొప్పగా ఉన్నా వాటిని అమలు చేసేవారికి సదుద్దేశాలు లేకపోతే అవన్నీ వ్యర్ధం. కాకపోతే మనిషి ‘ఇంతటి ఉన్నతమైన ఆలోచనలు చేయగలిగాడు’ అని చెప్పుకోవడానికి మాత్రం అవి పనికొస్తాయి. చట్టాలను అమలు చేయవలసిన వర్గాల అవసరాలు చట్టాల ఉద్దేశ్యాలకు విరుద్ధంగా ఉన్నపుడు ఆ చట్టాలు అమల్లోకి రావు. అందుకని ఆ వర్గాలను మార్చడం ప్రజలు చేయవలసిన పని.

వ్యాఖ్యానించండి