అణ్వస్త్రవ్యాప్తి నిరోధం గురించి ప్రపంచానికి సుద్దులు చెప్పే అమెరికా తాను మాత్రం అణు పరీక్షలను మానలేదు. సామూహిక విధ్వంసక మారణాయుధాలు కలిగి ఉన్నదంటూ ఇరాన్ దేశాన్నీ, ప్రజలనూ సర్వనాశనం చేయడమే కాక సిరియా, ఇరాన్ లకు కూడా అదే గతి పట్టించే కృషిలో నిమగ్నమై ఉన్న అమెరికా ఈ వారం నెవాడాలో అణు పరీక్షలు నిర్వహించినట్లు రష్యా టుడే పత్రిక తెలిపింది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధంలో అమెరికా ద్వంద్వ విధానాన్నీ, హిపోక్రసీని జపాన్, ఇరాన్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా అణు పరీక్షలు ప్రపంచ శాంతికి భంగం అని ప్రకటించాయి.
“అణ్వస్త్రాలు లేని ప్రపంచం తన లక్ష్యం” అంటూ ఓ పక్క చాటుకుంటూనే ఒబామా ప్రభుత్వం అణు పరీక్షలు నిర్వహించడం పట్ల జపాన్ నగరం హీరోషిమా మేయర్ కజుమి మట్సుయి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అమెరికా తన అణ్వాయుధాలను ఎప్పటికైనా ప్రయోగిస్తుందని అది జరిగిపిన తాజా పరీక్ష ద్వారా రుజువు అవుతున్నదని ‘నాగసాకి అటామిక్ బాంబ్ సర్వైవర్స్ కౌన్సిల్’ కి నేతృత్వం వహిస్తున్న హీరోటామి యమడా అన్నాడు.
అణ్వాయుధాల ప్రయోగం పైన అమెరికా విదేశాంగ విధానం భారీగా ఆధారపడి ఉన్న విషయం బుధవారం నిర్వహించిన పేలుడు పరీక్ష రుజువు చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రపంచస్ధాయిలో అణ్వస్త్రాలను నిర్మూలించాలన్న ఐక్యరాజ్య సమితి పిలుపును అమెరికా చర్య గేలిచేసిందని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించినట్లుగా ప్రెస్ టి.వి తెలిపింది.
ప్లూటోనియమ్ అణు ఇంధనాన్ని ‘నెవాడా నేషనల్ సెక్యూరిటీ సైట్’ బుధవారం విజయవంతంగా పేల్చి పరీక్షించినట్లు అమెరికా ప్రభుత్వ సంస్ధ ‘నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్’ అధికారులు శుక్రవారం ప్రకటించారు. లోతైన కందకంలో ఈ పేలుడు జరిపారనీ, దీనిద్వారా అమెరికా అణ్వాయుధాల ప్రభావశీలతను, భద్రతను పరీక్షించామనీ సదరు అధికారులు తెలిపారు. ప్రభావశీలతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ తన అణ్వస్త్రాలను అమెరికా నిరంతరం అభివృద్ధి చేసుకుంటూనే ఇండియా, ఇరాన్, ఉత్తర కొరియా తదితర దేశాల అణు పరీక్షలను నియంత్రించడానికీ, వీలయితే అడ్డుకోవడానికీ అమెరికా ప్రయత్నిస్తున్నదని ఈ ప్రకటన స్పష్టం చేస్తున్నది.
పరీక్షలలో స్వల్పస్ధాయి ప్లూటోనియం బాంబును పేల్చి పరీక్షించినట్లు రష్యా టుడే పత్రిక తెలిపింది. దీనిని పోలుక్స్ సబ్ క్రిటికల్ ప్రయోగంగా చెబుతున్నారు. లాస్ అలమోస్ అనే న్యూ మెక్సికో నేషనల్ లేబరేటరీ మరియు శాండియా నేషనల్ లేబరీటరీస్ ఈ పరీక్షలో పాల్గొన్నాయి. తాను అణు పరీక్షలను పూర్తిగా ఆపేస్తున్నట్లు అమెరికా 1992లో ప్రకటించింది. కానీ సబ్ క్రిటికల్ పరీక్షల పేరుతో అమెరికా అణు పరీక్షలను 1997 నుండి తిరిగి ప్రారంభించింది. అణు పేలుడు సంభవించే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ కు ముందరి దశ వరకూ జరిపే పరీక్షలను సబ్ క్రిటికల్ ప్రయోగాలుగా చెబుతారని తెలుస్తున్నది.
ఎక్కడ అణు పరీక్షలు జరిగినా, విద్యుత్ కోసం అణు శుద్ధిని చేపట్టినా వాటిని ఐ.ఎ.ఇ.ఎ (ఇంటర్నేషనల్ ఎటామిక్ ఎనర్జీ ఏజన్సీ) చేత తనిఖీ చేయించాలని అమెరికా ఒత్తిడి చేస్తుంది. ఇందిరా గాంధీ హయాంలో ఇండియా అణు పరీక్ష జరిపినపుడు ఐ.ఎ.ఇ.ఎ తనిఖీకి ఇండియా ఒప్పుకోలేదు. ఆ వంకతో అమెరికా ఇతర అణు సరఫరా దేశాలపై ఒత్తిడి తెచ్చి భారత దేశంపై అణు నిషేధాన్ని విధింపజేసింది. ఐ.ఎ.ఇ.ఎ తనిఖీలు జరపడానికి మన్మోహన్ ప్రభుత్వం అంగీకరించడంతో ఈ అణు నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేయడానికి అమెరికా ఒప్పుకుంది. ఈ లొంగుబాటును మన్మోహన్ ప్రభుత్వం ‘అణు ఏకాకితనం నుండి ఇండియా బైటపడడం’ గా చెప్పుకుంది. ఒకవైపు ఇతర దేశాలపై ఇలాంటి మోసపు ఒత్తిడిలను అమలుచేస్తూనే మరొకవైపు తన అణు పరీక్షలను తనిఖీ చేయించడానికి అమెరికా ససేమిరా ఒప్పుకోలేదు.
బుధవారం జరిపిన ప్రయోగం అమెరికా తాను పరీక్షలను ఆపేశానని 1992లో చెప్పాక 27వ పరీక్ష అని గ్లోబల్ రీసర్చ్ సంస్ధ తెలిపింది. ఈ పరీక్షను తిలకించడానికి కూడా అమెరికా, అంతర్జాతీయ తనిఖీదారులను అనుమతించలేదు. ఐ.ఎ.ఇ.ఎ తనిఖీదారులను ఇరాన్ అనుమతించడం లేదని కాకిగోల చేసే పశ్చిమ కార్పొరేట్ మీడియా సంస్ధలు అమెరికా అణుపరీక్ష పై కనీస సమాచారాన్ని కూడా ఇవ్వలేదు. తనిఖీ పేరుతో ఐ.ఎ.ఇ.ఎ ఇనస్పెక్టర్లు అమెరికా కోసం గూఢచర్యానికి పాల్పడినా ఈ మీడియా పట్టించుకోదు. ఇరాన్, ఉత్తర కొరియా, ఇండియా ల అణు పరీక్షలపై అదేపనిగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేసే ఈ మీడియా సంస్ధలు అమెరికా ప్రయోజనాలకే పూర్తిగా కట్టుబడి ఉన్నాయని తాజా అణు వ్యవహారం మరోసారి స్పష్టం చేస్తున్నది.
అణ్వాయుధాలను మొట్టమొదట తయారు చేసిన దేశం, అమెరికా. అణ్వాయుధాలను మొట్టమొదట ప్రయోగించి లక్షలాది జపనీయులను చంపిన దేశం, అమెరికా. అనంతరం ప్రాణాంతక రసాయనాయుధాలను వియత్నాం రైతాంగంపై ప్రయోగించిన మొట్టమొదటి దేశం అమెరికా. అమెరికాకి ఉన్న హంతక నీచ చరిత్ర ప్రపంచంలో మరే దేశానికీ లేదు. ఆ తర్వాత ఇరాక్ ప్రజలపై రసాయన ఆయుధాలతో పాటు పరిమిత స్ధాయిలో అణు పదార్ధాలను వెదజల్లిన దేశం కూడా అమెరికాయే. ఆ దేశం ఆఫ్ఘనిస్ధాన్, సిరియా, లిబియా తదితర దేశాల్లో జరిపిన ఘోరాలకు అన్నీ ఇన్నీ కాదు. అలాంటి దుష్ట అమెరికా అణ్వాస్రవ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని (ఎన్.పి.టి) ఇండియా, ఇరాన్, ఉత్తరకొరియా దేశాలపై రుద్దడానికి పూనుకోవడం, ఒప్పందాన్ని ఆమోదించనందుకు ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు విధించి కోట్లాది ప్రజలను నరకయాతన పెట్టడం అత్యంత దారుణం.